స్కాలర్ షిప్

ఉపకార వేతనం.. ప్రతిభే ప్రామాణికం

* ఇంటర్‌లో అత్యధిక
* మార్కులు సాధిస్తే అర్హత
* రెండు విధాలుగా ఎంపిక

కుటుంబ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కొందరు విద్యార్థులు మధ్యలోనే చదువుకు స్వస్తి పలుకుతున్నారు. కానీ ప్రతిభావంతులకు కేంద్రం ఆసరాగా నిలుస్తోంది. ఇంటర్‌ మార్కులను ప్రామాణికంగా తీసుకుని ఉపకార వేతనాలు అందిస్తోంది. వీటికి అర్హత సాధించే దిశగా విద్యార్థులు ప్రయత్నిస్తే తమ జీవితాశయాన్ని నెరవేర్చుకునే వీలుంది.

ఉపకార వేతనాలకు అర్హత సాధించాలనే తపనతో ఇటీవల కాలంలో విద్యార్థులు పోటీపడుతూ తమవంతు ప్రయత్నం చేస్తున్నారు. కళాశాలలో అడుగుపెట్టిన క్షణం నుంచే లక్ష్యం సాధించే దిశగా ప్రణాళికతో చదువుతూ ముందుకు సాగుతున్నారు. గతంలో అవగాహన లేకపోవటం వల్ల విద్యార్థులు అందిపుచ్చుకోలేకపోవటాన్ని దృష్టిలో పెట్టుకుని అధ్యాపకులు చొరవ తీసుకుంటున్నారు. కొన్నేళ్లుగా పలువురు విద్యార్థులు ఉపకార వేతనాలకు అర్హత సాధిస్తూ ఉన్నత చదువులకు ఆర్థిక చేయూతను అందుకుంటున్నారు. ఎంపిక ఇలా చేస్తారు.. ఇంటర్‌లో ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో వచ్చిన మార్కుల ఆధారంగా ఉపకార వేతనాలకు ఇంటర్‌బోర్డు అర్హులైన విద్యార్థులను ఎంపిక చేస్తోంది. ఏ కళాశాలలో చదివినా ఇంటర్‌లో 970కి పైగా మార్కులు సాధించిన వారిని పరిగణనలోకి తీసుకుంటారు. ప్రతి కళాశాలను యూనిట్‌గా తీసుకుని అత్యధిక మార్కులతో పాటు విద్యార్థుల సామాజిక వర్గాన్ని పరిగణనలోకి తీసుకుని ఎంపిక చేస్తున్నారు.

ఎంపికైన విద్యార్థులకు ఇంటర్‌ బోర్డు నేరుగా ప్రొసీడింగ్‌ లేఖ, దరఖాస్తులను కళాశాలలకు పంపిస్తుంది. కళాశాల నుంచి ఎంత మందినైనా ఎంపిక చేసే వీలుంది. ఇంటర్‌బోర్డు అందించే ఉపకార వేతనం.. మొదటి పద్ధతిలో ఇంటర్‌ బోర్డు స్థాయిలో ఎంపికైన విద్యార్థులకు డిగ్రీ, ఇంజినీరింగ్‌లో నెలకు రూ.వెయ్యి చొప్పున మూడేళ్లు, పీజీలో రూ.2 వేలు చొప్పున రెండేళ్ల పాటు ఉపకార వేతనాలు మంజూరు చేస్తోంది. ఈ ఉపకార వేతనాలను బోర్డు అందజేస్తోంది. జాతీయ ఉపకార వేతనం.. రెండో విధానంలో జాతీయ ఉపకార వేతనాలకు అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల వివరాలను ఇంటర్‌ బోర్డు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖకు పంపిస్తోంది. దాదాపు 97 శాతం పైగా మార్కులు సాధించిన విద్యార్థులను జాతీయ ప్రతిభా ఉపకార వేతనాలకు ఎంపిక చేస్తారు. వీరు డిగ్రీ మాత్రమే అభ్యసించాల్సి ఉంటుంది. ఇంజినీరింగ్‌ వంటి సాంకేతిక విద్యా కోర్సులు అభ్యసిస్తే ఉపకార వేతనాల మంజూరు నిలిపివేస్తారు. ఏడాదికి రూ.80 వేలు చొప్పున డిగ్రీ మొదటి సంవత్సరం నుంచి ఐదేళ్లపాటు మంజూరు చేస్తున్నారు. డిగ్రీ బీఎస్సీ, బీజెడ్‌సీలో ఏదో ఒక సబ్జెక్టుపై పరిశోధన చేసి పంపించాల్సి ఉంది.

