అర్హ‌త ప‌రీక్ష‌


సెట్‌ అర్హత సాధించేది ఇలా!

       ఉన్నత విద్యారంగంలోకీ, పరిశోధన రంగంలోకీ అడుగుపెట్టాలని భావించే అభ్యర్థులకు అర్హత కల్పించే పరీక్ష... ఏపీ-సెట్‌. జులై 30న ఆంధ్రప్రదేశ్‌లోని ఎంపిక చేసిన ఆరు ప్రాంతీయ కేంద్రాల్లో ఈ పరీక్ష జరగబోతోంది. దీనికి మెరుగైనవిధంగా తయారయ్యేది ఎలాగో తెలుసుకుందాం.
ప్రస్తుతం 31 సబ్జెక్టుల్లో సెట్‌ను నిర్వహించబోతున్నారు. కేవలం కామర్స్‌, ఎకనామిక్స్‌, ఎడ్యుకేషన్‌, హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్‌, పబ్లిక్‌ ఆడ్మినిస్ట్రేషన్‌, సోషియాలజీ, సోషల్‌ వర్క్‌ సబ్జెక్టుల్లో మాత్రమే తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో ప్రశ్నపత్రాలు ఇస్తారు. అందరికీ ఉమ్మడిగా ఉండే పేపర్‌-1 (టీచింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ అప్టిట్యూడ్‌) కూడా తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్‌ విధానంలో ఉంటుంది. అధికారిక వెబ్‌సైట్‌ http://apset.net.in లో రిజిస్ట్రేషన్‌ చేసుకొని, దరఖాస్తును నింపిన తరువాత నిర్ణయించిన ఫీజును క్రెడిట్‌/ డెబిట్‌ కార్డు లేదా నెట్‌బ్యాంకింగ్‌ ద్వారా చెల్లించవచ్చు.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాంతీయ కేంద్రాలైన విశాఖపట్నం, రాజమండ్రి, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, తిరుపతిలలో పరీక్షను నిర్వహిస్తారు.
అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో 55% మార్కులతో (SC/ ST/ PWD లకు 50% మార్కులు) యూజీసీ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్‌ డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. చివరి సం॥ చదువుతున్న విద్యార్థులు కూడా అర్హులే. కానీ వారు సెట్‌ ఫలితాలు ప్రకటించిన తేదీ నుంచి ఏడాది లోపు మాస్టర్స్‌ డిగ్రీలో ఉత్తీర్ణులు కావల్సి ఉంటుంది. గరిష్ఠ వయఃపరిమితి అంటూ ఏమీ లేదు.

ముఖ్యమైన తేదీలు:
* దరఖాస్తులకు చివరి తేదీ: 10 మే, 2017
* రూ. 1000 ఆలస్య రుసుం + రిజిస్ట్రేషన్‌ ఫీజు: 17 మే, 2017
* పరీక్ష తేదీ: 30 జులై, 2017

పరీక్ష స్వరూపం:
ప్రతి అభ్యర్థినీ మూడు పేపర్ల ద్వారా పరీక్షిస్తారు. అన్ని పేపర్లలోని ప్రశ్నలు బహుళైచ్ఛిక రూపంలో ఉంటాయి. పేపర్‌-I టీచింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ ఆప్టిట్యూడ్‌ అందరికీ ఉంటుంది. పేపర్‌-II , పేపర్‌-IIIలు అభ్యర్థి సబ్జెక్టుకు సంబంధించినవి.

