నవ స్పర్శ eచర్మం

కృత్రిమమే కావొచ్చు...సహజంగా స్పందిస్తుంది...సున్నితత్వాన్ని, కఠినత్వాన్ని గుర్తిస్తుంది...వేడి, చల్లదనం వంటివీ పసిగడుతుంది...ఒక్క మాటలో చెప్పాలంటే మన చర్మం మాదిరిగానే ప్రతిస్పందిస్తుంది. అదే ఇ-చర్మం. ప్రయోగదశలను దాటుకుంటూ.. మానవ జీవితాలను పెనవేసుకుంటోంది!
ఇ-చర్మం అంటే?
నిజానికిదో అతి పలుచటి రబ్బరు లేదా పాలిమర్‌ పొర. కాకపోతే ఒత్తిడి, వేడి, చలి, తేమ, గాలి ప్రవాహం వంటి వాటిని గుర్తించే సున్నితమైన గ్రాహకాలు ఉండటం వల్ల చర్మం మాదిరిగానే స్పందిస్తుంది. ఇది మన చర్మ కణాల కన్నా 10 రెట్లు పలుచగానూ, చాలా తేలికగానూ ఉంటుంది! అన్నిరంగాల్లోనూ ఎలక్ట్రానిక్‌ పరికరాల వినియోగం అత్యవసరవుతున్న తరుణంలో ఇ-చర్మం పలు అద్భుతాలకు వేదికవుతోంది.
కాల్పనిక కథలే ప్రేరణ
ఇ-చర్మం సృష్టికి ఒకరకంగా సైన్స్‌ ఫిక్షన్‌ కథలే ప్రేరణ. ఎప్పుడంటే అప్పుడు తీసి పెట్టుకునే చేయి, కన్ను పాత్రతో 1971లో ప్రసారమైన ‘సిక్స్‌ మిలియన్‌ డాలర్‌ మ్యాన్‌’ టీవీ సీరియల్‌.. 1980ల్లో స్టార్‌ వార్స్‌ సీరియల్‌లో కనిపించే ఎలక్ట్రానిక్‌ చేయి.. 1984లో వచ్చిన టెర్మినేటర్‌ సినిమాల్లో మనుషుల్లాంటి మర మనుషులు.. ఇలాంటివన్నీ ఇ-చర్మం ఆలోచనకు బీజం వేశాయి.
45 ఏళ్ల కిందట్నుంచే..
ఇ-చర్మం సృష్టికి 1974లోనే ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే హెచ్‌పి సంస్థ 1983లో మొట్టమొదటి టచ్‌స్క్రీన్‌ కంప్యూటర్‌ను తయారుచేయటంతో కొత్తమలుపు తిరిగింది. స్పర్శకు స్పందించే పరికరాల తయారీకి ఇది బీజం వేసింది. జీఈ సంస్థ 1985లో పరిసరాలకు స్పందించగల పొరలను రూపొందించటంతో మరో ముందడుగు పడింది. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధకులు 2010లో రబ్బరు మీద నానోవైర్‌ ట్రాన్సిస్టర్లను అతికించి తొలిసారిగా ప్రయోగాత్మక ఇ-చర్మాన్ని సృష్టించారు. అనంతరం స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయం 2011లో రూపొందించిన అతి పల్చటి, పారదర్శక నానో వైర్‌ ఎలక్ట్రానిక్‌ పరికరాలు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాయి. బెర్కలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధకులు 2013లో తాకితే వేలిగే ఇ-చర్మాన్ని సృష్టించి మరింత అబ్బురపరిచారు. అచ్చం మనిషి చేయిలా కనిపించే, స్పందించే కృత్రిమ చేయి 2014లో పురుడుపోసుకుంది. శరీర కదలికలకు అనుగుణంగా సాగటానికి వీలైన ఎలక్ట్రానిక్‌ సర్క్యూట్ల వంటివీ ఇప్పుడు వీటికి జతకూడుతున్నాయి.
ప్రయోజనాలు అనేకం
కృత్రిమ పరికరాలను ధరించేవారికి వేడి, చల్లదనం వంటి వాటిని గుర్తించటానికి తోడ్పడుతుంది. ఇలా ప్రమాదాల బారినపడకుండా చూసుకోవచ్చు. రోబోలకు పరిసరాలను పసిగట్టటం.. కఠినమైన, మృదువైన వస్తువులకు మధ్య తేడాలను గుర్తించటం.. గాలి ప్రవాహంలో తేడాల ఆధారంగా అటువైపుగా వచ్చేవారి వైపు తిరగటం వంటి జ్ఞానాలు అబ్బుతాయి. వైద్యపరంగానూ ఎంతో మేలు చేస్తుంది. గుండె విద్యుత్‌ స్పందనలు, మెదడు తరంగాల వంటి కీలకమైన సంకేతాల తీరుతెన్నులను నిరంతరం పసిగట్టొచ్చు. ఈ సమాచారాన్ని ప్రత్యేక పరికరాలు లేదా స్మార్ట్‌ఫోన్ల ద్వారా ఎప్పటికప్పుడు డాక్టర్లకు చేరవేయొచ్చు కూడా. మెడలోని కండరాల సంకోచాల ద్వారా కంప్యూటర్‌ మౌస్‌ను నియంత్రించటం వంటి పనులకూ తోడ్పడగలదు. ఇ-చర్మంలోని నానోవైర్లను వెలిగేలా చేసి తాత్కాలికంగా పచ్చబొట్లనూ సృష్టించుకోవచ్చు. ఇ-చర్మాన్ని తాకుతూ పుస్తకాల వంటివీ చదువుకోవచ్చు. అంటే చర్మమే కంప్యూటర్‌గా మారిపోతుందన్నమాట.
ఇ-వ్యర్థాలకూ పరిష్కారం
ఎలక్ట్రానిక్‌ వ్యర్థాల సమస్యకూ ఇ-చర్మం పరిష్కారం చూపుతుంది. కొలరాడో బౌల్డర్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు వెండి నానో పార్టికల్స్‌తో రూపొందించిన కొత్తరకం ఇ-చర్మమే దీనికి నిదర్శనం. ఇది ఎక్కడైనా దెబ్బతింటే తనకు తాను మరమ్మతు చేసుకోగలదు! కొద్దిగా చిరిగిపోతే దీనికి మూల రసాయనాలను జతచేస్తే తిరిగి కుదురుకుంటుంది. బాగా దెబ్బతిందనుకోండి. చిన్న చిన్న ముక్కలుగా చేసి ఓ ప్రత్యేకమైన ద్రావణంలో వేస్తే పూర్తిగా కరిగిపోతుంది. ద్రావణంలో కరిగిన మూల పదార్థాలను వేరుచేసి తిరిగి కొత్త ఇ-చర్మం తయారీకీ ఉపయోగించుకోవచ్చు.

Posted on 18-04-2018