Counseling

మెడికల్‌ సీట్లకు ముందడుగు ఎలా?

నీట్‌-2018 యూజీ ఫలితాలు వెలువడి, కొత్త విద్యాసంవత్సరంలో మెడికల్‌ సీట్ల కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానున్నది. తెలుగు విద్యార్థులు తొలిసారిగా అఖిల భారత వైద్యవిద్య కూటమి (నేషనల్‌ పూల్‌)లోకి వెళ్తున్నారు. ఈ సందర్భంగా కౌన్సెలింగ్‌ విధానాన్ని విద్యార్థులూ, తల్లిదండ్రులూ సమగ్రంగా అవగాహన చేసుకోవటం, గత ఏడాది ఆలిండియా కోటా ర్యాంకుల కటాఫ్‌ను పరిశీలించటం వల్ల సీట్ల లభ్యతపై కొంత అంచనా వస్తుంది. ఇందుకు ఉపకరించే వివరాల విశ్లేషణ... ఇదిగో!

గత సంవత్సరంతో పోలిస్తే నీట్‌ కటాఫ్‌ మార్కు బాగా తగ్గింది. విద్యార్థుల సంఖ్య దాదాపు 16 శాతం పెరిగింది. కేటగిరీ వారీగా కటాఫ్‌ మార్కు, విద్యార్థుల సంఖ్య కింది విధంగా ఉంది.
ఈ పట్టిక చూడగానే చాలామంది రిజర్వేషన్లో చాలా తక్కువమంది ఉన్నారని భావిస్తారు. కానీ ఆ సంఖ్య 50వ పర్సంటైల్‌ నుంచి 40వ పర్సంటైల్‌ లోపు ఉన్న విద్యార్థులు. అంటే ఓబీసీలో మొత్తం విద్యార్థులు 54,653 కాదు. మొదట 50వ పర్సంటైల్‌లో దాదాపు 3 లక్షలమంది వరకూ ఉంటారు.
అర్హత పొందిన విద్యార్థులు ఆంధ్రప్రదేశ్‌ నుంచి 35,732 మంది, తెలంగాణ నుంచి 30,912 మంది. అంటే.. తెలుగు రాష్ట్రాల నుంచి అర్హులైనవారు మొత్తం 66,644 మంది విద్యార్థులు. వీరిందరికీ ఇది తొలిసారి కాబట్టి కౌన్సెలింగ్‌ ఏ విధంగా జరుగుతుందో చూడాలి.

ఈ కౌన్సెలింగ్‌ని నాలుగు భాగాలుగా అవగాహన చేసుకోవడం మేలు. 1) ఆల్‌ ఇండియా కోటా (ఏఐక్యూ) 2) స్టేట్‌ కోటా 3) మేనేజ్‌మెంట్‌ లేదా ఎన్‌ఆర్‌ఐ సీట్ల కోటా 4) డీమ్డ్‌ యూనివర్సిటీ, సెంట్రల్‌ యూనివర్సిటీల కోటా.
వీటిలో ఆలిండియా కోటా, డీమ్డ్‌ యూనివర్సిటీ, సెంట్రల్‌ యూనివర్సిటీల్లో అడ్మిషన్ల ప్రక్రియను మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ (ఎంసీసీ) తరఫున డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ (డీజీహెచ్‌ఎస్‌) నిర్వహిస్తుంది. దీనిద్వారా ఆలిండియా కోటాలోని ప్రభుత్వ మెడికల్‌, డెంటల్‌ కళాశాలల్లోని 15 శాతం సీట్లు, డీమ్డ్‌ యూనివర్సిటీ, సెంట్రల్‌ యూనివర్సిటీల్లో 100 శాతం సీట్లు, ఈఎస్‌ఐ మెడికల్‌ కళాశాలలోని ఇన్సూర్డ్‌ పర్సన్స్‌ కోటా, ఏఎఫ్‌ఎంసీ- పుణెలోని సీట్లు నింపుతారు.
కౌన్సెలింగ్‌ దరఖాస్తు విధానం
కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకోవడానికి పత్రాలు ఏమీ అవసరం లేదు. కానీ, విద్యార్థి కొంత డేటా తనతో ఉంచుకుని రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఇది మొత్తం నాలుగు అంచెల్లో జరుగుతుందని చెప్పొచ్చు.
