అర్హ‌త ప‌రీక్ష‌


ఏపీ సెట్‌.. ఇదిగో రూట్‌!

       పీ సెట్‌ ప్రకటన వెలువడింది! ఆంధ్రప్రదేశ్‌లోని విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలల్లో సహాయ ఆచార్యుల, అధ్యాపకుల ఉద్యోగాల్లో అర్హత పరీక్షకు సంబంధించిన ప్రకటన ఇది. వివిధ యూనివర్సిటీల్లో ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు వెలువడనున్న సందర్భంలో ఈ ప్రకటన.. పీజీ ఉత్తీర్ణత పొంది, అధ్యాపక వృత్తిలోకి ప్రవేశించదలచినవారికి ఒక సదవకాశం!
ఏపీ సెట్‌ రాయదల్చినవారు కంటెంట్‌పై పూర్తిస్థాయి పట్టు పెంచుకోవడం అవసరం. విషయ సామర్థ్యాన్నీ, గ్రహణ శక్తినీ మెరుగుపరచుకోవాలి. మూల భావనలపై వివిధ కోణాల్లో సన్నద్ధత కొనసాగించాలి. ఇటీవల జరిగిన నెట్‌లో ఉత్తీర్ణత సాధించలేనివారు గతంలోని పొరపాట్లను సరిదిద్దుకొని సన్నద్ధత కొనసాగిస్తే ఉత్తీర్ణులు కావొచ్చు.
* ఏపీ సెట్‌ ఈసారి 30 సబ్జెక్టుల్లో జరుగుతుంది.
* విజువల్‌ ఆర్ట్స్‌ను కొత్తగా చేర్చారు.
* గతంలో ఉన్న 6 పరీక్ష కేంద్రాలకు అదనంగా కడప, కర్నూలుల్లో నూతన పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
* నెగిటివ్‌ మార్కు లేదు.
* ఓఎంఆర్‌ పద్ధతిలో పరీక్ష జరుగుతుంది.
* ఏదైనా ఒక సబ్జెక్టులో ఇప్పటికే ఏపీ సెట్‌/నెట్‌ ఉత్తీర్ణులైనవారు మళ్లీ అదే సబ్జెక్టులో ఏపీ సెట్‌ రాయటానికి వీలు లేదు.
పరీక్ష అక్టోబరులో
దరఖాస్తు గడువు: 11-09-2019 (ఆలస్య రుసుముతో 03-10-2019 వరకు)
పరీక్ష తేది: 20-10-2019
వయసు: గరిష్ఠ వయఃపరిమితి లేదు.
అర్హత: పీజీలో 55% మార్కులతో ఉత్తీర్ణత పొందివుండాలి. బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ, పీడబ్ల్యూడీ వారికి 5% మార్కుల సడలింపు ఉంది. ప్రస్తుతం పీజీ చేస్తున్నవారూ అర్హులు.
http://apset.net.in/
ఏ పేపర్‌ ఎలా?
పేపర్‌-1: అన్ని సబ్జెక్టుల అభ్యర్థులూ రాయాల్సినది. 50 ప్రశ్నలు, 100 మార్కులు. ప్రధానంగా అభ్యర్థి వివేచనా సామర్థ్యం, విషయ అవగాహన, విభిన్న ఆలోచన విధానం, సాధారణ పరిజ్ఞానం లాంటి అంశాల్లో ప్రశ్నిస్తారు. ప్రధానంగా పది విభాగాలుంటాయి. 1. బోధనాభిరుచి 2. పరిశోధనాభిరుచి 3. పఠనావగాహన 4. సంభాషణ 5. గణిత వివేచన 6. తార్కిక వివేచన 7. దత్తాంశ వ్యాఖ్యానం 8. ఐ.సి.టి. 9. ప్రజలు-పర్యావరణం, 10. ఉన్నత విద్యావ్యవస్థలో సుపరిపాలన. ప్రతి విభాగం నుంచి ప్రశ్నలకు అవకాశమున్న అంశాలు/ భావనలు ఎంచుకొని సన్నద్ధత ప్రారంభించాలి. జ్ఞానాత్మక సామర్థ్యాలు, అవబోధం, విశ్లేషణ, మూల్యాంకనం, ఆగమన, నిగమన, తార్కిక వివేచన సామర్థ్యాలు, పర్యావరణం, సహజ వనరులు, సమాచార సాంకేతిక రంగంపై మూలభావనలు, ఆధునిక జీవన విధానంపై ప్రభావం మొదలైన అంశాలపై లోతైన అవగాహన, పరిజ్ఞానం అవసరం.
