SSC > SI, ASI's - Preparation Plan

భద్రతా దళంలో ఎ‘స్సై’ అంటారా?

* ఎస్‌ఐ, ఏఎస్‌ఐల నియామకానికి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ నోటిఫికేషన్‌

భద్రతా దళాల్లో కొలువంటే... దేశ ప్రజల రక్షణలో పాలుపంచుకున్నట్టే! వీటిలో ఎస్‌ఐ, ఏఎస్‌ఐ పోస్టుల భర్తీకి తాజాగా స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ నుంచి నియామక ప్రకటన విడుదలైంది. ఆకర్షణీయమైన జీతభత్యాలతో పాటు ఎనలేని ఉద్యోగ సంతృప్తి లభించే ఈ పోస్టులకు ఎంపికవ్వాలంటే.. రాతపరీక్షతో పాటు వివిధ పరీక్షల్లో నెగ్గాల్సివుంటుంది. సాహస ప్రవృత్తీ, ఉత్సాహం పొంగిపొరలే పాతికేళ్లలోపు వయసున్న గ్రాడ్యుయేట్లకు ఇదో బంగారు అవకాశం. దరఖాస్తు చేసుకుని, సమగ్ర సన్నద్ధతపై దృష్టిపెట్టటానికి ఇదే తరుణం!

కేంద్ర భద్రతాదళాలైన బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, సీఆర్పీఎఫ్‌, ఐటీబీపీఎఫ్‌, ఎస్‌ఎస్‌బీల్లో ఎస్‌ఐ పోస్టులతోపాటు సీఐఎస్‌ఎఫ్‌లో ఏఎస్‌ఐ, దిల్లీ పోలీస్‌ విభాగంలో ఎస్‌ఐ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. రాతపరీక్ష, పీఈటీ, పర్సనాలిటీ టెస్టు, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఎంపికైనవారు పోస్టును బట్టి దిల్లీలో/ దేశసరిహద్దుల్లో పనిచేయాలి. విమానాశ్రయాలు, నౌకాశ్రయాల్లో పనిచేయాలి. స్మగ్లింగ్‌, చొరబాట్లను నియంత్రించాలి. టెర్రరిజం, నక్సలిజం దేశంలో వ్యాపించకుండా వారి చొరబాట్లు నియంత్రించాలి. పౌరుల రక్షణే ప్రథమ ధ్యేయంగా పనిచేయాలి.

విజయవంతంగా శిక్షణ ముగించుకుని, విధుల్లో చేరిన సబ్‌ ఇన్‌స్పెక్టర్లకు రూ.35,400 మూల వేతనం లభిస్తుంది. ఇవి గ్రూప్‌-బి నాన్‌ గెజిటెడ్‌ పోస్టులు. అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్లకు రూ.29,200 మూలవేతనం అందుతుంది. ఇవి గ్రూప్‌-సి నాన్‌ గెజిటెడ్‌ పోస్టులు. డీఏ, హెచ్‌ఆర్‌ఏ, అలవెన్సులు కలుపుకుని ఎస్‌ఐలు రూ. 52,000; ఏఎస్‌ఐలు రూ. 45,000 ప్రారంభ గరిష్ఠ వేతనాలు పొందవచ్ఛు ఎస్‌ఐగా చేరినవారు 10-15 ఏళ్ల సర్వీస్‌తో ఇన్‌స్పెక్టర్‌ హోదాకు చేరుకోవచ్ఛు అనుభవం, ప్రతిభ ప్రాతిపదికన అసిస్టెంట్‌ కమాండెంట్‌, డిప్యూటీ కమాండెంట్‌, కమాండెంట్‌, సీనియర్‌ కమాండెంట్‌ స్థాయి వరకూ వెళ్లవచ్ఛు

రాతపరీక్ష ఎలా ఉంటుంది?
ప్రతి ప్రశ్నకూ మార్కు చొప్పున 200 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. జనరల్‌ ఇంటలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌, జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ జనరల్‌ అవేర్‌నెస్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌ ఒక్కో విభాగం నుంచి 50 చొప్పున ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి 2 గంటలు. సెక్షన్లవారీ కటాఫ్‌లుంటాయి. పేపర్‌ -1లో అర్హత సాధిస్తే పీఈటీ నిర్వహిస్తారు. అందులోనూ అర్హత సాధిస్తే పేపర్‌ 2 రాసే అవకాశమిస్తారు. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌ నుంచి 200 మార్కులకు పేపర్‌-2 ఉంటుంది. పరీక్ష వ్యవధి 2 గంటలు.

