SSC - Multi Tasking Staff

కొట్టేద్దాం.. కేంద్రం కొలువు!

* టెన్త్‌ ఉత్తీర్ణులకు చక్కటి అవకాశం
* ఎస్‌ఎస్‌సీ - మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ ప్రకటన విడుదల

ఆఫీసు అంటే అన్ని రకాల సిబ్బంది ఉంటారు. ఎవరి పాత్ర మేరకు వాళ్లు ప్రధానమే. అర్హతలను బట్టి ఉద్యోగ స్థాయి మారుతుంది అంతే. కేవలం పదో తరగతి ఉత్తీర్ణతతో కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో కిందిస్థాయి ఉద్యోగాలను స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) భర్తీ చేస్తోంది. దీని కోసం మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ (ఎంటీఎస్‌) పేరుతో ఏటా నోటిఫికేషన్‌ వెలువరిస్తోంది. ఈ సంవత్సరానికి ప్రకటన విడుదలైంది. దాదాపు పదివేల వరకు ఖాళీలు ఉండవచ్చని అంచనా. విజయం సాధిస్తే చిన్న వయసులోనే మంచి ఉద్యోగంలో స్థిరపడొచ్చు. దేశవ్యాప్తంగా ఇరవై లక్షలమందికిపైగా పోటీ పడతారు. తెలుగు రాష్ట్రాల నుంచి రెండు లక్షల మంది పరీక్షకు హాజరయ్యే అవకాశముంది.

కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో రోజువారీ కార్యక్రమాలు సక్రమంగా సాగడానికి సాయపడే గ్రూప్‌-సీ ఉద్యోగులను స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఏటా భర్తీ చేస్తుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు శాఖకు సంబంధించిన సమాచారాన్ని ఫోన్‌లలో అందించడం, ఫైల్స్‌ భద్రపరచడం, లేఖలు తదితర కమ్యూనికేషన్‌ను సంబంధితులకు చేరవేయడం, పోస్టల్‌ వర్క్‌.. ఇలా పలు రకాల విధులను నిర్వహిస్తూ పై అధికారులకు సాయపడుతుంటారు. అందుకే వీరిని మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ అని వ్యవహరిస్తారు.
విద్యార్హతలు: పదోతరగతి తత్సమాన అర్హత ఉన్నవాళ్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 1 ఆగస్టు, 2019 నాటికి పదోతరగతి లేదా తత్సమాన ఉత్తీర్ణత సర్టిఫికెట్‌ పొందగలిగిన వాళ్లు కూడా అప్లై చేసుకోవచ్చు. నెలకు రూ. ఇరవై వేలకు పైగా జీతం అందుతుంది. వయసు 18 నుంచి 25 సంవత్సరాలు ఉండాలి. రూ. 100 ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

రెండు దశల్లో ఎంపిక
అభ్యర్థుల ఎంపిక కోసం రెండు దశల్లో పరీక్షలు జరుగుతాయి. మొదటి దశ రాత పరీక్షలో ఒక పేపర్‌ ఉంటుంది. ప్రశ్నలు ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు చొప్పున 100 మార్కులకు 100 ప్రశ్నలు ఇస్తారు. జనరల్‌ ఇంగ్లిష్‌, జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌, న్యూమరికల్‌ ఆప్టిట్యూడ్‌, జనరల్‌ అవేర్‌నెస్‌ విభాగాల్లో ఒక్కోదాని నుంచి 25 ప్రశ్నలను 25 మార్కులకు ఇస్తారు. ఇంతకు ముందు జనరల్‌ అవేర్‌నెస్‌, జనరల్‌ ఇంగ్లిష్‌ ఒక్కోటి 50 మార్కులకు ఉండేవి. ఇప్పుడు 25కి తగ్గించి అన్ని విభాగాలకు సమ ప్రాధాన్యం ఇచ్చారు.
పరీక్ష కాలవ్యవధి 90 నిమిషాలు. తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికి నాలుగో వంతు (0.25) నెగెటివ్‌ మార్కు ఉంటుంది. జనరల్‌ ఇంగ్లిష్‌లోని ప్రశ్నలు మినహా మిగిలినవన్నీ ఇంగ్లిష్‌, హిందీ మాధ్యమాల్లో ఉంటాయి. పేపర్‌-1లో నిర్ణీత అర్హత మార్కులు పొందితేనే రెండో దశలో డిస్క్రిప్టివ్‌ విధానంలో జరిగే పేపర్‌-2 పరీక్ష రాసేందుకు అభ్యర్థులను అనుమతిస్తారు. ఇది అర్హత పరీక్ష మాత్రమే. పేపర్‌-1లో సాధించిన మెరిట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