విద్యార్థులకు తెలియజేస్తున్నాం
ఇంటర్‌ మార్కులను ప్రామాణికంగా తీసుకుని ఉపకార వేతనాలకు ఎంపిక చేసే విధానంపై గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం. కళాశాలలో అడుగుపెట్టగానే ఆ దిశగా సన్నద్ధులు కావాలని సూచిస్తున్నాం. మార్కుల ఆధారంగా ఎంపిక చేసే విధానాన్ని ముందుగానే తెలిపి, పోటీతత్వం పెంచుతున్నాం. ఎక్కువ మంది ఉత్తీర్ణత సాధించటంతో పాటు మంచి మార్కులు పొందటానికి వీలుండటంతో ఆ దిశగా మావంతు ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కువ మంది అర్హత సాధించేలా ఈ ఏడాది విద్యాసంవత్సరం ప్రారంభం నుంచే ప్రత్యేక దృష్టిసారించాం. - ఎస్‌.సరళకుమారి, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌

పెద్దకష్టమేమీ కాదు
జాతీయ ప్రతిభా ఉపకార వేతనాలకు అర్హత సాధించటం పెద్దకష్టమేమీ కాదు. క్రమం తప్పకుండా కళాశాలకు వస్తూ ప్రణాళిక ప్రకారం చదివితే అత్యధిక మార్కులు సాధించటానికి అవకాశం ఉంది. ఉన్నత చదువులకు అవసరమైన మొత్తాన్ని సమకూర్చుకునే వెసులుబాటు ఉంది. ఇంటర్‌లో అడుగు పెట్టగానే మొదటి సంవత్సరం నుంచే తమ ప్రయత్నాన్ని కొనసాగించాలి. సాధ్యమైనన్ని ఎక్కువ మార్కులు సాధించటం పైనే దృష్టిసారించాలి. ప్రస్తుతం డిగ్రీ చదువుతున్నాను. ఇటీవల బ్యాంకు ఖాతాలో రూ.60 వేలు జమ చేశారు. ప్రాజెక్టు రిపోర్టు ఇచ్చిన తరువాత మిగతా మొత్తం జమ చేస్తారు.
- తన్నీరు తేజస్విని, అర్హత సాధించిన విద్యార్థిని

విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి
ఇంటర్‌లో అత్యధిక మార్కులు సాధించి కేంద్రప్రభుత్వం అందజేసే జాతీయ ఉపకార వేతనానికి ఎంపికయ్యాను. విస్సన్నపేట కళాశాలలో ఇంటర్మీడియట్‌ పూర్తి చేసి, ప్రస్తుతం బీఎస్సీ చదువుతున్నా. కేంద్రం ఇస్తున్న ఈ ప్రోత్సాహక ఉపకార వేతనం పేద కుటుంబాలకు చెందిన మాలాంటి విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ముఖ్యంగా ఇంటర్‌ చదువుతున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
- జి.హరిచందన, ఉపకార వేతనం అందుకుంటున్న విద్యార్థిని

అర్హత సాధిస్తాననే నమ్మకం ఉంది
జాతీయ ఉపకార వేతనానికి అర్హత సాధించాలనే లక్ష్యంతో చదువుతున్నాను. ఎక్కువ మార్కులు సాధించటానికి అవకాశం ఉన్న సబ్జెక్టులపై దృష్టిసారించాను. అధ్యాపకుల సూచనల మేరకు ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నాను. అర్హత సాధిస్తాననే నమ్మకం కలిగింది.
- ఆకుల సౌమ్య, ఇంటర్‌ విద్యార్థిని

సలహాలు తీసుకుంటున్నాను
ఇంటర్‌లో అత్యధిక మార్కులు సాధించటం కోసం అధ్యాపకులు, సీనియర్ల సలహాలు తీసుకుంటున్నాను. ఆర్ట్స్‌ చదువుతున్న విద్యార్థులతో పోల్చితే సైన్సు చదివే విద్యార్థులకు ఎక్కువ మార్కులు సాధించే అవకాశం ఉంది. ఎంపికైన తరువాత 80 శాతం పైగా మార్కులు సాధించాలనే విషయం తెలుసుకున్నాను.
- ఎస్‌కే అయేషా, ఇంటర్‌ విద్యార్థిని

Posted on 08-10-2017