Preparation Plan

నీట్‌ పోటీకి ధీమాగా!

వైద్యవిద్యలో ప్రవేశం కోసం జాతీయస్థాయి పరీక్ష ‘నీట్‌’ దరఖాస్తుల ప్రక్రియ మొదలయింది. ఆన్‌లైన్‌ దరఖాస్తును సక్రమంగా భర్తీచేసి పంపటం; పరీక్ష స్థాయికి తగ్గట్టుగా సన్నద్ధతపై దృష్టి సారించటం విద్యార్థుల కర్తవ్యాలు. ఆత్మవిశ్వాసంతో ఈ పోటీలో నెగ్గటానికి ఇదే తొలి మెట్టు!
తెలుగు రాష్ట్రాల ఇంటర్మీడియట్‌ బైపీసీ విద్యార్థులు ఈ విద్యా సంవత్సరం నుంచి వైద్య, దంతవైద్య కళాశాలల్లో ప్రవేశం కోసం తప్పనిసరిగా నీట్‌ (నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌-2017) రాయాల్సివుంది. మొదట ఏఐపీఎంటీ రూపంలో ఉన్న ఈ పరీక్ష 2016 నుంచి ‘నీట్‌’గా మారింది.
గత ఏడాది ఆర్డినెన్స్‌ ద్వారా కల్పించిన వెసులుబాటుతో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో కేటగిరి-ఏ సీట్లకు ప్రవేశాలు ఎంసెట్‌ ద్వారానే జరిగాయి. కానీ సంవత్సరం నుంచి ప్రభుత్వ, ప్రైవేటు లేదా డీమ్డ్‌ యూనివర్సిటీల్లో సీట్లకు మైనారిటీ సంస్థలతో కలిపి నీట్‌-యూజీ పరీక్షలో అర్హత తప్పనిసరి అయింది. మేనేజ్‌మెంట్‌ కోటాలో సీట్లు పొందాలన్నా నీట్‌లో అర్హత పొందాల్సిందే.
అంటే దేశంలో ఉన్న మొత్తం ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సులకు సంబంధించిన మొత్తం 52,305 సీట్లు నీట్‌-యూజీలో అర్హులైన విద్యార్థులతోనే భర్తీ చేయాల్సివుంటుంది.
8 భాషల్లో...
మామూలుగా ఈ జాతీయస్థాయి పోటీపరీక్ష వివరాలు డిసెంబర్లో వెలువరిస్తారు. కానీ ఈసారి జనవరి 31 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఏడాది నుంచి ఈ పరీక్షను 8 భాషల్లో (హిందీ, ఇంగ్లిష్‌, తమిళం, తెలుగు, గుజరాతీ, మరాఠీ, అస్సామీ, బెంగాలీ) నిర్వహిస్తున్నారు. గతంలో పరీక్షాపత్రం ఇంగ్లిష్‌, హిందీల్లో మాత్రమే ఉండేది.
ఇప్పుడు ప్రాంతీయభాషను విద్యార్థి కోరుకుంటే ఇంగ్లిష్‌తో పాటు ఆ భాషలో కూడా ఉన్న ప్రశ్నపత్రాన్ని ఇస్తారు. తెలుగు రాష్ట్ర విద్యార్థులు ఇంగ్లిష్‌, ఇంగ్లిష్‌-హిందీ; ఇంగ్లిష్‌-తెలుగు... ఈ మూడు రకాల్లో ఏ ప్రశ్నపత్రాన్ని అయినా కోరుకోవచ్చు. అయితే ఇంగ్లిష్‌- తెలుగు కోరుకోవాలంటే పరీక్షాకేంద్రం తెలుగు రాష్ట్రాల్లోని నాలుగు కేంద్రాల్లో ఏదో ఒకటి మాత్రమే తీసుకోవాల్సివుంటుంది. అవి- తెలంగాణలో హైదరాబాద్‌, వరంగల్‌; ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, విశాఖపట్నం. తమిళంలో రాయదల్చిన అభ్యర్థి విజయవాడ లాంటి పరీక్షకేంద్రాలు ఎంపిక చేసుకునే అవకాశం లేదు. తమిళనాడులోని ఒక పరీక్షాకేంద్రాన్ని మాత్రమే ఎంపిక చేసుకోవాలి.
