MBBS

ఎల్లలు దాటి.. ఎంబీబీఎస్‌ సీటు!

తెలుగు రాష్ట్రాల నుంచి ఎంబీబీఎస్‌ చదవడం కోసం విదేశాలకు వెళుతున్న వారి సంఖ్య గత కొన్నేళ్లుగా పెరుగుతోంది. ఈ క్రమంలో అనేక కొత్త దేశాల్లోని కళాశాలలూ, విశ్వవిద్యాలయాలూ తెరమీదకు వచ్చి ఆకర్షిస్తున్నాయి. డొనేషన్లు కట్టాల్సిన అవసరం లేకుండా తక్కువ ఫీజుతోనే కలల కోర్సులో చేరే అవకాశమిస్తున్న విదేశీ వైద్యవిద్యపై విద్యార్థులూ, తల్లిదండ్రులూ అవగాహనతో ముందడుగు వేయాల్సిన అవసరముంది!

మనదేశంలో కానీ, రాష్ట్రాల్లో కానీ పరిమితంగానే మెడికల్‌ సీట్లు ఉన్న నేపథ్యంలో విదేశీ వైద్యవిద్య ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. రష్యా, ఉక్రెయిన్‌, కిర్గిస్థాన్‌, బెలారస్‌, జార్జియా, కజకిస్థాన్‌ వంటి కామన్‌ వెల్త్‌ ఇండిపెండెంట్‌ స్టేట్స్‌కూ, చైనా, ఫిలిప్పీన్స్‌, మారిషస్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌ వంటి ఆసియా దేశాలకూ, బార్బొడస్‌, జమైకా, గయానా, బిల్లిజ్‌ వంటి కరేబియన్‌ ద్వీప దేశాలకూ తెలుగు విద్యార్థులు తమ మెడిసిన్‌ కలలను సాకారం చేసుకునేందుకు వెళుతున్నారు.

కరేబియన్‌ దీవులు
బిలిజ్‌, బార్బొడస్‌, గయానా, జమైకా వంటి చిన్నదేశాల్లో ఉన్న మెడికల్‌ వర్సిటీలు ఈ ఏడాది విస్తృత ప్రచారంతో విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. తక్కువ జనాభాగల ఈ ద్వీప దేశాలన్నీ ఆంగ్లంలో బోధన అందిస్తున్నాయి. కొన్ని కళాశాలలు నీట్‌ లేకుండా చేరొచ్చనే ప్రకటనలు ఇస్తున్నాయి. అయితే ఎంసీఐ ఈ ఏడాది విదేశాలకు వెళుతున్న విద్యార్థులకు కచ్చితంగా నీట్‌లో అర్హత తప్పనిసరి అంటోంది. కోర్సు వ్యవధి ఐదేళ్లు.
సవాళ్లు: ఈ విశ్వవిద్యాలయాలు క్లినికల్‌ రొటేషన్‌ కోసం ఇతర దేశాలతో ఒడంబడిక చేసుకున్నాయి. మూడో ఏడాది తరువాత క్లినికల్‌ రొటేషన్‌ కోసం ఇతర దేశాలకు వెళ్లడం తప్పనిసరి.
* వేసవిలో ఉష్ణోగ్రత చాలా ఎక్కువ. ఈదురు గాలులతో భారీ తుపాన్లు ఇక్కడ సర్వసాధారణం.
ముఖ్య విశ్వవిద్యాలయాలు: ఎవ్‌లాన్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌, బ్రిడ్జ్‌టౌన్‌ ఇంటర్నేషనల్‌ వర్సిటీ, కొలంబస్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌, వాషింగ్టన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ సైన్స్‌.
కిర్గిస్థాన్‌
తెలుగు విద్యార్థులను ఆకర్షిస్తున్న మరో దేశమిది. ఇక్కడ కోర్సు వ్యవధి 5 సంవత్సరాలు, కొన్నిటిలో ఆరు సంవత్సరాలు ఉంటుంది. ఆంగ్ల మాధ్యమంలో ఎంబీబీఎస్‌ చదివేందుకు మనదేశం నుంచి ఇక్కడకు విద్యార్థులు వెళ్లడం 2003 నుంచి ప్రారంభమైంది. కొన్ని వర్సిటీలు బోధనను భారతీయ బోధనా సిబ్బందితోనే అందిస్తున్నాయి. ఎఫ్‌ఎంజీఈ (స్క్రీనింగ్‌ టెస్ట్‌) కోసం ఇక్కడ కోచింగ్‌ సెంటర్లను నిర్వహిస్తున్నారు.
సవాళ్లు: * కొన్ని యూనివర్సిటీల్లో 90% రష్యన్‌ భాషలో బోధన జరుగుతోంది.
