RBI - Assistants Notification

రిజర్వ్‌ బ్యాంకులో భలే అవకాశం!

భారతీయ రిజర్వ్‌ బ్యాంకులోని అసిస్టెంట్‌ పోస్టుల భర్తీ కోసం నియామక ప్రకటన విడుదలైంది. దేశవ్యాప్తంగా 623 పోస్టుల నియామకం జరగనుంది. హైదరాబాద్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫీసులో 16 పోస్టులున్నాయి. డిగ్రీ విద్యార్హతతో 20 నుంచి 28 సంవత్సరాల వయసున్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు!

ఆర్‌బీఐ అసిస్టెంట్‌ ఉద్యోగులకు నెలకు సుమారు రూ.35,000 జీతంతోపాటు ఎన్నో సదుపాయాలు ఉంటాయి. వారంలో సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే పని దినాలు. ఆఫీసు పనివేళలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5:45 గంటల వరకు మాత్రమే. ఉద్యోగులకు ఆర్‌బీఐ నివాస సముదాయంలో క్వార్టర్లు ఉంటాయి. 100% బీమా సౌకర్యం ఉంటుంది. కన్సూ్యమర్‌ అలవెన్స్‌; ఫర్నీచర్‌, న్యూస్‌పేపరు, పెట్రోలు, ఇంటర్నెట్‌ అలవెన్సులతోపాటు ఇతర సదుపాయాలూ ఉంటాయి. అసిస్టెంట్‌ పోస్టు ఉద్యోగులకు స్థానచలన అవకాశం ఉండదు. గ్రేడ్‌-ఎ పోస్టుకు ఎంపిక అయినట్లయితే ఆ సమయంలో మాత్రమే స్థానచలనం ఉంటుంది. అసిస్టెంట్‌ పోస్టులో మూడేళ్లు పనిచేసిన తర్వాత పదోన్నతి పరీక్షలో అర్హత పొందితేనే వారిని గ్రేడ్‌-ఎ పోస్టు ఉద్యోగులుగా ప్రమోట్‌ చేస్తారు. గ్రేడ్‌-ఎ పోస్టు అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టు లాంటిది. గ్రేడ్‌-ఎ తరువాత గ్రేడ్‌-బి పోస్టు ఉంటుంది. ఇది మేనేజర్‌ పోస్టుకు సమానం. గ్రేడ్‌-బి పోస్టు కోసం ఆర్‌బీఐ విడిగా నోటిఫికేషన్‌ విడుదల చేస్తుంది. ఆర్‌బీఐ ఉద్యోగులే కాకుండా మిగిలినవారు కూడా గ్రేడ్‌-బి పోస్టుకు జరిగే పోటీపరీక్ష రాయవచ్చు.

ఆర్‌బీఐ అసిస్టెంట్‌ ఉద్యోగులు రీజనల్‌ ఆఫీసర్‌ పరిధిలో ఉన్న పబ్లిక్‌, ప్రైవేటు సెక్టార్లు, రూరల్‌ బ్యాంకు, కో ఆపరేటివ్‌ బ్యాంకుల రోజువారీ లావాదేవీలను, వారాంతంలో హెడ్‌ ఆఫీస్‌ (ఆర్‌బీఐ)కు పంపాలి. బ్యాంకింగ్‌ సూపర్‌విజన్‌లో భాగంగా క్యాష్‌ రెమినెన్స్‌ వ్యవహారాలను కూడా చూడాలి. రిజర్వ్‌ బ్యాంక్‌ నుంచి బ్యాంకులకు నోట్లను ఆయా బ్యాంకుల చెస్ట్‌లకు చేరవేయడం, బ్యాంకుల నుంచి వచ్చే చిరిగిపోయిన నోట్లను మార్చడం వంటి పనులు ఉంటాయి. రిజర్వ్‌ బ్యాంకు ఆఫీసులో లోకల్‌ పనులను చూడాలి. ఎక్కువశాతం సిస్టమ్‌ మీద పనిచేసేలా ఉంటుంది. కాబట్టి అభ్యర్థులకు కంప్యూటర్‌ పరిజ్ఞానం అవసరం.జాతీయ సంస్థలైన పోస్టల్‌, తపాలా శాఖలు, వైమానిక, నౌకాదళ, ఆర్మీ సంస్థలకు ప్రత్యేకంగా ఆర్‌బీఐలో ఆయా శాఖల అకౌంట్లు ఉంటాయి. వారికి సంబంధించిన లావాదేవీలను కూడా ఆర్‌బీఐలో చేయాలి. బ్యాంకుల్లో సేవింగ్స్‌, కరెంట్‌ అకౌంట్‌ కలిగివున్న వారు మోతాదుకు మించి లావాదేవీలను నిర్వహిస్తే వారి అకౌంట్‌లను పరిశీలించడం, రీజనల్‌ ఆఫీస్‌ పరిధిలోని అన్ని బ్యాంకింగ్‌ రంగ సంస్థలు నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తున్నాయో లేదో వంటి కార్యక్రమాలను పరిశీలించడం ఆర్‌బీఐ అసిస్టెంట్‌ ఉద్యోగుల బాధ్యతలే. 623 పోస్టుల్లో 16 హైదరాబాద్‌ ఆర్‌బీఐలో భర్తీ చేయనున్నారు. అత్యధికంగా ముంబయిలో 264 పోస్టులున్నాయి. బెంగళూరులో 25 ఉన్నాయి.