పరీక్ష ప్రశ్నపత్రం ఒకవేళ రెండుభాషల్లో తీసుకున్నప్పటికీ ఒకవేళ అనువాదంలో తేడా అనిపిస్తే ఇంగ్లిష్‌ పేపర్లోని వ్యక్తీకరణనే పరిగణనలోకి తీసుకోవాలి. తెలుగు తీసుకునే విద్యార్థులు ప్రశ్నను ఇంగ్లిష్‌లో కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇలా ప్రాంతీయ భాషల్లో కూడా పేపర్‌ తయారీకి కావలసిన నిబంధనల రూపకల్పన కోసమే దాదాపు నెల రోజుల పొడిగింపు జరిగింది.
దరఖాస్తు ప్రక్రియ
నీట్‌-యూజీ: 2017 తేదీని మే 7గా నిర్ణయించారు. దీన్ని రాయటం కోసం జనవరి 31 నుంచి మార్చి 1వ తేదీ వరకూ ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్‌, ఓబీసీ వారు రూ.1400, ఎస్‌సీ, ఎస్‌టీ, పీహెచ్‌ వారు రూ. 750 దరఖాస్తు రుసుముగా చెల్లించాల్సివుంటుంది.
దరఖాస్తు నింపాలంటే ఆధార్‌ కార్డు తప్పనిసరి. దీనితో పాటు విద్యార్థికి ఈ-మెయిల్‌ ఐడీ, తల్లిదండ్రుల సెల్‌ఫోన్‌ నంబర్‌, దరఖాస్తు రుసుము సిద్ధం చేసుకోవాలి.
వయసు నిబంధన
ఎంబీబీఎస్‌/ బీడీఎస్‌లో చేరడానికి విద్యార్థి కనీస వయసు 17 సంవత్సరాలు నిండాలి. అది వారు చేరే విద్యాసంవత్సరంలో డిసెంబరు 31లోపు 17 సంవత్సరాలు నిండాలి. ఇప్పుడు దరఖాస్తు చేసే విద్యార్థుల్లో వారి పుట్టినతేదీ 31-12-2000 లేదా ఇంతకుముందు ఉంటే వారు అర్హులే. 1-1-2001, ఆపై తేదీల్లో పుట్టినవారు ఈ విద్యాసంవత్సరంలో ప్రవేశానికి అనర్హులు. ఈ నిబంధన కచ్చితంగా పాటిస్తారు. దీనిలో ఒక్క రోజుకు కూడా ఎలాంటి సడలింపూ ఉండదు.
ఫొటో, ధ్రువపత్రాలు...
మీ ఫొటోగ్రాఫ్‌ 10 కేబీ నుంచి 100 కేబీలోపు ఉండేలా, సంతకం 3 కేబీ నుంచి 20 కేబీలోపు ఉండేలా స్కాన్‌ చేసుకొని ఉంచుకోవాలి. ఆపై దరఖాస్తు భర్తీ ప్రక్రియ ఆరంభించాలి.
దివ్యాంగులైన విద్యార్థులు కింది నాలుగు సంస్థల్లో ఏదో ఒకదాన్నుంచి ధ్రువ పత్రం పొందాలి. ఆ సంస్థలు- వర్థమాన్‌ మహావీర్‌ మెడికల్‌ కాలేజ్‌, దిల్లీ 2) ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిజికల్‌ మెడిసిన్‌ అండ్‌ రిహాబిలిటేషన్‌, ముంబయి 3) ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పీజీ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసర్చ్‌, కోల్‌కత 4) మద్రాస్‌ మెడికల్‌ కాలేజ్‌, చెన్నై. వీరి లోయర్‌ లిమిట్స్‌ డిజేబిలిటీ 50 శాతం నుంచి 70 శాతం ఉంటే పీహెచ్‌-1; 40 శాతం- 50 శాతం ఉంటే పీహెచ్‌-2 కేటగిరీ కింద వస్తారు. అయితే కచ్చితంగా ధ్రువీకరణ పత్రం పై నాలుగు సంస్థల్లో ఏదో ఒక సంస్థ నుంచే పొందివుండాలి.
