AP Sr.INTER 2016 Toppers

ఏపీ 'ఇంటర్‌' టాపర్ల మనోగతాలు
సీనియర్‌ ఇంటర్‌ పరీక్ష ఫలితాల్లో విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ చాటారు. ఆయా కోర్సుల్లో అగ్రగణ్యులుగా నిలిచిన విద్యార్థుల అభిప్రాయాలు, లక్ష్యాలివి.
* సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు అవుతా..: రోషిణి (ఎంపీసీ 992)
భవిష్యత్తులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు కావాలన్నదే తన లక్ష్యమని రోషిణి పేర్కొంది. జేఈఈ ద్వారా ఎన్‌టీఐ లేదా ఐఐటీల్లో ఇంజినీరింగ్‌ పూర్తిచేసి, ఎంటెక్‌ ఇంజినీరింగ్‌ చదవనున్నట్లు తెలిపింది. ఎంపీసీలో 992 మార్కులు సాధించింది. ఈమె విజయనగరానికి చెందిన వారణాసి శ్రీనివాసరావు, ఉషారాణి దంపతుల రెండో కుమార్తె. రోజుకు 16 గంటలు సమయాన్ని చదువు కోసం కేటాయించానని చెప్పింది రోషిణి.
* ఐఐటీ సాధనే లక్ష్యం: ప్రియాంక (ఎంపీసీ 992)
తల్లిదండ్రుల ప్రోత్సాహం, అధ్యాపకుల సలహాలతో ఇంటర్మీడియట్‌లో ఉత్తమ మార్కులు సాధించానని ఐఐటీలో మంచి ర్యాంకు సాధనే తన లక్ష్యమని ద్వితీయ ఇంటర్లో మొదటి ర్యాంకు సాధించిన చిలకల వెంకట ప్రియాంక వెల్లడించారు. నెల్లూరులోని కల్లూరుపల్లి నారాయణ కళాశాలలో ఇంటర్‌ చదివిన ఆమెకు 992 మార్కులు లభించాయి. ప్రియాంక సొంత వూరు కడప. తండ్రి సీవీ సుబ్బయ్య, తల్లి సుశీల కడప జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు. ప్రియాంక సోదరి ఉస్మానియా మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ మూడో సంవత్సరం చదువుతోంది. ప్రియాంక ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్య కడపలోని నాగార్జున పాఠశాలలో చదివింది. కంప్యూటర్‌ సైన్సులోగానీ, ఈసీఈలగానీ ఐఐటీ సాధించాలనే లక్ష్యంతో సన్నద్ధ మవుతున్నానని తెలిపింది.
* న్యూరోసర్జన్‌లో ఎంఎస్‌ చేయడమే లక్ష్యం: ఇంద్రస్వరూప్‌ (బైపీసీ 991)
చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన బి.ఇంద్రస్వరూప్‌ నాయక్‌ ఇంటర్మీడియట్‌ బైపీసీ విభాగంలో 991 మార్కులు పొందారు. స్వరూప్‌ నాయక్‌ తండ్రి రామ్‌నాయక్‌ తితిదేలో పనిచేస్తున్నారు. ఫలితాలు వెలువడిన అనంతరం ఇంద్ర స్వరూప్‌ మాట్లాడుతూ.. వైద్య విద్య పూర్తిచేసి న్యూరో సర్జన్‌లో ఎంఎస్‌ చేయడమే ఆశయమన్నారు.
* సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌లో రాణిస్తా: మౌనిక (ఎంపీసీ 991)
ఎంపీసీలో రెండో అత్యధిక మార్కులు సాధించిన మౌనిక తల్లిదండ్రులు బొడ్డు రవి, జ్యోతి నెల్లూరు జిల్లా సింగరాయకొండలో ఉంటున్నారు. తండ్రి ప్రైవేటు ఉద్యోగం. మధ్య తరగతి కుటుంబానికి చెందినవారు. బాల్యం నుంచి చదువంటే ఎంతో ఆసక్తి. లక్ష్య సాధన కోసం అటు తల్లిదండ్రులు, అన్న ఇటు కళాశాల అధ్యాపకులు ఇచ్చిన ప్రోత్సాహంతో పట్టుదలతో చదివి ఉన్నత మార్కులను సొంతం చేసుకున్నానంది. పదో తరగతి ప్రకాశం జిల్లాలో సింగరాయకొండలోని సెయింట్‌ జాన్స్‌ ఉన్నత పాఠశాలలో చదివారు. 9.5 గ్రేడ్‌ సాధించారు. నెల్లూరు నారాయణ కళాశాల చెముడుగుంట క్యాంపస్‌లో జూనియర్‌ ఇంటర్‌లో 467 మార్కులతో రాష్ట్రంలో ప్రథమ ర్యాంకులో నిలిచారు. సీనియర్‌ ఇంటర్‌లో ప్రథమ ర్యాంకుకు ఒక్క మార్కు తేడాతో 991 మార్కులు సాధించి ద్వితీయ స్థానాన్ని దక్కించుకుంది. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌లో రాణించాలని ఉందని మౌనిక చెబుతోంది. 'మహిళలు ఎందులోనూ తీసిపోరు.. పట్టుదలగా అడుగు ముందుకువేస్తే విజయం తప్పక సాధ్యం అవుతుంది. ఎవరు ఎంత ఎత్తుకు ఎదిగినా కేవలం డబ్బు సంపాదనే ధ్యేయం కాకుండా సామాజిక బాధ్యతను గుర్తించి ముందుకు పోవాలి. అప్పుడే అందరూ బాగుంటారు’ అని పేర్కొంది.
* తల్లిదండ్రుల దీవెనతో.. : హరిప్రియ (ఎంపీసీ 991)
చిత్తూరు జిల్లా గంగవరం మండల పరిధిలోని మదర్‌ థెరిస్సా జూనియర్‌ కళాశాల విద్యార్థిని హరిప్రియ ఎంపీసీ విభాగంలో 991 మార్కులు సాధించింది. పలమనేరు పట్టణ పరిధిలో నివాసం ఉంటున్న రవికుమార్‌, చిత్ర దంపతుల కుమార్తె హరిప్రియ చిన్నప్పటి నుంచే చదువులో ప్రతిభ చాటుతోంది. తండ్రి రవికుమార్‌ చిన్నతరహా వ్యాపారవేత్తగా పని చేస్తున్నారు. తల్లి గంగవరం మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. ఒక్కగానొక్క కుమార్తెను ఉన్నత చదువులు చదివించి మంచి ఉద్యోగంలో స్థిరపడేటట్లు చేయాలన్నది తల్లిదండ్రుల కోరిక. హరిప్రియ మాట్లాడుతూ.. 'అధ్యాపకులు చెప్పిన ప్రతి విషయాన్ని నోట్స్‌గా తయారు చేసుకోవటం అలవాటు.ఏ రోజు జరిగిన సిలబస్‌ను ఆ రోజే పూర్తి చేశాను. దీంతో పరీక్షల సమయంలో ఒత్తిడి అనిపించలేదు. చిన్నప్పటి నుంచి అమ్మనాన్న చదువులో ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చారు. గణితం అంటే చాలా ఇష్టం.అందుకే ఎంపీసీ గ్రూపు తీసుకున్నా. బీఎస్సీలో చేరుతా. పీహెచ్‌డీ పూర్తి చేసి ప్రొఫెసర్‌గా స్థిరపడాలనుకుంటున్నా. ఒక విద్యార్థి నిర్ధిష్టమైన లక్ష్యాన్ని పెట్టుకుని చదివితే తప్పకుండా విజయం సాధిస్తారు’ అని పేర్కొంది.
* తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే.. : లీలాప్రసాద్‌ (ఎంపీసీ 991)
తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఎంపీసీ విభాగంలో 991 మార్కులు సాధించానని విద్యార్థి లీలాప్రసాద్‌ పేర్కొన్నాడు. లీలాప్రసాద్‌ తండ్రి లోకనాథాచారి తిరుపతి అమరరాజ సంస్థలో కార్పెంటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. తల్లి కల్యాణి గృహిణి. లీలాప్రసాద్‌ మాట్లాడుతూ.. పది మందికి ఉపాధి చూపాలనే తన ఆశయమన్నారు. ఐఐటీలో సీటు సాధించి మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చేస్తానన్నాడు. దివంగత రాష్ట్రపతి అబ్దుల్‌కలాం తన ఆదర్శమన్నాడు. అధ్యాపకులు చెప్పింది ఎప్పటికప్పుడు చదవగలిగితే ఉత్తమ మార్కులు సాధించవచ్చని లీలాప్రసాద్‌ చెప్పాడు.
