Preparation Plan
ఎన్ని మార్కులువస్తే ‘నీట్’ సీటు?
వైద్యవిద్యా కోర్సుల్లో చేరదల్చిన విద్యార్థులు ‘నీట్’ ర్యాంకు పొందడం తప్పనిసరి. పైగా మిగతా ప్రవేశపరీక్షలతో పోలిస్తే దీని ద్వారా భర్తీ అయ్యే సీట్లూ ఎక్కువే. తొలిసారిగా ఈ సంవత్సరమే తెలుగు విద్యార్థులు పూర్తిస్థాయి పోటీలో ఈ పరీక్ష రాస్తున్నారు. సమర్థంగా ఎదుర్కొని స్కోరు చేయాలంటే దీనిపై సమగ్ర అవగాహన పెంచుకోవడం, అపోహలు తొలగించుకోవడం అవసరం!
తెలుగు రాష్ట్రాల బైపీసీ ఇంటర్మీడియట్, లాంగ్‌టర్మ్ విద్యార్థులకు ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర ఆయుష్ కోర్సుల్లో ప్రవేశానికి తోడ్పడే పరీక్ష ‘నీట్’. ఇది మే 7న జరగబోతోంది. గతంలో వివిధ పరీక్షలు వివిధ విశ్వవిద్యాలయాలకు జరిగేవి కాబట్టి, విద్యార్థులు ఏదో ఒక పరీక్ష అనే రీతిలో ఉండేవారు. కానీ ఇప్పుడు ఎంబీబీఎస్‌లో ప్రవేశానికి దేశం మొత్తంలో జరిగే పరీక్షలు మూడే.
1) నీట్
2) ఎయిమ్స్
3) జిప్మర్.
ఎయిమ్స్, జిప్మర్ జూన్‌లో జరుగుతాయి. నీట్‌తో పోలిస్తే వీటి ద్వారా ఉండే సీట్ల సంఖ్య చాలా తక్కువ. దీన్ని దృష్టిలో ఉంచుకునే నీట్ ర్యాంకు సాధన విద్యార్థుల లక్ష్యంగా మారింది. ఈ పరీక్షపై ఉన్న సందేహాలూ, అపోహలను నివృత్తి చేసుకోవడానికి విద్యార్థులు గత నాలుగు సంవత్సరాల ఏఐపీఎంటీ పేపర్లను విశ్లేషించుకోగలిగితే చాలు. పరీక్ష స్వభావం పూర్తిగా భోదపడుతుంది.
పరీక్ష విధానం
ఇంగ్లిష్, ఇంగ్లిష్- హిందీ, ఇంగ్లిష్-తెలుగు అనే మూడు విధానాల్లో విద్యార్థి దరఖాస్తులో ఎంచుకున్న దాని ప్రకారం నీట్- 2017 ప్రశ్నపత్రం ఉంటుంది. తెలుగు రాష్ట్రాల విద్యార్థులు దాదాపు 90 శాతం ఇంగ్లిష్‌లోనే ప్రశ్నపత్రాన్ని తీసుకుంటున్నారు. ఒకవేళ తెలుగు కావాలంటే ఇంగ్లిష్, తెలుగు రెండు భాషల్లో ఉన్న ప్రశ్నపత్రాన్ని ఎంచుకోవచ్చు. తెలుగు తర్జుమాలో ఏదైనా తప్పు ఉంటే ఇంగ్లిష్‌లోని అర్థాన్నే తీసుకుని తుది కీని ప్రకటిస్తారు. అందుకని తెలుగు మాధ్యమ విద్యార్థులు ప్రశ్నలను ఇంగ్లిష్‌లో చదవడాన్ని అలవాటు చేసుకోవాలి. ఈ పరీక్షలో మొత్తం 180 ప్రశ్నలు ఉంటాయి. బయాలజీ నుంచి 90 ప్రశ్నలు ఉంటాయి. కానీ బోటనీ, జువాలజీల నుంచి సమంగా అంటే 45 చొప్పున ప్రశ్నలు ఉండాలనేం లేదు. 2016లో జరిగిన నీట్లో బోటనీ నుంచి 52, జువాలజీ నుంచి 38 ప్రశ్నలు వచ్చాయి.
