SBI Associates - Notification

ఎస్‌బీఐలో 8301 జూనియ‌ర్ అసోసియేట్ పోస్టులు

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నుంచి దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ఎనిమిది వేలకు పైగా ఖాళీలతో క్లరికల్‌ (జూనియర్‌ అసోసియేట్స్‌) నోటిఫికేషన్‌ వెలువడింది. వీటి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో 400, తెలంగాణలో 255 ఖాళీలు భర్తీ చేయనున్నారు. సాధారణ డిగ్రీ అర్హతతో దేశంలోనే అతిపెద్ద బ్యాంకులో ఉద్యోగం సాధించుకునే మంచి అవకాశం ఇది. అకడమిక్‌ పరిజ్ఞానంతో సంబంధం లేకుండా సరైన ప్రణాళికతో ప్రాక్టీస్‌ చేస్తే ఉద్యోగాన్ని సంపాదించుకోవచ్చు.

దేశ వాణిజ్య బ్యాంకింగ్‌ రంగంలో ఎస్‌బీఐ ప్రథమస్థానంలో ఉండటమే కాకుండా, ప్రపంచంలోని మొదటి 100 బ్యాంకుల్లో ఒకటిగా ఉంది. ఇతర బ్యాంకులతో పోలిస్తే జీతభత్యాలు కూడా ఇందులో ఎక్కువే. అన్ని బ్యాంకుల కంటే ఎక్కువగా 18 వేలకు పైగా బ్రాంచ్‌లు కలిగి ఉండటం వల్ల తమ ప్రాంతాలకు దగ్గరగా పనిచేసే అవకాశం కూడా అభ్యర్థులకు లభిస్తుంది. ఈ ప్రత్యేకతల వల్ల సహజంగా అభ్యర్థులు ఎస్‌బీఐ నోటిఫికేషన్‌ పట్ల అత్యంత ఆసక్తిగా ఉంటారు. అందుకే పోటీ కూడా తీవ్రంగా ఉంటుంది.

ప్రిలిమినరీ పరీక్షలో ప్రధాన మార్పు
2016లో విడుదలైన నోటిఫికేషన్‌తో పోలిస్తే ఒకే తరహాలో రెండంచెల రాత పరీక్ష ఉంది. సబ్జెక్టులు, ప్రశ్నల సంఖ్య, పరీక్షకు కేటాయించిన మొత్తం సమయంలో ఎలాంటి మార్పులేదు. అయితే ప్రిలిమినరీ పరీక్షలో మాత్రం మొదటిసారిగా మొత్తం 60 నిమిషాల సమయాన్ని విభాగాల వారీగా 20 నిమిషాల చొప్పున మూడు విభాగాలకు కేటాయించారు. దీనివల్ల అభ్యర్థులు ఏదైనా విభాగాన్ని మొదలుపెడితే, దానికి నిర్దేశించిన సమయం పూర్తయిన తర్వాతే మరొక విభాగంలోకి వెళ్లాల్సి ఉంటుంది. కొన్ని ప్రశ్నల తర్వాత వేరే విభాగంలోకి వెళ్లే అవకాశం ఉండదు. దీనివల్ల తేలికగా ఉండే విభాగాన్ని త్వరగా పూర్తిచేసి తద్వారా మిగిలిన సమయాన్ని ఇతర కఠిన సబ్జెక్టులోని ప్రశ్నలు సాధించడానికి ఉపయోగించుకునే వెసులుబాటు ఈ పరీక్షలో ఉండదు.

మొత్తం ఖాళీలు: 8301
దరఖాస్తు ప్రారంభం: జనవరి 20, 2018 (ఆన్‌లైన్‌లో)
చివరి తేదీ: ఫిబ్రవరి 10, 2018

న్యూమరికల్‌ ఎబిలిటీ, రీజనింగ్‌లు కీలకం
ప్రిలిమినరీ పరీక్షలో సమయాన్ని విభాగాలవారీగా కేటాయించడం వల్ల న్యూమరికల్‌ ఎబిలిటీ, రీజనింగ్‌ సబ్జెక్టుల్లో ఒక్కోదానిలో ఉండే 35 ప్రశ్నలను 20 నిమిషాల్లో పూర్తి చేయాలి. అంటే ఒక్కో ప్రశ్నకు సగటున 34 సెకన్ల సమయం మాత్రమే ఉంటుంది. ఇది అత్యంత తక్కువ సమయం. అందువల్ల ఈ రెండు విభాగాలను ఎవరైతే వేగంగా పూర్తిచేయగలుగుతారో వారే మిగిలిన అభ్యర్థుల కంటే మెరుగైన ప్రతిభను ప్రదర్శించగలుగుతారు.

