Counseling

ఏం చూడాలి?ఎలా సాగాలి?

ఎంబీబీఎస్‌- 2018 అడ్మిషన్లు సీట్లు పరిమితం... పోటీ మాత్రం అత్యధికం. ఎయిమ్స్‌, జిప్మర్‌, నీట్‌ల ద్వారా కలల కోర్సులో సీటును అందుకోగలమా అనే అనుమానం! గత ఏడాది కౌన్సెలింగ్‌ సరళిని బట్టీ, సీట్ల లభ్యతను బట్టీ అంచనాలు కట్టటం... బేరీజు వేసుకోవటం! వైద్యవిద్య ప్రవేశాల ప్రస్తుత తరుణంలో విద్యార్థులకూ, వారి తల్లిదండ్రులకూ ఎన్నో ప్రశ్నలు.. నీట్‌ సెంట్రల్‌ కౌన్సెలింగ్‌లో డీమ్డ్‌ యూనివర్సిటీల్లో అడ్మిషన్ల ప్రక్రియ గురించీ, స్టేట్‌ కౌన్సెలింగ్‌లో అవకాశాల గురించీ వివిధ సందేహాలు వారిని సతమతం చేస్తున్నాయి. వాటిని నివృత్తి చేసే కథనమిది..!

దేశంలోని మొత్తం 492 మెడికల్‌ కళాశాలల్లో ఉన్న మొత్తం సీట్ల సంఖ్య 63,400. మూడు ప్రవేశపరీక్షల్లో మెరిట్‌ ఆధారంగా వీటిల్లో ప్రవేశాలు జరుగుతాయి. అవి: నీట్‌ (నేషనల్‌ ఎలిజిబిలిటీ కం ఎంట్రన్స్‌ టెస్ట్‌), ఎయిమ్స్‌ (ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌), జిప్‌మర్‌ (జవహర్‌లాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌).
* ఎయిమ్స్‌ ప్రవేశ ప్రక్రియ ఎలా ఉంటుంది?
ఎయిమ్స్‌ మొత్తం 9 కళాశాలలు ఉన్నాయి. ఇవి న్యూదిల్లీ, భోపాల్‌, పట్నా, జోధ్‌పుర్‌, రుషికేష్‌, రాయ్‌పుర్‌, భువనేశ్వర్‌, గుంటూరు, నాగ్‌పుర్‌ల్లో ఉన్నాయి. వీటిలో మొత్తం 807 సీట్లున్నాయి. న్యూదిల్లీ ఎయిమ్స్‌లో విదేశీయులకు 7 సీట్లున్నాయి. ఈ అన్ని కళాశాలల్లో ఎయిమ్స్‌ వారు నిర్వహించే ప్రవేశపరీక్ష ఆధారంగానే ప్రవేశాలు జరుగుతాయి. ప్రవేశపరీక్ష ఫలితాలు జూన్‌ 18న వెలువడతాయి. నూతనంగా ప్రారంభించిన గుంటూరు, నాగ్‌పుర్‌ల్లో మాత్రమే 50 సీట్ల చొప్పున ఉన్నాయి. మిగిలిన అన్ని కళాశాలల్లో 100 సీట్లు ఉన్నాయి. రిజర్వేషన్లు వర్తిస్తాయి.
* జిప్‌మర్‌లో అడ్మిషన్‌ ప్రక్రియ ఎలా?
జిప్‌మర్‌లో మొత్తం రెండు కళాశాలలు ఉన్నాయి. అవి- జిప్‌మర్‌- పుదుచ్చేరి, జిప్‌మర్‌- కరేకల్‌. వీటిలో పుదుచ్చేరిలో 150 సీట్లు కరేకల్‌లో 50 సీట్లు ఉన్నాయి. ఈ సీట్లన్నింటినీ జిప్‌మర్‌ ప్రవేశపరీక్షలోని ర్యాంకు ఆధారంగా భర్తీ చేస్తారు. జిప్‌మర్‌ పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి.
ఎయిమ్స్‌, జిప్మర్‌లలో వివిధ కేటగిరీ సీట్ల వివరాలను ఈనాడుప్రతిభ.నెట్‌లో చూడవచ్చు.
నీట్‌ ద్వారా...
