Preparation Plan

మెడికల్‌ సీట్లు మనకెన్ని?

రెండు తెలుగు రాష్ట్రాల్లో వైద్యవిద్య చదవాలనే అభిలాష ఉన్నవారికి అత్యంత ఆసక్తికరం... ‘నీట్‌’. విద్యార్థుల దృష్టి ప్రధానంగా ఈ పరీక్ష సన్నద్ధతపైనే! దాంతోపాటు సీట్ల లభ్యతపై వారికీ, వారి తల్లిదండ్రులకూ సందేహాలు సహజం. నేషనల్‌ పూల్‌లోకి తెలుగు రాష్ట్రాలు చేరిన నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో అందుబాటులో ఉండే సీట్ల సంఖ్య, ఫీజు ఎంతెంత అనే అంశాలపై వివరణా, విశ్లేషణా... ఇదిగో!

ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, ఆయుష్‌ కోర్సుల్లో ప్రవేశానికి జరిగే పరీక్ష- నీట్‌ మే 6న ఉదయం 10 గంటల నుంచి ఒంటిగంట వరకూ జరగనున్నది. బైపీసీ విద్యార్థులు రెండు సంవత్సరాల నుంచీ; కొందరైతే లాంగ్‌ టర్మ్‌ అభ్యాసంతో 3, 4 సంవత్సరాల నుంచీ పట్టుదలతో తయారవుతున్న కీలక పరీక్ష ఇది. ఈ సంవత్సరం నుంచి ఈ పరీక్ష ర్యాంకుల ద్వారా ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రవేశాలు లభించబోతున్నాయనేది గమనించదగ్గ విషయం. అందువల్ల విద్యార్థులు ఈ పరీక్షపై తగిన దృక్పథం ఏర్పర్చుకోవాల్సివుంది.

గతంలో తెలుగు రాష్ట్రాల్లో మెడికల్‌ సీట్లను ఇతర రాష్ట్రాలకు ఇవ్వలేదు కాబట్టి ఏ రాష్ట్రంలో ఎంతమేర సీట్లున్నవి అనే అంశంపై దృష్టి సారించలేదు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోని మూడు యూనివర్సిటీల పరిధిలోని పోటీ గురించి మాత్రమే ఆలోచిస్తూవచ్చారు. ఇప్పుడు జాతీయ దృక్పథం అలవర్చుకోవాలి కాబట్టి ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు ఉన్నాయి అనేదానిపై అవగాహన చాలా అవసరం.
* మనదేశంలో ప్రభుత్వ కళాశాలల్లో మొత్తం 30,880 ఎంబీబీఎస్‌ సీట్లు, ప్రైవేటు కళాశాలల్లో 30,165 ఎంబీబీఎస్‌ సీట్లు ఉన్నాయి. అంటే మొత్తం 438 కళాశాలల్లో 61045 సీట్లు ఈ రోజుకి ఎంసీఐ అనుబంధ కళాశాలల్లో ఉన్నాయి.
* డెంటల్‌ విభాగంలో 2980 సీట్లు ప్రభుత్వ కళాశాలల్లో; 23,530 సీట్లు ప్రైవేటు కళాశాలల్లోనూ ఉన్నాయి. అంటే మొత్తం 307 కళాశాలల్లో 26,150 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఎన్ని కళాశాలల్లోని సీట్లకు మనం అర్హులమో ఏవిధంగా అడ్మిషన్‌ ప్రక్రియ ఏర్పడబోతుందో పరిశీలిద్దాము.

