NEET Preparation Plan

నెగ్గేద్దాం నీట్‌గా!

వైద్య, దంతవైద్య కళాశాలల్లో ప్రవేశానికి సీబీఎస్‌ఈ నిర్వహించే ప్రవేశ పరీక్ష నీట్‌ (National Eligibility cum Entrance Test). తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు 2016లోనే ఈ పరీక్ష జగటంతో అవగాహన చాలా తక్కువగా ఉంది. ఈ లోపం సవరించుకుని సరైన ప్రణాళిక వేసుకోగల్గితే నీట్‌-2017లో ఆశించిన ర్యాంకు తథ్యం!
గత నీట్‌ పరీక్షకు హాజరైన మొత్తం విద్యార్థులు 7,31,223 మంది అయితే, వారిలో కటాఫ్‌ మార్కు దాటి ర్యాంకు పొందినవారి సంఖ్య 4,09,477. జాతీయకోటా కింద తొలి 15%లో ఉన్నవారు 19,325 మంది. ఈ 2016లోని నీట్‌ తుది ర్యాంకుల జాబితా చూస్తే ఇప్పటినుంచి తయారీలో జాగ్రత్త వహిస్తే సాధారణ విద్యార్థి కూడా విజయం సాధించగలడని గ్రహించవచ్చు.
మనదేశంలో 190 ప్రభుత్వ, 222 ప్రైవేటు కలిపి మొత్తం 412 వైద్య కళాశాలల్లో 52,715 వరకు సీట్లున్నాయి (ప్రభుత్వ 25880+ ప్రైవేటు 26835). వీటన్నింటిలో దేనిలో ప్రవేశం పొందాలన్నా నీట్‌లో అర్హత పొందడం తప్పనిసరి. నీట్‌ నుంచి మినహాయింపు పొందినవి రెండు సంస్థలు మాత్రమే. అవి AIIMS లోని 7 మెడికల్‌ కళాశాలలు, JIPMER (Puducherry, Karaikal). సీఎంసీ-వెల్లూరు, సీఎంసీ-లూధియానా లాంటి మైనారిటీ సంస్థలకు కూడా మినహాయింపు లేదు. కాబట్టి మిగిలిన ఏ కళాశాలల్లో సీటు సాధించాలన్నా నీట్‌లో కటాఫ్‌ మార్కులు తెచ్చుకోవడం తప్పనిసరి.
ఏకీకృత విధానం
జాతీయస్థాయిలో వైద్య, దంతవైద్య ప్రవేశ పరీక్ష ఒకటే ఉండాలని ఏకీకృత విధానాన్ని 2012లో ప్రతిపాదించారు. అయితే దాన్ని ప్రవేశపెట్టడంలో అప్పుడు విఫలమయిన తర్వాత సుప్రీం కోర్టు ఉత్తర్వులతో, రాష్ట్రపతి గెజిట్‌ ఆధారంగా 2016లో మళ్ళీ పరీక్ష నిర్వహించారు. ఇది గతంలో AIPMT (All India Pre Medical Test) రూపంలో ఉండేది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షలు (CET), స్వయం ప్రతిపత్తి గల కళాశాలలు (Deemed Universities) నిర్వహించే పరీక్షలను రద్దుచేసి వాటి స్థానంలో ఒకే పరీక్ష నీట్‌ను ప్రవేశపెట్టారు.
నీట్‌- 2017: స్థూలంగా...
