Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 

కేంద్రంలో ఎస్సై కొలువులు... ప్రిప‌రేష‌న్ ఇలా...

 

      మంచి దేహదార్ఢ్యం ఉన్న, ఆరోగ్యవంతులైన యువతీయువకులకు సదవకాశం వచ్చింది... స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ద్వారా! ఈ పోలీసు పోస్టులకు ఎంపికైతే ఆకర్షణీయమైన వేతనాలూ, సదుపాయాలతోపాటు దేశం కోసం పనిచేసే ఆత్మతృప్తి లభిస్తుంది!
దేశంలోని వివిధ పోలీస్‌ శాఖలైన బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (BSF), సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (CISF), సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (CRPF), ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌ (ITBPF), సహస్ర సీమబల్‌ (SSB) శాఖల్లోని సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, CISF శాఖలోని అసిస్టెంట్‌ సబ్‌-ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల భర్తీ జరగబోతోంది.
ఎస్‌ఐ పోస్టుకు సుమారు 40,000; ఏఎస్‌ఐ పోస్టుకు సుమారు 25,000 నెల జీతం వస్తుంది. ఏడో వేతన సవరణ అమలు జరిగితే వారి జీతాలు 18% పెరుగుతాయి.
ఏయే అర్హతలుండాలి?
01-01-2016 నాటికి అభ్యర్థులు 20-25 సంవత్సరాల మధ్య వయసు వారై ఉండాలి.
ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు 5 సం॥, ఓబీసీ వారికి 3 సంవత్సరాలు మినహాయింపు ఉంది. అంగవైకల్యం ఉన్నవారు ఈ పోస్టులకు అర్హులు కారు.
01-01-2016 నాటికి అభ్యర్థులు గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసి ఉండాలి.
గమనిక: సబ్‌ ఇన్‌స్పెక్టర్‌-దిల్లీ పోలీస్‌ పోస్టుకు దరఖాస్తు చేసేవారికి డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాలి. డ్రైవింగ్‌ లైసెన్సు లేని అభ్యర్థులు మిగతా CAPF పోస్టులకు అర్హులు.
* గ్రాడ్యుయేషన్‌ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు అర్హులు కారు.
మహిళలు, SC/ST కేటగిరీ అభ్యర్థులు, Ex-Servicemen ఉచితంగా ఆన్‌లైన్‌ దరఖాస్తు పూర్తి చేయవచ్చు. మిగిలిన కేటగిరీ పురుషులు ఆన్‌లైన్‌లో రూ.100 ఫీజు చెల్లించాలి.
దరఖాస్తులకు ఆఖరు తేదీ: 05-02-2016
పరీక్ష తేదీ (పేపర్‌-1) : 20-03-2016
పరీక్ష తేదీ (పేపర్‌-2) : 05-06-2016
ఎంపిక ప్రక్రియ
అభ్యర్థులు మొదటిగా 20-03-2016న పేపర్‌-1 పరీక్ష రాయాలి. ఇందులో 4 విభాగాలలో కలిపి 200 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయిస్తారు. ఈ ప్రశ్నలను 2 గంటల వ్యవధిలో పూర్తి చేయాలి.
పేపర్‌-1లోని ప్రతి విభాగం నుంచి కనీస అర్హత మార్కులు పొందిన అభ్యర్థులకు PET/PST (ఫిజికల్‌ టెస్ట్‌) పరీక్ష నిర్వహిస్తారు. ఈ విభాగంలో కూడా అర్హులైనవారికి 05-06-2016న పేపర్‌-2 పరీక్ష నిర్వహిస్తారు. అన్ని పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన అభ్యర్థులకు వారి ప్రతిభ ఆధారంగా పోస్టులను కేటాయిస్తారు.
శారీరక సామర్థ్యం:
పురుషులు:
1) 100 మీటర్ల రేస్‌ను 16 సెకన్లలో పూర్తిచేయాలి
2) 1.6 K.M. రేస్‌ను 6.5 నిమిషాల్లో పూర్తిచేయాలి.
3) 3.65 మీటర్ల లాంగ్‌ జంప్‌ పూర్తిచేయాలి (3 అవకాశాల్లో).