* దరఖాస్తు ఫీజును ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌... ఏవిధంగా అయినా చెల్లించవచ్చు. ఆన్‌లైన్‌ అంటే నెట్‌ బ్యాంకింగ్‌, డెబిట్‌ కార్డ్‌ లాంటివి. అదే విధంగా ఆఫ్‌లైన్‌ అంటే బ్యాంక్‌ చలానా లాంటివి చేయవచ్చు. ఇండియన్‌ పోస్టల్‌ ఆర్డర్‌ కానీ, డీడీ, పే ఆర్డర్‌, చెక్‌ గానీ అంగీకరించరు.
* దరఖాస్తు నింపేటపుడు ఈ-మెయిల్‌, ఫోన్‌ నంబర్‌ తప్పనిసరి. వ్యక్తిగత ఈ-మెయిల్‌ఇవ్వడం మంచిది. ఎందుకంటే తర్వాత సమాచారం ఆ మెయిల్‌కే వస్తుంది. దరఖాస్తు భర్తీ చేసేటపుడు ఓటీపీ (వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌) సెల్‌ఫోన్‌కూ, మెయిల్‌కూ వస్తుంది. అది ఎంటర్‌ చేసిన తర్వాతే దరఖాస్తు భర్తీ పూర్తవుతుంది.
* గ్రామీణ విద్యార్థులు తమ దరఖాస్తును పూర్తిచేయటం ఇబ్బందిగా భావిస్తే సీబీఎస్‌ఈ వారి నిర్ణీత కేంద్రాల్లో దరఖాస్తు నింపడానికి ఫీజు చెల్లించి అక్కడ పూర్తి చేసుకోవచ్చు. పూర్తిగా తెలియని విద్యార్థులు మొత్తం దరఖాస్తును భర్తీ చేయించుకోవడానికి రూ. 100 లోపు అవుతుంది. దరఖాస్తు కచ్చితంగా నింపడం సమస్యగా ఉన్నవారు ఆ కేంద్రాల సేవను వినియోగించుకోవడం మేలు అవుతుంది.
రెండు పరీక్షలకూ ఏమిటి తేడా?
ఇంతవరకూ తెలుగు విద్యార్థులకు ఎంసెట్‌ రాసే అలవాటే ఎక్కువ; అధ్యాపకుల బోధన కూడా దానికి తగినవిధంగానే ఉంటూ వచ్చింది. ఇప్పుడు నూతన పరీక్ష అయిన నీట్‌కూ, పాత ఎంసెట్‌కూ తేడాలేమిటో విద్యార్థులు అవగాహన చేసుకోవాలి.
ఈ ఏడాది కూడా ఎంసెట్‌ బయాలజీ విభాగపు పరీక్ష జరుగుతుంది కానీ కేవలం అగ్రికల్చర్‌, బీఫార్మసీ, నర్సింగ్‌, హోమియోపతి, ఆయుర్వేదిక్‌, యునానీ కోర్సుల్లో ప్రవేశానికి మాత్రమే ఎంసెట్‌ ర్యాంకు ఉపయోగపడుతుంది.
బయాలజీ + ఒక సబ్జెక్టు
నీట్‌లో ప్రతి సబ్జెక్టుకూ కనీస మార్కు అనేది లేదు. అది ఎంసెట్‌లో కూడా లేదు. మొత్తం మార్కుల ప్రాతిపదిక అవుతుంది కాబట్టి విద్యార్థి బయాలజీకి తోడుగా ఫిజిక్స్‌ లేదా కెమిస్ట్రీ... ఏదో ఒక సబ్జెక్టుకు అధిక ప్రాధాన్యం ఇస్తే మెడికల్‌ సీటు సాధించుకునే అవకాశం ఉంటుంది.