తేదీ, సమయం: మే 7, 2017; ఉదయం 10- మధ్యాహ్నం 1 గంట వరకూ
పరీక్ష తీరు: కలం, కాగితం
పరీక్ష వ్యవధి: 3 గంటలు
ఏ భాషల్లో?: ఇంగ్లిష్‌, హిందీ, ప్రాంతీయభాషల్లో
ఎన్ని ప్రశ్నలు: 180 బహుళైచ్ఛిక ప్రశ్నలు (MCQs)
ఏ విభాగాల నుంచి: బయాలజీ నుంచి 90, ఫిజిక్స్‌ నుంచి 45, కెమిస్ట్రీ నుంచి 45
మార్కుల కేటాయింపు: సరైన జవాబుకు 4 మార్కులు; తప్పు జవాబుకు -1 మార్కు
సిలబస్‌ సంగతి
నీట్‌ సిలబస్‌ను వివిధ రాష్ట్రాల సిలబస్‌లను నియంత్రణ చేసే CBSE, NCERT XI, XII ల ఆధారంగా తయారుచేసినది. 2012లో ఆంధ్రప్రదేశ్‌ ఉమ్మడి రాష్ట్రంలో అదే సిలబస్‌ ప్రతిపాదించారు కాబట్టి నేటి నీట్‌ సిలబస్‌కూ భౌతిక, రసాయన శాస్త్రాల మన ఇంటర్మీడియట్‌ సిలబస్‌కూ ఎటువంటి తేడా లేదు. బయాలజీ సీబీఎస్‌ఈలో ఒకటిగా ఉండి; రాష్ట్ర బోర్డ్‌లో బోటనీ, జువాలజీ వేర్వేరుగా ఉన్నాయి. ఈ కారణంతో మన వద్ద కొంత అదనపు సిలబస్‌ ఉంది.
2017లో సీనియర్‌ ఇంటర్‌ రాసే విద్యార్థులు లేదా 2016లో పూర్తయి లాంగ్‌ టర్మ్‌ ద్వారా ఇప్పుడు నీట్‌ రాసే విద్యార్థులు ఇంటర్‌లో చదివిన సిలబస్‌ నీట్‌ సిలబస్‌ కంటే స్వల్పంగా అదనంగానే ఉంది కాబట్టి సిలబస్‌ వ్యత్యాసం గురించి వీరికి ఎటువంటి ఆందోళనా అవసరం లేదు.
నీట్‌-2016 విశ్లేషణ
నీట్‌ 2016లో రెండుసార్లు జరిగింది. ఈ రెండింటి విశ్లేషణ సబ్జెక్టులవారీగా చూద్దాం.
ఫిజిక్స్‌:
NEET-1:గతంలోని AIPMTతో పోలిస్తే ప్రశ్నలు నిడివిగా ఎక్కువగా లెక్కించే విధంగా ఉన్నాయి. మొత్తం 45 ప్రశ్నల్లో 22 ప్రశ్నలు జూనియర్‌ ఇంటర్‌ నుంచీ, 23 ప్రశ్నలు సీనియర్‌ ఇంటర్‌ నుంచీ ఉన్నాయి. అయితే అన్ని ప్రశ్నలూ ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల పరిధిలోనే ఉన్నాయి.
NEET-2: రెండోసారి కూడా 22, 23 ప్రశ్నలు వరుసగా జూనియర్‌, సీనియర్‌ నుంచి ఇచ్చారు. NEET-Iతో పోలిస్తే సులభం. కానీ ఎక్కువ లెక్కలే ఉన్నాయి.
రసాయన శాస్త్రం:
NEET-1:చాలా సులభంగా అధికంగా సంప్రదాయ ప్రశ్నలే ఉన్నాయి. లెక్కలు కూడా సులువుగా ఫార్ములాలో ప్రతిక్షేపణ రూపంలో ఉన్నాయి. అయితే 2 ప్రశ్నలు ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల పరిధి వెలుపల ఉన్నాయి. దీనిలో కొన్ని విభాగాల నుంచి అసలు ప్రశ్నలు అడగలేదు. ఉదా: Chemistry in everyday life, Environmental Chemistry etc.
NEET 2:ఈ కెమిస్ట్రీ ప్రశ్నపత్రం ఒకటి కంటే చాలా కష్టంగా ఉన్నదని విద్యార్థుల అభిప్రాయం. దీనివల్లనే 1లోనే ఎక్కువమంది విద్యార్థులకు మంచి మార్కులు వచ్చాయని వారి అభిప్రాయం. కానీ ప్రశ్నలు కర్బన రసాయన శాస్త్రంలోని సిలబస్‌ వెలుపల, ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లో లేనివి ఇచ్చారు. ఒక ప్రశ్నకు రెండు సమాధానాలు ఉన్నాయి. దీనిలో కూడా Enviromental Chemistry, Chemistry in everydaylife నుంచి ప్రశ్నలు ఇవ్వలేదు.
