అడుగడుగునా ఆధునికమే.. మన ఇల్లే ఓ మయసభ!

హాలులో కూచొని హాయిగా పాటలు వింటున్నారు. అంతలో వంటింట్లోకి వెళ్లాల్సి వచ్చింది. పాటలు కూడా మిమ్మల్ని అనుసరిస్తూ మీ వెంటే వస్తాయి. అంతా రహస్య స్పీకర్ల మహిమ! జీపీఎస్‌తో అనుసంధానమై పనిచేసే ఇవి మీరు ఎక్కడుంటే అక్కడే పాటలను వినిపిస్తాయి!
చేత్తో తాకితే చాలు. గోడకు వేలాడదీసిన చిత్రపటాలు మారిపోతాయి. కొత్త దృశ్యాలు ప్రత్యక్షమవుతాయి. ఎందుకంటే అవన్నీ కంప్యూటర్‌ తెరల మీద తళుకులీనే చిత్రాలు మరి!
ఉన్నట్టుండి ఆకాశం మబ్బు పట్టింది. వాతావరణం చల్లబడిపోయింది. అయినా ఇంట్లో వెలుగు తగ్గలేదు. చలి కూడా వేయటం లేదు. దీనికి కారణం.. సెన్సర్లు బయటి వాతావరణానికి అనుగుణంగా ఇంట్లో కాంతిని, ఉష్ణోగ్రతలను నియంత్రిస్తుండటమే!
-ఇవన్నీ బిల్‌ గేట్స్‌ ఇంటి ముచ్చట్లు. ఇవి కేవలం సంపదకు, విలాసాలకు సంబంధించిన విషయాలే కావు. అత్యాధునిక సాంకేతికత పరిజ్ఞానానికీ నిలువెత్తు నిదర్శనాలు. టెక్నాలజీ మన ఇంటిని ఎంత ‘స్మార్ట్‌’గా మార్చగలదో అన్నదానికి ప్రత్యక్ష ఉదాహరణలు. ఇంతటి స్థాయిలో కాకపోయినా ఇలాంటి పరిజ్ఞానాలు మనకూ అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే వీటి ఫలాలను కొంతవరకు రుచి చూస్తున్నాం కూడా. లైట్లు, అలారాలు, ఉష్ణోగ్రత నియంత్రకాలు, టీవీలు, పొగ డిటెక్టర్లు, కాఫీ యంత్రాలు, వాషింగ్‌ మెషిన్లు, కెమెరాలు.. ఒక్కటేమిటి సమస్త స్వయంచాలిత వస్తు సముదాయాన్ని స్మార్ట్‌ఫోన్‌తోనో, కంప్యూటర్‌తోనో, ట్యాబ్లెట్‌తోనో ఆయా సమయాలకు అనుగుణంగా పనిచేసేలా మార్గనిర్దేశనం చేయటమే స్మార్ట్‌ హోం ఉద్దేశం. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది ‘ఆరో జ్ఞానం’తో మన ఇంటిని విచక్షణా జ్ఞానమున్న ‘తెలివైన గృహం’గా మార్చేస్తుందన్నమాట.