తల్లిపాలలోని అసహజ చక్కెరతో బిడ్డకు చేటు!

న్యూయార్క్‌: తల్లిపాలు అమృతతుల్యమనే విషయంలో కించిత్తు అనుమానమైనా అక్కర్లేదు. కానీ, ఆమె తీసుకునే ఆహారం వల్ల ఒక్కోసారి బిడ్డ అనారోగ్యం పాలయ్యే ముప్పు లేకపోలేదంటున్నారు... కెక్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌కు చెందిన పరిశోధకులు! అమ్మపాలలో ఉండే ‘ఫ్రక్టోజ్‌’ అనే అసహజ చక్కెర వల్ల బిడ్డకు అనేక రకాల రుగ్మతలు దరిచేరే ప్రమాదమున్నట్లు వారు గుర్తించారు. రోజులో బియ్యం గింజంత పరిమాణంలో ఫ్రక్టోజ్‌ అందినా, అది బిడ్డ అధికంగా బరువు పెరగడానికి కారణమవుతోందట. పలువురు తల్లులు తమ శిశువులకు ఇస్తున్న పాలపై బాల వూబకాయ వైద్యనిపుణులు డా.మైకేల్‌ గోరాన్‌ ఇటీవల పరీక్షలు నిర్వహించారు. ‘‘నిజానికి తల్లిపాలలో ఫ్రక్టోజ్‌ ఉండదు. సోడా, శక్తినందించే పానీయాలు తాగడం, మార్కెట్లలో దొరికే తయారైన ఆహార పదార్థాలను తినడం వల్ల అమ్మపాలలో ఈ కృత్రిమ చక్కెర చేరుతుంది. ఇది బిడ్డ ఎదగడానికి కొంతవరకూ దోహదపడుతుంది. కానీ, మోతాదుకు మించి అందడంవల్ల అధిక బరువు మొదలు, మధుమేహం వరకూ ఎన్నో సమస్యలు పిల్లలను చుట్టుముడుతున్నాయి’’ అని గోరాన్‌ ఆందోళన వ్యక్తంచేశారు.గర్భిణులు, పాలిచ్చే తల్లులేకాక పిల్లలు, పెద్దలు ఫ్రక్టోజ్‌ అధికంగా ఉండే ఆహార పదార్థాలు, పానీయాలకు దూరంగా ఉండటం మేలని సూచించారు.

పాడే పోస్టరు.. మాట్లాడే చొక్కా!

లండన్‌: మీరు కారులో వెళుతున్నారు. పట్టణంలో మీకిష్టమైన సంగీత కళాకారుడి కచేరీ జరుగుతున్నట్టు పోస్టర్‌ కనబడింది. వెళ్లలేకపోయామే అని బాధపడకుండా మీ కారునే రేడియో స్టేషన్‌గా మార్చేస్తే? లేదూ.. ఆ పోస్టరే మీ స్మార్ట్‌ఫోన్‌కు రాయితీ టికెట్లు దొరికే లింకును పంపిస్తే? అక్కడికి చేరుకోవటానికి కూడా అదే దారి చూపిస్తే? అదలా ఉంచండి. మీరు ఎక్కడో పరుగెడుతున్నారు. మీరు ధరించిన చొక్కా చెమటను విశ్లేషించి.. శరీరంలో తలెత్తే కీలకమైన మార్పులను నేరుగా మీ ఫోన్‌కు పంపిస్తే? విచిత్రమే కదూ. అలాంటి విచిత్రాన్నే సృష్టించారు వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయ ఇంజినీర్లు. అప్పటికే గాలిలో ఉన్న ఎఫ్‌ఎం రేడియో సంకేతాలను ఉపయోగించుకొని.. ఒక రాగి టేపు యాంటెనా ద్వారా సమాచారాన్ని చేరవేసే సరికొత్త ప్రక్రియకు జీవం పోశారు. ఇది అసలైన రేడియో ప్రసారాలను దెబ్బతీయకుండానే ఆయా సంకేతాల్లోని సమాచారాన్ని, మాటలను క్రోడీకరించి.. వాటిని పరావర్తనం చేస్తూ సందేశాలను చేరవేస్తుంది. అంటే దీని ద్వారా ఒకరకంగా పోస్టర్లను పాడేలా చేయొచ్చు, చొక్కాలను మాట్లాడేలా చేయొచ్చన్నమాట.

