Sr. Inter 2016 Toppers

AP INTER 2016 Toppers
* సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు అవుతా..: రోషిణి (ఎంపీసీ 992)
భవిష్యత్తులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు కావాలన్నదే తన లక్ష్యమని రోషిణి పేర్కొంది. జేఈఈ ద్వారా ఎన్‌టీఐ లేదా ఐఐటీల్లో ఇంజినీరింగ్‌ పూర్తిచేసి, ఎంటెక్‌ ఇంజినీరింగ్‌ చదవనున్నట్లు తెలిపింది. ఎంపీసీలో 992 మార్కులు సాధించింది. ఈమె విజయనగరానికి చెందిన వారణాసి శ్రీనివాసరావు, ఉషారాణి దంపతుల రెండో కుమార్తె. రోజుకు 16 గంటలు సమయాన్ని చదువు కోసం కేటాయించానని చెప్పింది రోషిణి.
* ఐఐటీ సాధనే లక్ష్యం: ప్రియాంక (ఎంపీసీ 992)
తల్లిదండ్రుల ప్రోత్సాహం, అధ్యాపకుల సలహాలతో ఇంటర్మీడియట్‌లో ఉత్తమ మార్కులు సాధించానని ఐఐటీలో మంచి ర్యాంకు సాధనే తన లక్ష్యమని ద్వితీయ ఇంటర్లో మొదటి ర్యాంకు సాధించిన చిలకల వెంకట ప్రియాంక వెల్లడించారు. నెల్లూరులోని కల్లూరుపల్లి నారాయణ కళాశాలలో ఇంటర్‌ చదివిన ఆమెకు 992 మార్కులు లభించాయి. ప్రియాంక సొంత వూరు కడప. తండ్రి సీవీ సుబ్బయ్య, తల్లి సుశీల కడప జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు. ప్రియాంక సోదరి ఉస్మానియా మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ మూడో సంవత్సరం చదువుతోంది. ప్రియాంక ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్య కడపలోని నాగార్జున పాఠశాలలో చదివింది. కంప్యూటర్‌ సైన్సులోగానీ, ఈసీఈలగానీ ఐఐటీ సాధించాలనే లక్ష్యంతో సన్నద్ధ మవుతున్నానని తెలిపింది.
* న్యూరోసర్జన్‌లో ఎంఎస్‌ చేయడమే లక్ష్యం: ఇంద్రస్వరూప్‌ (బైపీసీ 991)
చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన బి.ఇంద్రస్వరూప్‌ నాయక్‌ ఇంటర్మీడియట్‌ బైపీసీ విభాగంలో 991 మార్కులు పొందారు. స్వరూప్‌ నాయక్‌ తండ్రి రామ్‌నాయక్‌ తితిదేలో పనిచేస్తున్నారు. ఫలితాలు వెలువడిన అనంతరం ఇంద్ర స్వరూప్‌ మాట్లాడుతూ.. వైద్య విద్య పూర్తిచేసి న్యూరో సర్జన్‌లో ఎంఎస్‌ చేయడమే ఆశయమన్నారు.
TS INTER 2016 Toppers
* కూలిపనులకెళ్లి చదువుకున్నా.. ఐఏఎస్‌ కావాలన్నదే లక్ష్యం: హెచ్‌ఈసీలో టాపర్‌ స్నేహ మనోగతం (హెచ్‌ఈసీ 925)
మారుమూల గిరిజన ప్రాంతం.. కూలికెళితేగానీ పూట గడవని కుటుంబ నేపథ్యం.. తండ్రి చనిపోవడంతో అక్కలతో పాటే కూలికెళ్లిన ఆ అమ్మాయి జీవితంతో పోరాడింది. కష్టాన్నే ఇష్టంగా మలుచుకుని ఇంటర్మీడియట్‌లో ఏకంగా రాష్ట్రస్థాయిలో మొదటిస్థానం సాధించి శభాష్‌ అనిపించుకుంది. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలోని మారుమూల గిరిజన ప్రాంతం చండ్రలగూడేనికి చెందిన మొల్కం నారాయణ, రాధమ్మల మూడో కుమార్తె స్నేహ. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో హెచ్‌ఈసీలో 925 మార్కులు సాధించి రాష్ట్రంలో మొదటిస్థానంలో నిలిచింది. స్నేహకు ఆర్నెల్ల వయసున్నప్పుడే తండ్రి చనిపోయాడు. అక్కలు కవిత, మౌనికలతోపాటు తాను కూలి పనులకు వెళ్లేది. కారేపల్లి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో హెచ్‌ఈసీ చదివి రాష్ట్రస్థాయిలో టాపర్‌గా నిలిచింది. కళాశాల అధ్యాపకులు తననెంతగానో ప్రోత్సహించారని చెప్పింది. ప్రస్తుతం ఖమ్మంలో స్పోకెన్‌ ఇంగ్లిష్‌ శిక్షణ తీసుకుంటోంది. ఐఏఎస్‌ కావాలనే లక్ష్యంగా నిర్ణయించుకున్నానని, సాధించి తీరతానని ధీమా వ్యక్తం చేసింది.
* ఐఏఎస్‌ నా లక్ష్యం - చరితారెడ్డి, 992, ఎంపీసీలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం
మాది అనంతపురం జిల్లా కదిరి. నాన్న ప్రసాద్‌రెడ్డి అడ్వకేట్‌గా పనిచేస్తున్నారు. అమ్మ లలిత గృహిణి. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో ఎంపీసీలో రాష్ట్ర స్థాయిలో ప్రథమస్థానంలో నిలవడం ఆనందంగా ఉంది. మాదాపూర్‌లోని నారాయణ కళాశాల నర్మద క్యాంపస్‌లో ఇంటర్మీడియట్‌ చదివాను. తరుచూ పరీక్షలు నిర్వహిస్తూ సబ్జెక్ట్‌పై పట్టుసాధించేలా నారాయణలో మంచి శిక్షణ ఇచ్చారు. మొదటి నుంచి ప్రణాళికబద్ధంగా చదవడం వల్లే ఇది సాధ్యమైంది. ఐఐటీలో సీటు సాధించి అది పూర్తి చేసిన తరువాత సివిల్స్‌ రాసి ఐఏఎస్‌ కావాలనేది నా జీవిత లక్ష్యం.
* తల్లిదండ్రుల కల నెరవేరుస్తా - ప్రీతి శర్మ, ఎంపీసీ(992), రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం
మాది నిజామాబాద్‌. నేను గొప్ప సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ను కావాలనేది మా అమ్మానాన్న బీనాశర్మ, సంతోష్‌శర్మల కోరిక. దాన్ని నెరవేరుస్తా. నిజామాబాద్‌ కాకతీయ కళాశాలలో చదివాను. గతేడాది ప్రథమ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంకు సాధించాను. ఈసారి మరింత పట్టుదలగా చదివి రాష్ట్రస్థాయిలో మొదటి స్థానంలో నిలవడం సంతోషంగా ఉంది. పట్టుదల, ప్రణాళికతో చదవడమే ఈ విజయానికి కారణం. ఇదే స్ఫూర్తితో ఇంజినీరింగ్‌లోనూ ముందుకెళతాను.
* చిన్నపిల్లల వైద్యురాలినవుతా - నిదామెహ్రీన్‌, బైపీసీ (994), రాష్ట్ర స్థాయి ప్రథమ ర్యాంకరు
నిజామాబాద్‌లోని అహ్మద్‌పురా కాలనీకి చెందిన తలాతార, అలీషరీఫ్‌ నా తల్లిదండ్రులు. ఇంటర్‌ నిజామాబాద్‌ కాకతీయ కళాశాలలో చదివాను. బైపీసీలో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం సాధించడం సంతోషాన్నిచ్చింది. నాకు స్నేహితులెవరూ లేరు. పుస్తకాలే నా నేస్తాలు. రోజుకు 14 గంటలు చదవడం వల్లే ఈ విజయం సొంతమైంది. దీని వెనుక తల్లిదండ్రులు, కళాశాల అధ్యాపకుల ప్రోత్సాహం ఎంతో ఉంది. చిన్నపిల్లల వైద్యురాలిని కావాలన్నదే నా జీవితాశయం.

 

Back

Academic Exams