వ్యూహం ఎలా ఉండాలి?
పేపర్‌-I
ఇది జనరల్‌ పేపర్‌. మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. అయితే ప్రశ్నలు మాత్రం 60 ఇస్తారు. 50 ప్రశ్నలకు మాత్రమే సమాధానమివ్వాల్సి ఉంటుంది. ఒకవేళ అభ్యర్థి 60 ప్రశ్నలకు సమాధానాలు గుర్తిస్తే కేవలం 1-50 ప్రశ్నలను మూల్యాంకనానికి పరిగణనలోకి తీసుకుంటారు. 51-60 వరకు గల ప్రశ్నల్లో సరైన సమాధానాలు గుర్తించినా అవి అభ్యర్థి స్కోరింగ్‌ కింద జమ కావు.
పేపర్‌-I సిలబస్‌ను 10 యూనిట్లుగా విభజించారు.
1. బోధనా సామర్థ్యం: ఇది పూర్తిగా ఉపాధ్యాయ విద్య విభాగానికి చెందినది. తరగతి గది బోధనాభ్యసన పరిస్థితుల పట్ల అభ్యర్థి జ్ఞానాన్ని, వైఖరులను, దృక్పథాలను వెలికితీయటమే లక్ష్యంగా ప్రశ్నల కూర్పు ఉంటుంది. ఇటీవలికాలంలో భారతీయ విద్యావిధానాల్లో పెను మార్పులకు కారణమవుతున్న నిర్మాణాత్మక అభ్యసన సిద్ధాంతాలు, శిశు కేంద్రీకృత విద్య, నిరంతర సమగ్ర మూల్యాంకనం, విద్యా హక్కు చట్టం-2009, NCF-2005 లపై పట్టు సాధించి, వాటి సూత్రాలతో అనువర్తన సామర్థ్యం పెంచుకుంటే ఈ విభాగంలో గరిష్ఠ మార్కులు సాధింవచ్చు.
2. పరిశోధన సామర్థ్యం: ఉన్నత విద్యా స్థాయిలో బోధించే అధ్యాపకులు శాస్త్రీయ దృక్పథాన్ని కలిగి ఉండి, ప్రతి సూత్రాన్ని/ సత్యాన్ని వస్తు నిషతో పరిశీలించటం ముఖ్యం. ఈ విభాగంలో అడిగే ప్రశ్నలు ఈ మౌలికాంశాల పరిజ్ఞానాన్ని పరిక్షించే లక్ష్యంతో ఉంటున్నాయి.
3. రీడింగ్‌ కాంప్రహెన్షన్‌: ఇందులో ఒక వ్యాసం ఇస్తారు. వ్యాసంలో అంతర్లీనమైన భావాన్ని అర్థం చెడకుండా గ్రహించడం, పరిణామాలను అంచనా వేయగలగడం లాంటి సామర్థ్యాల్ని పరీక్షించటానికి వ్యాసం కింద ప్రశ్నలు ఇస్తారు.
4. కమ్యూనికేషన్‌: అభ్యర్థి సమాచార ప్రసార నైపుణ్యాలను మదింపు చేయడం ఈ విభాగంలోని ప్రశ్నల లక్ష్యం. అభ్యసనకు పాఠ్యపుస్తకాలు మాత్రమే ఆధారం కాదు. నిరంతరం విస్తరిస్తున్న జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే వార్తా పత్రికలు, మ్యాగజీన్లు, టెలివిజన్‌, ఇతర ఆధునిక సమాచార ప్రసార సాధనాలను విరివిగా ఉపయోగించాలి. ఆ విధమైన జ్ఞానాన్ని పరీక్షించటం కూడా అత్యావశ్యకం.
5, 6, 7 యూనిట్లలో అభ్యర్థి వివేచన, అంకగణిత సామర్థ్యాలను అంచనా వేస్తారు. ఈ విభాగంలోని ప్రశ్నలు దాదాపుగా పాఠశాల స్థాయి కాఠిన్యతా స్థాయిలోనే ఉంటున్నందున తక్కువ శ్రమతో ఎక్కువ మార్కులకు వీలుంది.
8. ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ: కంప్యూటర్‌ సహాయంలేని బోధన, పరిశోధన పరిపూర్ణమైనది కాజాలదు. ఈ విభాగంలో కంప్యూటర్‌పై అవగాహన, ఇంటర్నెట్‌, సోషల్‌ మీడియా, ఈ-మెయిల్‌, ముఖ్యమైన అబ్రివేషన్లపై ప్రశ్నలు అడుగుతున్నారు.
9. పీపుల్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌: పర్యావరణాన్ని పరిరక్షిస్తూ అభివృద్ధి ప్రక్రియను కొనసాగించి సుస్థిరాభివృద్ధి సాధించాలనేది ఆధునిక సమాజ లక్ష్యం. దానికి సంబంధించి వాతావరణ అంశాలు, కాలుష్యం- రకాలు, కారకాలు, వ్యాధులు, సహజ వనరుల దోపిడీ, ప్రకృతి వైపరీత్యాలు- కారణాలు, ఫలితాలు, నష్ట నివారణ చర్యలు, పర్యావరణ చట్టాలు, కార్యక్రమాలు, సదస్సులకు సంబంధించిన ప్రశ్నలను ఈ విభాగంలో అడుగుతున్నారు.
10. హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ పాలిటీ: ఈ విభాగంలో భారతదేశపు ఉన్నత విద్యా స్వరూపం, వ్యవస్థాగత ఏర్పాట్లు, నియంత్రణ సంస్థలు, వాటి విధులపై ప్రశ్నలు అడుగుతారు. వాటితోపాటు భారత రాజ్యాంగం, ప్రాథమిక హక్కులు, విధులు, ఆదేశిక సూత్రాలు, కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు, న్యాయవ్యవస్థ మొ॥ పాలిటీ సంబంధిత అంశాలపై ప్రశ్నలు అడుగుతున్నారు.