మొదటి అంచె: mcc.nic.in వెబ్‌సైట్‌లో ముందుగా విద్యార్థి లాగిన్‌ అవ్వాలి. దానిలో కింద Already signed in, New Registration, Forgot Passwordఅని మూడు బాక్సులు ఉంటాయి. ఇంతకు ముందే రిజిస్ట్రేషన్‌ చేసుంటే దానిలోకి వెళ్లొచ్చు. అదే తొలిసారిగా అయితే New Registration చేయాలి. తరువాతి పేజీలో రోల్‌ నంబరు, రిజిస్ట్రేషన్‌ నంబరు, విద్యార్థి పేరు, తల్లిపేరు, పుట్టిన తేదీ, మొబైల్‌ నంబరు, ఈ-మెయిల్‌ను అడుగుతుంది. అవి నింపిన తరువాత కింద ఒక సెక్యూరిటీ కోడ్‌ కనిపిస్తుంది. దాన్ని బాక్సులో టైప్‌ చేస్తే కింద Submit, Reset అనే రెండు బటన్లు ఉంటాయి. ఏవైనా మార్పులు చేయదలచుకుంటే Reset నొక్కి మళ్లీ మొదటి నుంచి ప్రక్రియ చేయాలి. పూర్తిగా సరిగా ఉంటే Submit నొక్కితే ఓటీపీ (వన్‌ టైం పాస్‌వర్డ్‌) జెనరేట్‌ అవుతుంది. దానిని ఎంటర్‌ చేస్తే తరువాతి విండోకి వెళుతుంది. దానిలో Terms and conditions ఉంటాయి. వాటిని చదివి కింద Submit అని ఉన్నచోట క్లిక్‌ చేస్తే తరువాతి విండోకి వెళుతుంది. దానిలో మెయిలింగ్‌ అడ్రస్‌, పిన్‌కోడ్‌ వివరాలు నింపిన తరువాత సెక్యూరిటీ ప్రశ్న, దాని సమాధానాన్ని కూడా ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. దాని తరువాత పాస్ట్‌వర్డ్‌ జెనరేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది.
పాస్‌వర్డ్‌: పాస్‌వర్డ్‌ 8-13 అక్షరాల్లో ఉండాలి. వీటిలో ఒక కాపిటల్‌ లెటర్‌, ఒక స్మాల్‌ లెటర్‌, 0-9 వరకు ఒక సంఖ్య, ఒక స్పెషల్‌ క్యారెక్టర్‌ (*, !) లాంటివి ఉండాలి. ఈ పాస్‌వర్డ్‌ను ఏర్పరచుకుని submit నొక్కితే కన్ఫర్మేషన్‌ అడుగుతుంది. దీనిలో Back నొక్కితే మళ్లీ చేయాలి లేదా Confirm registration అంటే ప్రక్రియ పూర్తై రిజిస్ట్రేషన్‌ స్లిప్‌ వస్తుంది. దీన్ని తొలి అంచెగా చెప్పొచ్చు.
రెండో అంచె: కళాశాల ఎంపిక రెండో అంచె అవుతుంది. దీనిని ఓపెన్‌ చేయగానే విద్యార్థికి లభ్యమయ్యే కళాశాలల వివరాలు వస్తాయి. వాటిలో 5 చాయిస్‌లు తీసుకుని నింపాలి. ఈ ఎంపికలో ఏ కళాశాలనైనా విద్యార్థి ఎంపిక చేసుకోవచ్చు. AIQ లో తెలుగు విద్యార్థులు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వ కళాశాలలను ఎంపిక చేసుకోవచ్చో లేదో అనే సంశయంతో ఉన్నారు. ఏఐక్యూలో ఏ రాష్ట్ర విద్యార్థి అయినా ఏ రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్‌ కళాశాలకైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే తెలుగు విద్యార్థులు ఏఐక్యూలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలను కూడా ఎంచుకోవచ్చు.
మూడో అంచ: కళాశాలలు ఎంపిక చేసుకున్న తరువాత ఎన్ని కళాశాలలనైనా మార్చుకోవచ్చు. వాటి వరుసక్రమాలు కూడా విద్యార్థి అనుకున్న రీతిలో మార్చుకోవడానికి అవకాశాలున్నాయి. ఎంపిక చేసుకున్న తరువాత లాకింగ్‌ చేయొచ్చు. ఒకసారి లాక్‌ చేసుకున్న తరువాత రెండో రౌండ్‌ కౌన్సెలింగ్‌ వరకు మార్పు చేసుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి ముందుగానే సరిగా సరిచూసుకుని లాక్‌ చేసుకుంటే దాని ప్రింట్‌ అవుట్‌ విద్యార్థికి వస్తుంది. దీంతో దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది.