బోధనాస్వభావం, లక్ష్యాలు, లక్షణాలు, బోధన ఉపగమాలు, మదింపు, మూల్యాంకనం, పరిశోధన-స్వభావం, సోపానాలు, పద్ధతులు, విలువలు, పరిశోధన వ్యాసం లక్షణాలు, కమ్యూనికేషన్‌ అర్థం, రకాలు, లక్షణాలు, అవరోధాలు, ఇంటర్‌నెట్‌, ఈ-మెయిల్‌, కంప్యూటర్‌ మెమరీ- ఈ భావలపై ప్రామాణిక పుస్తకాలు, మెటీరియల్‌ ఆధారంగా, గత ప్రశ్నపత్రాల ఆధారంగా నోట్స్‌ తయారు చేసుకోవాలి. అభ్యాసం, పునశ్చరణ, స్వీయ విశ్లేషణ చేసుకొని, ముందుకు సాగితే ఉత్తమ ఫలితాలు పొందవచ్చు.
పేపర్‌-2: దీనిలో అభ్యర్థులు ఎంచుకున్న సబ్జెక్టుకు సంబంధించి సమాధానాలు రాయాలి. 100 ప్రశ్నలు, 200 మార్కులు. సబ్జెక్టు పూర్వజ్ఞానం, విషయంపై అవగాహన స్థాయి, మూల భావనలు, ఆధునిక విషయ భావనలు నేర్చుకోవాలి. విషయాన్ని ఉన్నదున్నట్లుగా గాక రకరకాల సందర్భాలకు, సన్నివేశాలకు అనువర్తింపచేయాల్సినవిధంగా వివిధ సమస్యలను సాధన చేయాలి. ప్రశ్నల కఠినత్వస్థాయి పెరిగేకొద్దీ, సమాచారాన్ని విస్తరించుకుంటూ అభ్యసించాలి. ఎంచుకున్న సబ్జెక్టులో పీజీ స్థాయి ప్రశ్నలు అడుగుతారు. సబ్జెక్టును పూర్తిగా అవగాహన చేసుకొని, అన్వయించగలిగే సామర్థ్యాన్ని పొందివుండాలి. అకడమిక్‌ పరీక్షలకు చదివిన విషయాన్ని, ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలలోకి మార్చుకోగలగాలి.
సన్నద్ధతలో నాణ్యత ముఖ్యం
* ఒకే సూత్రం, భావనలపై వైవిధ్యభరితంగా ఉండే ప్రశ్నలు సాధన చేయాలి. ప్రశ్నలో అంతర్లీనంగా ఉండే విషయం/ భావనపై దృష్టి పెట్టాలి.
* ప్రశ్నలు జతపరచడం, సమస్యాపూరణం మొదలైనవి లోతుగా, విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయాలి.
* మొదట సాధన నిదానంగా ఉండడం, చిన్నచిన్న పొరపాట్లు జరగడం సహజం. నిరంతర ప్రేరణతో, అభ్యాసం చేయడం వల్ల తప్పులు లేకుండా సాధించే సామర్థ్యం అలవడుతుంది. వేగంగా, కచ్చితంగా సాధించే నైపుణ్యం వస్తుంది. షార్ట్‌కట్స్‌, కొండ గుర్తులు సొంతంగా తయారుచేసుకుంటే సమయం ఆదా అవుతుంది.
* నేర్చుకోదలచిన విషయంపై మంచి పట్టు ఏర్పడిన తర్వాత నమూనా పరీక్షలు సాధన చేయాలి.
* అభ్యర్థులు రెండు పేపర్లలో ప్రతి అంశంలో తమ బలాలు, బలహీనతలు అంచనా వేసుకోవాలి. దానికి అనుగుణంగా, విశ్లేషణాత్మకంగా చదవాలి. అదనపు సమాచారంకోసం రెఫరెన్స్‌ పుస్తకాలు, యూట్యూబ్‌, సామాజిక మాధ్యమాల ద్వారా వివరణలతో కూడిన బోధనను వినియోగించుకోవాలి.
* గత ప్రశ్నపత్రాలను విశ్లేషణ చేసుకొని, ఏ అంశాలకు ప్రాధాన్యముందో స్పష్టత పెంచుకోవాలి.
* నిర్ణీత కాలంలో సిలబస్‌, మోడల్‌ పరీక్షలు పూర్తిచేసుకోవటానికి ఒత్తిడి లేని ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.
* చదివిన అంశాల పునశ్చరణ తప్పనిసరి. మంచి స్కోరు చేయటానికి అవకాశం ఉంటుంది.
* పోటీపరీక్ష శైలిలో ముఖ్యాంశాలను అభ్యసించి, సాధన చేయాలి. నిర్ణీత కాలవ్యవధిలో అన్ని ప్రశ్నలకూ సమాధానాలు రాయగలిగేలా నైపుణ్యం పెంపొందించుకోవాలి.

ఏపీ సెట్ - 2019 వివరాలు

  • నోటిఫికేషన్
  • ఆన్‌లైన్ అప్లికేష‌న్‌
  • సబ్జెక్టులు
  • పాత ప్రశ్నపత్రాలు
  • నమూనా ప్రశ్నపత్రాలు