* మరికొన్ని కళాశాలల గురించి మనదేశ ఎంబసీ అధికారిక వెబ్‌సైట్‌లో సమాచారం ఉంటుంది. దాన్ని పరిశీలించి, నిర్ణయం తీసుకోవచ్చు.
ముఖ్య విశ్వవిద్యాలయాలు: ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌-యూనివర్సిటీ ఆఫ్‌ కిర్గిస్థాన్‌, కిర్గిస్థాన్‌ స్టేట్‌ మెడికల్‌ అకాడమీ, ఓష్‌ స్టేట్‌ మెడికల్‌ యూనివర్సిటీ.
చైనా
2003-2007 వరకు వందల సంఖ్యలో ఉన్న ఇక్కడి మెడికల్‌ కళాశాలలు మన విద్యార్థులను ఆకర్షించాయి. తరువాత కొన్ని కళాశాలల్లో సౌకర్యాలు, వసతులు, నాణ్యత ప్రమాణాలు అంతగా లేక కళాశాలల, సీట్ల సంఖ్యను ఎంసీఐ కుదించింది.ఇప్పుడిప్పుడే చైనాలో భారతీయ విజిటింగ్‌ ప్రొఫెసర్లను అంగీకరించడంతో కొన్ని కళాశాలల్లో మన విద్యార్థుల ప్రమాణాలు పెరిగాయి.
సవాళ్లు:* అనేక విశ్వవిద్యాలయాల్లో చైనా భాషను ఒక పాఠ్యాంశంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. కొన్ని వైద్య కళాశాలల్లో ఆంగ్లం నామమాత్రం; బోధనంతా చైనా భాషలో ఉంటుంది. చైనీస్‌, ఇంగ్లిష్‌ రెండు భాషల్లో బోధిస్తున్న అనేక కళాశాలలు ఎంసీఐ వెబ్‌సైట్‌లో ఉన్నాయి.
* చైనా ఉత్తర ప్రాంతంలో శీతాకాలం చలి ఎక్కువ.
ముఖ్య విశ్వవిద్యాలయాలు: జింఝౌ మెడికల్‌ వర్సిటీ, చైనా మెడికల్‌ వర్సిటీ, నాన్జింగ్‌ మెడికల్‌ వర్సిటీ, సుచో మెడికల్‌ వర్సిటీ, లియోనింగ్‌ మెడికల్‌ వర్సిటీ, గాంగ్జీ మెడికల్‌ వర్సిటీ, ఊహాన్‌ మెడికల్‌ యూనివర్సిటీ.
ఉక్రెయిన్‌
వందేళ్లు పైబడిన అనేక వైద్యకళాశాలలకు పుట్టినిల్లు ఉక్రెయిన్‌. ఇక్కడ వైద్యవిద్య ఆరేళ్లుంటుంది. మొదటి మూడేళ్ల కాలం బోధన పూర్తి ఇంగ్లిష్‌లో ఉండగా, చివరి మూడేళ్లలో కొంత స్థానిక రష్యా భాషను తప్పనిసరిగా బోధిస్తారు. రెండేళ్ల క్రితం యుద్ధ పరిణామాల వల్ల విద్యార్థుల చేరిక కాస్త మందగించింది. ఈ ఏడాది నుంచి తిరిగి అడ్మిషన్లను తీసుకుంటున్నారు.
సవాళ్లు:* చాలా వైద్య విశ్వవిద్యాలయాల్లో ప్రాక్టికల్స్‌ ప్రారంభమైన నాలుగో ఏడాది నుంచి ఆంగ్ల బోధన తగ్గించి, రష్యన్‌లో బోధిస్తారు.
* రెండు, మూడు నెలలపాటు మంచుతో సాధారణ జీవితం కష్టమవటం. ఆ సమయంలో వర్సిటీలు సెలవులు ప్రకటిస్తాయి.
ముఖ్య విశ్వవిద్యాలయాలు: ఝప్రోజీ స్టేట్‌ మెడికల్‌ వర్సిటీ, ఒడిశా నేషనల్‌ మెడికల్‌ వర్సిటీ, కీవ్‌ మెడికల్‌ వర్సిటీ ఆఫ్‌ యూఏఎఫ్‌ఎం, ఇవానో ప్రాంక్‌ విక్‌ మెడికల్‌ వర్సిటీ, డోనెస్స్‌ స్టేట్‌ మెడికల్‌ యూనివర్సిటీ.