నత్త విషం నుంచి నొప్పి నివారణ ఔషధాలు!

వాషింగ్టన్‌: ఓ రకమైన సముద్ర నత్త విషం నుంచి నొప్పి నివారణ ఔషధాలను తయారుచేయవచ్చునని అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ‘ఒపియాయిడ్‌’ నొప్పి నివారణ మందుల కంటే ఇవి మెరుగ్గా పనిచేసే అవకాశాలున్నాయని వారు చెబుతున్నారు. ‘కానస్‌ రెజియస్‌’ అనే చిన్న నత్త కరీబియన్‌ సముద్రంలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది తనలోని విషం సాయంతో కొన్ని జీవులను అచేతనంగా చేసి, చంపి ఆహారంగా స్వీకరిస్తుంది. అయితే, సదరు విషంలోని ‘ఆర్‌జీ1ఏ’ అనే సమ్మేళనం నొప్పి నివారణ లక్షణాలను కలిగి ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ సమ్మేళనంతో తయారుచేసిన ఔషధాలు.. ఓపియాయిడ్‌ మందులకు భిన్నమైన చర్యాక్రమంలో నొప్పిని సమర్థంగా హరిస్తున్నట్లు వారు వెల్లడించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఔషధాల కంటే ఎక్కువసేపు వీటి ప్రభావం కొనసాగుతోందని తెలిపారు.

మధుమేహ పీడితులకు వరం.. ఈ వరి అన్నం!

ఈనాడు - బెంగళూరు: మధుమేహ వ్యాధి పీడితులు తినేందుకు అనుకూలమైన వరి రకాన్ని బెంగళూరులోని వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆవిష్కరించింది. సాధారణ వరిలో ఆరున్నర శాతం నుంచి ఏడు శాతం వరకూ మాంసకృత్తులు (ప్రొటీన్లు) ఉంటాయి. కొత్తగా ఆవిష్కరించిన వరిలో 12 శాతం నుంచి 13 శాతం వరకు మాంసకృత్తులు ఉంటాయి! ఈ రకం వరిని మధుమేహ పీడితులు హాయిగా భుజించవచ్చని వ్యవసాయ నిపుణులు వివరించారు. సంప్రదాయ వరి రకాల్లో 20శాతం వరకూ లైజిన్‌ను వృద్ధి చేయడం ద్వారా మాంసకృత్తుల పరిమాణాన్ని పెంచారు. ‘‘ఎక్కువ మాంసకృత్తుల వల్ల వరిలో పిండిపదార్థం (స్టార్చ్‌) పరిమాణం తగ్గి మధుమేహులకు ఉపయుక్తమవుతుంది’’ అని జెనిటిక్స్‌, ప్లాంట్‌ బ్రీడింగ్‌ విభాగాధిపతి, పరిశోధక బృందానికి సారథ్యం వహించిన హెచ్‌.శైలజ చెప్పారు. మాంసాహరం ద్వారా లభించే మాంసకృత్తుల కంటే వరిలోని మాంసకృత్తులు తేలిగ్గా జీర్ణమవుతాయని వివరించారు. అదనపు వ్యయం లేకుండా రైతులు ఈ రకం వరిని పండించి లాభాలు గడించవచ్చని చెప్పారు. జింకు, ఇనుము ఎక్కువగా ఉండే మరో రెండు రకాల వరినీ ఈ బృందం ఆవిష్కరించింది. గోధుమలోని మాంసకృత్తుల పరిమాణం 14 శాతమని, ఆ స్థాయికి కొత్త వరిని తీసుకెళ్లడమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు వెల్లడించారు.