సీట్ల సంఖ్య
నీట్ వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఎంబీబీఎస్/ బీడీఎస్ సీట్లు పెరగడం కానీ, తగ్గడం కానీ జరగదు. 371 (డి) ప్రకారం మన విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లోని ప్రభుత్వ మెడికల్/ కన్వీనర్ కోటాలోని మెడికల్ సీట్లు పొందడానికి అవకాశం లేదు. మన రాష్ట్రంలో ఇతర రాష్ట్ర విద్యార్థులకు కన్వీనర్ కోటాలోని సీట్లు ఇవ్వరు. అయితే ఈ నీట్ వల్ల అదనంగా డీమ్డ్ యూనివర్సిటీలు, ఇతర రాష్ట్రాల్లోని మెడికల్, డెంటల్ కళాశాలల్లో కేటగిరీ-బి, సి సీట్లకు అర్హత పొందుతారు. అంటే, తెలుగు రాష్ట్రాల్లోని 6500 సీట్లలో.. ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో 4000 వరకు ఉన్న కేటగిరీ-ఎ సీట్లను తెలుగు రాష్ట్రాల విద్యార్థులకే కేటాయిస్తారు. ఇక్కడ కేటగిరీ-బి, సి, గీతం యూనివర్సిటీలోని సీట్లకు అన్ని రాష్ట్రాల విద్యార్థులూ అర్హులే. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లోని మెడికల్ కళాశాలల్లోని కేటగిరీ-బి, సి, డీమ్డ్ యూనివర్సిటీల్లోని సీట్లకు తెలుగు విద్యార్థులు కూడా పోటీపడవచ్చు. దీనివల్ల అదనంగా 11,000 వరకు సీట్లు వస్తాయి. వీటిలో కనీసం 2000 వరకు తెలుగు విద్యార్థులు పొందే అవకాశం ఉంది.
రిజర్వేషన్ విధానం
మెడికల్, డెంటల్ కళాశాలల్లో గతంలో నిర్వహించిన రిజర్వేషన్ విధానమే ఇప్పుడూ కొనసాగుతుంది. నీట్ జాతీయస్థాయి పరీక్ష అయినప్పటికీ సీట్లను నింపే విధానం ప్రాంతీయంగానే జరుగుతుంది. కాబట్టి, రిజర్వేషన్లో ఎలాంటి మార్పూ ఉండదు. గతంలో మాదిరిగానే ఎస్సీ- 15%, ఎస్టీ- 7% తోపాటు బీసీ- ఎ, బి, సి, డి, ఇ కూడా అలాగే కొనసాగుతుంది. ఎన్సీసీ, స్పోర్ట్స్ కోటాలు కూడా గతంలో ఉన్న విధానంలోనే కొనసాగుతాయి. కాబట్టి రిజర్వేషన్ అర్హత ఉన్న విద్యార్థులు ఈ విషయంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సీట్ల భర్తీలో ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని విద్యార్థులకు 85 శాతం సీట్లు ఉంటాయి. మిగిలిన 15 శాతం సీట్లు శ్రీ వెంకటేశ్వర, ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థులతో నింపుతారు. ఆంధ్రా యూనివర్సిటీలోని 85% సీట్లను దాని పరిధిలోని విద్యార్థులకు మిగిలిన 15% సీట్లను ఉస్మానియా, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ పరిధిలోని విద్యార్థులతో భర్తీ చేస్తారు.
తయారీ విధానం
* ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తవనున్నాయి. కాబట్టి, విద్యార్థి తన పూర్తి సమయాన్ని నీట్ తయారీకే ఉపయోగించుకోవాలి.