రష్యా
మనకు స్వాతంత్య్రం వచ్చిన తరువాత వైద్యవిద్యకు రష్యా వర్సిటీలు చిరునామాగా నిలిచాయి. స్క్రీనింగ్‌ టెస్ట్‌ నిబంధనలు అమలైన తరువాత విద్యార్థుల చేరిక శాతం తగ్గింది! మరోవైపు ఇక్కడి విశ్వవిద్యాలయాలు ఆంగ్లబోధన పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపనందున ఇతర దేశాలు ముందు వరుసలో నిలిచాయి. అయినా రష్యాకు వెళుతున్నవారి సంఖ్య గణనీయంగానే ఉంది. కోర్సు కాలం- ఆరేళ్లు.
సవాళ్లు:* శీతాకాలంలో చలి అత్యధికం. కొన్ని విశ్వవిద్యాలయాల్లో అమ్మాయిలకు ప్రత్యేక హాస్టళ్లు ఉండవు.
ముఖ్య విశ్వ విద్యాలయాలు: సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ స్టేట్‌ మెడికల్‌ యూనివర్సిటీ, స్మోలెన్‌స్క్‌ స్టేట్‌ మెడికల్‌ యూనివర్సిటీ, రోస్తోవ్‌ మెడికల్‌ యూనివర్సిటీ, మాస్కో స్టేట్‌ మెడికల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ మెడిసిన్‌ అండ్‌ డెంటిస్ట్రీ, నార్త్‌ వెస్టర్న్‌ స్టేట్‌ మెడికల్‌ యూనివర్సిటీ.
ఫిలిప్పీన్స్‌
వైద్యవిద్య కోసం ఫిలిప్పీన్స్‌కు వెళ్లడం ఆరేళ్ల క్రితం నుంచి ప్రారంభమైంది. ఇక్కడ కళాశాలలన్నీ క్రిస్టియన్‌ మిషినరీలు ఏర్పాటు చేయడంతో ఆంగ్లభాషలో బోధన ఉంటుంది. వాతావరణం కూడా మన విద్యార్థులకు అనుకూలం. ఈ దేశంలో ఇంగ్లిష్‌ మాట్లాడే ప్రజల సంఖ్య ఎక్కువ. విద్యార్థి నేరుగా బీఎస్‌లో చేరుతున్నందున అక్కడ ఒక ఏడాది తరువాత ఎన్‌ మ్యాట్‌ పరీక్ష (ఫిలిప్పీన్స్‌ ప్రభుత్వం నిర్వహిస్తున్న అర్హత పరీక్ష) ఉత్తీర్ణత సాధించాకే అక్కడ వైద్యవిద్యలో చేరాల్సి ఉంటుంది. దీనిపై అవగాహన పెంచుకోవటం అవసరం.
సవాళ్లు: * ఇక్కడ బీఎస్‌ ప్రోగ్రామ్‌ మొదటి సంవత్సరం ఉండటంతో ఈ ఏడాది నీట్‌ అర్హత పొందినవారు ఒకవేళ అక్కడి కళాశాలల్లో చేరినా ఎంసీఐ ఆ విద్యార్థికి అర్హత పత్రం ఇవ్వదు.
* ఈ ఏడాది చేరిన విద్యార్థి వచ్చే ఏడాది నీట్‌లో అర్హత సాధించి, తిరిగి ఫిలిప్పీన్స్‌ వెళ్లాల్సి ఉంటుంది.
ముఖ్య విశ్వవిద్యాలయాలు: మనిలా సెంట్రల్‌ వర్సిటీ, శిబు డాక్టర్స్‌ యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ మెడిసిన్‌, దవావో మెడికల్‌ స్కూల్‌ ఫౌండేషన్‌, ఎమిలో అగియినాల్డో కాలేజ్‌, యూనివర్సిటీ ఆఫ్‌ పెర్పెచ్యువల్‌ హెల్ప్‌.
జార్జియా, కజకిస్థాన్‌
బీఎస్‌ ప్రోగ్రామ్‌తో కలిపి ఐదున్నర సంవత్సరాల కోర్సుంటుంది. ఇక్కడ వైద్య విశ్వవిద్యాలయాలు చిన్నవైనా అత్యాధునిక వసతులతో నడుస్తున్నాయి. స్థానిక భాషలు వేరైనా 90% క్రిస్టియన్‌ జనాభా ఉండటంతో బోధనలోనూ ఆంగ్ల ఒరవడి కనిపిస్తుంది. కామన్‌వెల్త్‌ ఇండిపెండెంట్‌ దేశాల్లో ధనవంతమైన దేశం- కజకిస్థాన్‌. ఆస్థానా, అల్‌మటీ, సెమీ నగరాల్లో ప్రముఖ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి.
సవాళ్లు: * వీసా గ్యారెంటీపై సందేహాలున్నాయి. ఐఎల్‌టీఈఎస్‌ స్కోరు కావాలని కొన్ని యూనివర్సిటీలు చెబుతాయి. అయితే విద్యార్థి అడ్మిషన్‌ రద్దయ్యే అవకాశం ఉండదు. కొంత ఆలస్యం మాత్రం జరగొచ్చు.
