టీఎస్ సెట్


‘సెట్‌’లో నిలుద్దాం దీటుగా!

       ఉమ్మడి రాష్ట్రంలో స్టేట్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (సెట్‌)ను నిర్వహించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రస్తుతం తెలంగాణ పరిధిలో ఈ పరీక్షను నిర్వహించటానికి సిద్ధమైంది. అర్హులైన పీజీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
అధ్యాపకులుగా/సహాయక ఆచార్యులుగా నియమితులు కావాలనుకునేవారికి అర్హత కల్పించటానికి ప్రత్యేక పరీక్ష నిర్వహించాలనేది జాతీయ విద్యావిధానం సూచన. ఏకీకృత ప్రమాణాలు నెలకొల్పాలన్న లక్ష్యం అనుసరించి జాతీయస్థాయిలో హ్యుమానిటీస్‌ విభాగాలకు యూజీసీ నెట్‌, సైన్స్‌ విభాగాలకు సీఎస్‌ఐఆర్‌ నెట్‌లను నిర్వహిస్తున్నారు.అయితే ఆంగ్లమాధ్యమంలో ఈ పరీక్షలు జరుగుతుండటం వల్ల మాతృభాషలో చదువుకున్న చాలామంది ప్రావీణ్యం ఉండి కూడా వాటిలో అర్హత సాధించలేకపోతున్నారు. దీన్ని అధిగమించటానికే రాష్ట్రాల స్థాయిలో సెట్‌ నిర్వహణకు యూజీసీ అనుమతించింది. జూనియర్‌ లెక్చరర్లు డిగ్రీ అధ్యాపకులుగా పదోన్నతి పొందాలన్నా కూడా నెట్‌/సెట్‌ అర్హత తప్పనిసరి. పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి కూడా ఈ అర్హత వీలు కల్పిస్తుంది.

దరఖాస్తు ఎలా చేయాలి?
ఆన్‌లైన్‌విధానంలో దరఖాస్తు సమర్పించాల్సివుంటుంది. అధికారిక వెబ్‌సైట్‌ అయిన www.telanganaset.orgలో రిజిస్టర్‌ అయి దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేయాలి. నిర్దేశించిన రుసుమును క్రెడిట్‌ కార్డు/డెబిట్‌ కార్డు/నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా చెల్లించవచ్చు.
టీఎస్‌ సెట్‌లో ప్రతి అభ్యర్థినీ మూడు పేపర్ల ద్వారా పరీక్షిస్తారు. అన్ని పేపర్లలోని ప్రశ్నలనూ బహుళైచ్ఛిక రూపంలో ఇస్తారు. పేపర్‌-1 అయిన టీచింగ్‌ అండ్‌ రిసర్చ్‌ ఆప్టిట్యూడ్‌ అందరికీ ఉమ్మడిగా ఉంటుంది. దీన్ని అన్ని సబ్జెక్టులవారికీ తెలుగు, ఆంగ్ల మాధ్యమంలో ఇస్తారు. పేపర్‌-2, 3లు అభ్యర్థి సబ్జెక్టుకు సంబంధించినవి. కొన్ని సబ్జెక్టుల్లో మాత్రమే తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో ప్రశ్నపత్రాన్ని ఇస్తారు. అవి కామర్స్‌, ఎకనామిక్స్‌, ఎడ్యుకేషన్‌, హిస్టరీ, ఫిలాసఫీ, పొలిటికల్‌ సైన్స్‌, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, సోషియాలజీ, సోషల్‌ వర్క్‌.
* ఆన్‌లైన్‌ దరఖాస్తులు సమర్పించే గడువు: మార్చి 20, 2017
* సెట్‌ నిర్వహణ తేదీ: జూన్‌ 11, 2017

