CA-CPT Toppers

 

సహనంతో శ్రమిస్తే... సీఏ

చార్టర్డ్‌ అకౌంటెన్సీ (సీఏ) కోర్సు కష్టమైనదనే భావన ఇప్పటికే చాలామందిలో ఉంది. చిత్తశుద్ధితో, శ్రద్ధగా కష్టపడి చదివితే సీఏ క్లిష్ట్టమేమీ కాదని నిరూపించాడు గుంటూరు విద్యార్థి పవన్‌ కుమార్‌. జీవితంలో త్వరగా స్థిరపడాలనీ, తద్వారా కుటుంబానికి ఆర్థిక చేయూతను ఇవ్వాలనీ నిర్ణయించుకున్నాడు. దానికోసం సీఏను కెరియర్‌గా ఎంచుకున్నాడు. కృషి చేసి, సీఏ ఫైనల్‌లో ఏకంగా అఖిలభారత స్థాయిలో 22వ ర్యాంకు సాధించాడు. సీఏ కోర్సు చదవడానికి తనకు ప్రేరణ ఏమిటి? సన్నద్ధత ఎలా సాగింది? అతడి మాటల్లోనే తెలుసుకుందాం!
పేరు: తిరుమలశెట్టి పవన్‌ కుమార్‌
పదోతరగతి: 9.2 గ్రేడ్‌ పాయింట్లు
ఇంటర్మీడియట్‌: 971 మార్కులు ( రాష్ట్రస్థాయిలో 10వ ర్యాంకు)
సీఏ-సీపీటీ: 184 మార్కులు
సీఏ-ఐపీసీసీ: 479/700 మార్కులు
సీఏ ఫైనల్‌: అఖిల భారత 22వ ర్యాంకు

గుంటూరు శివారులోని తురకపాలెం మా గ్రామం. నాన్న తిరుమలశెట్టి శ్రీనివాసరావు గుంటూరులోని ఆంధ్రప్రదేశ్‌ బేవరేజెస్‌ కార్పొరేషన్లో సెక్యూరిటీ గార్డు; అమ్మ రమాదేవి గృహిణి. పదో తరగతి వరకు గుంటూరు నల్లపాడులోని కేంద్రీయ విద్యాలయంలో చదివాను.
పదోతరగతిలో ఉన్నప్పుడు మా ఫిజిక్స్‌ మాస్టర్‌ మూర్తి గారి ద్వారా సీఏ కోర్సు గురించి తెలిసింది. ఇది తక్కువ సమయంలో పూర్తిచేయగల కోర్సు అనీ, జీవితంలో త్వరగా స్థిరపడవచ్చనీ చెప్పారాయన. అంతే కాదు; సీఏలకు మంచి ఉద్యోగావకాశాలు ఉంటాయని కూడా తెలిపారు. ఇదే విషయం మా అమ్మానాన్నలకు చెప్పాను. వారు నా ఇష్టాన్ని గౌరవించి సీఏ చదవడానికి ప్రోత్సహించారు.
సీఏ కోర్సు చదవడానికి ఇంటర్‌లో ఎంఈసీ గ్రూపు తీసుకుని చదవడమే సరైన విధానమని సీనియర్లు చెప్పారు. మాస్టర్‌ మైండ్స్‌ శిక్షణ సంస్థలో ఎంఈసీ, సీఏ కోర్సుల్లో చేరాను. ఇంటర్‌ ఎంఈసీ, సీఏ- సీపీటీ ఏకకాలంలో చదివాను. ఇంటర్‌లో 971 మార్కులతో రాష్ట్ర స్థాయిలో పదో ర్యాంకు తెచ్చుకున్నాను. సీఏ-సీపీటీలో 200 మార్కులకుగానూ 184 మార్కులు వచ్చాయి. సీపీటీలో కేవలం ఒక్క మార్కుతో అఖిల భారతస్థాయి పదో ర్యాంకు చేజారింది. దాంతో సీఏ కోర్సు ఇంకా బాగా చదవాలన్న కసి నాలో పెరిగింది. సీఏలోని రెండోదశ ఐపీసీసీ సైతం మొదటి ప్రయత్నంలో 700 మార్కులకు 479 సాధించి, పూర్తిచేశాను. ఆర్టికల్‌షిప్‌ పూర్తిచేసిన తర్వాత సీఏ ఫైనల్‌ మొదటి ప్రయత్నంలో పూర్తిచేశాను. అది కూడా అఖిలభారత స్థాయిలో 22వ ర్యాంకులో నిలవడం సంతోషంగా అన్పిస్తోంది. మంచి సీఏగా రాణించాలన్నదే నా లక్ష్యం!

