Preparation Plan

నీట్‌గా... దీటుగా

2017 విద్యాసంవత్సరానికి వైద్య, దంత వైద్య కళాశాలల్లో ప్రవేశం కోసం రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. 2016 సంవత్సరంలో కొంత గందరగోళానికి గురైనా, పూర్తి స్థాయిలో నీట్‌-2017 రాయబోతున్నారు. నెలకు పైగా సమయమున్న ఈ ప్రవేశపరీక్ష రాసేవారికోసం మెలకువలూ... సూచనలూ!
దేశవ్యాప్తంగా, ముఖ్యంగా మన తెలుగురాష్ట్రాల్లో ‘నీట్‌’ పట్ల అవగాహన పెరిగింది. గత సంవత్సరం దాదాపు 7.31 లక్షల మంది నీట్‌కు హాజరైతే, ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో 11,30,104 మంది రాయబోతున్నారు. గత ఏడాది కన్నా ఈ సంఖ్య ఇంచుమించు 41 శాతం అధికం.
ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, విశాఖపట్టణం మాత్రమే పరీక్షా కేంద్రాలు. కానీ ఈ మధ్యనే గుంటూరు, తిరుపతి, రాజమండ్రి, కర్నూలులలో కూడా పరీక్షా కేంద్రాలను ప్రకటించారు.
ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో సీట్లు నీట్‌-2017 ర్యాంకు ద్వారా భర్తీ చేస్తారు. జాతీయ ర్యాంకులతోబాటు రాష్ట్రస్థాయి ర్యాంకులు కూడా ప్రకటిస్తారు. విద్యార్థి కోరిక మేరకు ఇంగ్లిషుతో పాటు ప్రాంతీయ భాష తెలుగులో కూడా ప్రశ్నపత్రాన్ని ఇస్తారు.
ప్రైవేటు వైద్యకళాశాలల్లో యాజమాన్య కోటా కింద ఇప్పటివరకు భర్తీ చేస్తున్న సీట్లను ప్రభుత్వమే భర్తీ చేసే ఆలోచన ఉంది. ఇదే జరిగితే భారీ డొనేషన్లు కట్టి కళాశాలల్లో చేరే పరిస్థితులు ఉండకపోవచ్చు. ఇన్ని ప్రత్యేకతలున్న ‘నీట్‌’కు ప్రణాళికాబద్ధంగా సిద్ధమైతే మంచి ర్యాంకు తెచ్చుకోవడం సాధ్యమవుతుంది.
ఏ సబ్జెక్టులో ఎలా?
వివిధ సబ్జెక్టుల్లో మంచి మార్కులు సాధించడం ఎలాగో పరిశీలిద్దాం!
జీవశాస్త్రం: నీట్‌లో బోటనీ, జువాలజీ ప్రశ్నలు విడివిడిగా ఇవ్వరు. మొత్తం 90 ప్రశ్నల్లో చెరిసగంగా కూడా విభజన ఉంటుందని చెప్పలేము. గతఏడాది బోటనీలో 52, జువాలజీలో 38 ప్రశ్నలు వచ్చాయి.
* బొమ్మలను ఆధారంగా చేసుకుని 3 నుంచి 5 ప్రశ్నలు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లోని బొమ్మలన్నింటినీ అధ్యయనం చేయాలి. బొమ్మలనూ, చిత్రాలనూ గుర్తుపెట్టుకోవడం మాని విద్యార్థి స్వయంగా గీసుకుని వాటిలో విడిభాగాలను గుర్తిస్తూ అభ్యాసం చేయడం మంచిది.
* బోటనీలో Classification of Plants (మొక్కల వర్గీకరణ) అధ్యాయాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. సిలబస్‌ పరంగా ఈ విభాగంలో కొంత సందిగ్ధతకు అవకాశం ఉంది కనుక తగిన సమాచారాన్ని కలిగిఉండాలి. దీనికోసం అధ్యాపకుల సహకారం తీసుకోవాలి. Evolutionary Aspects of different Plant Groupsలో తగినన్ని ఉదాహరణలను తెలుసుకోవాలి.
* మొక్కలకు సంబంధించిన అనేక అంశాలు మార్ఫాలజీ వివరిస్తుంది. కానీ ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లో కొన్నిచోట్ల తగిన వివరణ లేదు. మార్ఫాలజీ చదివిన తర్వాత Reproduction in Angiosperms and Plants చదివితే చాలా ఉపయోగకరం.
