Preparation

తిప్పి అడిగినా.. తిప్పలు లేకుండా!

* నీట్‌ - 2019

నీట్‌-2019 అప్లికేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు తిరస్కరణకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటివరకు చేసిన అధ్యయనాన్ని అంచనా వేసుకొని ప్రిపరేషన్‌లో అవసరమైన మార్పులు చేసుకోవాలి. ఇంటర్‌ బోర్డు ప్రశ్నలకు, సీబీఎస్‌ఈ అడిగే తీరుకు తేడాలు ఉండటంతో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు తడబడుతున్నారు. ప్రశ్నలను సూటిగా కాకుండా తిప్పి అడుగుతున్నారు. ఈ ఇబ్బందులను అధిగమించాలంటే నమూనా పరీక్షలను ఎక్కువ ప్రాక్టీసు చేయాలి. తద్వారా మెరుగైన స్కోరును సాధించవచ్చు.

నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (నీట్‌) ఏటా కొన్ని మార్పులతో వస్తుంది. ఈ ఏడాది మార్పు.. పరీక్ష పద్ధతిలో కాకుండా నిర్వహించే సంస్థలో వచ్చింది. సీబీఎస్‌ఈ ఆధ్వర్యంలో జరుగుతూవచ్చిన ఈ పరీక్షను ఈ సంవత్సరం నుంచీ ఎన్‌టీఏ (నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ) ఆఫ్‌లైన్‌లో నిర్వహించబోతోంది. మే 5న జరగనున్న నీట్‌కు దాదాపు 180 రోజుల వ్యవధి ఉంది. గత రెండేళ్లలో విద్యార్థుల నీట్‌ కటాఫ్‌ మార్కులను పరిశీలిస్తే... 2017 కంటే 2018లో అర్హత పొందినవారి సంఖ్య పెరిగింది. కానీ అన్ని విభాగాల్లో కటాఫ్‌ మార్కు తగ్గింది. అదేకాకుండా సీటు సాధించే మార్కు విషయంలోనూ 2017 కంటే 2018లో దాదాపు 50 మార్కులు తగ్గాయి. మన తెలుగు విద్యార్థులకు 2017లో నేషనల్‌ కోటా కింద సీట్లు ఇవ్వలేదు కానీ 2018లో మనం కూడా నేషనల్‌ పూల్‌లో ఉన్నాం. అయితే సీటు సాధించే మార్కు తగ్గింది. ర్యాంకు పెరిగింది.

గత రెండేళ్లలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి క్వాలిఫై అయిన విద్యార్థుల సంఖ్య మాత్రం పెరిగింది. అంటే కటాఫ్‌ మార్కు 119 దాటారు కానీ సీటు సాధించడానికి కావాల్సిన 460 మార్కులు సాధించడంలో విఫలమయ్యారని చెప్పవచ్చు. దీనికి కారణాలు విశ్లేషించుకుంటే లోపాలు సరిదిద్దుకోవచ్చు. గతంలో ఎక్కువ సమయం ఫిజిక్స్‌కు కేటాయించేలా విద్యార్థులు పరీక్షకు సన్నద్ధమయ్యేవారు. అయితే నీట్‌ అభ్యర్థులు ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ...ఈ మూడింటికీ సమప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా చేస్తేనే సరైన వ్యూహం అవుతుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం, ప్రణాళికాబద్ధంగా సిద్ధమవటం.. ఇవీ మంచి ర్యాంకు సాధనకు సోపానాలు. బయాలజీ జాతీయస్థాయిలో సిలబస్‌ వేరని భావించి చాలామంది విద్యార్థులు పరీక్షపై భయాన్ని పెంచుకున్నారు. కానీ గత ఏడాది బోటనీ చాలా సులభంగా ఉంది. మొత్తం ప్రశ్నలకు చాలామంది 10 నిమిషాల్లోపే జవాబులను గుర్తించగలిగారు. కాబట్టి బయాలజీతో పాటు ఇప్పుడు మరింత జాగ్రత్త వహించాల్సిన సబ్జెక్టులు- ఫిజిక్స్‌, కెమిస్ట్రీ.