నీట్‌ ద్వారా 193 మెడికల్‌, 40 డెంటల్‌ కళాశాలల్లో ఆల్‌ ఇండియా కోటా (15%), స్టేట్‌ కోటాలోని (85%) మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాల ప్రైవేటు మెడికల్‌ కళాశాలల్లోని ఎ, బి, సి కేటగిరీ సీట్లు, మైనారిటీ కళాశాలల్లోని, డీమ్డ్‌ యూనివర్సిటీల ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ సీట్లు, ఏఎఫ్‌ఎంసీ (ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ మెడికల్‌ కాలేజ్‌, పుణె), ఈఎస్‌ఐసీ మెడికల్‌ కళాశాలల సీట్లు, సెంట్రల్‌ యూనివర్సిటీలు అయిన అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ), బెనారస్‌ హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌యూ), దిల్లీ యూనివర్సిటీ, క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజ్‌ (సీఎంసీ) తదితర సంస్థల్లోని సీట్లను నీట్‌ ర్యాంకు ఆధారంగా నింపుతారు. సి కేటగిరీ లేదా ఎన్‌ఆర్‌ఐ సీట్లను సంబంధిత కాలేజ్‌ మేనేజ్‌మెంట్‌ నింపుకున్నప్పటికీ విద్యార్థి నీట్‌లో ఉత్తీర్ణత తప్పనిసరి.
* ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ మెడికల్‌ కాలేజ్‌లో అడ్మిషన్ల ప్రక్రియ ఎలా ఉంటుంది?
ఏఎఫ్‌ఎంసీ- పుణెలో మొత్తం 145 సీట్లు ఉన్నాయి. వీటిలో 117 అబ్బాయిలకు, 28 సీట్లు అమ్మాయిలకు రిజర్వ్‌ చేసి ఉంటాయి. వీటిని ఆలిండియా కోటా(ఏఐక్యూ) ద్వారా నింపుతారు. మిలటరీలో పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లలకు కేటాయించిన రిజర్వేషన్‌ సీట్లను నీట్‌ ర్యాంకు ఆధారంగా ఏఎఫ్‌ఎంసీ భర్తీ చేసుకుంటుంది. ఏఐక్యూ ద్వారా సీటు సాధించిన విద్యార్థి ఏఎఫ్‌ఎంసీలో మౌఖికపరీక్ష, దేహదార్ఢ్య పరీక్షలకు హాజరవ్వాల్సి ఉంటుంది. గత ఏడాది కటాఫ్‌ మార్కు బాలికలకు 600 కాగా అబ్బాయిలకు 570.
* ఈఎస్‌ఐసీ మెడికల్‌ కళాశాలలు ఎన్ని? వాటి అడ్మిషన్‌ ప్రక్రియ ఎలా ఉంటుంది?
ఇవి మొత్తం 9. బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, ఫరిదాబాద్‌, గుల్బర్గా, హైదరాబాద్‌, కొల్లాం, కోయంబత్తూరు, మండిల్లో ఉన్నాయి. వీటిలో కొన్నింటిని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చారు. మొత్తం సీట్లను మూడు భాగాలుగా నింపుతారు. 1. ఆల్‌ ఇండియా కోటా (ఏఐక్యూ) 2. స్టేట్‌ గవర్నమెంట్‌ కోటా 3. ఇన్‌స్యూర్‌డ్‌ పర్సన్స్‌ కోటా (337 సీట్లు). స్టేట్‌ గవర్నమెంట్‌ కోటా వివిధ రాష్ట్రాల్లో వేర్వేరుగా ఉంది. అందువల్ల కళాశాల ప్రాతిపదికగా చేసుకోవాల్సి ఉంటుంది.
* సెంట్రల్‌ యూనివర్సిటీల సంగతి?
సెంట్రల్‌ యూనివర్సిటీలు ముఖ్యంగా అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ), బెనారస్‌ హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌యూ), దిల్లీ యూనివర్సిటీ మొదలైనవి ఉన్నాయి. అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీలో సీట్లను రెండు విధాలుగా నింపుతారు. 1) ఓపెన్‌ 2. ఇంటర్నల్‌. ఓపెన్‌లో 72 సీట్లున్నాయి. ఈ సీట్లను ఏఐక్యూ కౌన్సెలింగ్‌ ద్వారా నింపుతారు. ఇంటర్నల్‌లో 73 సీట్లున్నాయి. అక్కడ 3 నుంచి 12వ తరగతి వరకు చదువుకున్నవారికి నీట్‌ ర్యాంకు ఆధారంగా 73 సీట్లను యూనివర్సిటీ భర్తీ చేసుకుంటుంది. బెనారస్‌ హిందూ యూనివర్సిటీలో మొత్తం 84 సీట్లున్నాయి. వీటిని కూడా ఏఐక్యూ ద్వారా నింపుతారు. ఇక్కడ ఇంటర్నల్‌ సీట్లు లేవు. దిల్లీ వర్సిటీకి దరఖాస్తు చేయడానికి అక్కడ ప్రాథమిక విద్యాభ్యాసం చేసినవారు మాత్రమే అర్హులు.