రెండు పేపర్లలోనూ రుణాత్మక మార్కులున్నాయి. ప్రతి తప్పు సమాధానానికీ పావు మార్కు చొప్పున తగ్గిస్తారు. పరీక్షలో అర్హత సాధించడానికి రెండు పేపర్లలోనూ విడిగా జనరల్‌ అభ్యర్థులు 30 శాతం, ఓబీసీ, ఈబీసీలు 25 శాతం, ఎస్సీ, ఎస్టీలు 20 శాతం మార్కులు సాధించాలి. పేపర్‌-1, 2 రెండింటి మార్కులు కలిపి మెరిట్‌, రిజర్వేషన్‌ ప్రకారం అర్హులకు వైద్య పరీక్షలు నిర్వహించి శిక్షణకు తీసుకుంటారు.

ఇవి గమనించండి!
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత
వయసు: జనవరి 1, 2020 నాటికి 25 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి.
శారీరక ప్రమాణాలు: ఎత్తు పురుషులు 170, మహిళలు 157 సెం.మీ. ఉండాలి. ఎస్టీ పురుషులు 162.5, మహిళలు 154 సెం.మీ. ఉంటే సరిపోతుంది. ఊపిరి పీల్చిన తర్వాత కనీసం 80 సెం.మీ, పీల్చక ముందు 75 సెం.మీ. ఛాతీ విస్తీర్ణం పురుషులకు ఉండాలి (ఊపిరి పీల్చక ముందు, పీల్చిన తర్వాత కనీస వ్యత్యాసం 5 సెం.మీ. ఉండాలి)
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబరు 16
పేపర్‌-1 పరీక్ష: డిసెంబరు 11,12,13 తేదీల్లో షిఫ్ట్‌లవారీ ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు.
పేపర్‌-2 పరీక్ష తేదీ: తర్వాత ప్రకటిస్తారు.
ఖాళీల వివరాలు: తర్వాత లభిస్తాయి
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, వరంగల్‌, గుంటూరు, కర్నూలు, రాజమహేంద్రవరం, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ
వెబ్‌సైట్‌: https://ssc.nic.in/

రిఫరెన్స్‌ పుస్తకాలు
ఒక్కో విభాగం నుంచి ఒక పుస్తకాన్ని బాగా చదువుకుంటే సరిపోతుంది. ఉన్న సమయంలో ఎక్కువ పుస్తకాల అధ్యయనం సాధ్యం కాదు. అందువల్ల అభిరుచుల మేరకు ఏ పబ్లిషర్‌ పుస్తకాన్నైనా ఎంచుకోవచ్ఛు
ఆబ్జెక్టివ్‌ ఇంగ్లిష్‌: టాటా మెక్‌ గ్రాహిల్స్‌ లేదా చాంద్‌ పబ్లికేషన్స్‌
క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ ఫర్‌ కాంపిటీటివ్‌ ఎగ్జామ్స్‌: ఆర్‌.ఎస్‌. అగర్వాల్‌
జనరల్‌ నాలెడ్జ్‌: లూసెంట్స్‌ జీకే