కెమిస్ట్రీ: ప్రశ్నల పద్ధతి వేరు
గతంలో కెమిస్ట్రీలో (ఎంసెట్‌) మార్కులు బాగా సాధించేవారు. కానీ నీట్‌లో మార్కులపరంగా వారు బాగా వెనుకబడి ఉంటున్నారు. దీనికి ముఖ్య కారణం- సీబీఎస్‌ఈ వారి ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకంలోని వాక్యాలను ప్రశ్నల రూపంలో మార్చినపుడు విద్యార్థులు జవాబులు గుర్తించడంలో వెనుకబడటమే!
పాఠ్యపుస్తకాలు ఒకటే అయినప్పటికీ మన ఇంటర్మీడియట్‌ బోర్డులో అడిగే ప్రశ్నల విధానంలోని తేడా వల్ల కెమిస్ట్రీలోని ఎక్కువ ప్రశ్నలకు జవాబులు గుర్తించలేకపోతున్నారు. కాబట్టి, తెలుగు విద్యార్థులు ఇప్పుడు రసాయనశాస్త్రంపై ఎక్కువ దృష్టిసారించాల్సి ఉంటుంది. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లోని వాక్యాలను ప్రశ్నల రూపంలో మలిచిన ఏదైనా ఒక పుస్తకాన్ని తీసుకుని దాన్ని కనీసం రెండు, మూడుసార్లు అభ్యాసం చేయగలిగితే ఎక్కువ మార్కులకు అవకాశముంది.
కర్బన, అకర్బన, భౌతిక రసాయనశాస్త్రాల నుంచి వచ్చే ప్రశ్నల సంఖ్య పరీక్షలో సమంగానే ఉంటోంది. ద్వితీయ సంవత్సర సిలబస్‌ నుంచి ప్రశ్నల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. దీనిలో విద్యార్థి కొంతమేరకు క్లిష్టంగా భావిస్తున్న భాగం- కర్బన రసాయనశాస్త్రం. దీనిలో 5-6 ప్రశ్నలు తప్ప మిగిలినవన్నీ సాధారణ విద్యార్థి రాయగలిగే రీతిలోనే ఉంటున్నాయి. అందుకని అకర్బన, భౌతిక రసాయన శాస్త్రాల్లో తప్పులు లేకుండా జవాబులు గుర్తించేలా అభ్యాసం, పునశ్చరణ చేసుకోవాలి. ఎక్కువ నమూనా ప్రశ్నలు రాయాలి. పరీక్షల సంఖ్య పెరిగేకొద్దీ కొత్త ప్రశ్నలను ఎక్కువగా చూస్తారు. కాబట్టి, తుది పరీక్షలో సులువవుతుంది.

ఫిజిక్స్‌: గణిత ఆధారిత ప్రశ్నలు ఎక్కువ
భౌతికశాస్త్ర ప్రశ్నల విషయానికొస్తే ఎంసెట్‌లోని వాటికీ, నీట్‌లోని వాటికీ చాలా తేడా ఉంటుంది. గతంలో ఎంసెట్‌లో సిద్ధాంతపరమైన ప్రశ్నల సంఖ్య ఎక్కువగానూ లెక్కలు తక్కువగానూ ఉండేవి. నీట్‌లో గణిత ఆధారిత ప్రశ్నల సంఖ్య బాగా ఎక్కువగా ఉంటోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు డిసెంబరు నాటికి ఎక్కువ ప్రశ్నలను లెక్కల రూపంలో సాధన చేయాలి. కొత్త ప్రశ్నలను ఎదుర్కొనే నేర్పు బాగా అలవాటు చేసుకున్నవారు ఎక్కువ స్కోరు చేయగలుగుతారు.

స్పష్టంగా ఫొటో... అన్నిచోట్లా ఒకే సంతకం
విద్యార్థి ఫొటో ముఖం స్పష్టంగా కనిపించేలా తీసుకోవాలి. జుట్టు చెవులపై పడిన ఫొటో కారణంగా తిరస్కరణకు గురైన దరఖాస్తులున్నాయి. అలాగే పొడి అక్షరాల్లో, అన్నీ కేపిటల్‌ అక్షరాల్లో ఉన్న సంతకాన్ని తిరస్కరిస్తారు. సాధారణ పద్ధతిలోనే రాసేలా అలవాటు చేసుకోవాలి. పరీక్ష హాలులో కూడా విద్యార్థి సంతకాన్ని తీసుకుంటారు. కాబట్టి, అన్నిచోట్లా ఒకేలా ఉండేలా చూసుకోవాలి.
వీటితోపాటు ఒకే పేపర్‌పై ఆధార్‌ కార్డులోని ఆఖరి నాలుగు సంఖ్యలు/ పాస్‌ పోర్ట్‌ నంబరు/ రేషన్‌కార్డు నంబరు, బ్యాంక్‌ అకౌంట్‌ నంబరు, పుట్టిన తేదీ, చిరునామా, మొబైల్‌ నంబరు, ఈ-మెయిల్‌ ఐడీ అన్నీ రాసుకోవాలి. ఆపై ఆన్‌లైన్‌లో దరఖాస్తు నింపడం ప్రారంభించాలి.
ఈ-మెయిల్‌ ఇప్పటికే లేకపోతే కొత్తది రూపొందించుకోవాలి. విద్యార్థి తనది లేదా తల్లిదండ్రులది మాత్రమే ఇవ్వాలి. మొబైల్‌ నంబరు విషయంలోనూ ఇదే పద్ధతి పాటించాలి. సొంత చిరునామా ఇవ్వాలి కానీ కోచింగ్‌ సెంటర్లదీ, ఉపాధ్యాయులదీ ఇవ్వకూడదు. ఎందుకంటే ఎక్కువమందిది ఒకే చిరునామా ఉన్నా తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంటుంది. దరఖాస్తు నింపడాన్ని ఒకసారి అభ్యాసం చేద్దామనుకునే వారికోసం ఆన్‌లైన్‌లో ‘రెప్లికా ఆఫ్‌ అప్లికేషన్‌-2019’ అందుబాటులో ఉంచారు. దాన్ని ప్రయత్నించిన తర్వాత అసలైన దరఖాస్తును పూర్తిచేసుకోవచ్చు.