* క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజ్‌, వెల్లూరు ఏఐక్యూ కళాశాలల్లో లేదు. ఎందుకని?
సీఎంసీ వెల్లూరులో అడ్మిషన్‌ పొందాలనుకునేవారికి గతంలోనే దరఖాస్తు చేసుకోమని నోటిఫికేషన్‌ వచ్చింది. అప్పుడు దరఖాస్తు చేసుకున్నవారికి మాత్రమే అడ్మిషన్లలో పాల్గొనే అవకాశం ఉంటుంది. సీఎంసీలో సీటును నీట్‌ ర్యాంకు ద్వారానే ఇస్తారు. దీనిలో మొత్తం సీట్లు- 100. వీటిలో 42 సీట్లను బాలికలకు కేటాయిస్తారు. సీఎంసీ వెల్లూరు ఆల్‌ ఇండియా ఓపెన్‌ ఎంబీబీఎస్‌ సీట్లు- 16. ఎ) భారత ప్రభుత్వం ఒక అభ్యర్థిని ఎంపిక చేస్తుంది. బి) ఆల్‌ ఇండియా ఓపెన్‌ ఎంబీబీఎస్‌ సీట్లలోని 20% (3) సీట్లను ఎస్‌సీ/ ఎస్‌టీ అభ్యర్థులకు కేటాయిస్తారు. దీనిలోని మొత్తం స్పాన్సర్డ్‌ సీట్లు- 84.
* ఏఐక్యూలో దరఖాస్తు చేసుకుంటే సీటు వదులుకోవచ్చా?
ఏఐక్యూలో దరఖాస్తు చేసుకున్నవారికి రౌండ్‌-1 తర్వాత ఎగ్జిట్‌ ఆప్షన్‌ ఉంది. తరువాత పాల్గొనకూడదనుకుంటే రౌండ్‌-1 తరువాత వదిలేయొచ్చు. అప్పుడు ఎలాంటి అపరాధ రుసుము లేదు. కాబట్టి రౌండ్‌-2కి వెళ్లేటపుడు జాగ్రత్త తీసుకోవాలి.
* ఏఐక్యూలో ఒకవేళ 18వ తేదీలోపు దరఖాస్తు చేయలేకపోతే మళ్లీ చేయవచ్చా?
చేసుకోవచ్చు. మళ్లీ రౌండ్‌-2 ప్రారంభానికి చేయాలి. అయితే వారికి రౌండ్‌-2లో ఏర్పడిన అదనపు సీట్లకు మాత్రమే అర్హత లభిస్తుంది. అలాగే మాప్‌ అప్‌ రౌండ్‌లోనూ రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. రౌండ్‌-2 తరువాత ఏఐక్యూలో మిగిలిపోయిన సీట్లను సంబంధిత రాష్ట్రాలకు బదిలీ చేస్తారు.
* ఏఐక్యూ దరఖాస్తు చేసుకునేవారికి గత ఏడాదికీ, ఇప్పటికీ తేడా ఉందా?
గత ఏడాది వరకూ ఏఐక్యూలో దరఖాస్తు చేసుకోవడానికి సీట్ల సంఖ్యకు 5 రెట్ల వరకు మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశమిచ్చేవారు. కటాఫ్‌ ర్యాంకు ఇచ్చి ఆ ర్యాంకులోపు వారిని మాత్రమే దరఖాస్తు చేసుకోమనేవారు. కానీ ఈ ఏడాది నుంచి నీట్‌లో క్వాలిఫై అయిన ప్రతి విద్యార్థీ దరఖాస్తు చేసుకోవచ్చు. గత ఏడాది 5 కళాశాలల వరకే ఎంపికకు అవకాశం ఇచ్చేవారు. ఇప్పుడు 193 మెడికల్‌, 40 డెంటల్‌ కలిపి 233 కళాశాలలను కూడా ఎంచుకోవచ్చు. ఎంపికలో ఎన్ని కళాశాలలకు పరిమితం కావాలనే నిబంధన లేదు.