జీర్ణరసంతో పనిచేసే బ్యాటరీ

బోస్టన్‌: రోగుల జీర్ణాశయంలోని ఆమ్లాల సాయంతో పనిచేసే సూక్ష్మ బ్యాటరీని ఎంఐటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి పరిచారు. భవిష్యత్తులో కడుపులోకి మింగే ఎలక్ట్రానిక్‌ మాత్రలకు ఇవి శక్తిని సమకూరుస్తాయని చెబుతున్నారు. ఈ తరహా ఉపకరణాలకు ప్రస్తుతం ఉపయోగిస్తున్న సంప్రదాయ బ్యాటరీలకు భిన్నంగా ఇది చవకైన, సురక్షితమైన ప్రత్యామ్నాయమని పరిశోధకులు వివరించారు. కడుపులోని ఉపకరణాలు, సుదీర్ఘంగా పనిచేసే వ్యవస్థలకు ఇంధనశక్తిని సమకూర్చే మార్గాల్ని రూపొందించాల్సిన అవసరం ఉందని ఎంఐటీ పరిశోధకులు గియోవన్ని ట్రావెర్సో అభిప్రాయపడ్డారు. రోగుల ఆరోగ్యాన్ని పర్యవేక్షించే, చికిత్స అందించడంలో కొత్త బాటలు వేసే తర్వాతి తరం ఎలక్ట్రానిక్‌ మాత్రలకు తాజా పరిజ్ఞానం దారిచూపుతుందని మరో పరిశోధకులు రాబర్ట్‌ లాంగర్‌ పేర్కొన్నారు.

ఒక్క సూదిమందుతో నిర్వీర్యం

గర్భ నిరోధక పరిశోధనల్లో సంచలనం! కేవలం ఒకే ఒక్క సూదిమందుతో రెండేళ్లపాటు వీర్యాన్ని అడ్డుకునే ఔషధం తయారైంది. వద్దనుకుంటే.. నాలుగు క్షణాలు చాలు. మరో ఇంజెక్షన్‌తో మళ్లీ సంతానప్రాప్తి ఖాయం!
కాలిఫోర్నియాలోని జాతీయ వానర పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు రూపొందించిన ఈ సరికొత్త ఔషధం... ఇప్పటికే ఎలుకలు, వానరాలపై నూరుశాతం సత్ఫలితాలను నమోదు చేసింది. ఇప్పటివరకూ గర్భధారణ రాకుండా సంభోగ సమయంలో కండోమ్‌లు, మందు బిళ్లల వాడకం వంటి తాత్కాలిక పద్ధతులున్నాయి. పిల్లలు వద్దనుకునే కొందరు పురుషులు శాశ్వత పరిష్కారంగా వేసక్టమీ శస్త్రచికిత్స చేయించుకుంటున్నారు. అయితే ఈ శస్త్రచికిత్సపై ఎన్నో అనుమానాలున్నాయి. పైగా వాపు, నొప్పి, ఇన్ఫెక్షన్‌ వంటి సమస్యలు లేకపోలేదు. వీర్య నియంత్రణకు తాత్కాలికంగా వాడే హార్మోన్‌ మిళిత మందులు కొన్నిసార్లు మెదడు పనితీరుపై ప్రభావం చూపి, కుంగుబాటుకు దారితీస్తున్నాయి. దీని పేరు ‘వాసల్‌జెల్‌’. జిగట తయారీకి అవసరమైన రసాయనాలను ఉత్పత్తిచేసే స్టెరీన్‌-ఆల్ట్‌-మెలియర్‌ ఆమ్లం (ఎస్‌ఎంఏ) ఇందులో ఉంటుంది. శరీరానికి ఎలాంటి హానీ కలుగకుండా హార్మోన్‌ రహితంగా దీనిని రూపొందించారు. పునరుత్పత్తి వ్యవస్థలోని వీర్య జనకం నుంచి శుక్రకణాలు నాళాల (వాస్‌ డక్ట్‌) ద్వారా మూత్రనాళానికి చేరి, స్కలిస్తాయి. అయితే ‘వాసల్‌జెల్‌’ను ఇంజెక్షన్‌ ద్వారా వాస్‌డక్ట్‌లోకి చొప్పిస్తారు. ఇది అక్కడ జిగట పదార్థాన్ని ఉత్పత్తి చేసి, వీర్య కణాలు ముందుకెళ్లకుండా దీర్ఘకాలం అడ్డుకుంటుంది. ఈ ప్రక్రియ రెండేళ్లపాటు జరుగుతూనే ఉంటుందట. పిల్లలు కావాలనుకుంటే, దీనికి విరుగుడు మందును ఇంజెక్షన్‌ ద్వారా ఒక్కసారి ఇస్తే చాలంటున్నారు పరిశోధకులు.