అయిదు సబ్జెక్టులూ ముఖ్యమే!
ప్రాథమిక, ప్రధాన పరీక్షలు రెండింటిలో ఉండే అయిదు సబ్జెక్టులన్నీ వేటికవే ముఖ్యమైనవి.

క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌/న్యూమరికల్‌ ఎబిలిటీ: ప్రిలిమినరీ, మెయిన్స్‌ పరీక్షలు రెండింటిలో ఉండే విభాగమిది. న్యూమరికల్‌ ఎబిలిటీ, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌లోని ప్రధాన భేదం ప్రశ్నల స్థాయి. సిలబస్‌లో పెద్దగా తేడా లేకపోయినా వాటికి సంబంధించిన ప్రశ్నల స్థాయి న్యూమరికల్‌ ఎబిలిటీలో తక్కువగా, క్వాంటిటేటివ్‌ ఎబిలిటీలో ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా సింప్లిఫికేషన్స్‌, అప్రాక్సిమేట్‌ వాల్యూస్‌, నంబర్‌ సిరీస్‌, క్వాడ్రాటిక్‌ ఈక్వేషన్స్‌, డేటా సఫిషియన్సీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌, అరిథ్‌మెటిక్‌లోని వివిధ టాపిక్స్‌ నుంచి ప్రశ్నలుంటాయి. అయితే న్యూమరికల్‌ ఎబిలిటీలో సింప్లిఫికేషన్స్‌ నుంచి, క్వాంటిటేటివ్‌ ఎబిలిటీలో డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ నుంచి ప్రశ్నలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ సమయం పట్టే విభాగం కాబట్టి లెక్కలు వేగంగా చేయగలిగే విధంగా బాగా సాధన చేయాలి. నంబర్‌ సిరీస్‌ ప్రశ్నల్లో సంఖ్యల మధ్య సంబంధం వెంటనే స్ఫురిస్తే ఆ ప్రశ్నను సాధించాలి. లేకపోతే ఎక్కువ కాలయాపన చేయకుండా వాటిని వదిలేయాలి. అదే విధంగా కఠినంగా అనిపించే ప్రశ్నలపై కూడా ఎక్కువ కాలయాపన మంచిది కాదు. తేలికపాటి ప్రశ్నలు ముందుగా పూర్తిచేసి సమయం ఉంటే కఠినమైన ప్రశ్నలు ప్రయత్నించాలి.

జనరల్‌/ ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్‌: సాధారణంగా జనరల్‌ అవేర్‌నెస్‌గా పేర్కొనే ఈ విభాగాన్ని ఈ పరీక్షలో జనరల్‌/ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్‌ అంటారు. జనరల్‌ అవేర్‌నెస్‌గా వ్యవహరించినప్పుడు కూడా ఫైనాన్షియల్‌, బ్యాంకింగ్‌ రంగాలకు సంబంధించిన విషయాలపైనే ఎక్కువ ప్రశ్నలు ఉండేవి. అందువల్ల ఇప్పుడు జనరల్‌/ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్‌గా ఇవ్వడం వల్ల సబ్జెక్టు కొత్తగా మారిందేమీ లేదు. ఈ విభాగంలో ప్రశ్నలు సాధారణంగా ఎకానమీ, ఫైనాన్స్‌, బ్యాంకింగ్‌ రంగాలకు సంబంధించిన వర్తమానాంశాలపై ఉంటాయి. కేంద్ర ప్రభుత్వ పథకాలు, సాధారణ బడ్జెట్‌లపై ప్రశ్నలు వస్తాయి. జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలు, అవార్డులు, పుస్తకాలు-రచయితలు, వార్తల్లోని వ్యక్తులు, స్థలాలు, క్రీడలు, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మొదలైన వాటి నుంచి కూడా ప్రశ్నలు ఉంటాయి. ముఖ్యమైన రోజులు గుర్తుంచుకోవాలి. సాధారణంగా పరీక్షా సమయానికి 5, 6 నెలల ముందు వరకు ఉండే వర్తమానాంశాలపైనే ఎక్కువ ప్రశ్నలు వస్తుంటాయి. అదేవిధంగా బ్యాంకింగ్‌ టెర్మినాలజీ తెలుసుకోవాలి. వివిధ బ్యాంకులు, వాటి ట్యాగ్‌లైన్‌/క్యాప్షన్లు గుర్తుపెట్టుకోవాలి. ఈ విభాగంలో ప్రశ్నలు వచ్చే అంశాల ప్రాధాన్యాన్ని తెలుసుకొని సన్నద్ధమైతే ఎక్కువ మార్కులు సాధించవచ్చు.

