Stenographers - Preparation Plan

ఇంటర్‌తో స్టెనోగ్రాఫ‌ర్ ఉద్యోగం

- ప్రక‌ట‌న విడుద‌ల‌చేసిన ఎస్సెస్సీ

ఇంటర్మీడియట్‌ విద్యార్హతలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి అవ‌కాశం క‌ల్పిస్తోంది స్టాఫ్ సెల‌క్షన్ క‌మిష‌న్ (ఎస్సెస్సీ) నిర్వహించే గ్రేడ్ సి, గ్రేడ్ డి స్టెనోగ్రాఫ‌ర్ పోస్టు. ఈ ఉద్యోగాల‌ భ‌ర్తీకి ముందుగా జాతీయ స్థాయిలో ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహిస్తారు. అందులో అర్హత సాధించిన అభ్యర్థులకు రెండో దశలో స్కిల్‌ టెస్ట్‌ (స్టెనోగ్రఫీ టెస్ట్‌) ఉంటుంది. ఈ ప‌రీక్షలోనూ నెగ్గితే కేంద్ర కొలువు ఖాయ‌మ‌వుతుంది. ప్రక‌ట‌న‌కు సంబంధించి పూర్తి స‌మాచారం తెలుసుకుందాం.

ఖాళీల వివ‌రాల‌ను త‌ర్వాత ప్రక‌టిస్తారు. గ్రేడ్ సి పోస్టులు గ్రూప్ - బి నాన్ గెజిటెడ్ కింద‌కి వ‌స్తాయి. గ్రేడ్ డి పోస్టులు గ్రూప్ - సి నాన్ గెజిటెడ్ ప‌రిధిలోకి వెళ్తాయి. ఉద్యోగాల‌కు ఎంపికైన‌వాళ్లు కేంద్ర మంత్రిత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ కార్యాల‌యాలతోపాటు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న కేంద్రానికి చెందిన స‌బార్డినేట్ ఆఫీసుల్లో విధులు నిర్వర్తిస్తారు. ఉద్యోగంలో చేరిన‌వారికి ప్రారంభంలో రూ. 20,000 వ‌ర‌కు నెల జీతంతో పాటు ఇతర సౌకర్యాలు లభిస్తాయి. పదోన్నతుల ద్వారా గెజిటెడ్‌ పోస్టుకు చేరుకునే అవకాశం ఉంది.

ప‌రీక్ష ఇలా..
200 ప్రశ్నలను 2 గంటల వ్యవధిలో పూర్తిచేయాలి. 200 ప్రశ్నలను 3 విభాగాలుగా విభజించారు. జ‌న‌ర‌ల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజ‌నింగ్‌లో 50 ప్రశ్నలకు 50 మార్కులు, జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్ 50 ప్రశ్నల‌కు 50 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ 100 ప్రశ్నల‌కు 100 మార్కులు కేటాయించారు. సరైన సమాధానానికి 1 మార్కు, తప్పు సమాధానానికి 0.25 రుణాత్మక మార్కులు.

స్కిల్‌ టెస్ట్‌:
స్కిల్ టెస్టులో భాగంగా అభ్యర్థులు హిందీ, ఇంగ్లిష్‌లో ఏదో ఒక భాష‌ను ఎంచుకోవాలి. ఏదైనా అంశంలో ప‌ది నిమిషాల పాటు ఈ భాష‌ల్లో డిక్టేష‌న్ ఉంటుంది. స్టెనోగ్రాఫ‌ర్ గ్రేడ్‌-సికి నిమిషానికి వంద పదాలు, గ్రేడ్‌-డికి నిమిషానికి 80 ప‌దాలు చొప్పున డిక్టేట్ చేస్తారు. ఈ పదాల‌ను స్టెనోగ్రఫీ విధానంలో రాసుకుని అనంత‌రం కంప్యూట‌ర్‌పై టైప్ చేయాల్సి ఉంటుంది. గ్రేడ్‌-డి అభ్యర్థుల‌కు ఇంగ్లిష్‌లో సంబంధిత స్టెనోగ్రఫీ స‌మాచారాన్ని టైప్ చేయ‌డానికి 50 నిమిషాలు అదే హిందీలో అయితే 65 నిమిషాలు కేటాయించారు. గ్రేడ్‌-సికి ద‌ర‌ఖాస్తు చేసుకున్నవారు ఇంగ్లిష్‌లో 40 నిమిషాలు హిందీలో అయితే 55 నిమిషాల్లో టైప్ చేయాలి.