మాక్‌ టెస్టులు చాలా ముఖ్యం
* పాత ప్రశ్నపత్రాలను పరిశీలించి, అభ్యాసం చేయాలి. దీనిద్వారా ప్రశ్నల స్థాయి, సన్నద్ధత ఎలా ఉందో తెలుసుకోవచ్ఛు
* పరీక్షలకు 20 రోజుల ముందు నుంచీ వీలైనన్ని (కనీసం పది) మాక్‌ పరీక్షలు రాయాలి. వీటిద్వారా ఏ విభాగాల్లో వెనుక బడ్డారో తెలుస్తుంది. ఉన్న సమయాన్ని అలాంటివాటికి వెచ్చించాలి.
* సెక్షన్లవారీ కటాఫ్‌లు ఉన్నాయి. కాబట్టి ప్రతి విభాగంలోనూ కనీస మార్కులు సాధిస్తేనే రెండో దశకు చేరుకోవడం వీలవుతుంది.
* పేపర్‌-2 మొత్తం ఆంగ్లం విభాగం నుంచే ఉంటుంది. అందువల్ల దీనికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చి చదవాలి. అందులో సాధించిన మార్కులు విజయంలో కీలకమవుతాయి.
* పరీక్షకు వ్యవధి తక్కువగా ఉంది. కాబట్టి ఉన్న సమయాన్ని పేపర్‌-1లో అర్హత సాధించడంపైనే పూర్తి దష్టి సారించాలి. పేపర్‌-1 పరీక్ష తర్వాత పీఈటీ, పేపర్‌-2 సన్నద్ధత ప్రారంభించాలి.
* క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ విభాగంలో ఎక్కువ మార్కులకు వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేయాలి. దీనిద్వారా వేగంగా గణించడం అలవడుతుంది.
* వర్తమాన వ్యవహారాలకు సంబంధించి ఏప్రిల్‌ 2019 నుంచి వివిధ రంగాల్లో జాతీయంగా, అంతర్జాతీయంగా జరుగుతోన్న ముఖ్య పరిణామాలపై దృష్టి సారించాలి. ఈ విభాగంలో అవార్డులు, పురస్కారాలు; వార్తల్లో వ్యక్తులు, నియామకాలు, పుస్తకాలు-రచయితలు, తాజా పరిశోధనలు వీటిని బాగా చదువుకోవాలి. చదువుతున్నప్పుడే ముఖ్యమైనవాటిని నోట్సు రాసుకుంటే పునశ్చరణ తేలికవుతుంది.

సన్నద్ధత ఎలా?
ఇంగ్లిష్‌: ఈ విభాగాన్ని కీలకంగా పరిగణించాలి. మొదటి పేపర్‌లో 50 మార్కులు, రెండో పేపర్‌లో 200 మార్కులున్నాయి. ప్రశ్నల స్థాయి సాధారణంగానే ఉంటుంది. టెన్సెస్‌, వాయిస్‌, ఆర్టికల్‌, ప్రిపొజిషన్స్‌, యాంటనిమ్స్‌, సిననిమ్స్‌, ఫిల్‌ ఇన్‌ ద బ్లాంక్స్‌, సెంటెన్స్‌ ఎరేంజ్‌మెంట్‌, సెంటెన్స్‌ కరక్షన్‌ ప్రశ్నలు చేయగలిగితే 50 శాతం ప్రశ్నలకు సమాధానం చేయవచ్ఛు ఇంగ్లిష్‌ భాష మీద పట్టు రావాలంటే, మొదటిగా అభ్యర్థులకు గ్రామర్‌ తెలిసి ఉండాలి. కాంప్రహెన్షన్‌, క్లోజ్‌ టెస్ట్‌లోని ప్రశ్నలు కీలకం. తక్కువ సమయంలో పారాగ్రాఫ్‌లోని సమాచారం చదివి, దాని ఆధారంగా సమాధానాలు గుర్తించాలి.

జనరల్‌ ఇంటలిజన్స్‌ అండ్‌ రీజనింగ్‌: దీని నుంచి మొదటి పేపర్‌లో 50 ప్రశ్నలు ఉంటాయి. కనీసం 35 ప్రశ్నలు ఈ విభాగం నుంచి తెచ్చుకోవచ్ఛు నంబర్‌ సిరీస్‌, లెటర్‌ సిరీస్‌, కోడింగ్‌- డీకోడింగ్‌, రక్తసంబంధాలు, క్యాలెండర్‌, అనాలజీ, ఆడ్‌మన్‌ అవుట్‌, సీటింగ్‌ ఎరేంజ్‌మెంట్‌ అన్నిటికంటే సులభమైన ప్రశ్నలు. ఇవి చదివిన తర్వాత పజిల్స్‌, హైలెవల్‌ రీజనింగ్‌, స్టేట్‌మెంట్‌ అజంప్షన్‌, క్రిటికల్‌ రీజనింగ్‌ ప్రశ్నలు పూర్తి చేయాలి. మెటీరియల్‌ అభ్యాసం పూర్తిచేసి లాజిక్‌లు నోట్సుగా రాసుకుంటే, పరీక్షకు ముందు రివిజన్‌ తొందరగా చేయవచ్ఛు