నాలుగో అంచె: జూన్‌ 22న సీట్ల కేటాయింపు ప్రకటిస్తారు. కాబట్టి, జూన్‌ 23- జులై 3లోపు కేటాయింపు జరిగిన కళాశాలలో రిపోర్టింగ్‌ చేయాలి. ఆ సమయంలో విద్యార్థి తనతోపాటు సర్టిఫికెట్లు, నిర్ణీత ఫీజు తీసుకెళ్లాల్సి ఉంటుంది.
కావాల్సిన సర్టిఫికెట్లు: నీ పరీక్ష అడ్మిట్‌ కార్డు (సీబీఎస్‌ఈ జారీ చేసింది) నీ ర్యాంకు కార్డు (సీబీఎస్‌ఈ జారీ చేసింది) నీ జనన ధ్రువీకరణ పత్రం నీ పదో తరగతి సర్టిఫికెట్‌ నీ 10+2/ ఇంటర్మీడియట్‌ సర్టిఫికెట్‌ నీ 10+2/ ఇంటర్మీడియట్‌ మార్కుల జాబితా నీ పాస్‌పోర్ట్‌ సైజు ఫొటోగ్రాఫ్‌లు- 8 నీ ప్రింటెడ్‌ అలాట్‌మెంట్‌ లెటర్‌- జెనరేటెడ్‌ ఆన్‌లైన్‌ నీ ఆధార్‌ కార్డు నీ ఎస్‌సీ/ ఎస్‌టీ/ ఓబీసీ/ పీహెచ్‌ సర్టిఫికెట్లు సంబంధిత సర్టిఫికెట్లతో కేటాయించిన కళాశాలలో జులై 3 లోపు చేరాల్సి ఉంటుంది.
ఐదో అంచె: మొదటి రౌండ్‌లో సీటు కేటాయింపు జరగకపోయినా లేదా వదిలేసుకున్నా పై విధానంలోనే రెండో కౌన్సెలింగ్‌కు వెళ్లడం. దీనికి చాయిస్‌ ఫిల్లింగ్‌ జులై 6-8 వరకు, పేమెంట్‌ ఫర్‌ రిజిస్ట్రేషన్‌ జులై 9 మధ్యాహ్నం 12 గం.లోపు పూర్తిచేసి తొలి రౌండ్‌ లాగానే సీట్లు కేటాయిస్తారు. సంబంధిత కళాశాలల్లో జులై 13 నుంచి జులై 22లోపు రిపోర్టు చేయాలి. జులై 23న ఏఐక్యూలో మిగిలిన సీట్లను సంబంధిత రాష్ట్రాలకు బదిలీ చేస్తారు.
ఆరో అంచె: ఏఐక్యూ విద్యార్థులకు ఐదో అంచె ఆఖరుగా చెప్పొచ్చు. ఆరో అంచెను Mop up round అంటారు. ఇది కేవలం డీమ్డ్‌ యూనివర్సిటీలు, సెంట్రల్‌ యూనివర్సిటీలకు మాత్రమే వర్తిస్తుంది. సెంట్రల్‌ యూనివర్సిటీల్లో చాలావరకు సీట్లు రెండో రౌండ్‌లోనే భర్తీ అవుతున్నాయి. కానీ డీమ్డ్‌ యూనివర్సిటీల్లో ఎక్కువ భాగం Mop up round లోనే నింపడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రక్రియ తొలి రెండు రౌండ్లలాగానే నిర్ణీత తేదీల్లో జరుగుతుంది. ఇక్కడ సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 18-26లోపు నిర్ణీత కళాశాలలో చేరాలి. మిగిలిన సీట్లను ఆగస్టు 27కు సంబంధిత డీమ్డ్‌ యూనివర్సిటీకి బదిలీ చేస్తారు. ఈ సీట్ల సంఖ్య కూడా బాగా ఎక్కువగానే ఉంటోంది. వీటిని ఆగస్టు 27 తరువాత, 30లోపు యూనివర్సిటీ వారు నీట్‌-2018లో క్వాలిఫై అయిన విద్యార్థులతో నింపుతారు.