* కజక్‌లో ఆంగ్లబోధన కొన్ని విద్యాసంస్థల్లోనే అందుబాటులో ఉంది.
జార్జియా ముఖ్య విశ్వవిద్యాలయాలు: యూరోపియన్‌ యూనివర్సిటీ, జార్జియా అమెరికన్‌ యూనివర్సిటీ, న్యూవిజన్‌ యూనివర్సిటీ.
కజకిస్థాన్‌ ముఖ్య విశ్వవిద్యాలయాలు: కజక్‌ నేషనల్‌ మెడికల్‌ యూనివర్సిటీ, కజక్‌ రష్యన్‌ మెడికల్‌ యూనివర్సిటీ, ఆస్తానా మెడికల్‌ యూనివర్సిటీ, సెమీ స్టేట్‌ మెడికల్‌ యూనివర్సిటీ.
నీట్‌ ర్యాంకు ఉంటేనే...
* విదేశాల్లో వైద్యవిద్యను అభ్యసించాలంటే ఇంటర్‌/ తత్సమాన (10+2) కోర్సు బైపీసీలో 50% మార్కులతో ఉత్తీర్ణులు కావాలి (ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ విద్యార్థులకు 40% ఉత్తీర్ణత సరిపోతుంది).
* ఈ ఏడాది విదేశాలకు వెళ్లి ఎంబీబీఎస్‌లో చేరాలనుకునేవారు ఈ ఏడాది జరిగిన నీట్‌లో అర్హత సాధించివుండాలి నీట్‌లో క్వాలిఫై అయినవారికి మాత్రమే విదేశీ ఎంబీబీఎస్‌ చదవటానికి భారతీయ వైద్య మండలి (ఎంసీఐ) అర్హత పత్రాన్ని అందిస్తోంది.
* విదేశాల్లో పట్టా పొంది, తిరిగి భారత్‌కు వచ్చిన తరువాత స్క్రీనింగ్‌ టెస్ట్‌ రాసి, ఉత్తీర్ణులవ్వాలి. ఆపై ఇక్కడ హౌజ్‌ సర్జన్సీ పూర్తిచేసి, పర్మనెంట్‌ పట్టా తీసుకున్నాకే భారత్‌లో ఇచ్చే ఎంబీబీఎస్‌ పట్టాతో సమానమైన గుర్తింపు లభిస్తుంది.
* బీఎస్‌ ఉన్న కళాశాలల్లో ఈ ప్రోగ్రామ్‌ తరువాత అక్కడ మెడిసిన్‌లో చేరతారు. కాబట్టి, ఆ ఏడాది వారు నీట్‌లో అర్హత సాధించాలి.
* ఎంసీఐ తన అధికారిక వెబ్‌సైట్‌ ‌www.mciindia.org లో ప్రపంచ దేశాల్లో గుర్తించిన వైద్య కళాశాలల జాబితాను పొందుపరిచింది. తాము చేరదల్చిన కళాశాల ఈ జాబితాలో ఉందనే విషయాన్ని విద్యార్థులు నిర్ధారించుకోవటం ముఖ్యం.
* నిర్దేశించిన నిబంధనలకు లోబడి ఉన్న యూనివర్సిటీలే కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. పైగా చేరదల్చినవారిని ఆయా విద్యాసంస్థలు తిరస్కరించే పరిస్థితి విదేశాల్లో లేనందున దేన్ని ఎంచుకోవాలన్నది విద్యార్థులకు క్లిష్టమవుతోంది.
ఇంటినీ, ఈ దేశాన్నీ వదిలి 5-6 సంవత్సరాలు వైద్యవిద్యను అభ్యసించడానికి వెళుతున్నారంటే విద్యార్థులు అందుకు మానసికంగానూ సంసిద్ధమవ్వాలి. బోధన మాధ్యమం, ఇతర అంశాలు ఎలా ఉంటాయో సీనియర్‌ విద్యార్థులతో సంప్రదించి తెలుసుకోవాలి.
* ఇక్కడి వాతావరణం, ఆహారం, ఇతర సౌకర్యాలు అక్కడ ఇలాగే ఉండనూ వచ్చు, లేకపోవచ్చు. అందుకే దేశం, దానిలోని వైద్యకళాశాలలను ఎంచుకునేముందు అనుకూల ప్రతికూల అంశాలను తెలుసుకోవాలి. బేరీజు వేసుకుని, తమకు సరిపోయే నిర్ణయం తీసుకోవటం సమంజసం.

Posted on 09-07-2018