* సెల్‌ బయాలజీ సిలబస్‌ విషయానికొస్తే బోటనీ, జువాలజీలో స్వల్ప అంతరాలు ఉన్నా ఇంచుమించు ఒకటే. ఈ అధ్యాయం పూర్తిచేసి జెనెటిక్స్‌ చదవడం అభిలషణీయం.
* పైన పేర్కొన్న అధ్యాయాలను పూర్తిచేశాక ప్లాంట్‌ ఫిజియాలజీ చదివితే మంచిది. ఇందులో వాటర్‌ రిలేషన్స్‌, మినరల్‌ న్యూట్రిషన్‌లతో బాటు ఎంజైమ్స్‌ సంబంధిత అంశాలలో జ్ఞాన సంబంధిత ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.
* బయో టెక్నాలజీ, అప్లైడ్‌ బయాలజీ... ఈ రెండూ అతి ముఖ్యమైన అధ్యాయాలు. వీటిపై పూర్తి పట్టు సాధించాలి. ఇందులో టిష్యూ కల్చర్‌, జెనెటిక్‌ ఇంజినీరింగ్‌కి సంబంధించిన అంశాలు గుర్తుంచుకోవాలి. దీని కోసం ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాలతో పాటు సంబంధిత సమాచారాన్ని సేకరిస్తే మేలు.
* హ్యూమన్‌ ఫిజియాలజీ అతి ముఖ్యమైన అధ్యాయం. దీని నుంచి దాదాపు 10కి పైగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.
* యానిమల్‌ కింగ్‌డమ్‌ అధ్యాయం నుంచి ప్రతి విభాగానికీ సంబంధించిన నిర్దిష్ట లక్షణాలు, ప్రత్యేక లక్షణాలను జాగ్రత్తగా చదవాలి.
* జెనెటిక్స్‌ అధ్యాయంలో ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లో ఉన్న సమాచారంతో పాటు పాలిజెనిక్‌ ఇన్‌హెరిటెన్స్‌, మెందెలియన్‌ డిజార్డర్స్‌ లాంటి విషయాలను కూడా చదవాలి.
* ఇకాలజీ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ ముఖ్యమైన అధ్యాయం. దీనిలో బయో డైవర్సిటీ, పొల్యూషన్‌, ఓజోన్‌ డిప్లీషన్‌కి సంబంధించి ప్రశ్నలు అడగవచ్చు.
* బయాలజీకి XI, XIIతరగతుల పుస్తకాలతోపాటు 8, 9, 10 పాఠ్యపుస్తకాలలో ఉన్న భావనలను కూడా చదివితే మంచిది.
* బయాలజీ పుస్తకాలను చదివేటప్పుడు అంతకుముందే మార్క్‌ చేసిన, అండర్‌లైన్‌ చేసిన వాక్యాలను చదువుతూ ఉంటే సమయం కలిసొస్తుంది.
రసాయన శాస్త్రం:
* ఇనార్గానిక్‌ కెమిస్ట్రీ విభాగం నుంచి థియరీ ప్రశ్నలు అడిగే అవకాశం ఎక్కువ. ముఖ్యంగా విభిన్న గ్రూపులకు సంబంధించిన వివరాలన్నింటినీ ఒకేచోట నోట్సు రాసుకుని చదువుకోవాలి. వీలైతే ఆ వివరాలను పట్టికల రూపంలో పొందుపరచుకోవాలి. విభిన్న ధర్మాలనూ, లక్షణాలనూ వీలైనన్నిసార్లు పునశ్చరణ చేసుకుంటే మంచిది.
* భౌతిక, రసాయన ధర్మాలు, తయారీ విధానాలు వంటివాటిని గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు అన్ని గ్రూపులకూ సంబంధించి హాలైడులు, ఆక్సైడులు, హైడ్రైడులు, కార్బొనేట్లు గురించి అధ్యయనం చేయాలి.
* ఫిజికల్‌ కెమిస్ట్రీలో ప్రాథమిక భావనలకు సంబంధించి లెక్కలు ఇవ్వడానికి అవకాశం ఎక్కువ. కాబట్టి తగిన ఫార్ములాలు ఉపయోగిస్తూ ప్రాక్టీస్‌ చేయడం ఉపయోగం. ఇందులో ముఖ్యంగా సొల్యూషన్స్‌, కెమికల్‌ ఈక్విలిబ్రియమ్‌, కైనటిక్స్‌, స్టేట్స్‌ ఆఫ్‌ మాటర్‌, థెర్మో డైనమిక్స్‌ లాంటి అధ్యాయాలపై ప్రధానంగా దృష్టి ఉంచాలి.