గమనిక: అభ్యర్థులు ఏదైనా ఒక రాష్ట్రాన్ని ఎంచుకుని ఒక్కదానికి మాత్రమే దరఖాస్తు చేయగలరు. కానీ అభ్యర్థికి స్థానిక భాషపై పూర్తి అవగాహన ఉంటేనే పోస్టును కేటాయిస్తారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థులు హైదరాబాదే కాకుండా ఇతర రాష్ట్రాలవాటికీ దరఖాస్తు చేసుకోవచ్చు. కాకపోతే అక్కడి ప్రాంతీయ భాష చదవడం, మాట్లాడటం, రాయడం వచ్చుండాలి.

ముఖ్యమైన తేదీలు
* దరఖాస్తు, ఫీజు చెల్లింపు చివరి తేదీ: 10.11.2017
* ప్రిలిమినరీ రాతపరీక్ష (ఆన్‌లైన్‌): 27, 28 నవంబరు 2017
* ఆన్‌లైన్‌ మెయిన్స్‌ రాతపరీక్ష: 20 డిసెంబరు 2017
* దరఖాస్తును www.rbi.org.in వెబ్‌సైట్‌లో పూర్తిచేయాల్సి ఉంటుంది. ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ
ఎ) అభ్యర్థులు మొదటగా ఆన్‌లైన్‌ ప్రిలిమినరీ పరీక్ష రాయాలి. ఇందులో 100 ప్రశ్నలను మూడు సెక్షన్ల నుంచి ఇస్తారు. 100 మార్కుల ఈ పరీక్షను గంట వ్యవధిలో పూర్తిచేయాలి. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ నుంచి 30, న్యూమరికల్‌ ఎబిలిటీ- 35, రీజనింగ్‌ ఎబిలిటీ నుంచి 35 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సరైన సమాధానానికీ ఒక మార్కు. తప్పు సమాధానానికి 1/4 తగ్గిస్తారు (రుణాత్మక మార్కు). ప్రిలిమినరీ పరీక్షలో ప్రతీ సెక్షన్‌లో కనీస అర్హత మార్కులతోపాటు మొత్తంగా కనీసార్హత మార్కులను పొంది ఉండాలి. అలా పొందినవారిని మాత్రమే ఆన్‌లైన్‌ మెయిన్స్‌ రాతపరీక్షకు అర్హులుగా గుర్తిస్తారు. ప్రిలిమినరీలో వచ్చేవి అర్హత మార్కులు మాత్రమే. తుది మెరిట్‌ జాబితాలో వాటిని పరిగణించరు.

బి) మెయిన్స్‌ రాతపరీక్షలో 200 ప్రశ్నలకు 200 మార్కులను కేటాయించారు. ఈ పరీక్షను అభ్యర్థులు 2.15 గంటల వ్యవధిలో పూర్తిచేయాలి. ఒక్కో సెక్షన్‌కు 40 ప్రశ్నల చొప్పున 5 సెక్షన్లుంటాయి. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు, తప్పు సమాధానానికి 1/4 రుణాత్మక మార్కు ఉంటాయి. 5 సెక్షన్ల నుంచి కనీసార్హత మార్కులను పొందాల్సి ఉంటుంది. అలాగే 200 మార్కులకు మొత్తంగా కనీస అర్హత మార్కులను పొందాలి. అలా పొందినవారిని మాత్రమే మెయిన్స్‌ పరీక్ష అర్హత పొందినట్లుగా ప్రకటిస్తారు.