బయాలజీ:
NEET-1:ప్రశ్నలు సాధారణ స్థాయిలో ఉన్నాయి. బోటనీలో ప్రశ్నల సంఖ్య 52, జువాలజీలో 38 ఉన్నాయి. ప్రశ్నపత్రం సులభం, మధ్యస్థం, కష్టంగా ఉన్న విభాగాల నుంచి ప్రశ్నల సంఖ్య సమంగా ఉంది. 8 ప్రశ్నలు NCERT XI, XII పుస్తకాలలో లేనివి ఇచ్చారు.
NEET-2: NEET-1 లాగానే విద్యార్థి కోరిన విధంగానే పేపరు ఉంది. 90 ప్రశ్నలు జవాబు గుర్తించడానికి గంట కంటే ఎక్కువ కాలం పట్టదు. మన ఇంటర్మీడియట్‌ సిలబస్‌ బాగా చదివి ఎక్కువ ప్రశ్నలకు అభ్యాసం చేసిన విద్యార్థులు 90 ప్రశ్నలు చేసే విధంగా ఉన్నాయి.
కటాఫ్‌ మార్కులు
నీట్‌ కటాఫ్‌ అనేది పర్సంటైల్‌లో ఉంది. ఈ పర్సంటైల్‌ అనేది విద్యార్థి వ్యక్తిగత మార్కులపై కాకుండా పరీక్ష రాసిన విద్యార్థుల మొత్తం సంఖ్య, ప్రశ్నపత్ర క్లిష్టత మీద ఆధారపడుతుంది. దీనిలో కటాఫ్‌ 40వ పర్సంటైల్‌ అంటే మొత్తం పది లక్షల విద్యార్థులు పరీక్ష రాశారని అనుకొంటే వారి మార్కులను అవరోహణ క్రమంలో అమర్చినప్పుడు 4,00,000వ విద్యార్థి సాధించిన మార్కులను 40th పర్సంటైల్‌ కటాఫ్‌ మార్కుగా నిర్ణయిస్తారు.
నీట్‌-2017 తయారీ విధానం
తెలుగు రాష్ట్రాల అధ్యాపకులు ఎంసెట్‌ బోధనకు దాదాపు 35 సంవత్సరాల నుంచీ అలవాటు పడివున్నారు. జాతీయస్థాయి పోటీ పరీక్షల్లో సీట్ల సంఖ్య చాలా తక్కువగా ఉండటం వల్ల బోధన చాలా తక్కువగా ఉండేది. ఎంసెట్‌లో 160 ప్రశ్నలు; రుణాత్మక మార్కులు లేవు. కానీ నీట్‌లో 180 ప్రశ్నలు. తప్పు జవాబుకు రుణాత్మక మార్కులు ఉన్నాయి. అంటే విద్యార్థి వేగం, కచ్చితత్వం... రెండూ పెరగాలి.
ఇంతవరకు ఎంసెట్‌ తరహా ప్రశ్నలతోనే ఉన్నారు, కానీ జాతీయస్థాయి ఏఐపీఎంటీపై అవగాహన లేనందున ప్రశ్నపత్రాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వవలసి ఉంటుంది. పేపర్‌ తయారుచేసేది సీబీఎస్‌ఈ కాబట్టి ఆ తరహాలో ఇచ్చే నమూనా ప్రశ్నపత్రాలపైనే ఎక్కువగా తర్ఫీదు పొందాలి.
ఇంటర్‌లో చదివిన సిలబస్‌ నీట్‌ సిలబస్‌ కంటే స్వల్పంగా అదనంగానే ఉంది కాబట్టి సిలబస్‌ వ్యత్యాసం గురించి ఎటువంటి ఆందోళనా చెందనవసరం లేదు.
తెలుగు రాష్ట్రాల్లోని పుస్తకాలు సీబీఎస్‌ఈ ఆధారిత పుస్తకాలు కాదు. అందుకని అభ్యాసానికి సరైన పుస్తకాలు ఎంచుకోవాలి. పాఠ్యాంశం చదవడానికంటే ప్రశ్నల అభ్యాసానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.
ఏమేం చేయాలి?
1. ఫిజిక్స్‌, కెమిస్ట్రీలలో సీనియర్‌ ఇంటర్‌ సిలబస్‌ నుంచీ, బయాలజీలో జూనియర్‌ ఇంటర్‌ సిలబస్‌ నుంచీ ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి ఇదేరీతిలో అభ్యాసానికి ప్రాధాన్యం ఇవ్వండి.