* కెమిస్ట్రీ ఇన్‌ ఎవ్రిడే లైఫ్‌, బయోమాలిక్యూల్స్‌, పాలిమర్స్‌, సర్ఫేస్‌ కెమిస్ట్రీ వంటి అధ్యాయాలకు సంబంధించి ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లో సమాచారం సరిపోతుంది.
* ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో ముఖ్యంగా నేమ్‌డ్‌ రియాక్షన్స్‌, ఐసోమిరిజమ్‌, రియాక్షన్‌ మెకానిజమ్స్‌ వంటి అధ్యాయాలు కీలకమైనవి. వీటితోపాటు మిగిలిన అంశాలను కూడా సాధన చేస్తే ఈ విభాగం సులభతరం అవుతుంది.
* కెమిస్ట్రీలో ఇచ్చే 45 ప్రశ్నలు XI, XIIపాఠ్యపుస్తకాలనుంచే అడగకపోవచ్చు. రెండు మూడు ప్రశ్నలు ప్రయోగ దీపికల ఆధారంగా కూడా ఇవ్వవచ్చు.
* కెమిస్ట్రీలో 85% పైగా ప్రశ్నలు సులభంగానే ఉంటాయి. మిగిలినవి మధ్యరకంగా, రెండు మూడు కష్టతరంగా ఉండవచ్చు.
‘తేలికపాటి అధ్యాయాలనే అనేకసార్లు అభ్యాసం చెయ్యటం కాకుండా కష్టతరంగా అనిపించే అంశాలను రెండు మూడు సార్లైనా అధ్యయనం చెయ్యాలి. తేలికగా భావించే టాపిక్‌లలో క్లిష్టతరమైన భాగాలపై ఎక్కువ శ్రద్ధ వహించాలి.’
భౌతిక శాస్త్రం:
* సాధారణంగా బైపీసీ విద్యార్థులు ఈ సబ్జెక్టును కష్టంగా భావిస్తారు. ఇది అశాస్త్రీయమైన ఆలోచన. కష్టమనేది వాస్తవం కాదు; అపోహే కాబట్టి కంగారు పడకూడదు.
* బయాలజీ, కెమిస్ట్రీ విభాగాలను రెండు గంటలలోపు పూర్తి చేసుకుని కనీసం ఒక గంట వ్యవధినైనా ఫిజిక్స్‌ కోసం కేటాయిస్తే మంచిది.
* ప్రతి అధ్యాయంలోని ముఖ్యమైన అంశాలు, ఫార్ములాలను విడిగా రాసి ఉంచుకుని తరచుగా పునశ్చరణ చేసుకోవాలి.
* ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లో ప్రతి చాప్టర్‌ చివర ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుని సాధన చెయ్యాలి.
* తేలికపాటి అధ్యాయాలనే అనేకసార్లు అభ్యాసం చెయ్యటం కాకుండా కష్టతరంగా అనిపించే అంశాలను రెండు మూడు సార్లైనా అధ్యయనం చెయ్యాలి.
* తేలికగా భావించే టాపిక్‌లలో క్లిష్టతరమైన భాగాలపై ఎక్కువ శ్రద్ధ చదవాలి.
* అభ్యర్థి గణిత సంబంధ భావనలు నేర్చుకుని అభ్యాసం చెయ్యాలి. ఉదా: డిఫరెన్షియేషన్‌, ఇంటెగ్రేషన్‌
* 11, 12 తరగతుల పాఠ్యాంశాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలి.
* అటామిక్‌ ఫిజిక్స్‌, న్యూక్లియర్‌ ఫిజిక్స్‌, సెమీ కండక్టర్స్‌, కమ్యూనికేషన్‌ విభాగాల నుంచి థియరీ ప్రశ్నలు ఇచ్చే అవకాశం ఎక్కువ.
* గ్రావిటేషన్‌, ఎలక్ట్రోస్టాటిక్స్‌, మ్యాగ్నటిజమ్‌లలో భావనలు, అనువర్తనాలు పోల్చదగినవిగా ఉంటాయి. కాబట్టి ఈ అధ్యాయాలను విడివిడిగా కాకుండా చదివితే ఉపయోగం ఉంటుంది.
