Preparation Plan

వైద్యకోర్సుల్లో ఎక్కడ ఎన్ని సీట్లు?

తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా జాతీయ ప్రవేశపరీక్ష ‘నీట్‌ ’ (నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌) ద్వారా మెడికల్‌, డెంటల్‌, ఆయుష్‌ కోర్సుల ప్రవేశం జరుగుతోంది. ఈ ప్రక్రియలో గతానికీ, ఇప్పటికీ ఉన్న మార్పులపై విద్యార్థులూ, వారి తల్లిదండ్రులూ అవగాహన ఏర్పరచుకోవాలి. రెండు రాష్ట్రాల్లో ఉన్న వైద్యకళాశాలల్లోని సీట్లపై కూడా స్పష్టత అవసరం.
వైద్య/దంతవైద్య సీట్లు నాలుగు రకాలు. 1. ప్రభుత్వ కళాశాలల్లోని సీట్లు 2. ప్రైవేటు కళాశాలల్లోని కేటగిరీ ఎ సీట్లు (కన్వీనర్‌ కోటా) 3. కేటగిరీ బి సీట్లు (మేనేజ్‌మెంట్‌ సీట్లు) 4. కేటగిరీ సి సీట్లు (ఎన్‌ఆర్‌ఐ సీట్లు). గతంలో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాల్లోని కేటగిరీ ఎ సీట్లను కౌన్సెలింగ్‌ ద్వారా ఎన్‌టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ వారు నింపేవారు. మిగిలిన ప్రైవేటు కళాశాలల్లోని బి, సి కేటగిరీ సీట్లను ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు ఏర్పరచుకున్న అసోసియేషన్‌ ఒక ఉమ్మడి పరీక్షను నిర్వహించి దాని ద్వారా సీట్లను భర్తీ చేసేది. గత సంవత్సరం సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ప్రైవేటు కేటగిరీ బి, సి సీట్లు, స్వయం ప్రతిపత్తిగల విశ్వవిద్యాలయాల్లోని సీట్లను నీట్‌లో అర్హులైన అయిన విద్యార్థులతో యాజమాన్యాలు ఆ సీట్లను నింపుకునే అవకాశం ఏర్పడింది.
ఈ సంవత్సరం మళ్లీ సుప్రీంకోర్టు నీట్‌- పీజీ సీట్ల ప్రవేశాలను ప్రభుత్వమే మెరిట్‌ ప్రాతిపదికతో నిర్ధారిత ఫీజుతో చేపట్టాలని ఆదేశించడంతో పీజీ సీట్ల భర్తీ ఆరోగ్య విశ్వవిద్యాలయాలు చేపట్టాయి. ఇదే ప్రక్రియ ఇప్పుడు ఎంబీబీఎస్‌, బీడీఎస్‌లకు కూడా వర్తిసుంది. కాబట్టి, ఈ కళాశాలల్లోని సీట్లు పూర్తిగా ఆరోగ్య విశ్వవిద్యాలయాలే నింపే అవకాశం కనిపిస్తోంది. ప్రక్రియ ఇలాగే కొనసాగితే నూరు శాతం సీట్లు వేర్వేరు ఫీజులతో ప్రభుత్వమే నింపే అవకాశం ఏర్పడినట్లు అవుతుంది.
గత సంవత్సరం ప్రభుత్వ, ప్రైవేటు కేటగిరీ ఏ సీట్లు రెండు రాష్ట్రాల్లో విడివిడిగా ఏపీ ఎంసెట్‌, టీఎస్‌ ఎంసెట్‌ల ర్యాంకుల ఆధారంగా నింపారు. కానీ, ఈ ఏడాది రెండు తెలుగు రాష్ట్రాల్లో నీట్‌ ర్యాంకు ప్రాతిపదికనే సీట్ల భర్తీ జరగాలి. అంటే రాష్ట్ర విభజనకు పూర్వం ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ సీట్ల భర్తీ ఏవిధంగా జరుగుతూ ఉండేదో అలాగే ఈ సంవత్సరం కూడా నీట్‌ ర్యాంకు ఆధారంగా సీట్ల భర్తీ జరుగుతుంది. అంటే ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం మూడు వర్సిటీల పరిధిలో ఉండేవి. అవి: ఉస్మానియా, ఆంధ్రా, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయాలు.
ఇప్పుడు తెలంగాణ మొత్తం ఉస్మానియా యూనివర్సిటీ పరిధి కిందకు వస్తుంది. ఉత్తర కోస్తా శ్రీకాకుళం నుంచి పాక్షిక ప్రకాశం వరకు ఆంధ్రా విశ్వవిద్యాలయం పరిధి. రాయలసీమ నాలుగు జిల్లాలు, నెల్లూరు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిధి కిందకు వస్తాయి. ఒక విశ్వవిద్యాలయ పరిధిలో నింపే సీట్లలో ఆ ప్రాంత విద్యార్థులకు 85%, మిగిలిన 15% సీట్లను మిగిలిన రెండు విశ్వవిద్యాలయాల విద్యార్థులకు కేటాయిస్తారు.
ఉదాహరణకు- ఒక హైదరాబాద్‌ విద్యార్థి ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని మెడికల్‌, డెంటల్‌ కళాశాలల్లో 85% సీట్లకు, శ్రీవెంకటేశ్వర, ఆంధ్రా యూనివర్సిటీ పరిధుల్లోని మెడికల్‌ కళాశాలల్లో 15% సీట్లకు పోటీ పడవచ్చు. ఆంధ్రా మెడికల్‌ కళాశాల (ఏఎంసీ) తీసుకుంటే దానిలోని 85 శాతం సీట్లను ఆంధ్రా విశ్వవిద్యాలయం పరిధిలోని విద్యార్థులతోనూ, మిగిలిన 15% సీట్లను ఉస్మానియా, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ పరిధుల్లోని విద్యార్థులతోనూ నింపుతారు. అయితే సిద్ధార్థ మెడికల్‌ కళాశాల, విజయవాడను ఉమ్మడి రాష్ట్ర మెడికల్‌ కళాశాలగా పరిగణిస్తారు. దీనిలోని సీట్లలో 42% ఆంధ్రా విశ్వవిద్యాలయ విద్యార్థులతో, 36% సీట్లను ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులతో, మిగిలిన 22% సీట్లను శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ పరిధిలోని విద్యార్థులతో నింపుతారు. డెంటల్‌ కళాశాలలో కూడా స్టేట్‌ కోటా ఉన్న కళాశాలల్లో సీట్లు నింపుతారు. విజయవాడ, హైదరాబాద్‌ల్లోని డెంటల్‌ కళాశాలలు స్టేట్‌ కోటాలోనే ఉన్నాయి. 15% సీట్లు మిగిలిన రెండు విశ్వవిద్యాలయాలే కాకుండా తొలి విశ్వవిద్యాలయంలోని విద్యార్థులు కూడా పోటీ పడవచ్చు.