* ఏపీ లేదా తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు అదే రాష్ట్రంలోని మెడికల్‌ కళాశాలలకు ఏఐక్యూలో దరఖాస్తు చేసుకోవచ్చా?
జమ్మూ కశ్మీర్‌ విద్యార్థులు మినహా ఏఐక్యూలో ఏ రాష్ట్రంలోని సీటుకైనా ఏ రాష్ట్ర విద్యార్థి అయినా దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే తెలుగు విద్యార్థులు తెలుగు రాష్ట్రాల్లోని మెడికల్‌ కళాశాలలకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే తెలుగు రాష్ట్రాల్లోన్ని కొన్ని మెడికల్‌ కళాశాలలను జాబితాలో చేర్చలేదు. అందువల్ల 18వ తేదీ చివరివరకూ చాయిస్‌లు చూసుకుని లాక్‌ చేసుకోవడం మేలు. ఒకవేళ లాక్‌ చేయకపోయినా సేవ్‌ అండ్‌ ప్రొసీడ్‌ ఆప్షన్‌ చేసుకుని ఉండుంటే 19 మధ్యాహ్నానికి ఆటోమేటిక్‌గా ఆప్షన్స్‌ లాక్‌ అయిపోతాయి.
* డీమ్డ్‌ యూనివర్సిటీల్లో సీట్ల రిజర్వేషన్‌ ప్రక్రియ ఎలా ఉంటుంది?
దేశంలో ఎంబీబీఎస్‌ను అందించే మొత్తం డీమ్డ్‌ యూనివర్సిటీల సంఖ్య- 40. వీటిలో 4 మైనారిటీవి. వాటిలో అత్యంత ప్రాచుర్యమున్న మణిపాల్‌ కూడా ఉంది. ఈ మొత్తం డీమ్డ్‌ యూనివర్సిటీల్లో 5109 సీట్లున్నాయి. వీటిల్లోని సీట్లకు రిజర్వేషన్లు వర్తించవు. అన్ని సీట్లూ జనరల్‌ లేదా ఎన్‌ఆర్‌ఐ విభాగంలోనే నింపుతారు. తెలుగు విద్యార్థులు ఎక్కడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఏడాది ఫీజు రూ.10 లక్షల నుంచి రూ.17 లక్షల వరకు ఉంది. దీనికి ఇప్పుడు దరఖాస్తు చేయాలన్నా మొదట రూ.2,05,000 కట్టి దరఖాస్తు చేసుకోవాలి. కచ్చితంగా చేరాలనుకునేవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడం మంచిది. కొన్ని కళాశాలల్లో నీట్‌ మార్కులు 200లోపు ఉన్నా సీటు సాధించే అవకాశముంది.
* తెలుగు విద్యార్థులు ఏయే కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది?
తెలుగు విద్యార్థులు ఏఐక్యూ, ఏపీ స్టేట్‌ సీట్లకు ఎన్‌టీఆర్‌ యూహెచ్‌ఎస్‌, టీఎస్‌ సీట్లకు కేఎన్‌ఆర్‌ యూహెచ్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకోవాలి. వీటిద్వారా ప్రభుత్వ కళాశాలల్లోని మెడికల్‌ సీట్లు, ప్రైవేటు కళాశాలల్లోని కేటగిరీ-ఎ వరకు సీట్లు నింపుతారు. కేటగిరీ-బి, సి సీట్లకు సంబంధిత రాష్ట్రాలు నోటిఫికేషన్‌ ఇస్తాయి. వాటి ఆధారంగా ఇష్టమైనవాటికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఉదాహరణకు- తమిళనాడులో ప్రైవేటు మెడికల్‌ కళాశాలలో చేరడానికి 19వ తేదీ తుదిగడువుగా నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. అలాగే కర్ణాటకలోని ప్రైవేటు మెడికల్‌ కళాశాలలకు అయితే 21 ఆఖరితేదీ అవుతుంది.

స్టేట్‌ కౌన్సెలింగ్‌లో గత ఏడాది ఏ ర్యాంకులకు సీట్లు వచ్చాయి?
Click here: http://www.eenadupratibha.net/Pratibha/OnlineDesk/neet/neet-mockcounselling.html

Posted on 18-06-2018