* తెలియని, చేయలేని ప్రశ్నల్ని వదిలెయ్యడం మంచిది.
* ప్రశ్నను చదివేటప్పుడు ఇచ్చిన సమాచారాన్నీ, కీలకమైన అంశాలనూ జాగ్రత్తగా చదవాలి. దీని కోసం ప్రశ్న వాక్యం కింద వేలును లేదా పెన్నును జరుపుతూ చదవాలి.
ఎన్ని మార్కులు తెచ్చుకుంటే మేలు?
నీట్‌-2017 జాతీయ ర్యాంకుల ఆధారంగానే అన్ని రాష్ట్రాల విద్యార్థులకు విడివిడిగా రాష్ట్రస్థాయి ర్యాంకులను తయారు చేస్తారు. తర్వాత వాటి ఆధారంగా గతంలో ఎంసెట్‌ మాదిరిగానే తెలుగు రాష్ట్రాల్లో సీట్ల భర్తీ ప్రక్రియను నిర్వహిస్తారు. మన విద్యార్థులు ఈ రకమైన పరీక్షకు పూర్తిస్థాయిలో మొదటిసారిగా సన్నద్ధమవుతున్నారు. కాబట్టి సీట్ల సాధన, కటాఫ్‌ ర్యాంకులను కచ్చితంగా నిర్ణయించడం అంత తేలిక కాదు. ప్రశ్నపత్రం స్థాయి, తెలుగు విద్యార్థుల ప్రతిభను బట్టి కొంతవరకూ కటాఫ్‌లను వూహించవచ్చు.
ఆంధ్రప్రదేశ్‌లో 27, తెలంగాణలో 20 ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలలున్నాయి. వీటిలో దాదాపు 6600 సీట్లు లభ్యమవుతున్నాయి. దంత వైద్యకళాశాలలు రెండు రాష్ట్రాల్లో 31 ఉన్నాయి. వాటిలో ఉన్న సీట్ల సంఖ్య దాదాపు 2500. గతంలో మాదిరిగానే లోకల్‌ (85%), నాన్‌లోకల్‌ (15%), రిజర్వేషన్‌ అభ్యర్థులకు ఉన్న కోటాలో మార్పులేదు.
గత సంవత్సరం ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ఎ కేటగిరీ కటాఫ్‌ ర్యాంకుల మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఉండవచ్చు. కాకపోతే గత సంవత్సరం బి కేటగిరీకి తక్కువ సంఖ్యలో అభ్యర్థులు ఉండటంవల్ల అంత పోటీ లేదు. ఈ సంవత్సరం అందరూ రాయవలసి రావడంతో కటాఫ్‌ మార్కులు, ర్యాంకులు మారతాయి.
తెలుగు విద్యార్థులు వారి సొంత రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోని ప్రైవేటు కళాశాలల్లో, డీమ్డ్‌ యూనివర్సిటీల్లో సీట్లు పొందే అవకాశం ఉంది. గత సంవత్సరం కటాఫ్‌లను దృష్టిలో ఉంచుకుని ఆలోచిస్తే- ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీట్లు సాధించాలంటే రాష్ట్రస్థాయి ర్యాంకు 1200- 1300 మధ్యలో అవసరమవుతుంది. తెలంగాణ విద్యార్థికి ర్యాంకు 900-1000 మధ్యలో ఉండొచ్చు. ప్రైవేటు కళాశాలల్లో సీటు పొందడానికి ఆంధ్రా విద్యార్థికి 2600 వరకు, తెలంగాణ విద్యార్థికి 1600 వరకు ర్యాంకు అవసరమవుతుందని అంచనా.
ఈవిధంగా ర్యాంకులు సాధించాలంటే నీట్‌-2017లో 720 మార్కులకు ఎన్ని మార్కులు తెచ్చుకోవాలనేది నిర్ణయించడం కొంచెం క్లిష్టమే. 530-540 మార్కులవరకు తెచ్చుకున్న ఆంధ్రా విద్యార్థి, 500- 510 మార్కులు తెచ్చుకున్న తెలంగాణ విద్యార్థి ప్రభుత్వ కళాశాలలో మెడికల్‌ సీటు పొందే అవకాశం ఉంది.
గమనించదగ్గ సూచనలు
గత పది సంవత్సరాల ఏఐపీఎంటీ ప్రశ్నపత్రాలను సాధన చెయ్యడం ఉపయోగకరమే.