నీట్‌- 2017 కౌన్సెలింగ్‌ (ఆలిండియా కోటా)
* మొదటి రౌండ్‌లో అన్‌ రిజర్వ్‌డ్‌ కేటగిరీలో కటాఫ్‌ ర్యాంకు 5779, రెండో రౌండ్‌లో 8317.
* బీడీఎస్‌లో తొలిరౌండ్‌లో కటాఫ్‌ ర్యాంకు 10,920, రెండో రౌండ్‌లో కటాఫ్‌ ర్యాంకు 12,419.
ముఖ్యమైన తేదీలు
* విద్యార్థులు జూన్‌ 13 నుంచి జూన్‌ 18వ తేదీలోపు రిజిస్ట్రేషన్‌, చాయిస్‌ ఫిల్లింగ్‌ చేసుకోవచ్చు.
* రిజిస్ట్రేషన్‌కు నిర్ణీత ఫీజును జూన్‌ 19వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు చెల్లించవచ్చు.
* సీట్ల కేటాయింపు ప్రక్రియ ఎంసీసీ సర్వర్‌లో జూన్‌ 20, 21 తేదీల్లో జరుగుతుంది.
* మొదటి రౌండు సీట్ల కేటాయింపు ఫలితాలను జూన్‌ 22న ప్రకటిస్తారు.
* సంబంధిత కళాశాలలో విద్యార్థి జూన్‌ 23 నుంచి జులై 3 వరకూ రిపోర్ట్‌ చేయాల్సివుంటుంది.
* మొదటి రౌండులో సీటు పొందకపోయినా, స్కిప్‌ అయినా తర్వాత రౌండు ఆలిండియా కోటా, డీమ్డ్‌, సెంట్రల్‌ యూనివర్సిటీలకు జులై 6 నుంచి పై విధంగానే జరుగుతుంది.
* జులై 23న ఆలిండియా కోటాలో మిగిలిన సీట్లను సంబంధిత రాష్ట్రాలకు రాష్ట్రస్థాయి కౌన్సెలింగుకు కేటాయిస్తారు.
డీమ్డ్‌ యూనివర్సిటీలు, సెంట్రల్‌ యూనివర్సిటీలకు మాత్రమే మూడో రౌండు మాప్‌ అప్‌ అనేది నిర్వహిస్తారు. డీమ్డ్‌ యూనివర్సిటీల్లో ఫీజు చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి తొలిరౌండులో 10 శాతం లోపు సీట్లు మాత్రమే భర్తీ అవుతున్నాయి. రెండో రౌండు పూర్తయ్యేటప్పటికి కూడా 75 శాతం వరకూ ఖాళీగా ఉంటున్నాయి. ఆ సీట్లన్నీ మాప్‌ అప్‌ రౌండులో పిలుస్తున్నారు.
మాప్‌ అప్‌ రౌండుకి రిజిస్ట్రేషన్‌ ఆగస్టు 12 నుంచి ఆగస్టు 14 వరకూ జరుగుతుంది. ఆగస్టు 15 మధ్యాహ్నం 12 గంటల వరకూ రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించవచ్చు. ఆగస్టు 16 నుంచి సీట్ల కేటాయింపు జరుగుతుంది. ఆగస్టు 18 నుంచి ఆగస్టు 26లోపు నిర్ణీత కళాశాలల్లో జాయిన్‌ కావాలి.
ఇంకా మిగిలిన సీట్లను ఆగస్టు 27న సంబంధిత డీమ్డ్‌ యూనివర్సిటీకి బదిలీ చేస్తారు.
మిగిలిన సీట్లకు నీట్‌లో క్వాలిఫై అయిన ఏదో ఒక విద్యార్థితో ఆగస్టు 27- 30 లోపు యూనివర్సిటీ ఆ సీట్లను నింపుకోవచ్చు.
నేషనల్‌ పూల్‌.. ప్రభుత్వ కళాశాలలకేనా?
మన దగ్గర బి-కేటగిరీ సీట్లు ఉన్నట్లే వేరే రాష్ట్రాల్లోని బి-కేటగిరీలో అడ్మిషన్లను మనం తీసుకోవచ్చా? దీనికి మార్గదర్శకాలేంటి?