ఆంధ్రప్రదేశ్‌
ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 30 మెడికల్‌ కళాశాలలు, 22 డెంటల్‌ కళాశాలలు ఉన్నాయి.
* వీటిలో 12 ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల్లో 1900 ఎంబీబీఎస్‌ సీట్లు, 18 ప్రైవేటు కళాశాలల్లో 2700 ఎంబీబీఎస్‌ సీట్లు ఉన్నాయి.
* 2 ప్రభుత్వ డెంటల్‌ కళాశాలల్లో 140 సీట్లు, 20 ప్రైవేటు డెంటల్‌ కళాశాలల్లో 1840 సీట్లు ఉన్నాయి.
ప్రభుత్వ కళాశాలల్లోని 15 శాతం సీట్లు నేషనల్‌ పూల్‌కి ఇవ్వాలి. అంటే 285 ఎంబీబీఎస్‌ సీట్లు, 21 బీడీఎస్‌ సీట్లు నేషనల్‌ పూల్‌లోకి పోతాయి. ప్రయివేట్‌ కళాశాలల్లో కేటగిరీ-ఎ సీట్ల సంగతి ఇంతవరకు స్పష్టత లేదు. అయితే వాటిలో నేషనల్‌ పూల్‌కి ఇవ్వడంలేదనే భావనతో లెక్కిద్దాము.

కన్వీనర్‌ కోటా (ఎంబీబీఎస్‌)
ప్రభుత్వ కళాశాలలో 1615 సీట్లు (1900-285), ప్రైవేటు కళాశాలల్లో 50 శాతం సీట్లు అంటే 1350 సీట్లు కన్వీనర్‌ కోటాలో నింపుతారు. దీనికి ఫీజు ప్రభుత్వం అయినా లేదా ప్రయివేట్‌ కేటగిరీ-ఎ అయినా రూ. 10,000 మాత్రమే. ప్రైవేటు కళాశాలల్లో, డీమ్డ్‌ యూనివర్సిటీల్లో సీట్లను వారే నీట్‌లో క్వాలిఫై అయిన విద్యార్థులతో నింపుకుంటారు. అందుకని ఆ సీట్లను లెక్కించకూడదు. ఉదాహరణకు.. ఆంధ్రప్రదేశ్‌లో గీతం విశ్వవిద్యాలయానికి 150 ఎంబీబీఎస్‌ సీట్లు ఉన్నాయి. వాటిని తీసివేస్తే మిగిలిన ప్రయివేట్‌ కళాశాలల్లో మైనారిటీ సంస్థలతో కలిపి 2550 ఎంబీబీఎస్‌ సీట్లు ఉన్నాయి.

వీటిలో 50 శాతం సీట్లు, ప్రభుత్వ సీట్లను కలుపుకొంటే కన్వీనర్‌ కోటా ద్వారా భర్తీ అయ్యే మొత్తం సీట్ల సంఖ్య 2890. ఈ సీట్లన్నీ కూడా కన్వీనర్‌ కోటా ఫీజు అంటే రూ. 10,000 (సంవత్సరానికి) చెల్లించే పద్ధతిలో భర్తీ అవుతాయి. వీటిలో రిజర్వేషన్‌ ప్రాతిపదికను కూడా సరిగా పాటిస్తారు. ఎస్‌సీ 15%, ఎస్‌టీ 6%, బీసీ-ఏ 7%, బీసీ-బీ 10%, బీసీ-సీ 1%, బీసీ-డీ 7%, బీసీ-ఈ 4% ఉంటుంది. బీసీ-ఈ కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటుంది. అలాగే సీఏపీ 1%, ఎన్‌సీసీ 1%, స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ 0.5%, ఫిజికల్లీ ఛాలెంజ్డ్‌ 3%, పోలీస్‌ అమరవీరుల పిల్లలలకు 0.25% ఉంటుంది. మొత్తం అన్నింటిలో బాలికల రిజర్వేషన్‌ 33%ను పాటిస్తారు.

బీడీఎస్‌లో కూడా ఇదే ప్రాతిపదిక ఉంటుంది. అంటే బీడీఎస్‌లోని ప్రభుత్వ సీట్లు 140లో 21 సీట్లు నేషనల్‌పూల్‌కి పోతే మిగిలే ప్రభుత్వ సీట్లు 119. ప్రైవేటు కళాశాలల్లో గీతం 100 సీట్లు తీసివేస్తే మిగిలినవి 1740. వీటిలో 50 శాతం సీట్లు... 870 సీట్లు, 119 ప్రభుత్వంతో కలిపి 989 సీట్లు కన్వీనర్‌ కోటాలో రిజర్వేషన్‌ పాటిస్తూ భర్తీ చేస్తారు. కన్వీనర్‌ కోటాలో డెంటల్‌ ఫీజు కూడా సంవత్సరానికి రూ. 10,000.