* నీట్‌ను నిర్వహిస్తున్నది సీబీఎస్‌ఈ కాబట్టి ప్రశ్నలను వ్యక్తపరచే విధానం, భాష మనకు బాగా పరిచయమున్న ఎంసెట్‌తో పోలిస్తే స్వల్ప తేడాలతో ఉంటుంది.
* ప్రశ్నను లిప్‌ రీడింగ్‌ ద్వారా చదవడం అలవర్చుకోవాలి. దానివల్ల ముఖ్యమైన విషయాలను నిర్లక్ష్యం చేసే అవకాశం ఉండదు. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో లెక్కలు సాధన చేసేటప్పుడు ఇది బాగా ఉపయోగకరం.
ఉదాహరణకు 2×3 కనుగొనాలనుకుందాం. హడావిడిలో దానిని 2+3గా వూహించుకుని జవాబుని గుర్తించే ప్రమాదం ఉంది. కాబట్టి దానిని పెదవులతో చదువుతూ పరిష్కరిస్తే కచ్చితత్వం ఉంటుంది.
* కొన్ని సందర్భాల్లో ఫార్ములాలను ఉపయోగించి లెక్కను సాధించినప్పుడు వచ్చిన జవాబు ప్రశ్నలో అడిగినది కాకపోవచ్చు. కానీ లెక్క ద్వారా వచ్చిన సమాధానాన్ని ఉపయోగించి సరైన జవాబు పొందవచ్చు. ఉదాహరణకు ఫిజిక్స్‌ ప్రశ్నలో లెక్కను సాల్వ్‌ చేసినప్పుడు ఒక గోళ వ్యాసార్ధాన్ని కనుగొన్నామనుకుందాం. కానీ ప్రశ్నలో గోళ వ్యాసం అడిగి ఉండవచ్చు. కాబట్టి ప్రశ్నలో దేనిని కనుగొనాలో జాగ్రత్తగా గమనించాలి.
* ప్రశ్నపత్రాల్లో మూడు సబ్జెక్టుల క్రమం పేపర్‌ కోడ్‌ని బట్టి మారవచ్చు. ఏఏ చాప్టర్‌లలో ఎన్నెన్ని ప్రశ్నలు వస్తాయో అంచనాలు వేసుకోవడం మీద అతిగా ఆసక్తి చూపకూడదు. దీనికంటే ఆయా చాప్టర్ల ప్రాధాన్యం బట్టి వాటి మీద పట్టు సంపాదించుకోవాలి.
* గత సంవత్సరాల కటాఫ్‌ మార్కులు, ప్రశ్నపత్రాల సరళి గురించి మిత్రులతో, ఇతరులతో ఎక్కువగా చర్చించడాన్ని తగ్గించి బలహీనంగా ఉన్న విభాగాలను బలపరచుకోవాలి.
* ప్రశ్నపత్రంలో కొన్ని క్లిష్టంగా అనిపించినా, అదే పత్రం అందరూ రాస్తారు కాబట్టి ఇతరులకు కూడా అది కష్టంగానే ఉంటుందని గుర్తించాలి. ఒత్తిడి తగ్గించుకోవాలి.
* తేలికగా, బాగా తెలిసిన ప్రశ్నల జవాబులను తప్పులు లేకుండా మార్క్‌ చెయ్యాలి. అర్థం కానివీ, చేయలేకపోయినవీ వదిలెయ్యడం శ్రేయస్కరం. ఎందుకంటే నెగటివ్‌ మార్కుల వల్ల మార్కులు తగ్గి మంచి ర్యాంకును కోల్పోయే అవకాశం ఉంది.
* 720 మార్కులకు 100 శాతం సాధించేద్దామన్న తపన కన్నా చేయగలిగినవన్నీ తప్పులు లేకుండా గుర్తించటం ముఖ్యం. అప్పుడే మంచి ర్యాంకు రావడానికి ఆస్కారం ఉంటుంది. గత సంవత్సరాల మార్కుల సరళిని గమనిస్తే 450 మార్కులు- అంతకన్నా అధికంగా సాధించిన విద్యార్థి వైద్య కళాశాలలో సీటు పొందే అవకాశం ఉంది.
* సన్నద్ధత సమయంలో తగినంత నిద్ర, వ్యాయామం, విరామం వంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వటం మర్చిపోకూడదు. అప్పుడే మెదడు చురుకుగా పనిచేస్లూ పరీక్ష రోజు ఎటువంటి ఒత్తిడీ ఉండదు.

Posted on 03-04-2017