జనరల్‌ నాలెడ్జ్‌- జనరల్‌ అవేర్‌నెస్‌: దీన్ని రెండు భాగాలుగా విభజించాలి. మొదటిది గతంలో జరిగిన విషయాలు, కచ్చితమైన సమాచారం ఉండి, ఆన్సర్‌ మారని చరిత్ర, భౌగోళిక, సాంఘిక, ఆర్థిక శాస్త్రాల్లోని ప్రశ్నలివి. వీటి నుంచి 20 ప్రశ్నల వరకు ఉంటాయి. మిగిలిన ప్రశ్నలు వర్తమాన అంశాల నుంచి వస్తాయి. పరీక్షకు నాలుగునెలల ముందు వార్తల్లో ఉన్న అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.

క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌: ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగొనామెట్రీ, వైశాల్యాలు, ఘనపరిమాణాలు వంటి విభాగాల్లోని ప్రశ్నలు ఫార్ములా ఆధారంగా వస్తాయి. కాబట్టి వాటికి సంబంధించిన అన్ని ఫార్ములాలను ఒక పట్టిక రూపంలో రాసుకుని, ప్రతి విభాగంలో కనీసం 100 నుంచి 150 ప్రశ్నలు సాధన చేయాలి. దైనందిన జీవితంలో భాగంగా ఉండే శాతాలు, నిష్పత్తి, లాభనష్టాలు, వడ్డీ, కాలం-దూరం, కాలం-పని, సరాసరి మొదలైనవి సులువుగానే చేయవచ్ఛు డేటా అనాలిసిస్‌ ప్రశ్నలు బాగా సాధన చేస్తే 5 నుంచి 10 మార్కులు వస్తాయి.

- సుధీర్‌ చక్రవర్తి చాగంటి

Posted on 23.09.2019


సాయుధ దళాల్లో ఎస్సై, ఏఎస్సై పోస్టులు

బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఐటీబీపీఎఫ్, ఎస్ఎస్‌బీల్లో ఎస్సై పోస్టులతోపాటు సీఐఎస్ఎఫ్‌లో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్ట‌ర్‌, దిల్లీ పోలీస్ విభాగంలో ఎస్సై పోస్టుల ఉమ్మడి భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్సెస్సీ) ప్రకటన విడుదల చేసింది. డిగ్రీ ఉత్తీర్ణ‌త‌తోపాటు 25 ఏళ్ల‌లోపు వ‌య‌సువారు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ప‌రీక్ష‌, ఫిజిక‌ల్ ఎఫిషియ‌న్సీ టెస్టు, ప‌ర్స‌నాలిటీ టెస్టు, మెడిక‌ల్ ఎగ్జామినేష‌న్ ద్వారా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. ఎస్సై పోస్టుల‌కు ఎంపికైన‌వారికి రూ.35,400 మూల‌వేత‌నం అందుతుంది. ఏఎస్సై ల‌కు రూ.29,200 చెల్లిస్తారు. దీంతోపాటు డీఏ, హెచ్ఆర్ఏ, ఇతర ఆలవెన్సులు లభిస్తాయి. ఎస్సై పోస్టులకు ఎంపికైనవారు మొదటి నెల నుంచే కనీసం రూ.50వేలు వేతనంగా అందుకోవచ్చు.