ఉదయం కాదు... మధ్యాహ్నం..
పరీక్ష కాలవ్యవధి మూడు గంటలు. మధ్యాహ్నం 2 గం. నుంచి సాయంత్రం 5 గం. వరకు పరీక్ష జరుగుతుంది. గతంలో ఉదయం నిర్వహించేవారు. కానీ ఈసారి నుంచి ఎంసెట్‌లా మధ్యాహ్నం నిర్వహిస్తున్నారు. పరీక్షలో మొత్తం 180 ప్రశ్నలు ఉంటాయి. వాటిలో బయాలజీ (బోటనీ, జువాలజీ) నుంచి 90 ప్రశ్నలు, ఫిజిక్స్‌, కెమిస్ట్రీల నుంచి 45 చొప్పున ప్రశ్నలుంటాయి.
ప్రతి సరైన సమాధానానికి + 4 మార్కులు, తప్పు సమాధానానికి -1 మార్కు. పరీక్ష 180 శ్రీ 4 = 720 మార్కులకు జరుగుతుంది. ఈ పరీక్షలో క్వాలిఫయింగ్‌ మార్కు జనరల్‌ కేటగిరీ విద్యార్థులకు 50వ పర్సంటైల్‌, రిజర్వేషన్‌ కేటగిరీ వారికి 40వ పర్సంటైల్‌. మొత్తం పరీక్ష రాసిన విద్యార్థుల మార్కులను అవరోహణ క్రమంలో అమర్చి, మధ్యలో ఉన్న విద్యార్థికి ఎన్ని మార్కులు వచ్చాయో, ఆ మార్కులను ఆ సంవత్సర కటాఫ్‌ మార్కుగా నిర్ణయిస్తారు.
ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ... ఈ మూడింటికీ సమ ప్రాధాన్యం ఇస్తేనే సరైన వ్యూహం అవుతుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం, ప్రణాళికాబద్ధంగా సిద్ధమవటం.. ఇవీ ర్యాంకు సాధనకు సోపానాలు!

నీట్‌ - ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్‌ దరఖాస్తుల సమర్పణ చివరి తేదీ: నవంబరు 30, 2018
ఆన్‌లైన్‌ ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: డిసెంబరు 1, 2018
దరఖాస్తులో తప్పుల సవరణ (ఆన్‌లైన్‌లో): జనవరి 14, 2019 - జనవరి 31, 2019
ప్రవేశ అనుమతి పత్రాలు (అడ్మిట్‌ కార్డులు) విడుదల: ఏప్రిల్‌ 15, 2019
పరీక్ష తేదీ: మే 5, 2019
పరీక్ష ఫలితాల వెల్లడి: జూన్‌ 5, 2019
దరఖాస్తు ఫీజు: జనరల్‌ కేటగిరీకి రూ.1400, ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లకు రూ.750

దరఖాస్తుకు ఎవరు అర్హులు?
నీట్‌కు దరఖాస్తు చేయాలంటే ఇంటర్‌లో బయాలజీ/ బయోటెక్నాలజీతోపాటు ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, ఇంగ్లిష్‌ సబ్జెక్టులు చదివి ఉండాలి. ఇంటర్‌ లేదా తత్సమాన పరీక్షలో 50% మార్కులు అన్ని సబ్జెక్టుల్లో ప్రాక్టికల్స్‌తో కలిపి సాధించి ఉండాలి. ఇది దాదాపుగా అందరు విద్యార్థులూ సాధిస్తారు. ఎస్‌సీ, ఎస్‌టీ, పీహెచ్‌ విద్యార్థులకు 40% మార్కులుంటే చాలు. 2019 డిసెంబరు 31 నాటికి 17 సంవత్సరాలు నిండిన విద్యార్థులు మాత్రమే అర్హులు. అంతకన్నా వయసు ఒకరోజు తక్కువ ఉన్నా పరీక్ష రాయడానికీ, ఎంబీబీఎస్‌/ బీడీఎస్‌ల్లో చేరడానికీ అర్హులు కారు. ఈ విధంగా వయసు తక్కువ కారణంగా ఏటా 15 నుంచి 20 మంది విద్యార్థులు అర్హత కోల్పోతున్నారని గమనించాలి.
రిజర్వేషన్‌ విద్యార్థులకు వయసులో సడలింపు ఉంటుంది. అంటే..
జనరల్‌ కేటగిరీ విద్యార్థులు 05.05.1994 నుంచి 31.12.2002లోపు పుట్టినవారై ఉండాలి.
రిజర్వేషన్‌ విద్యార్థులు 05.05.1989 నుంచి 31.12.2002లోపు పుట్టినవారై ఉండాలి.

Posted on 09-11-2018