MTS - Preparation Plan

పదో తరగతి ఉంటే ప్రభుత్వోద్యోగం!

మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ (నాన్‌-టెక్నికల్‌) పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ నుంచి ప్రకటన విడుదలయింది. పదో తరగతి ఉత్తీర్ణత ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు. అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాలలోని పోస్టులను దీని ద్వారా భర్తీ చేస్తారు. తక్కువ విద్యార్హతతోనే కేంద్రప్రభుత్వ ఉద్యోగం పొందటమే కాకుండా గెజిటెడ్‌ పోస్టు వరకూ పదోన్నతులకు వీలున్న పోస్టులివి!

కేంద్రప్రభుత్వ అన్ని శాఖల్లోని గ్రూప్‌-‘సి’ పోస్టులను మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ (ఎంటీఎస్‌) గా పిలుస్తారు. వీరికి నెలవారీ రూ. 20,000 జీతం వస్తుంది. దీనితో పాటు ఇతర సౌకర్యాలు కూడా వర్తిస్తాయి. డిపార్ట్‌మెంటను బట్టి వీరికి పదోన్నతులు ఉంటాయి.
ఎంటీఎస్‌ పాతికేళ్ళ వయసులో ఉద్యోగంలో చేరితే ఉద్యోగ విరమణనాటికి గెజిటెడ్‌ అధికారి పోస్టు వరకూ చేరుకోవచ్చు. ఆదాయపు పన్ను శాఖలోని ఎంటీఎస్‌ ఉద్యోగ విరమణ నాటికి ఇన్‌కంటాక్స్‌ ఆఫీసర్‌ పోస్టుకు చేరవచ్చు. ఏజీ ఆఫీసులోని ఎంటీఎస్‌ ఉద్యోగ విరమణ నాటికి ఆడిట్‌ ఆఫీసర్‌ పోస్టు వరకూ చేరవచ్చు.
ఎస్‌ఎస్‌సీ-ఎంటీఎస్‌ పరీక్షకు తయారయ్యే అభ్యర్థులు ఇదే సన్నద్ధతతో ఎస్‌ఎస్‌సీ నిర్వహించే కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవెల్‌ (CHSL)పరీక్ష కూడా రాయవచ్చు.
వయః పరిమితి, మినహాయింపులు
ఆగస్టు 1, 2017 నాటికి పదో తరగతి పూర్తిచేసిన అభ్యర్థులు ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్‌ రాతపరీక్షకు అర్హులు. అలాగే 01-08-2017 నాటికి 18-25 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి.
SC/STకేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, PHకేటగిరీ అభ్యర్థులకు 10 సంవత్సరాల మినహాయింపు ఉంది.
దరఖాస్తు పూర్తి చేయటానికి ఆఖరు తేదీ: 30-01-2017
రాత పరీక్ష తేదీలు: 16-04-2017, 30-04-2017, 07-05-2017
అర్హతలు కలిగిన అభ్యర్థులు http://ssconline.nic.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ దరఖాస్తు పూర్తిచేసి 100 రూపాయల పరీక్ష ఫీజు చెల్లించాలి.
* మహిళలు, SC/STకేటగిరీ అభ్యర్థులు ఉచితంగా ఈ పరీక్షను రాయవచ్చు. దరఖాస్తు ఆన్‌లైన్‌లో పూర్తి చేయాలి.
పరీక్ష విధానం
అభ్యర్థుల ఎంపిక రెండు పేపర్ల ఆధారంగా జరగనుంది.
(పేపర్‌-1) ఆబ్జెక్టివ్‌ రాత పరీక్ష
(పేపర్‌-2) డిస్క్రిప్టివ్‌ పరీక్ష
పేపర్‌-1ను అభ్యర్థులు రెండు గంటల వ్యవధిలో పూర్తి చేయాలి. 150 ప్రశ్నలు ఉంటాయి.