4) 1.2 మీటర్ల హైజంప్‌ను 3 అవకాశాల్లో పూర్తిచేయాలి.
5) 4.5 మీటర్ల షాట్‌పుట్‌ (16 LBS)ను 3 అవకాశాల్లో పూర్తిచేయాలి
మహిళా అభ్యర్థులు:
1) 100 మీటర్ల రేస్‌ను 18 సెకన్లలో పూర్తిచేయాలి.
2) 800 మీటర్ల రేస్‌ను 4 నిమిషాల్లో పూర్తిచేయాలి.
3) 2.7 మీటర్ల లాంగ్‌జంప్‌ను 3 అవకాశాల్లో పూర్తిచేయాలి.
4) 0.9 మీటర్ల హైజంప్‌ను 3 అవకాశాల్లో పూర్తి చేయాలి.
కంటిచూపు, నరాల వాపు, దొడ్డికాళ్ళు, పాదాల తీరు మొదలైన మెడికల్‌ పరీక్షలు నిర్వహిస్తారు.
PET/PST లో అర్హులైనవారికి పేపర్‌-2 పరీక్ష నిర్వహిస్తారు.
ఇలా సన్నద్ధం కావాలి
రాత పరీక్షల్లో పేపర్‌-1 200 మార్కులకూ, పేపర్‌-2 200 మార్కులకూ చొప్పున మొత్తం 400 మార్కులకు పరీక్ష జరుగుతుంది. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటాయి. 1/4 రుణాత్మక మార్కులున్నాయి. అందువల్ల తెలిసిన ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు పెట్టాలి.
ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ & కాంప్రహెన్షన్‌ ప్రశ్నలు పేపర్‌-1, పేపర్‌-2లలో ఉన్నాయి. వీటినుంచి మొత్తం 250 మార్కులు వస్తున్నాయి. కీలకమైన విభాగం కావటంవల్ల ఇంగ్లిష్‌పై ప్రత్యేక దృష్టి అవసరం.
పేపర్‌ 1
జనరల్‌ ఇంటలిజెన్స్‌: వెర్బల్‌, నాన్‌వెర్బల్‌ రీజనింగ్‌ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. హై-లెవల్‌ రీజనింగ్‌, క్రిటికల్‌ థింకింగ్‌, సోషల్‌-ఇంటలిజన్స్‌ ప్రశ్నలు వస్తాయి.
సిరీస్‌, అనాలజీ, కోడింగ్‌-డీకోడింగ్‌, ఆడ్‌ మన్‌-అవుట్‌ అంశాల వెర్బల్‌, నాన్‌-వెర్బల్‌ రీజనింగ్‌ ప్రశ్నలను సాధన చేయాలి.
బొమ్మలపై విజువలైజేషన్‌ ప్రశ్నలు, క్లరికల్‌ ఆప్టిట్యూడ్‌, పజిల్స్‌, ఎంబెడెడ్‌ ఫిగర్స్‌, మిర్రర్‌ ఇమేజ్‌, వాటర్‌ ఇమేజ్‌ సింబల్‌ ఆపరేషన్స్‌, ఫిగర్‌ క్లాసిఫికేషన్‌ ప్రశ్నలు వస్తాయి.
హైలెవల్‌ రీజనింగ్‌ అంశాలైన సిల్లాయిజమ్‌, ఇన్‌పుట్‌-అవుట్‌పుట్‌, డెనిషన్‌ మేకింగ్‌, స్టేట్‌మెంట్స్‌-ఎజంప్షన్స్‌, స్టేట్‌మెంట్స్‌-కంక్లూజన్స్‌, ఇన్ఫరెన్సెస్‌ ప్రశ్నలపై పట్టు సాధిస్తే మంచి మార్కులు వస్తాయి.
వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలు, మాదిరి ప్రశ్నపత్రాలు సాధన చేస్తే జనరల్‌ ఇంటలిజెన్స్‌లో అధిక మార్కులు సాధించవచ్చు.