పేపర్‌-1లో నాలుగు విభాగాలు
సిబ్బంది ఎంపికలో లింగ సమానత్వాన్ని సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తోంది. మహిళా అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో దరఖాస్తు చేసుకోవాలని ప్రోత్సహిస్తోంది. ఈ నినాదంతోనే ఉద్యోగ ప్రకటన ప్రారంభమవుతుంది.
1) జనరల్‌ ఇంగ్లిష్‌: సరిగా దృష్టిసారించి చక్కటి ప్రణాళికతో సిద్ధమైతే ఇందులో ఎక్కువ మార్కులను తెచ్చుకోవచ్చు. ఇంగ్లిష్‌ అనగానే కంగారు పడాల్సిన పనిలేదు. పదో తరగతి స్థాయి అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని ప్రశ్నపత్రాన్ని రూపొందిస్తారు. ఆంగ్లభాషకు సంబంధించి సాధారణ పరిజ్ఞానాన్ని పరిశీలిస్తారు. పదసంపద, వ్యాకరణం, వాక్య నిర్మాణం, వివిధ పదాలకు అర్థాలు, వ్యతిరేక పదాలు వాటిని ఉపయోగించే విధానంపై ప్రశ్నలు ఉంటాయి. ఫిల్లింగ్‌ ద బ్లాంక్స్‌, ఎర్రర్‌ స్పాటింగ్‌ నుంచి దాదాపు పది వరకు ప్రశ్నలు వస్తున్నాయి. స్పెల్లింగ్‌, సిననిమ్స్‌, యాంటనిమ్స్‌పై ఆరు ప్రశ్నల వరకు అడుగుతున్నారు. ఈ విభాగానికి మార్కులను 50 నుంచి 25కి తగ్గించారు కాబట్టి ఈ ప్రశ్నల సంఖ్య తగ్గవచ్చు. కానీ ప్రాధాన్యం మాత్రం ఉంటుంది. వన్‌ వర్డ్‌ సబ్‌స్టిట్యూషన్‌, ఇడియమ్స్‌ అండ్‌ ఫ్రేజెస్‌, యాక్టివ్‌ వాయిస్‌ అండ్‌ పాసివ్‌ వాయిస్‌, రీడింగ్‌ కాంప్రహెన్షన్‌, సెంటెన్స్‌ అరేంజ్‌మెంట్‌, క్లోజ్‌ టెస్ట్‌ తదితర అన్ని రకాల ప్రశ్నలను ప్రాక్టీస్‌ చేయాలి. పదసంపదపై పట్టు సాధించాలంటే ఆంగ్లదిన పత్రికలను రోజూ చదవాలి. ఆంగ్ల వ్యాకరణం కోసం ఏదైనా ప్రామాణిక గ్రామర్‌ పుస్తకాన్ని అధ్యయనం చేస్తే సరిపోతుంది.
2) జనరల్‌ ఇంటలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌: అభ్యర్థిలోని సాధారణ తార్కిక, విశ్లేషణాత్మక పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా ఇందులో ప్రశ్నలు ఉంటాయి. క్లాసిఫికేషన్‌, అనాలజీ, సిరీస్‌ల నుంచి కనీసం 3 నుంచి 4 ప్రశ్నలు వస్తున్నాయి. ఆరు ప్రశ్నల వరకు నాన్‌-వెర్బల్‌ నుంచి ఇస్తారు. ఇందులో మిర్రర్‌ ఇమేజ్‌, వాటర్‌ ఇమేజ్‌, పేపర్‌ కటింగ్స్‌ తదితరాలకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. క్రిటికల్‌ రీజనింగ్‌లోని డెసిషన్‌ మేకింగ్‌, సిలాజిజమ్‌, కోర్స్‌ ఆఫ్‌ యాక్షన్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు. పోలికలు, భేదాలు, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌, రిలేషన్‌షిప్‌లు, అరిథ్‌మెటికల్‌ నంబర్‌ సిరీస్‌ మొదలైన అంశాలను అభ్యర్థులు సాధన చేయాలి. పాత ప్రశ్నపత్రాలను పరిశీలించి పలు రకాల ప్రశ్నల నమూనాలను తెలుసుకోవాలి. వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్‌ చేయాలి.
3) న్యూమరికల్‌ ఆప్టిట్యూడ్‌: ఇది కూడా పూర్తి 25 మార్కులు సంపాదించుకోగలిగిన విభాగం. ముందుగా సాధారణ అరిథ్‌మెటిక్‌ ఫంక్షన్స్‌ పర్సంటేజెస్‌, ప్రాఫిట్‌ అండ్‌ లాస్‌, రేషియో అండ్‌ ప్రపోర్షన్‌, యావరేజస్‌, ఇంట్రెస్ట్‌ క్యాలిక్యులేషన్‌, డిస్కౌంట్స్‌ తదితరాలను బాగా ప్రాక్టీస్‌ చేయాలి. టేబుల్స్‌-గ్రాఫ్‌ల వినియోగం, మెన్సురేషన్‌, టైమ్‌ అండ్‌ డిస్టెన్స్‌, రేషియో అండ్‌ టైమ్‌, టైమ్‌ అండ్‌ వర్క్‌ ప్రశ్నలను సాధన చేయాలి. ఒక్కో చాప్టర్‌ నుంచి సాధారణంగా రెండు నుంచి ఏడు ప్రశ్నలు వస్తున్నాయి. కేటాయించిన సమయంలో పరిష్కరించగలిగిన స్థాయిలోనే ప్రశ్నలు ఉంటాయి. పాత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. అవసరమైన సూత్రాలన్నింటినీ ఒక పుస్తకంలో రాసుకొని ఎప్పటికప్పుడు గుర్తుచేసుకోవాలి.
4) జనరల్‌ అవేర్‌నెస్‌: ప్రత్యేక అధ్యయనం అవసరం లేకుండా సాధారణ పరిజ్ఞానంతో సమాధానాలు గుర్తించగలిగిన వివిధ అంశాలపై ఈ విభాగంలో ప్రశ్నలు వస్తాయి. దీనికి 25 మార్కులు కేటాయించారు. తమ చుట్టూ ఉన్న పరిస్థితుల పట్ల పరీక్షార్థులు ఎలాంటి అవగాహన కలిగి ఉన్నారో పరిశీలిస్తారు. అక్షరాస్యుడైన అభ్యర్థి నిత్యజీవితంలో ఎదురయ్యే అనేక అంశాలపై ఏవిధమైన శాస్త్రీయ దృక్పథాన్ని కలిగి ఉన్నారో కనుక్కునే ప్రయత్నం చేస్తారు. వీటితోపాటు మనదేశం, మన చుట్టుపక్కల దేశాల్లో జరిగే ముఖ్యమైన సంఘటనలు, స్పోర్ట్స్‌, చరిత్ర, సంస్కృతి, జాగ్రఫీ, ఆర్థిక పరిస్థితులు, జనరల్‌ పాలిటీ, రాజ్యాంగం, తాజా పరిశోధనల గురించి అధ్యయనం చేయాలి. రోజూ దినపత్రికలను చదివి నోట్స్‌ రాసుకోవడం ద్వారా ఇరవై ప్రశ్నల వరకు సమాధానాలు గుర్తించవచ్చు.