పేపర్‌-1లోని ప్రశ్నలు ఇంగ్లిష్‌, హిందీ మాధ్యమాలలో ఉంటాయి. 150 ప్రశ్నలకు 150 మార్కులు కేటాయించారు. సరైన సమాధానానికి (1) మార్కు ఇస్తారు. తప్పు సమాధానానికి 0.25 తగ్గిస్తారు.
పేపర్‌-2: డిస్క్రిప్టివ్‌ విధానంలో ఉండే ఈ పరీక్షలో ఎస్సే రైటింగ్‌, లెటర్‌-రైటింగ్‌ ఉంటాయి. 30 నిమిషాల వ్యవధిలో ఈ పరీక్షను పూర్తి చేయాలి. పేపర్‌-2 పరీక్షకు 50 మార్కులు కేటాయించారు.
పేపర్‌-1లో కనీస అర్హత మార్కులు సాధించిన అభ్యర్థులకు మాత్రమే పేపర్‌-2 పరీక్ష నిర్వహిస్తారు. పేపర్‌-2 కేవలం అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో వచ్చే మార్కులను మెరిట్‌ మార్కులుగా పరిగణించరు.
ఇలా సన్నద్ధం కండి! 2
150 ప్రశ్నలు ఉండే పేపర్‌-1 పరీక్షను 2 గంటల వ్యవధిలో పూర్తిచేసే విధంగా తయారీ కొనసాగించాలి.
జనరల్‌ ఇంటలిజన్స్‌: ఈ విభాగంలో 25 ప్రశ్నలు ఉంటాయి. వెర్బల్‌, నాన్‌-వెర్బల్‌ ప్రశ్నలుంటాయి. డెసిషన్‌ మేకింగ్‌, జడ్జిమెంట్‌, ఫిగర్‌ క్లాసిఫికేషన్‌, క్లరికల్‌ ఆప్టిట్యూడ్‌ (అడ్రస్‌ మాచింగ్‌), మిర్రర్‌ ఇమేజ్‌, వాటర్‌ ఇమేజ్‌, ఇన్‌కంప్లీట్‌ ఫిగర్‌, నంబర్‌ పజిల్‌, మాట్రిక్స్‌ ఫిగర్స్‌, బ్లడ్‌ రిలేషన్స్‌, సీటింగ్‌-ఎరేంజ్‌మెంట్‌, డైరెక్షన్స్‌, కోడింగ్‌-డీకోడింగ్‌, నంబర్‌ సిరీస్‌, రాంగ్‌ నంబర్‌ సిరీస్‌, లెటర్‌ సిరీస్‌, ఆడ్‌-మన్‌-అవుట్‌ వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. పదో తరగతి పూర్తిచేసిన అభ్యర్థులు రాయగలిగే ప్రశ్నలులాగానే ఉంటాయి. ఎక్కువ ప్రశ్నలు సాధన చేస్తే ఎక్కువ మార్కులు పొందవచ్చు.
న్యూమరికల్‌ ఆప్టిట్యూడ్‌:
మాథమెటికల్‌ కాలిక్యులేషన్స్‌ నుంచీ, అరిథ్‌మెటిక్‌ అంశాలైన శాతాలు, నిష్పత్తి, సరాసరి, చక్రవడ్డీ, బారు వడ్డీ, లాభనష్టాలు, డిస్కౌంట్‌, డేటా ఎనాలిసిస్‌, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌, వైశాల్యాలు, కాలం-పని, కాలం-దూరం అంశాల నుంచీ ప్రశ్నలు వస్తాయి.
సూక్ష్మీకరణ (సింప్లిఫికేషన్‌) తక్కువ సమయంలో పూర్తి చేసేవిధంగా కొత్త విధానాలు నేర్చుకోవాలి. వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలు సాధన చేస్తే మంచిది.
ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌:
ఈ విభాగంలో గ్రామర్‌కు సంబంధించిన ప్రశ్నలే కాకుండా, రీడింగ్‌ స్కిల్‌తో సమాధానాలు గుర్తించగలిగేలా కూడా ప్రశ్నలు ఉంటాయి. సమాచారం క్షుణ్నంగా అర్థం చేసుకొని అందులోని తత్వం గుర్తించాలి. అవసరమైన విషయాలను మాత్రమే పరిగణనలోకి తీసుకొని సమాధానాలు గుర్తించాలి. ఇంగ్లిష్‌ నుంచి 50 ప్రశ్నలు వస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా సన్నద్ధత సాగించాలి.
జంబుల్డ్‌ సెంటెన్స్‌, క్లోజ్డ్‌ టెస్ట్‌, రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ల నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. అలాగే సెంటెన్స్‌ కరెక్షన్‌, సెంటెన్స్‌ ఎరేంజ్‌మెంట్‌, స్పాటింగ్‌ ఎర్రర్‌; ఒకాబులరీలు కూడా ముఖ్యం. వీటితో పాటు ఫిల్‌ ఇన్‌ ద బ్లాంక్స్‌పై దృష్టి సారిస్తే మంచి ఫలితాలు రాబట్టవచ్చు.
జనరల్‌ ఎవేర్‌నెస్‌:
అభ్యర్థులకు సమాజం చుట్టూ జరుగుతున్న విషయాలు, జాతీయ/అంతర్జాతీయ అంశాలు, భౌగోళిక, శాస్త్రీయ అంశాలపై అవగాహన పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి.
* భారతదేశం స్థితిగతులు, భౌగోళిక అంశాలు
* అంతర్జాతీయ సదస్సులు, వాటి సంబంధాలు
* కేంద్ర ప్రభుత్వ పథకాలు
* వ్యవసాయరంగ సంబంధిత సమాచారం
* రక్షణరంగ వ్యవహారాలు
* క్రీడలు, పుస్తకాలు-రచయితలు
* వార్తలలో ముఖ్య వ్యక్తులు
* శాస్త్రీయ-సాంకేతిక అంశాలు, ఉపగ్రహ ప్రయోగాలు
* టీకాలు, వైరస్‌కు సంబంధించిన అంశాలు
* దేశాలు-రాజధానులు-కరెన్సీ-ప్రధానమంత్రుల వివరాలు
* హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ సంబంధిత ప్రశ్నలు
* సైన్స్‌ అంశాలైన ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ ల నుంచి ప్రశ్నలు వస్తాయి. 50 ప్రశ్నలకు 50 మార్కులు ఉన్నాయి.
పరీక్షలో 1/3వ వంతు ప్రశ్నలు జనరల్‌ ఎవేర్‌నెస్‌ సెక్షన్‌ నుంచి ఉన్నాయి. కాబట్టి ఈ సమాచారం సేకరించి నోట్సు తయారుచేసుకోవాలి. పరీక్షలో రావటానికి అవకాశం ఉన్న ప్రశ్నలపై దృష్టి పెట్టాలి. పాత ప్రశ్నపత్రాలు గమనించి దానికి తగ్గ మెటీరియల్‌ తయారుచేసుకుంటే మంచిది.
పేపర్‌-1తో పాటు పేపర్‌-2 డిస్క్రిప్టివ్‌ పరీక్షకు కూడా ఇప్పటినుంచే తయారీ కొనసాగించాలి. రాత పరీక్షలో వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలు సమాధానాలు గుర్తించేలా సన్నద్ధత సాగిస్తే ఉద్యోగం పొందటం సులభం అవుతుంది. రూ.5,200-రూ.20,200 వేతనం ఉన్న పోస్టు సొంతమవుతుంది.
పరీక్ష కేంద్రాలు
ఆంధ్రప్రదేశ్‌: గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం
తెలంగాణ: హైదరాబాద్‌, నిజామాబాద్‌, వరంగల్‌

posted on 12.01.2017