జ: ప్రతి రాష్ట్రంలోని ప్రైవేటు కళాశాలల్లో బి, సి కేటగిరీ సీట్లున్నాయి. ఈ సీట్లను ప్రతి రాష్ట్రంలోనూ వారి నిబంధనలకు అనుగుణంగా నింపుతారు. వీటిలో రాష్ట్రానికి కానీ, సామాజిక వర్గానికి కానీ సంబంధించి ఎలాంటి రిజర్వేషన్‌ వర్తించదు. దేశంలోని ఏ విద్యార్థి అయినా నీట్‌-2018లో క్వాలిఫై అయితే మెరిట్‌ ప్రకారం చేరవచ్చు. అయితే వివిధ రాష్ట్రాల్లో ఫీజులు లేదా, సీట్లు నింపే పద్ధతులు బి, సి కోటా సీట్ల పర్సంటేజీ వేర్వేరుగా ఉన్నాయి.
15% నేషనల్‌ పూల్‌ అనేది ప్రభుత్వ కళాశాలలకేనా? ప్రైవేటు కళాశాలలకు కూడానా?
జ: ఆలిండియా కోటా (ఏఐక్యూ) అనేది ప్రభుత్వ కళాశాలలకు మాత్రమే వర్తిస్తోంది. ప్రైవేటు కళాశాలలకు వర్తించడం లేదు. జమ్మూ కశ్మీర్‌ తప్ప మిగిలిన ఏ రాష్ట్ర విద్యార్థి అయినా ఏ రాష్ట్రంలో అయినా ఏఐక్యూ కింది 15% సీట్లకు (ప్రభుత్వ కళాశాలలకు) దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇతర రాష్ట్రాల్లోని ప్రైవేటు కళాశాలల్లోనూ కోటాలో 50% కన్వీనర్‌, 35% కేటగిరీ బి లేదా మేనేజ్‌మెంట్‌ సీట్లు, 15% కేటగిరీ సి లేదా ఎన్‌ఆర్‌ఐ సీట్లు ఉన్నాయి కదా! ఇదే నిష్పత్తి అన్ని రాష్ట్రాల్లోనూ అమలవుతుందా?
జ: కాదు. ప్రతి రాష్ట్రంలోని ఈ సీట్ల శాతాలు వేర్వేరుగా ఉన్నాయి. విడిగా ఆ రాష్ట్ర ప్రవేశపరీక్ష కన్వీనర్‌ వెబ్‌సైట్‌లోకి వెళితే ఆ వివరాలు సులభంగా లభ్యమవుతాయి.
గుజరాత్‌, ఎంపీ, పంజాబ్‌, మహారాష్ట్రల్లో మేనేజ్‌మెంట్‌ సీట్లు (బి కేటగిరీ) ఆ రాష్ట్రంలోని విద్యార్థులకే ఇస్తారని అంటున్నారు. ఇది కరక్టేనా?
జ: ఇంతవరకు ఎంసీఐ వెబ్‌సైట్‌ లేదా ఆ రాష్ట్రాల్లోని కౌన్సెలింగ్‌ వెబ్‌సైట్లలో అలాంటిదేదీ పొందుపరచలేదు. దానిపై స్పష్టత జూన్‌ 22 లోపు వచ్చే అవకాశం ఉంది. గత ఏడాది ఇతర రాష్ట్రాల్లాగానే ఇక్కడ కూడా నిబంధనలకు అనుగుణంగా భర్తీ చేశారు. రాష్ట్రానికి గానీ, సామాజిక వర్గానికి గానీ ఎలాంటి రిజర్వేషన్‌ వర్తించలేదు.
తమిళనాడు కేటగిరీ బి కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్లు, ఫీజు వివరాలు బయటకు రావడం లేదెందుకు? ఎప్పుడు జరుగుతాయి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
జ: తమిళనాడులో ప్రైవేటు కళాశాలల్లో ప్రముఖమైనవన్నీ స్వయం ప్రతిపత్తి గల విశ్వవిద్యాలయాలు అయ్యాయి. గతంలో నీట్‌ క్వాలిఫై అయినవారికి వారి హెచ్‌ఎస్‌సీ మార్కుల ప్రాతిపదికగా అడ్మిషన్ల ప్రక్రియ జరిగేది. అందువల్ల మనకు అవగాహన ఏర్పడేది కాదు. కానీ ఈ ఏడాది పైన చెప్పిన విధంగా జూన్‌ 22లోపు దానిపై సరైన ప్రకటన వెలువడాల్సి ఉంది.

Posted on 13-06-2018