ప్రైవేటు కళాశాలల్లో మొత్తం సీట్లలో 50 శాతం కన్వీనర్‌ కోటా అయితే 35 శాతం కేటగిరీ- బీ సీట్లుగా; మిగిలిన 15 శాతం కేటగిరీ-సీ (ఎన్‌ఆర్‌ఐ కోటా)గా పరిగణిస్తున్నారు. వీటిలో ఏ రిజర్వేషన్‌ ప్రక్రియనూ అనుసరించరు. అంటే యూనివర్సిటీ పరిధి కానీ, రాష్ట్ర రిజర్వేషన్‌ కానీ, కాస్ట్‌ రిజర్వేషన్‌ కానీ లేదు. ఈ సీట్లను కూడా గత సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ నింపుతోంది.

బీ కేటగిరీ సీట్లకు ఎంబీబీఎస్‌లో ఫీజు సంవత్సరానికి రూ. 12,12,750, సీ కేటగిరీకి రూ. 30,00,00 నిర్థారించారు. అలాగే డెంటల్‌ కళాశాలల్లో కేటగిరీ-బీ సీట్లకు ఫీజు రూ. 4,96,125, కేటగిరీ-సీలో కాలేజీకి అనుగుణంగా సంవత్సరపు ఫీజును నిర్థారణ చేశారు. ప్రతి సంవత్సరం ఈ ఫీజు 5 శాతం పెరుగుతుంది. దీన్ని గమనించి ఇప్పుడున్న ఫీజుకి అదనంగా 5 శాతం పెంచి అంచనా వేసుకోవాలి.

మైనారిటీ కళాశాలల్లో గతంలో మైనారిటీ సంస్థలే అడ్మిషన్ల ప్రక్రియను నిర్వహించుకునేవి. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేదు. ఆ సంస్థల్లో కూడా యూనివర్సిటీ అధికారులే సీట్లను నింపుతారు. మొత్తం సీట్లలో 50 శాతం సీట్లు మైనారిటీ విద్యార్థులతో నింపుతారు. మిగిలిన 50 శాతం సీట్లలో 30 శాతం సీట్లను మైనారిటీ విద్యార్థులతో నింపాలి. ఇక్కడ కూడా కేటగిరీ బీ, కేటగిరీ-సీ సీట్లను 30 శాతం మైనారిటీ రిజర్వేషన్‌తో అధికారులే నింపవచ్చు. సీట్లు మిగిలిపోతే ఆ సంస్థకు తిరిగి ఇచ్చేస్తారు.

తెలంగాణ
తెలంగాణ రాష్ట్రంలో 7 ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల్లో 1100 సీట్లు, 15 ప్రయివేట్‌ మెడికల్‌ కళాశాలలో 2100 సీట్లు... మొత్తం 22 కళాశాలల్లో 3200 సీట్లు ఉన్నాయి. తెలంగాణలోని 1100 సీట్లలో 15 శాతం సీట్లు అంటే 165 సీట్లు నేషనల్‌పూల్‌కి ఇవ్వాలి. మిగిలిన 935 సీట్లు ప్రభుత్వ కళాశాలల్లోనూ, 1050 సీట్లు ప్రైవేటు కళాశాలల్లోనూ కేటగిరీ-ఎ సీట్లుగా పరిగణిస్తున్నారు. మొత్తం 1985 సీట్లలో మైనారిటీ సీట్లు కూడా ఉన్నాయి. వీటన్నింటినీ కలిపి కన్వీనర్‌ కోటాలో పైన తెలిపిన రిజర్వేషన్‌ ప్రాతిపదికతో నింపుతారు.