* కార్డియాలజీలో ఎంఎస్‌ చేస్తా: బొజ్జా ప్రదీప్‌రెడ్డి (బైపీసీ 990)
ఇంటర్మీడియట్‌ బైపీసీలో 990 మార్కులు సాధించాడు బొజ్జా ప్రదీప్‌రెడ్డి. తిరుపతి పట్టణానికి చెందిన నారాయణరెడ్డి కుమారుడైన ప్రదీప్‌రెడ్డి మాట్లాడుతూ మెడిసిన్‌ పూర్తిచేసి కార్డియాలజీలో ఎంఎస్‌ చేయటమే ధ్యేయమన్నారు.
* ఎంఎస్‌ చేయడమే లక్ష్యం: అలేఖ్య (బైపీసీ 989)
హైదరాబాద్‌ పట్టణానికి చెందిన మెట్టపల్లి అలేఖ్య ఇంటర్మీడియట్‌లో 989 మార్కులు సాధించారు. అలేఖ్య తండ్రి కృష్ణారావు ప్రయివేటు ఉద్యోగి. అలేఖ్య మాట్లాడుతూ... ఎంబీబీఎస్‌ పూర్తి చేసి ఎంఎస్‌ చేస్తామని చెప్పింది. క్యాన్సర్‌ వ్యాధి నిపుణురాలిగా రాణించడమే తన లక్ష్యమన్నారు.
* సివిల్స్‌ సాధిస్తా: సఫియా ఖానుమ్‌ (సీఈసీ 970)
అనంతపురం జిల్లా హిందూపురం పట్టణానికి చెందిన ఖలీల్‌ఖాన్‌ కుమార్తె సఫియా ఖానుమ్‌ ఇంటర్‌ సీఈసీలో 970 మార్కులతో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా సఫియా మాట్లాడుతూ.. పది మందికి విద్యను అందించాలన్నదే నా లక్ష్యమన్నారు. నా తండ్రి ఆశయం అదే. సివిల్స్‌ సాధించాలన్న పట్టుదల ఉంది. ప్రాథమిక పాఠశాల స్థాయిలో ప్రధానోపాధ్యాయురాలు స్వరూపారాణి, కళాశాలలో ప్రధానాచార్యులు బలరామిరెడ్డి ప్రోత్సాహం అందించటంవల్లే మంచి మార్కులు సాధించగలిగానని తెలిపారు.
* సోదరుడి ప్రోత్సాహంతోనే: సత్యనవీన్‌ (హెచ్‌ఈసీ 961)
తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం లక్కవరంలోని మంగెన గురయ్య జూనియర్‌ కళాశాలకు చెందిన పిచ్చిక యుగ సత్యనవీన్‌ హెచ్‌ఈసీ గ్రూపులో 961 మార్కులు సాధించాడు. సామాన్య చేనేత కుటుంబానికి చెందిన నవీన్‌ తల్లి సుబ్బలక్ష్మి, తండ్రి నాగభద్రశ్రీనివాస్‌ ఉపాధి నిమిత్తం గల్ఫ్‌ దేశంలో ఉంటున్నారు. ఇంటివద్ద ఉంటున్న తన సోదరుడు తేజతో కలిసి నవీన్‌ చదువులో ముందంజ వేశాడు. చదువుకు అవసరమైన ఖర్చులను సొంతంగా సంపాదించుకోవటానికి కష్టపడే ఏ పనైనా చేయడానికి సిద్ధ పడుతుంటాడు. సివిల్స్‌కు వెళ్లాలన్న లక్ష్యంతో అధ్యాపకుల సూచనలు, సోదరుడి ప్రోత్సాహంతోనే ఉత్తమ మార్కులు సాధించగలిగానని నవీన్‌ పేర్కొన్నాడు.

Back

Academic Exams