సి) మెయిన్స్‌ పరీక్షలో అర్హులైన అభ్యర్థులకు లాంగ్వేజ్‌ పరీక్ష నిర్వహిస్తారు. తాము ఏ ఆర్‌బీఐ శాఖకు దరఖాస్తు చేసుకున్నారో ఆ రాష్ట్ర భాషలోనే అభ్యర్థులకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. ప్రాంతీయ భాష చదవడం, రాయడం, మాట్లాడటం తెలిసుండాలి. ప్రాంతీయభాషపై పరిజ్ఞానం లేనివారిని అర్హత కోల్పోయినవారిగా ప్రకటిస్తారు. కాబట్టి అభ్యర్థులు దరఖాస్తు సమయంలో వారికి తెలిసిన భాష ప్రకారమే శాఖను ఎంచుకోవడం మేలు.

రెండింటినీ దృష్టిలో ఉంచుకోవాలి
రీజనింగ్‌, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌, న్యూమరికల్‌ ఎబిలిటీ సెక్షన్ల నుంచి ప్రిలిమినరీ, మెయిన్స్‌ పరీక్షల్లో ప్రశ్నలు వస్తాయి. జనరల్‌ అవేర్‌నెస్‌, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ నుంచి మెయిన్స్‌ పరీక్షలో ప్రశ్నలు వస్తాయి. సన్నద్ధత సందర్భంగా అభ్యర్థులు ప్రిలిమినరీ, మెయిన్స్‌ పరీక్షలు రెండింటినీ దృష్టిలో ఉంచుకోవాలి.

మెయిన్స్‌ పరీక్షలో ప్రతి విభాగానికీ నిర్ణీత సమయాన్ని కేటాయించారు. రీజనింగ్‌ విభాగంలోని 40 ప్రశ్నలకు 30 నిమిషాలు, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 40 ప్రశ్నలకు 30 నిమిషాలు, న్యూమరికల్‌ ఎబిలిటీ 40 ప్రశ్నలకు 30 నిమిషాలు, జనరల్‌ అవేర్‌నెస్‌ 40 ప్రశ్నలకు 25 నిమిషాలు, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ 40 ప్రశ్నలకు 20 నిమిషాల నిర్ణీత సమయాన్ని కేటాయించారు. కాబట్టి అభ్యర్థులు సమయానుగుణంగా ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేలా సన్నద్ధమవ్వాలి.

ప్రిలిమినరీ పరీక్షలో 100 ప్రశ్నలన్నింటికీ కలిపి 60 నిమిషాల సమయముంది.

* రీజనింగ్‌: క్రిటికల్‌ రీజనింగ్‌ నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. రివర్స్‌ సిలాజిజం నుంచి ప్రశ్నలు అడగటం ప్రస్తుతం జరుగుతున్న ఐబీపీఎస్‌, ఐబీపీఎస్‌-ఆర్‌ఆర్‌బీ పరీక్షల్లో గమనించవచ్చు.
* ఇంగ్లిష్‌: రీడింగ్‌ కాంప్రహెన్షన్లో 1500 నుంచి 2000 పదాలతో సమాచారం ఇచ్చి వాటిపై ప్రశ్నలు అడుగుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ సమాచారం చదివి సమాధానం గుర్తించాలంటే వేగవంతమైన పఠనం అలవాటు చేసుకోవాలి. ఆంగ్లంపై పట్టు సాధిస్తే రీజనింగ్‌లోని ప్రశ్నలకు కూడా వేగంగా జవాబులు గుర్తించవచ్చు.
* న్యూమరికల్‌ ఎబిలిటీ: సూక్ష్మీకరణలపై పట్టు పెంచుకుంటే ఎక్కువ మార్కులు పొందేలా పరీక్ష రాయవచ్చు. వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలు సాధన చేయటం ఉత్తమం.
* జనరల్‌ అవేర్‌నెస్‌: స్టాటిక్‌ జీకే, వర్తమాన అంశాలతో పాటు కేంద్రప్రభుత్వ పథకాలు, బ్యాంకింగ్‌, ఎకానమీ, బిజినెస్‌ సంబంధిత అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. రోజూ దినపత్రికలు చదువుతూ నోట్సు తయారుచేసుకోవాలి.
* కంప్యూటర్‌ నాలెడ్జి: కంప్యూటర్‌ జనరేషన్‌, ఎంఎస్‌ ఆఫీస్‌, హార్డ్‌వేర్‌ నెట్‌వర్క్‌, షార్ట్‌కట్‌ కీ, ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌, ఇంటర్నెట్‌, సాఫ్ట్‌వేర్‌ మాల్వేర్స్‌, గేట్‌వేస్‌, మెమరీ సంబంధిత అంశాలపై ప్రశ్నలు వస్తాయి.
పాత, మాదిరి ప్రశ్నపత్రాలు, మంచి మెటీరియల్‌లను సేకరించి, వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలు సాధనచేస్తే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి.

Notification Online Registration Website

Posted on 31-10-2017