జనరల్‌ ఎవేర్‌నెస్‌: దీనినుంచి 50 ప్రశ్నలు వస్తాయి. 8, 9, 10 తరగతుల్లోని హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ వంటి సోషల్‌స్టడీస్‌ సంబంధిత ప్రశ్నలు వస్తాయి. ఇండియన్‌ హిస్టరీ నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. సైన్స్‌కు సంబంధించి ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ అంశాల ప్రశ్నలు వస్తాయి. వీటికి సంబంధించి వీలైనంత ఎక్కువ సమాచారం చదివి సమాజంపై, పర్యావరణంపై ఎంతమేర అవగాహన ఉందో తెలుసుకునేలా ప్రశ్నలు వస్తాయి.
కరెంట్‌ ఎఫైర్స్‌ నుంచి సైన్స్‌ & టెక్నాలజీ, వాక్సిన్స్‌, కార్పొరేట్‌ కంపెనీల వివరాలు, ఉపగ్రహ ప్రయోగాలు, రక్షణ శాఖలోని ఒప్పందాలు, దేశాలు-ప్రధానులు-రాజధానులు-కరెన్సీ, సమావేశాలు, కేంద్రప్రభుత్వ పథకాలు, జాతీయ-అంతర్జాతీయ విశేషాలకు సంబంధించిన ప్రశ్నలు వస్తాయి.
క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌: నంబర్‌ సిస్టమ్‌, కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాలు, వర్గాలు, వర్గమూలాలు, ఘనాలు, ఘనమూలాలపై పట్టుసాధిస్తే ప్రశ్నలను తక్కువ సమయంలో పూర్తిచేయవచ్చు. సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, భిన్నాలు, ప్రధాన సంఖ్యలపై అవగాహన అవసరం.
అరిథ్‌మెటిక్‌ అంశాలైన శాతాలు, నిష్పత్తి-అనుపాతం, లాభ నష్టాలు, కాలం-పని, కాలం-దూరం, వైశాల్యాలు-ఘనపరిమాణాలు, చక్రవడ్డీ, బారువడ్డీ, క.సా.గు-గ.సా.భా, రైళ్ళు, బోట్ల మీద వచ్చే ప్రశ్నలు సాధన చేయాలి.
గణితం నుంచి సర్డ్స్‌, ఇండిసెస్‌, ఆల్జీబ్రా అంశాలు, త్రికోణమితి, రేఖాగణితం ప్రశ్నలు సాధన చేస్తే మంచి మార్కులు పొందవచ్చు. వీటి సమాచారాన్ని సేకరించి ఫార్ములాలను ఒక పట్టిక రూపంలో తయారుచేసుకుని వీలైనన్ని ఎక్కువసార్లు చదివి గుర్తుంచుకోవాలి. డేటాఎనాలిసిస్‌ ప్రశ్నలపై దృష్టి పెట్టాలి.
ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ &కాంప్రహెన్షన్‌: అన్ని విభాగాల్లో కీలకమైనది ఇంగ్లిష్‌. 400 మార్కుల రాత పరీక్షలో ఇంగ్లిష్‌ విభాగం నుంచి 250 మార్కులు రానున్నాయి.
వ్యాకరణంపై పట్టు సాధించాలి. ఒకాబులరీలో వీలైనన్ని ఎక్కువ పదాలు నేర్చుకోవాలి. Antonyms, Synonyms నేర్చుకోవాలి. సెంటెన్స్‌ కరెక్షన్స్‌, ఎరర్‌ లొకేషన్‌ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించగలిగేలా ఉండాలి. ఇడియమ్స్‌, ఫ్రేజస్‌, సెంటెన్స్‌ కంప్లీషన్‌ ప్రశ్నలు చేయగలగాలి.కాంప్రహెన్షన్‌ పాసేజ్‌పై దృష్టి సారిస్తే అధిక మార్కులు పొందవచ్చు.
ఇంగ్లిష్‌లో మాట్లాడటం, రోజువారీ ఇంగ్లిష్‌ దినపత్రిక చదవడం లాంటివి చేస్తే మంచి ఫలితాలు రాబట్టవచ్చు. ఇంగ్లిష్‌ భాషపై ప్రత్యేక దృష్టి సారిస్తే విజయం సులువుగా దక్కుతుంది.
రాత పరీక్షతోపాటుగా ఫిజికల్‌ టెస్ట్‌లో ఉన్నవాటిని కూడా అభ్యాసం చేస్తే మంచి ఫలితాలు రాబట్టవచ్చు.

posted on 11.01.2016