* ఎయిమ్స్, జిప్మర్ రాస్తున్నప్పటికీ అవి జూన్ మొదటి వారంలో ఉన్నాయి. వాటికి మే 7 తరువాత సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. దీనికి ముందు మొత్తం సమయాన్ని నీట్‌కే కేటాయించడం మేలు.
* నీట్‌కు సుమారుగా 50 రోజుల సమయం ఉంది. మొదటి 20 రోజులు మొత్తం సిలబస్‌కు కేటాయించాలి. ఇంకో పదిరోజులు గ్రాండ్ టెస్ట్‌లకు, మిగిలిన రోజులను పునశ్చరణకు కేటాయించేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.
* సీనియర్ ఇంటర్ సిలబస్‌ను ఇప్పటిదాకా చదువుతూనే ఉన్నారు. దీనికి కొంత సమయం కేటాయిస్తే చాలు. జూనియర్ ఇంటర్ సిలబస్‌కు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తే మంచిది.
* నీట్లో సబ్జెక్టులవారీగా ప్రాముఖ్యం ఉన్న అధ్యాయాలను వేరుచేసి, వాటికి ఎక్కువ సమయం కేటాయించాలి.
* గుర్తుంచుకోవాల్సిన అంశాలకు ప్రాధాన్యమిచ్చి, ఎక్కువగా పునశ్చరణ చేయాలి.
* మొత్తం సమయంలో ఎక్కువ భాగాన్ని బయాలజీకి కేటాయించాలి. వాటిలో గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎక్కువసార్లు పునశ్చరణ చేయడం లాభిస్తుంది.
* ఆ తరువాతి ప్రాధాన్యం కెమిస్ట్రీకి ఇవ్వాలి. దీనిలో గ్రూపులకు సంబంధించి టేబుల్స్‌ను వేసుకోవడం ద్వారా సమయం ఆదా అవుతుంది.
* రుణాత్మక మార్కులు ఉంటాయి. ఎక్కువ నమూనా పరీక్షలను రాస్తూ, తప్పు సమాధానాలను గుర్తించకుండా అభ్యాసం చేయాలి.
* ఈ సమయంలో కొత్త పుస్తకాల జోలికి వెళ్లకూడదు. గతంలో చదివినవాటినే కొనసాగించడం ద్వారా వడి, కచ్చితత్వం పెరుగుతుంది.
* సాధారణ విద్యార్థి అతి కష్టమైన పరీక్షలను ఎంచుకుంటే ఆత్మస్థైర్యాన్ని కోల్పోయే ప్రమాదముంది. అందుకని విద్యార్థి తన స్థాయిని అంచనా వేసుకుని దానికి తగ్గట్టుగా ఉన్న పరీక్షలనే రాయడం మేలు.
* తెలియని అంశాలకు ప్రాధాన్యమిచ్చి సమయాన్ని నష్టపోకుండా తెలిసినవాటినే ఎక్కువసార్లు అభ్యాసం చేయడం మేలు.
‘మొత్తం సమయంలో ఎక్కువ భాగాన్ని బయాలజీకి కేటాయించాలి. వాటిలో గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎక్కువసార్లు పునశ్చరణ చేయడం లాభిస్తుంది. ఆ తరువాతి ప్రాధాన్యం కెమిస్ట్రీకి ఇవ్వాలి. దీనిలో గ్రూపులకు సంబంధించి టేబుల్స్‌ను వేసుకోవడం ద్వారా సమయం ఆదా అవుతుంది.’
కటాఫ్
ఏదైనా సంస్థలో మేనేజ్మెంట్/ మైనారిటీ కోటాలో చేరాలన్నా నీట్-2017లో అర్హత పొందడం (క్వాలిఫై) తప్పనిసరి. ఇందుకు జనరల్ కేటగిరీ విద్యార్థులు 50 పర్సంటైల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 40 పర్సంటైల్, జనరల్ కేటగిరీ, దివ్యాంగులు 45 పర్సంటైల్ పొందాల్సి ఉంటుంది.