స్కిల్ టెస్టు అర్హత ప‌రీక్ష మాత్రమే. తుది నియామ‌కాలు ఆన్‌లైన్ ప‌రీక్షలో సాధించిన మార్కులు ద్వారా చేప‌డ‌తారు.

సిద్ధమ‌వ్వండిలా...
జనరల్‌ ఇంటలిజన్స్‌ & రీజనింగ్‌: ప్రశ్నల స్థాయి తేలికగా ఉంటుంది. ప్రశ్నలో ఉన్న సమాచారం ఆధారంగా విశ్లేషణతో వాస్తవికతకు దగ్గరగా ఉండేలా సమాధానాలు గుర్తించాలి. వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేస్తే మంచి ఫలితం వస్తుంది.
లాజికల్‌ రీజనింగ్‌ అంశాలలో నంబర్‌ సిరీస్‌, రాంగ్‌-నంబర్‌ సిరీస్‌, నంబర్‌ అనాలజీ, లెటర్‌ అనాలజీ, ఆడ్‌-మన్‌-అవుట్‌, కోడింగ్‌-డీకోడింగ్‌, రక్త-సంబంధాలు, డైరెక్షన్స్‌ అంశాలను నేర్చుకుని వీలైనంత ఎక్కువ ప్రశ్నలు అభ్యాసం చేయాలి. బొమ్మల మీద వచ్చే ప్రశ్నలైన నాన్‌ వెర్బల్‌ రీజనింగ్‌, మిర్రర్‌ - ఇమేజ్‌, వాటర్‌- ఇమేజ్‌, పేపర్‌ ఫోల్టింగ్‌ & కటింగ్‌, ఎంబెడెడ్‌ ఫిగర్స్‌, మాట్రిక్స్‌ ఫిగర్స్‌, పజిల్స్‌ లాంటి అంశాలపై దృష్టి పెట్టాలి.
హై-లెవల్‌ రీజనింగ్‌, ఎనలిటికల్‌ రీజనింగ్‌ నుంచి కూడా ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. సిలజిసమ్‌, స్టేట్‌మెంట్స్‌-కంక్లూజన్స్‌, స్టేట్‌మెంట్స్‌-అజంషన్స్‌, ఇన్‌పుట్‌- అవుట్‌పుట్‌, ఇన్ఫరెన్సెస్‌, సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌, పజిల్‌ టెస్ట్‌ ముఖ్యమైనవి. ఇంగ్లిష్‌ భాషపై పట్టు పెంచుకుంటే ఈ విభాగంలోని ప్రశ్నలను సులువుగా చేయవచ్చు.

జనరల్ అవేర్‌నెస్‌: ఏప్రిల్‌, మే, జూన్‌, జూలై నెలలోని వర్తమాన వ్యవహారాలపై దృష్టి సారించాలి. జాతీయ, అంతర్జాతీయ విశేషాలు, డిఫెన్స్‌, సైన్స్‌ & టెక్నాలజీ, ఆర్థిక, వ్యవసాయ రంగాల అంశాలు, విద్య- వైద్య- ఆరోగ్య పరమైన అంశాలు, దేశాలు- రాజధానులు- కరెన్సీ- ప్రధానమంత్రుల వివరాలు, పుస్తకాలు- రచయితలు, ముఖ్యమైన తేదీలు, అవార్డులకు సంబంధించిన విషయాలను నోట్సు రూపంలో తయారుచేసుకుంటే మంచిది. జనరల్‌ ఎవేర్‌నెస్‌లో సోషల్‌ అంశాలైన హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీల నుంచి ప్రశ్నలు వస్తాయి.
సైన్స్‌ అంశాల్లో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీల నుంచి ప్రశ్నలు వస్తాయి. వ్యాక్సిన్స్‌, ఉపగ్రహ ప్రయోగాలు వంటి అంశాలపై కూడా దృష్టి పెట్టాలి.

ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ & కాంప్రహెన్షన్‌: పరీక్షలో అతి ముఖ్యమైన విభాగం ఇంగ్లిష్‌. 50% మార్కులు దీనికి కేటాయించారు. కాబట్టి ఎక్కువ దృష్టి సారించాలి. కాంప్రహెన్షన్‌ పాసేజ్‌ నుంచి 20 మార్కులు, క్లోజ్‌ టెస్ట్‌ నుంచి 15-20 మార్కులు, జంబుల్డ్‌ సెంటెన్స్‌ నుంచి 15-20 మార్కులు, ఫిల్‌-ఇన్‌-ద-బ్లాంక్స్‌ నుంచి 10-15 ప్రశ్నలు వస్తాయి. ఈ అంశాలన్నిటికీ రీడింగ్‌ స్కిల్స్‌ ఉంటేనే సమాధానాలు గుర్తించగలము. Antonyms, Synonyms నుంచి 15 ప్రశ్నలు వస్తాయి.
ప్రతిరోజూ ఆంగ్ల వార్తాపత్రికను చదవటం కొనసాగించాలి. ఇలా చేస్తే ఇంగ్లిష్‌ భాషపైనే కాకుండా, కరంట్‌ అఫైర్స్‌ అంశాలపై కూడా మెరుగైన ప్రతిభ చూపే అవకాశం ఉంది. తక్కువ సమయంలో చదివి, ఎక్కువ సమాచారం గుర్తించేలా సాధన చేయాలి. అర్థం తెలియని పదాలను ఒక పుస్తకంలో రాసుకుని, వాటికి సంబంధించిన విషయాలను తెలుసుకుంటూవుండాలి. రోజుకు ఒక మాదిరి ప్రశ్నపత్రం సాధన చేస్తే మంచి ఫలితం వస్తుంది.

అర్హత‌: ఇంటర్మీడియట్‌/ దానికి సమానమైన కోర్సును పూర్తిచేసినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వ‌యో ప‌రిమితి: ఆగ‌స్టు 1, 2017 నాటికి అభ్యర్థుల వయసు 18 నుంచి 27 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అయిదేళ్లు; ఓబీసీ మూడేళ్లు, దివ్యాంగుల‌కు ప‌దేళ్లు గ‌రిష్ఠ వ‌యోప‌రిమితిలో స‌డ‌లింపులు వ‌ర్తిస్తాయి.
ద‌ర‌ఖాస్తులు: ఆన్‌లైన్‌లోనే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ఇందుకోసం http://ssconline.nic.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు పూర్తిచేసి, 100 రూపాయిల ఫీజు ఆన్‌లైన్‌ విధానంలో చెల్లించాలి. మహిళ‌లు, దివ్యాంగులు, ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులు ఫీజు చెల్లించ‌న‌వ‌స‌రం లేదు.
ఆన్‌లైన్ ద‌రఖాస్తుల‌కు గ‌డువు: జులై 15 సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు.
ఆన్‌లైన్ ప‌రీక్ష తేదీలు: సెప్టెంబ‌రు 4 నుంచి 7 వ‌ర‌కు వివిధ స‌మ‌యాల్లో ప‌రీక్షలు నిర్వహిస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, గుంటూరు, విశాఖపట్నం, విజ‌య‌వాడ‌.

posted on 20.06.2017