బయాలజీలో 90 ప్రశ్నలకు 80 ప్రశ్నలవరకూ జవాబులు గుర్తించేవిధంగా తయారు కాగలిగితే 320 మార్కులు వస్తాయి. ఫిజిక్స్‌, కెమిస్ట్రీలతో కలిపి 90 ప్రశ్నల్లో కనీసం 40 ప్రశ్నలు సరిగా రాయగలిగితే ఇంకొక 160 మార్కులు... అంటే మొత్తం 480 మార్కుల వరకూ వస్తాయి. అలా సాధించగలిగితే ప్రభుత్వ కళాశాలలో లేదా ప్రైవేటు కళాశాలలో కేటగిరి ఏ లో సీటు సాధించుకున్నట్లే!
జనరల్‌ కేటగిరి కటాఫ్‌ మార్కు 145/720 ఉంది. ఈ మార్కును ఏ విద్యార్థి అయినా కేవలం బయాలజీ మార్కుల ఆధారంగా సాధించుకోవచ్చు. రుణాత్మక మార్కులు ఉన్నందున తెలియని ప్రశ్నలకు జవాబులు గుర్తించే అలవాటు మానుకోవాలి. దీనికి అధిక నమూనా పరీక్షలు రాయడం మేలవుతుంది.
నీట్‌లో బయాలజీకి తోడుగా ఫిజిక్స్‌ లేదా కెమిస్ట్రీ... ఏదో ఒక సబ్జెక్టుకు అధిక ప్రాధాన్యం ఇస్తే మేలు. బయాలజీలో 90 ప్రశ్నలకు 80 ప్రశ్నలవరకూ జవాబులు గుర్తించేలా తయారైతే 320 మార్కులు వస్తాయి. ఫిజిక్స్‌, కెమిస్ట్రీల్లో ఇంకొక 160 మార్కులు... మొత్తం 480 మార్కుల వరకూ సాధించగలిగితే సీటు వచ్చినట్లే!
అఖిలభారత కోటా సంగతి
దరఖాస్తు భర్తీ సందర్భంగా అఖిలభారత కోటా పొందటం ఎలా అనేది అవగాహన చేసుకోవాలి.
మెడికల్‌ సీట్లను ఎంసీఐ నాలుగు విభాగాలుగా విభజించింది. 1) అఖిలభారత కోటా సీట్లు 2) రాష్ట్రప్రభుత్వ కోటా సీట్లు 3) ప్రైవేటు మెడికల్‌/డెంటల్‌ కళాశాలల్లో రాష్ట్ర/ప్రైవేటు/మేనేజ్‌మెంట్‌/ ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లు 4) సెంట్రల్‌ పూల్‌ కోటా సీట్లు.
తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లోని 15 శాతం కోటా సీట్లకు అనర్హులు. అలాగే ఇతర రాష్ట్రాల విద్యార్థులు కూడా మన వద్ద సీట్లు పొందలేరు. ఇది కేవలం ప్రభుత్వ కళాశాలల్లోని సీట్లకూ, ప్రైవేటు కళాశాలల్లో కేటగిరీ ఏ సీట్లకూ మాత్రమే. అంటే రాష్ట్రప్రభుత్వ కౌన్సెలింగ్‌ ద్వారా నింపే సీట్లకు వర్తిస్తుంది.