2.ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల ఆధారంగా ప్రశ్నలు వస్తున్నందున ప్రాథమికంగా చేయవలసినది వాటినే. కొద్దిశాతం ప్రాక్టికల్స్‌ నుంచి వస్తాయి కదా? తయారీ విధానంలో వాటికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలి.
3. తయారీలో ప్రతి సబ్జెక్టులోనూ గుర్తుంచుకోవలసిన అంశాలను వేరుగా రాసుకొని ఎక్కువసార్లు పునశ్చరణ చేసుకోవాలి.
4. తెలుగు రాష్ట్రాల్లోని పుస్తకాలు సీబీఎస్‌ఈ ఆధారిత పుస్తకాలు కాదు. అందుకని అభ్యాసానికి సరైన పుస్తకాలు ఎంచుకొని పాఠ్యాంశం చదవడానికంటే ప్రశ్నల అభ్యాసానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.
5. రుణాత్మక మార్కులు ఉన్నందున పరీక్షల్లో తెలియని ప్రశ్నల జవాబులు గుర్తించకూడదు.
6. నమూనా పరీక్షలు వీలైనన్ని ఎక్కువ రాస్తూ, చేసిన తప్పులపై విశ్లేషణ, పునశ్చరణ జరగాలి.
7. సబ్జెక్టు కటాఫ్‌ మార్కులు లేవు. మూడింటిలో ఒకదానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం మేలు. బయాలజీ నుంచి 90 ప్రశ్నల్లో 80 ప్రశ్నల పైన జవాబు గుర్తించేలా తయారుకాగలిగితే 320 మార్కుల వరకు అంటే కచ్చితంగా ప్రైవేట్‌ కళాశాలలో సీటు సాధించుకొనే మార్కులు వచ్చినట్లు అవుతుంది.
8. రసాయన శాస్త్రంలో అకర్బన రసాయన శాస్త్రం నుంచి 15 ప్రశ్నలు ఉంటున్నాయి. వాటిలో గ్రూపులకు సంబంధించిన ప్రశ్నలే అధికం. వాటి తయారీకి పట్టికలు చేసుకొని రోజూ ఒకసారి మననం చేసుకోవడం మేలు.
9. ప్రతి చాప్టర్‌కూ సారాంశం (synopsis) మీరే తయారుచేసుకొని వాటిని ప్రతి నమూనా పరీక్ష ముందూ పునశ్చరణ చేయాలి.
10. పరీక్షలో తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నల సమాధానాలు గుర్తించగలగాలి. ఈ కారణం మూలంగా నమూనా పరీక్షల్లో సమయ పాలనకు ప్రాధాన్యం ఇవ్వాలి.
11. బయాలజీ ఒక గంట, కెమిస్ట్రీ 45 నిమిషాలు, ఫిజిక్స్‌ ఒక గంటలో చేసే విధంగా తయారు కావాలి.
12. తెలియని ప్రశ్నలను, క్లిష్టమైన లెక్కించే విధానం ఉన్న లెక్కలను వదిలి వెంటనే తర్వాత ప్రశ్నకు వెళ్లేవిధంగా తయారుకావాలి.
13జనవరి నుంచి మొత్తం సమయంలో సగం కాలవ్యవధి బయాలజీ తయారీకీ, మిగిలిన సగ కాలంలో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ పూర్తిచేసేలా తయారుకావాలి.
వివ‌రాలు....
* నేష‌న‌ల్ ఎలిజిబిలిటీ క‌మ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్‌-యూజీ) - 2017
కోర్సులు: ఎంబీబీఎస్‌, బీడీఎస్‌.
అర్హత‌: ఇంట‌ర్ లేదా త‌త్సమాన విద్యార్హత‌.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ప్రవేశ ప‌రీక్ష ద్వారా.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 31.01.2017.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 01.03.2017.
అడ్మిట్‌కార్డు డౌన్‌లోడ్‌: 15.04.2017 నుంచి.
నీట్‌(యూజీ) ప‌రీక్ష తేది: 07.05.2017.
ఆన్‌లైన్ అప్లికేష‌న్: https://goo.gl/XT5LPq
వెబ్‌సైట్‌: http://cbseneet.nic.in/cbseneet/Welcome.aspx
నోటిఫికేష‌న్‌

Posted on 01-02-2017