ప్రతి అంశాన్ని శ్రద్ధగా చదవాలి

ప్రతి అంశాన్ని శ్రద్ధగా చదువడమే తన విజయ రహస్యమని ఎంపీసీ గ్రూప్‌తో రాష్ట్రంలో 5వ ర్యాంకు సాధించిన వి.మౌనిక అన్నారు. తన విజయానికి తెలుగు అకాడమీ పుస్తకాలు ఎంతగానో తోడ్పడ్డాయని కూడా చెప్పారు. ఈమె సూర్యపేట త్రివేణి జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివారు. అదే విద్యా సంస్థల్లో 9, 10 తరగతులను పూర్తిచేశారు. ఈమెకు పదో తరగతిలో 563 మార్కులు వచ్చాయి. ఇంటర్ ఎంపీసీలో 991 మార్కులు సాధించారు.
ఇంటర్‌లో వచ్చిన మార్కులు
ఆంగ్లం 98, సంస్కృతం 98, గణితం- 1లో 75, గణితం- 2లో 75, భౌతికశాస్త్రం 60, రసాయనశాస్త్రం 60. ఆంగ్లం, సంస్కృతంలో రెండేసి మార్కులు తగ్గాయి.

పేదరికం అడ్డుకాలేదు
మౌనిక తల్లిదండ్రులు చిన్నపాటి బియ్యం వ్యాపారం చేసుకుంటూ సూర్యపేటలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఆర్థిక ఇబ్బందులు, పేదరికం కారణంగా త్రివేణి పాఠశాల యాజమాన్యం ఆమెను 9వ తరగతి నుంచే ఉచితంగా చదివించింది.

మౌనిక
(ఎంపీసీ సబ్జెక్టులతో)
స్టేట్5వ ర్యాంకర్

తెలుగు అకాడమీ పుస్తకాలే మూలం
ఇంటర్‌లో రాష్ట్రస్థాయిలో నాలుగో ర్యాంకు సాధనకు తెలుగు అకాడమీ పుస్తకాలు ఎంతగానో ఉపయోగపడ్డాయని మౌనిక అంటున్నారు. ఇతర క్వశ్చన్ బ్యాంకులు, గైడ్లు ఏమి చదవలేదన్నారు. తెలుగు అకాడమీ పుస్తకాలను మాత్రమే చదివాననీ, అందులో ఉన్న ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా, శ్రద్ధగా నేర్చుకున్నాననీ చెప్పారు. 'రోజూ 8 గంటలు చదివేదాన్ని. కళాశాలలో చెప్పిన పాఠాలను ఆరోజే అధ్యయనం చేసి, సందేహాలను నివృతి చేసుకునేదానిని. కళాశాల ప్రారంభం నుంచి ఇదే పద్ధతిని పాటించి విజయం సాధించానని ఆమె తెలిపారు.

కసరత్తు తప్పనిసరి

గైడ్లు, ప్రత్యేక పుస్తకాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా ప్రభుత్వం ముద్రించిన తెలుగు అకాడమీ పుస్తకాలు మనకు ఎంతగానో మేలు చేస్తాయనిమౌనిక అభిప్రాయపడ్డారు. గణితం, భౌతికశాస్త్రానికి సంబంధించిన పుస్తకాల్లో ముఖ్యమైన వాటిని ప్రత్యేకంగా ఇస్తారనీ, వాటిని తప్పనిసరిగా నేర్చుకోవాలనీ చెప్పారు. రసాయనశాస్త్రం, గణితం సబ్జెక్టులకు సంబంధించిన సూత్రాలను బాగా గుర్తుంచుకోవాలని కొత్తవారికి సలహా ఇచ్చారు. వాటిపై తగిన కసరత్తు చేయాలన్నారు. 'మార్కులు గురించి మానసిక ఆందోళనకు గురికాకుండా ప్రశ్నలకు సమాధానం రాసేటప్పుడు జాగ్రత్తగా పరిశీలించాలి. ముందుగా బాగా వచ్చిన వాటికి సమాధానం రాయాలి. రాసేటప్పుడు అర్థవంతంగా సూత్రాలు తప్పులు లేకుండా పరీశీలించుకోవాలి. ఆ దిశగా సాధన చేస్తే మంచి ఫలితమే దక్కుతుందని మౌనిక చెప్పారు.