మూడో కేటగిరిలో ఉన్న కళాశాలల్లో ఏ రాష్ట్రవిద్యార్థి ఏ రాష్ట్రానికి అయినా వెళ్ళవచ్చు. ప్రైవేటు కళాశాలల్లో కేటగిరీ బీ లేదా కేటగిరీ సీ సీట్లు, మేనేజ్‌మెంట్‌ కోటా, ఎన్‌ఆర్‌ఐ కోటా లేదా డీమ్డ్‌ యూనివర్సిటీల్లో సీట్లు ఏ రాష్ట్రంలో ఉన్నా తెలుగు రాష్ట్రాల విద్యార్థులు చేరడానికి అర్హులే. తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ లేదా ప్రైవేటు కళాశాలల్లోని నూరుశాతం సీట్లకూ, రాష్ట్రం వెలుపలున్న ప్రైవేటు కళాశాలల్లో కేటగిరీ బీ లేదా కేటగిరీ సీ సీట్లకూ, డీమ్డ్‌ వర్సిటీల్లో ప్రవేశం కోసం దరఖాస్తు చేయదల్చిన విద్యార్థులు అఫిడవిట్‌ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ విద్యార్థులు పైన పేర్కొన్న తెలిపిన సీట్లు వద్దని ఇతర రాష్ట్రాల్లోని ప్రభుత్వ కళాశాలల్లో 15 శాతంలో సీట్లు పొందాలంటే దరఖాస్తులో అఫిడవిట్‌ పొందపరచాల్సివుంటుంది. తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఈ అఫిడవిట్‌కు NO చెప్పడం సరి అవుతుంది!
గత ఏడాది కటాఫ్‌ ఎంత?
వైద్య/దంత వైద్య కళాశాలల్లో సీటు పొందాలంటే ఏ కేటగిరీకి సంబంధించిన వ్యక్తి అయినా నీట్‌లో అర్హత పొందాల్సిందే. దీనిలో క్వాలిఫై అవ్వటానికి జనరల్‌ కేటగిరీ విద్యార్థులకు 50th పర్సంటైల్‌గా నిర్థారించారు. 50వ పర్సంటైల్‌ అంటే.... జనరల్‌ కేటగిరిలో ఉన్న విద్యార్థుల మార్కులను ఆరోహణ క్రమంలో తీసుకున్నపుడు... రాసిన విద్యార్థుల్లో మధ్య విద్యార్థి సాధించిన మార్కులు. ఇవి ప్రతి సంవత్సరం మారవచ్చు.
గత సంవత్సరం మార్కులు సుమారుగా ఒక అవగాహన ఏర్పరచవచ్చు కానీ అంతకంటే అధిక మార్కులకే ప్రయత్నించాలి. గత ఏడాది విద్యార్థులకు పరీక్షపై అవగాహన తక్కువ; నీట్‌-2లో రాశారు కాబట్టి ప్రాధాన్యం తెలియలేదు.
ఇలా అర్థం చేసుకోవాలి...
ఉదాహరణకు 6వ వరస తీసుకుంటే అది ఓబీసీ విద్యార్థుల్లో ఫిజికల్లీ హ్యాండీకాప్డ్‌ కేటగిరీ. వారి క్వాలిఫైయింగ్‌ మార్కు 40వ పర్సంటైల్‌. ఈ మార్కులు 118/720. ఈ విభాగంలోని విద్యార్థుల్లో ఉత్తమ మార్కు 510/720. 510 నుంచి 118 మార్కులలోపు ఈ విభాగంలో 597 మంది విద్యార్థులున్నారు. ఈ కేటగిరిలో 510 మార్కులు సాధించిన విద్యార్థికి కేటగిరి ర్యాంకు 1; 118 మార్కులు సాధించిన విద్యార్థికి కేటగిరి ర్యాంకు 597.
597 ర్యాంకు విద్యార్థికి మెరిట్‌ కోటాలో సీటు రాదు. అయితే ఆ విద్యార్థి మైనారిటీ కళాశాలల్లో గానీ, డీమ్డ్‌ యూనివర్సిటీల్లో గానీ, ప్రైవేటు వైద్యకళాశాలల్లో గానీ కేటగిరి బీ, మేనేజ్‌మెంట్‌, ఎన్‌ఆర్‌ఐ కోటాలలోని సీట్లు పొందటానికి అర్హత పొందినట్లు అవుతుంది.

Posted on 06-02-2017