పేపర్‌ -II, III
* పేపర్‌-II లో మొత్తం 100 మార్కులకు 50 ప్రశ్నలు ఇస్తారు. పేపర్‌-III మొత్తం 150 మార్కులకు 75 ప్రశ్నలు ఇస్తారు. పేపర్‌-II లో ప్రశ్నల సరళిని పరిశీలిస్తే ప్రాథమిక భావనలతోపాటు వివిధ భావనల మధ్య సంబంధం, వాస్తవాలు, అవగాహనస్థాయిని అంచనా వేయటానికి ప్రాధాన్యమిస్తున్నారు. పేపర్‌-III లో అభ్యర్థి అవగాహన స్థాయి, అనువర్తిత సామర్థ్యాన్ని పరీక్షిస్తారు.
* పేపర్‌-III లోని అంశాలు పేపర్‌-II అంశాలను విస్తరించే స్వభావంతో ఉంటాయి. సిలబస్‌లోని మౌలికమైన అంశాల నుంచి లోతైన విషయ అవగాహన వరకూ సన్నద్ధత కొనసాగాలి.
* గతంలో వచ్చిన ప్రశ్నలు పునరావృతం అవుతున్నాయి. అందుకని పూర్వ పేపర్ల సాధన మరవకూడదు.
* ఈ పేపర్ల సిలబస్‌లోని అంశాలు పీజీ స్థాయిలో ఉంటాయి. మెటీరియల్‌ సేకరణకు కొద్దిపాటి కష్టం తప్పదు. మొత్తం సిలబస్‌ ఏ ఒక్క సంప్రదింపు గ్రంథంలోనే దొరకదు కాబట్టి అధ్యాపకుల, సీనియర్ల సలహాలు, సూచనలు మార్గదర్శకంగా ఉపయోగించుకోవచ్చు.

పేపర్‌--I లో అధిక మార్కుల కోసం..
గతంలో పేపర్‌-2, 3 లను మూల్యాంకనం చేయడానికి ఇందులో కేవలం అర్హత (40% మార్కులు) సాధిస్తే సరిపోయేది. మారిన విధానం ప్రకారం అర్హత నిర్ణయించటంలో మూడు పేపర్లలో సాధించిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటున్నారు. కాబట్టి పేపర్‌-I ను అశ్రద్ధ చేయకుండా మిగతా రెండింటిలో సమానమైన శ్రద్ధ పెట్టాల్సిందే.
* గత NET/SET ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే జ్ఞానాత్మక ప్రశ్నల సంఖ్య తగ్గి అవగాహన, అనువర్తిత సామర్థ్యాలను మదింపు వేసే ప్రశ్నల సంఖ్య పెరిగింది. అందుకే అభ్యర్థులు బట్టీ పద్ధతి కాకుండా భావనల ఆధారంగా భిన్న దృక్కోణాలలో ఆలోచించడం అలవర్చుకోవాలి.
* గతంలో జరిగిన యూజీసీ నెట్‌, వివిధ రాష్ట్రాల సెట్‌ల నుంచి దాదాపు 5% ప్రశ్నలు పునరావృతం అవుతున్నాయి. వాటిని అధ్యయనం చేయడం ముఖ్యం.


ఏపీ సెట్ - 2017 వివరాలు

  • నోటిఫికేషన్
  • ఆన్‌లైన్ అప్లికేష‌న్‌
  • సబ్జెక్టులు
  • పాత ప్రశ్నపత్రాలు
  • నమూనా ప్రశ్నపత్రాలు