సన్నద్ధత వ్యూహం
పేపర్‌-1 జనరల్‌ పేపర్‌. మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. 60 ప్రశ్నలు ఇస్తారు. అభ్యర్థులు 50 ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు ఇవ్వాల్సివుంటుంది. ఒకవేళ అభ్యర్థి 60 ప్రశ్నలకూ జవాబులు గుర్తిస్తే 1-50 ప్రశ్నలను మాత్రమే మూల్యాంకనానికి పరిగణనలోకి తీసుకుంటారు. 51-60 వరకూ ఉన్న ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించినా అవి అభ్యర్థి స్కోరింగ్‌ కింద జమ కావు.
పేపర్‌-1 సిలబస్‌ 10 యూనిట్లుగా ఉంటుంది. 1) బోధనా సామర్థ్యం 2) పరిశోధన సామర్థ్యం 3) రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ 4) కమ్యూనికేషన్‌ 5) 6) 7) అభ్యర్థి వివేచన, అంకగణిత సామర్థ్యాల పరీక్ష 8) ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ 9) పీపుల్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ 10) హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ పాలిటీ
* గతంలో పేపర్‌-2, 3లను మూల్యాంకనం చేయడానికి ఇందులో అర్హత మార్కులు (40 శాతం) మాత్రం సాధిస్తే సరిపోయేది. కానీ మారిన విధానం ప్రకారం అర్హత నిర్ణయించటంలో మూడు పేపర్లలో సాధించిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటున్నారు. కాబట్టి పేపర్‌-1ను అశ్రద్ధ చేయకూడదు.
* గత నెట్‌/సెట్‌ ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే జ్ఞానాత్మకమైన ప్రశ్నల సంఖ్య తగ్గి, అవగాహన, అనువర్తిత సామర్థ్యాలను మదింపు వేసే ప్రశ్నల సంఖ్య పెరిగిందని అర్థమవుతుంది. అందుకని బట్టీ పట్టే విధానంలో చదవకుండా భావనల ఆధారంగా భిన్న దృక్కోణాల్లో ఆలోచించడం అలవర్చుకోవాలి.
* గతంలో జరిగిన యూజీసీ నెట్‌, ఇతర రాష్ట్రాల సెట్‌ పరీక్షల నుంచే దాదాపు 5 శాతం ప్రశ్నలు పునరావృతం అవుతున్నాయి. వాటినీ అధ్యయనం చేస్తే మేలు.
* ఈ పేపర్లోని 10 యూనిట్లూ వేటికవే ప్రత్యేకమైనవి. సొంతంగా మెటీరియల్‌ సేకరించటానికి సమయం, డబ్బు వృథా అవుతాయి. కాబట్టి మార్కెట్లో ప్రామాణికమైన పుస్తకాన్ని సేకరించుకోవాలి.

పేపర్‌-2, 3లు ఎలా?
పేపర్‌-2లో మొత్తం 100 మార్కులకు 50 ప్రశ్నలు ఇస్తారు. పేపర్‌-3లో 150 మార్కులకు 75 ప్రశ్నలు ఇస్తారు.
పేపర్‌-2లో ప్రశ్నల సరళిని పరిశీలిస్తే... ప్రాథమిక భావనలతో పాటు వివిధ భావనల మధ్య అంతస్సంబంధం, వాస్తవాలు, అవగాహన స్థాయిని అంచనా వేయటానికి ప్రాధాన్యమిస్తున్నారు. పేపర్‌-3లో అభ్యర్థి అవగాహన స్థాయి, అనువర్తిత సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. ఈ రెండు పేపర్ల సిలబస్‌లలోని అంశాల్లో పెద్దగా వైరుధ్యం ఏమీ ఉండదు. కానీ పేపర్‌-3లోని అంశాలు పేపర్‌-2 అంశాలను విస్తరించే స్వభావంతో ఉంటాయి. అందుకే ఈ రెండు పేపర్లకూ సన్నద్ధత వ్యూహం వేర్వేరుగా ఉండకూడదు. మౌలికమైన అంశాల నుంచి లోతైన విషయ అవగాహన వరకూ కొనసాగాలి.
* ఈ పేపర్లలో కూడా గతంలో వచ్చిన ప్రశ్నలు పునరావృతం అవుతున్నాయి. అందుకని పూర్వపు పేపర్ల అధ్యయనం మరవకూడదు.
* ఈ పేపర్ల సిలబస్‌ అంశాలు పీజీ స్థాయిలో ఉంటాయి. మెటీరియల్‌ సేకరణకు కొద్దిపాటి కష్టం తప్పదు. మొత్తం సిలబస్‌ ఏ ఒక్క సంప్రదింపు పుస్తకంలోనో దొరకదు. విశ్వవిద్యాలయ ఆచార్యుల, సీనియర్ల సలహాలూ, సూచనలూ తీసుకుంటే ఈ విషయంలో ఎంతో ఉపయోగకరం.

Posted on 28.2.2017

టీఎస్ సెట్ - 2017 వివరాలు

  • ప్రిప‌రేష‌న్ ప‌ద్ధ‌తి(కామర్స్‌)
  • ప్రిప‌రేష‌న్ ప‌ద్ధ‌తి(ఆర్థిక శాస్త్రం)
  • పాత ప్రశ్నపత్రాలు
  • నోటిఫికేషన్
  • ముఖ్యమైన తేదీలు
  • సిలబస్‌
  • ఆన్‌లైన్ అప్లికేష‌న్