రీజనింగ్‌: అకడమిక్‌ పరీక్షల్లో ఎప్పుడూ చదవనిదీ, ఆసక్తికరంగా, సులభంగా ఉండేది రీజనింగ్‌. ఈమధ్య పరీక్షల్లో ఈ విభాగం ప్రశ్నలు కాస్త కఠినంగా ఉంటున్నాయి. కాబట్టి ఎక్కువ ప్రాక్టీస్‌ చేయాలి. దీనిలో కోడింగ్‌-డీకోడింగ్‌, అల్ఫాబెట్‌-నంబర్‌ సిరీస్‌, డైరెక్షన్స్‌, బ్లడ్‌ రిలేషన్స్‌, వెన్‌ డయాగ్రమ్స్‌, సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌, సిలాజిజమ్‌ మొదలైన వాటితోపాటు అనలిటికల్‌ రీజనింగ్‌లోని స్టేట్‌మెంట్‌ సంబంధ ప్రశ్నలు, కాజ్‌-ఎఫెక్ట్‌, ఇన్‌పుట్‌-అవుట్‌పుట్‌, పజిల్‌ టెస్ట్‌, ఎలిజిబిలిటీ టెస్ట్‌ మొదలైన వాటి నుంచి సాధారణంగా ప్రశ్నలు ఉంటాయి. బాగా సాధన చేస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా సరైన జవాబు గుర్తించవచ్చు.

ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌: బ్యాంకు పరీక్షల్లో ఎక్కువమంది ఫెయిలయ్యే విభాగమిది. దీనికి సరైన ప్రాధాన్యం ఇచ్చి తగిన విధంగా సిద్ధం కాకపోవడమే ప్రధాన కారణం. అయితే ఈ విభాగంలో వస్తున్న ప్రశ్నల సరళిని గమనించి తదనుగుణంగా ప్రిపేర్‌ అయితే ఎక్కువ మార్కులు సంపాదించవచ్చు. దీనిలో గ్రామర్‌ ఆధారంగా ఉండే సెంటెన్స్‌ కంప్లిషన్‌, పేరా జంబుల్డ్‌, ఫిల్లర్స్‌, క్లోజ్‌ టెస్ట్‌, గ్రమెటికల్‌ ఎర్రర్స్‌, రీ-అరేంజ్‌మెంట్‌ ఆఫ్‌ సెంటెన్సెస్‌ మొదలైన వాటి నుంచే దాదాపు 40-50 ప్రశ్నలుంటాయి. ఈ తరహా ప్రశ్నలు బాగా సాధన చేయాలి. వీటితోపాటు కాంప్రహెన్షన్‌, ఒకాబ్యులరీ ప్రశ్నలుంటాయి. వేగంగా చదవడం ప్రాక్టీస్‌ చేస్తే కాంప్రహెన్షన్‌లో ప్రశ్నలు త్వరగా సాధించవచ్చు.

కంప్యూటర్‌ నాలెడ్జ్‌: అభ్యర్థులందరూ ఎక్కువ మార్కులు సాధించగలిగే సబ్జెక్‌ ఇది. ఎవల్యూషన్‌ ఆఫ్‌ కంప్యూటర్‌, బేసిక్స్‌, హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌, వివిధ కాంపోనెంట్స్‌, డివైజెస్‌- వాటి ఉపయోగాలు, ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌, ఎమ్మెస్‌ ఆఫీస్‌, నెట్‌ వర్కింగ్‌, ఇంటర్నెట్‌, ఇ-కామర్స్‌, కంప్యూటర్‌ టెర్మినాలజీ, డీబీఎంఎస్‌, కంప్యూటర్‌ రంగంలోని తాజా పరిణామాలు తదితరాల నుంచి ప్రశ్నలు ఉంటాయి.