తెలంగాణలో ప్రభుత్వ కళాశాలల్లో వార్షిక ఫీజు రూ.10,000, ప్రైవేటు కళాశాలల్లో కేటగిరీ-ఎ వార్షిక ఫీజు రూ.68,000గా నిర్ణయించారు. డెంటల్‌ విభాగంలో ప్రభుత్వ కళాశాల ఒకటే ఉంది. 100 సీట్లలో 15 శాతం తీసివేస్తే మిగిలిన 85 సీట్లు, ప్రైవేటు కళాశాలల్లోని 400 సీట్లలో 200 సీట్లు... అంటే మొత్తం 285 సీట్లకు కన్వీనర్‌ కోటాలో అడ్మిషన్లు జరుగుతాయి.

మూడు యూనివర్సిటీ పరిధులు
ఆంధ్ర, తెలంగాణలను మొత్తం మూడు యూనివర్సిటీ పరిధులుగా (ఉస్మానియా, శ్రీ వేంకటేశ్వర, ఆంధ్రా) పరిగణిస్తారు. కన్వీనర్‌ కోటాలోని సీట్లలో ప్రతి యూనివర్సిటీ పరిధిలో 85 శాతం సీట్లు ఆ యూనివర్సిటీ పరిధిలోని విద్యార్థులతోనూ, మిగిలిన 15 శాతం జనరల్‌ కోటాలోనూ అంటే మూడు యూనివర్సిటీలకు కలిపి నింపుతారు.

మెడికల్‌ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌తో పోల్చుకుంటే తెలంగాణలో కళాశాలల సంఖ్య, సీట్ల సంఖ్య కూడా తక్కువే. డెంటల్‌ విభాగంలో అవి మరీ తక్కువ. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి జిల్లాలోనూ ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ఉంది. తెలంగాణలో ఆ విధంగా లేదు. ప్రైవేటు మెడికల్‌ కళాశాలల సంఖ్య కూడా చాలా తక్కువే. తెలంగాణలో ప్రైవేటు మెడికల్‌ కళాశాలల్లో కూడా 3 మైనారిటీ విద్యాసంస్థలు ఉన్నాయి కాబట్టి విద్యార్థులకు సీట్ల సంఖ్య బాగా తగ్గిపోతోంది. కేటగిరి బీ, కేటగిరి సీ సీట్ల ఫీజు వివరాలు పైన తెలిపిన విధంగానే ఉంది.

నాలుగు ఇతర రాష్ట్రాలు
తెలుగు విద్యార్థులు నేషనల్‌పూల్‌లో పోటీ పడవచ్చు. మొత్తం ఉన్న ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల సీట్లు 30,880. వీటిలో 15 శాతం సీట్లు అంటే 4632 సీట్లకు పోటీ పడవచ్చు. ఇవన్నీ ప్రభుత్వ కళాశాలలే కాబట్టి వీటన్నింటిలో వార్షిక ఫీజు రూ. 10,000 నుంచి రూ. 50,000 వరకూ ఉన్నాయి. అయితే ఎక్కువగా విద్యార్థులు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రల గురించి పోటీపడుతుంటారు. వీటికి తోడు ఇప్పుడు గుజరాత్‌ కూడా తోడైంది.

వీటిలో నేషనల్‌ పూల్‌లో ఉన్న సీట్ల సంఖ్య చూస్తే... తమిళనాడు 488, కర్ణాటక 412, మహారాష్ట్ర 465, గుజరాత్‌ 425. ఈ సీట్లకు తెలుగు విద్యార్థులు కూడా మిగతా 29 రాష్ట్రాలతోపాటు పోటీ పడవచ్చు.

వీటిలో సీట్లు సాధించాలనుకుంటే నీట్‌లో 720 మార్కులకు 500 మార్కుల వరకూ సాధించాల్సివుంటుంది. ఆ దిశగా పటిష్ఠమైన కృషి చేయటం మెడికల్‌ ఆశావహ విద్యార్థుల కర్తవ్యం!

Posted on 16-04-2018