ఎంతెంత రుసుము?
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో కేటగిరీలవారీగా రుసుములు వేళేర్వేరుగా ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలల్లో సీట్లకు ఫీజు మాత్రమే సమానంగా ఉంది. ఈ మార్పులు 2014 నుంచి ఆంధ్రప్రదేశ్‌లోనూ, 2015 నుంచి తెలంగాణలోనూ అమలవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 2014 ఫీజు నిర్ణయించినపుడు ప్రతి సంవత్సరం ఖర్చులు పెరుగుతుంటాయి. కాబట్టి, నిర్ధారిత ఫీజు ఏటా 5% పెరిగేలా నిర్ణయించారు. అంటే కేటగిరీ బి సీట్లకు 2015లో ఫీజు రూ.11,00,000 గా నిర్ణయించారు. ఆ ఫీజు 2016లో 5% పెరిగింది. అంటే రూ.11,55,000. కాబట్టి ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్‌లో కేటగిరీ బిలో ఎంబీబీఎస్‌లో చేరితే విద్యార్థికి ఫీజు రూ.12,10,000 అవుతుంది. డెంటల్‌లో కూడా కేటగిరీ బి సీట్లు ఇదేవిధంగా ఏటా 5% ఫీజు పెంచుతూ నింపుతారు. మొదట 2015లో ఈ ఫీజు రూ.4,50,000. ఈ సంవత్సరంలో జరిగే ప్రవేశాలకు రూ.4,95,000 అవుతుంది.
ప్రైవేటు కళాశాలల్లో కేటగిరీ సి అంటే ఎన్‌ఆర్‌ఐ కోటా. విదేశాల్లో స్థిరపడిన వారి పిల్లలు లేదా ఎన్‌ఆర్‌ఐ స్పాన్సర్‌ చేసిన విద్యార్థులకు ఈ కేటగిరీ ఉపయోగపడుతుంది. ఫీజు ఎక్కువ. ఆంధ్రప్రదేశ్‌లో కేటగిరీ సికి విద్యార్థి దరఖాస్తు చేసుకుంటే దాని ఫీజు కేటగిరీ బి ఫీజుకి 5 రెట్ల వరకు సంవత్సరానికి తీసుకునే అవకాశం కళాశాల యాజమాన్యానికి ఉంటుంది. అంటే, 2014లో కేటగిరీ బి సీటుకు ఫీజు రూ.11,00,000 కాబట్టి, కేటగిరీ సి ఫీజును కళాశాల యాజమాన్యం 55,00,000 వరకు నిర్ణయించే అవకాశం ఉంది. ఎక్కువ శాతం యాజమాన్యాలు రూ.12,00,000 లేదా 13,00,000ల్లో ఫీజు నిర్ణయించారు. ఈ సంవత్సరం కేటగిరీ సి సీట్లు కూడా ఆరోగ్య విశ్వవిద్యాలయాలు నింపే అవకాశం ఉంది. కౌన్సెలింగ్‌లో సీట్లు నిండకపోతే ఆ కళాశాల సంబంధిత యాజమాన్యాలు ఆ సీటును నీట్‌లో అర్హత సాధించిన విద్యార్థులతో నింపుకునే అవకాశం ఉంది.
ఎస్‌వీఐఎంఎస్‌ పరిధిలో ఉన్న పద్మావతి మహిళా మెడికల్‌ కళాశాలలో 85% సీట్లు కేటగిరీ ఎ, ఫీజు రూ.60,000తోనూ మిగిలిన 15% ఎన్‌ఆర్‌ఐ కేటగిరీలోనూ ఉన్నాయి. అంటే మొత్తం 150 సీట్లలో 127 సీట్లు రూ.60,000 ఫీజుతో, మిగిలిన 23 సీట్లు ఎన్‌ఆర్‌ఐ కోటాలో ఫీజు సంవత్సరానికి 20,000 డాలర్లుగా నిర్ణయించారు. పద్మావతి మహిళా కళాశాల ఎస్‌వీయూ పరిధిలో ఉంది కాబట్టి, దీనిలోని సీట్లలో 85% శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ పరిధిలోని బాలికలతో, మిగిలిన 15 శాతం సీట్లు ఉస్మానియా, ఆంధ్రా విశ్వవిద్యాలయాల పరిధుల్లోని విద్యార్థులతో నింపుతారు.

Posted on 06-06-2017