సన్నద్ధత ఏ విధంగా?
ప్రిలిమ్స్‌ పరీక్ష మార్చి/ఏప్రిల్‌లో, మెయిన్స్‌ పరీక్ష మే 12న జరుగుతాయి. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ పరీక్షలకు ఒకే సబ్జెక్టులు ఉన్నాయి కాబట్టి అభ్యర్థులు వీటికి విడివిడిగా కాకుండా ఒకేసారి ప్రిపరేషన్‌ మొదలుపెట్టాలి. మెయిన్స్‌ పరీక్షకు సిద్ధమవుతూ దాని అధ్యయనాన్ని ప్రిలిమ్స్‌ జరిగేలోగా పూర్తిచేయాలి. కనీసం ప్రిలిమ్స్‌లో కామన్‌గా ఉండే మూడు సబ్జెక్టులనైనా చదివేయాలి. కొత్తగా పరీక్ష రాసే సబ్జెక్టుల్లోని టాపిక్‌లను ప్రాథమికాంశాల నుంచి ప్రారంభించాలి. ఆపై వివిధ స్థాయుల్లోని ప్రశ్నలను ప్రాక్టీస్‌ చేయాలి. అదేవిధంగా వీలైనన్ని పూర్తిస్థాయి మోడల్‌పేపర్లను సమయం నిర్దేశించుకుని సాధన చేయాలి. ఎప్పటికప్పుడు సాధించగలిగే ప్రశ్నల సంఖ్య పెరిగే విధంగా ప్రాక్టీస్‌ చేయాలి.

తరచూ తలెత్తే ప్రశ్నలు
నేను నాన్‌-మ్యాథ్స్‌ అభ్యర్థిని. బ్యాంక్‌ ఉద్యోగం సాధించగలనా?
జ: బ్యాంక్‌ పరీక్షలు పదో తరగతి స్థాయిలోనే ఉంటాయి. అదేవిధంగా వీటిలోని సబ్జెక్టులన్నీ జనరల్‌ సబ్జెక్టులు. కేవలం అరిథ్‌మెటిక్‌ మాత్రమే ఇంతకు ముందు చదివి ఉంటారు. అది కూడా పాఠశాల స్థాయిలోనిదే. అందువల్ల ఆర్ట్స్‌, కామర్స్‌, సైన్స్‌, మేథ్స్‌, ఇంజినీరింగ్‌, ఫార్మసీ మొదలైన ఏ బ్యాక్‌గ్రౌండ్‌ నుంచి వచ్చినా అందరూ బ్యాంక్‌ ఉద్యోగం సాధించుకోవచ్చు.

బ్యాంక్‌ పరీక్షకు ఉన్న ఈ రెండు నెలల సమయం సరిపోతుందా?
జ: పరీక్షలో ఉండే విభాగాలన్నింటి కాన్సెప్ట్స్‌ నేర్చుకోవడానికి నెలరోజులు సరిపోతాయి. మిగిలిన సమయం వివిధ రకాల ప్రశ్నలు, మాదిరి ప్రశ్నపత్రాలు సాధించడానికి ఉపయోగిస్తే సమయం సరిపోతుంది.

రోజూ ప్రిపరేషన్‌ కోసం ఎన్ని గంటలు కేటాయించాలి?
జ: ఇక్కడ ఎన్ని గంటల సమయం అని కాకుండా ఎంత క్వాలిటీ సమయం కేటాయించారనేది ముఖ్యం. సబ్జెక్టులన్నింటికీ రెండు నెలల సమయంలో సిద్ధం కావాలంటే రోజుకి 8 నుంచి 10 గంటల సమయం కేటాయించాలి.

తెలుగు మాధ్యమం అభ్యర్థులు ఈ ఉద్యోగం సాధించగలరా? ఇంగ్లిష్‌ మీడియం వారితో పోటీ పడగలరా?
జ: పరీక్ష ఇంగ్లిష్‌లో ఉంటుంది కాబట్టి తెలుగు మీడియం అభ్యర్థులు సబ్జెక్టులన్నీ ఇంగ్లిష్‌లోనే నేర్చుకోవాలి. తెలుగులో నేర్చుకున్న పదాలన్నింటికీ ముందుగా ఇంగ్లిష్‌ పదాలు తెలుసుకోవాలి. ఇంగ్లిష్‌లోనే చదువుతూ ప్రాక్టీస్‌ చేస్తారు కాబట్టి అలవాటు పడతారు. అయితే ఇంగ్లిష్‌ మీడియం అభ్యర్థులతో పోలిస్తే ఎక్కువ సమయం కేటాయించుకోవడం మంచిది. సబ్జెక్టులన్నీ అందరికీ ఒకటే కాబట్టి ఎవరు బాగా సాధన చేస్తే వారికే అవకాశం ఉంటుంది.

పరీక్షలో ఏ సబ్జెక్టులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి?
జ: బ్యాంక్‌ పరీక్షలోని అన్ని సబ్జెక్టుల్లో విడివిడిగా ఉత్తీర్ణులవ్వాలి. కాబట్టి సబ్జెక్టులన్నింటికీ సమ ప్రాధాన్యం ఇవ్వాలి.

Posted on 22-01-2018