ప‌రీక్ష ఇలా:
జ‌న‌ర‌ల్ ఇంటెలిజెన్స్ అండ్‌ రీజ‌రింగ్‌, జ‌న‌ర‌ల్ నాలెడ్జ్ అండ్ జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్‌, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌, ఇంగ్లిష్ కాంప్ర‌హెన్ష‌న్‌ ఒక్కో విభాగం నుంచి 50 చొప్పున ప్ర‌శ్న‌లు వ‌స్తాయి. ప్ర‌తి ప్ర‌శ్న‌కు ఒక మార్కు చొప్పున 200 మార్కుల‌కు ప్ర‌శ్న‌ప‌త్రం ఉంటుంది. పరీక్ష వ్యవధి 2 గంటలు. ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్ర‌హెన్ష‌న్ నుంచి 200 మార్కుల‌కు పేప‌ర్‌-2 ఉంటుంది. పరీక్ష వ్యవధి 2 గంటలు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 200 ప్రశ్నలు వస్తాయి. పేపర్ 1లో అర్హత సాధించిన వారికి పీఈటీ నిర్వహిస్తారు. అందులోనూ అర్హత సాధిస్తే పేపర్ 2 రాయడానికి అవకాశమిస్తారు. పేపర్-1లో సెక్షన్లవారీ కటాఫ్ లు ఉంటాయి. రెండు పేపర్లలోనూ రుణాత్మక మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పు సమాధానానికీ పావు మార్కు చొప్పున తగ్గిస్తారు. పరీక్షలో అర్హత సాధించడానికి రెండు పేపర్లలోనూ విడిగా జనరల్ అభ్యర్థులు 30 శాతం, ఓబీసీ, ఈబీసీలు 25 శాతం, ఎస్సీ, ఎస్టీలు 20 శాతం మార్కులు సాధించాలి. పేపర్-1, 2 రెండింటిలోనూ వచ్చిన మార్కులు కలిపి మెరిట్, రిజర్వేషన్ ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించి శిక్షణకు తీసుకుంటారు.

పీఈటీ:
పురుషులు వంద మీట‌ర్ల దూరాన్ని 16, మ‌హిళ‌లు 18 సెకెన్ల‌లో చేరుకోవాలి. 1.6 కి.మీ. ప‌రుగును పురుషులు 6.5 నిమిషాల్లో, 800 మీట‌ర్లను మ‌హిళ‌లు 4 నిమిషాల్లో పూర్తిచేయాలి. లాంగ్‌జంప్‌లో పురుషులు 3 ప్ర‌య‌త్నాల్లో ఒక్క‌సారైనా 3.65 మీట‌ర్ల దూరంలో దూకాలి. అదే మ‌హిళ‌లైతే 3 ప్ర‌య‌త్నాల్లో 2.7 మీట‌ర్ల దూరం గెంతాలి. హైజంప్‌లో పురుషులు 1.2 మీట‌ర్ల ఎత్తుకు 3 ప్ర‌య‌త్నాల్లో ఎగ‌రాలి. మ‌హిళ‌లు 0.9 మీట‌ర్ల ఎత్తుకు ఎగ‌రాలి. షాట్‌పుట్ పురుషుల‌కు మాత్ర‌మే ఉంటుంది. 3 ప్ర‌య‌త్నాల్లో 16ఎల్‌బీఎస్ గుండును 4.5 మీ దూరానికి విస‌రాలి. పీఈటీకి మార్కులు లేవు. అయితే వీటన్నింటినీ విజయవంతంగా పూర్తిచేస్తేనే అర్హులగా పరిగణిస్తారు.

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత
వయసు: జనవరి 1, 2020 నాటికి 25 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి ఎత్తు పురుషులు 170, మహిళలు 157 సెం.మీ. ఉండాలి. ఎస్టీ పురుషులు 162.5, మహిళలు 154 సెం.మీ. ఉంటే సరిపోతుంది. ఊపిరి పీల్చిన తర్వాత కనీసం 80 సెం.మీ, పీల్చక ముందు 75 సెం.మీ. ఛాతీ విస్తీర్ణం పురుషులకు ఉండాలి.
ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబరు 16 సాయంత్రం 5 గంటలు
పేపర్-1 పరీక్ష: డిసెంబరు 11,12,13 తేదీల్లో నిర్వహిస్తారు.
పేపర్-2 పరీక్ష తేదీ: తర్వాత ప్రకటిస్తారు.
ఖాళీల వివరాలు: తర్వాత లభిస్తాయి
పరీక్ష కేంద్రాలు హైదరాబాద్, వరంగల్, గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ
వెబ్ సైట్: https://ssc.nic.in/