విజయానికి ఎనిమిది సూత్రాలు
1. నిపుణుల సలహాలతో ప్రామాణిక స్టడీమెటీరియల్‌ సేకరించుకోవాలి. కనిపించిన ప్రతి సమాచారాన్ని చదువుతూ కూర్చుంటే సమయం వృథా అవుతుంది.
2. సమయాన్ని జాగ్రత్తగా వినియోగించుకోవాలి. టైర్‌-1కి దాదాపు వందరోజుల టైమ్‌ ఉంది. సిలబస్‌ ప్రకారం అన్ని చాప్టర్‌ల అధ్యయం, రివిజన్‌, ఆన్‌లైన్‌ పరీక్షల ప్రాక్టీస్‌కు తగిన సమయాన్ని విభజించి, కేటాయించుకోవాలి.
3. అన్ని విభాగాలకు సమప్రాధాన్యం ఉంది కాబట్టి అన్నింటినీ తప్పనిసరిగా అధ్యయనం చేయాలి. ఇష్టంగా ఉన్నాయని కొన్నింటినే చదవడం, ఇబ్బందిగా అనిపిస్తున్నాయని ఇంకొన్నింటిపై దృష్టిపెట్టకపోడం చేస్తే మార్కులు నష్టపోవాల్సి ఉంటుంది.
4. జనరల్‌ అవేర్‌నెస్‌ కోసం ఆంగ్ల దినపత్రికలను చదవడం మంచిది. వాటి నుంచి పాయింట్స్‌ నోట్‌ చేసుకుంటున్నప్పుడే ఆంగ్ల పదాలపై దృష్టి పెట్టి అర్థాలను, వినియోగాన్ని తెలుసుకోవాలి. దీని వల్ల జనరల్‌ ఇంగ్లిష్‌ ప్రిపరేషన్‌ కూడా అవుతుంది.
5. న్యూమరికల్‌ ఎబిలిటీకి సంబంధించి వీలైనన్ని సంక్షిప్త పద్ధతులను (షార్ట్‌కట్స్‌) నేర్చుకోవాలి. ఎక్కువ ప్రాక్టీస్‌ చేయాలి. గణిత సూత్రాలను తరచూ మననం చేసుకోవాలి.
6. గత పరీక్షల ప్రశ్నపత్రాలను పరిశీలించి ప్రశ్నల సరళిని గ్రహించాలి. అవసరమైన నైపుణ్యాలను పెంచుకోవాలి.
7. ఆన్‌లైన్‌ పరీక్షలను, మోడల్‌ పేపర్లను ఎక్కువగా ప్రాక్టీస్‌ చేయాలి. ఎక్కడెక్కడ తప్పులు జరుగుతున్నాయో గమనించి ప్రిపరేషన్‌లో మార్పులు చేసుకోవాలి.
8. టైర్‌-2 పరీక్షకు ముందు నుంచే సిద్ధం కావాలి. టైర్‌-1 పూర్తయిన తర్వాత ప్రిపేర్‌ అవడానికి సమయం సరిపోదు. డిస్క్రిప్టివ్‌ కాబట్టి రైటింగ్‌ ప్రాక్టీస్‌ చేయాలి. తెలిసిందే కదా పరీక్షలో రాసేద్దాం అని నిర్లక్ష్యం చేస్తే తడబడే అవకాశం ఉంది.

ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 29, మే 2019
ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపు గడువు: 31, మే 2019
టైర్‌-1 ఆన్‌లైన్‌ పరీక్షతేదీలు: 02 ఆగస్టు, 2019 నుంచి 06 సెప్టెంబరు, 2019
టైర్‌-2 డిస్క్రిప్టివ్‌ పరీక్ష: 17 నవంబరు, 2019
వెబ్‌సైట్‌: https://ssc.nic.in/

పేపర్‌-2 వ్యక్తీకరణ పరీక్ష
అర్హత పరీక్ష అయినప్పటికీ పేపర్‌-2కి కూడా ముందు నుంచే ప్రిపేర్‌ కావాల్సి ఉంటుంది. ఇంగ్లిష్‌, హిందీ, తెలుగు భాషల్లో జవాబులు రాయవచ్చు. ఎంచుకున్న భాషలో అభ్యర్థుల సాధారణ వ్యక్తీకరణ, రాత నైపుణ్యాలను ఇందులో పరిశీలిస్తారు. 50 మార్కులు కేటాయించారు. 30 నిమిషాల సమయం ఇస్తారు. ఆ వ్యవధిలో రాయగలిగిన ప్రశ్నలనే అడుగుతారు. అభ్యర్థులు తడబడి సమయాన్ని వృథా చేసుకోకూడదు. ముందు నుంచే రాత ప్రాక్టీస్‌ చేస్తే ఎలాంటి ఆందోళన లేకుండా సమాధానాలు రాయవచ్చు. ప్రధానంగా ఎస్సే, లెటర్‌ రైటింగ్‌పై ప్రశ్నలు ఉంటాయి. ప్రెస్సీ, అప్లికేషన్‌ రైటింగ్‌ తదితరాలపై కూడా ప్రిపేర్‌ కావాలి. అక్షరదోషాలు, పద ప్రయోగాల్లో తప్పులు లేకుండా చూసుకోవాలి. వాక్య నిర్మాణం, విరామ చిహ్నాల వినియోగంపై శ్రద్ధ వహించాలి. ఆంగ్లంలో జవాబులు రాస్తే క్యాపిటల్‌, స్మాల్‌ లెటర్లను ఉపయోగించడంపై కూడా అవగాహన కలిగి ఉండాలి. పెద్ద పేరాల్లో ఉన్న విషయాన్ని కుదించి సొంత వాక్యాల్లో రాయడాన్ని అభ్యసించాలి.

ప్రీవియస్‌ పేపర్లు ప్రాక్టీస్‌ చేయాలి
ముందుగా అన్ని సబ్జెక్టుల బేసిక్స్‌పై పట్టు సాధించాలి. రీజనింగ్‌, న్యూమరికల్‌ ఎబిలిటీ స్కోరింగ్‌ విభాగాలు. వాటిలో పూర్తిమార్కులు సాధించడంపై దృష్టిపెట్టాలి. మొదట తేలిక ప్రశ్నలను సాధన చేసి మెల్లగా క్లిష్టమైన వాటిని పరిష్కరించాలి. ఆగస్టులో పరీక్ష కాబట్టి జూన్‌ మొదటి వారానికి ప్రిపరేషన్‌ ముగించి ప్రీవియస్‌ పేపర్లు బాగా ప్రాక్టీస్‌ చేయాలి. ఎక్కువ మోడల్‌ పేపర్లు కూడా చేయాలి. ఎంటీఎస్‌ పేపర్లతోపాటు ఎస్‌ఎస్‌సీ నిర్వహించే ఇతర పరీక్షల పేపర్లను పరిశీలించాలి. పోటీ ఎక్కువ ఉంది కాబట్టి అడ్వాన్స్‌డ్‌ లెవెల్‌ ప్రశ్నలు చేయడం మంచిది. పేపర్ల ప్రాక్టీస్‌లో పరీక్ష సమయం కంటే కొద్దిగా తక్కువ టైమ్‌ పెట్టుకొని చేయాలి. అప్పుడు స్పీడ్‌ పెరుగుతుంది. జనరల్‌ అవేర్‌నెస్‌కు గ్రూప్‌ ప్రిపరేషన్‌ ఉపయోగపడుతుంది. పేపర్‌-2 కోసం ముందు నుంచే ప్రిపేర్‌ కావాలి. హిందూ పేపర్‌ చదవడం వల్ల జనరల్‌ అవేర్‌నెస్‌తోపాటు ఇంగ్లిష్‌పై కొంత అవగాహన పెరుగుతుంది. ఇది డిస్క్రిప్టివ్‌ పరీక్షకు ఉపయోగకరం.
- కె. వెంకటస్వామి (ఎంటీఎస్‌ సాధించి ప్రస్తుతం ఇన్‌కంటాక్స్‌ డిపార్ట్‌మెంట్‌లో చేస్తున్నారు)

Posted on 23.04.2019