విజయ రహస్యాలు
* ఇంటర్‌లో ఎంఈసీ గ్రూపు తీసుకుని చదవడం వల్ల ప్రాథమికాంశాలపై మంచి పట్టు సాధించగలిగాను. కాబట్టి సీఏ చదవాలనుకునేవారు ఇంటర్‌లో ఎంఈసీ ఎంచుకోవడం సరైనదని నా ప్రగాఢ విశ్వాసం.
* సీఏ కోర్సులోని ఏ దశలోనూ ఎటువంటి ఒత్తిడులకూ గురికాలేదు. అన్ని దశల్లోనూ ప్రశాంతతతో ఆలోచించి చదివి పూర్తిచేశాను.
* నన్ను నేను నమ్మాను. నాకు ఆత్మవిశ్వాసం ఎక్కువే. అదే నా విజయానికి సోపానమైందని నమ్ముతున్నాను.
* జీవితంలో త్వరగా స్థిరపడాలనే లక్ష్యం ఉంది కాబట్టి సీఏ పూర్తిచేసేవరకూ అనవసర విషయాలపై దృష్టి సారించలేదు. అందుకే అనుకున్నట్లుగానే సీఏ కోర్సు పూర్తి చేయగలిగాను.
* కొన్నిరోజులు కష్టపడి వదిలేస్తే సీఏ లాంటి కోర్సుల్లో విజయం కష్టం. ఈ కోర్సు కోసం నిరంతరం హార్డ్‌వర్క్‌ చేయవలసి ఉంటుంది.

పునశ్చరణ తప్పనిసరి
* సీఏ ఇన్‌స్టిట్యూట్‌ వారు ఇచ్చే ప్రామాణిక మెటీరియల్‌ను క్షుణ్ణంగా అధ్యయనం చేయవలసి ఉంటుంది. దీనివల్ల పరీక్షలు బాగా రాయవచ్చు. ఏది చదివినా ప్రణాళికబద్ధంగా చదవాలి. కోచింగ్‌ పూర్తయ్యాక ఆరు నెలల సమయాన్ని అధ్యయనానికీ, పునశ్చరణకూ కేటాయించాలి.
* సీఏ లాంటి ప్రొఫెషనల్‌ కోర్సులో ప్రశ్నల కఠినత్వ స్థాయి ఎక్కువ. కాబట్టి చదివిన అంశాలనే కనీసం మూడుసార్లు పునశ్చరణ చేసుకునేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.
* విజయం సాధించడం ఎంత అవసరమో భావవ్యక్తీకరణ నైపుణ్యాలూ అంతే అవసరం. కాబట్టి సీఏ చదువుతున్న సమయంలోనే సెమినార్లు, వక్తృత్వ పోటీలు వంటి వాటిల్లో పాల్గొనగలిగితే ఈ నైపుణ్యాలను పెంచుకోవచ్చు.
* కోచింగ్‌ సమయంలోనూ, పునశ్చరణలోనూ ఒక్కమాటలో చెప్పాలంటే సీఏ కోర్సు పూర్తయ్యేవరకూ సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండటం మంచిది.
* ఆర్టికల్‌షిప్‌లో లభించే ప్రాక్టికల్‌ విజ్ఞానం సీఏ ఫైనల్‌ కోర్సుకూ, సీఏ పూర్తయ్యాక చేయబోయే ప్రాక్టీస్‌కూ, ఉద్యోగానికీ చాలా అవసరం. కాబట్టి ఆర్టికల్‌షిప్‌ను సరదాగా కాకుండా శ్రద్ధగా, సీరియస్‌గా చేయాలి.

చదవాల్సిన పుస్తకాలు
* విద్యాసంస్థ ఇచ్చే మెటీరియల్‌తోపాటు ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ) వారి మెటీరియల్‌ చదవడం కూడా తప్పనిసరి.
* సీఏ ఇన్‌స్టిట్యూట్‌ వారి ప్రాక్టీస్‌ మాన్యువల్స్‌, రివిజన్‌ టెస్ట్‌ పేపర్స్‌, మాక్‌ టెస్ట్‌ పేపర్స్‌ విధిగా చదవాలి. సాధన చేయాలి.
* పాత ప్రశ్నపత్రాలు ముఖ్యంగా గత పదేళ్లవి, వాటికి సరిపోయే సూచన, సమాధానాలను (సజెస్టెడ్‌ ఆన్సర్స్‌) చదవాలి. వీటిని సరిగా చదివితే పరీక్షల్లో సులువుగా ఉత్తీర్ణత సాధించవచ్చు.

వ్యక్తిగత బలాలపై దృష్టి
సీఏ లాంటి ప్రొఫెషనల్‌ పరీక్షల్లో విజయం సాధించాలంటే ఎంతో ఓపిక, కఠోర శ్రమ, సమయపాలన అవసరం. సీఏ పరీక్షలను కఠినంగా భావించి కొంతమంది కోర్సును మధ్యలోనే వదిలేస్తారు. దీనికి కారణం విద్యార్థిలో అంతర్లీనంగా ఉండే భయం. ఆ భయాన్ని వీడి, తమ బలాలపై దృష్టిసారిస్తే ఈ కోర్సు పూర్తి చేయడం కష్టమేమీ కాదు.

సబ్జెక్టులు- ప్రాధాన్యాంశాలు
* సీఏ కోర్సులోని లా పేపర్‌కు బేర్‌ యాక్ట్‌ చదివితే లా-లోని ప్రొవిజన్స్‌ను బాగా అర్థం చేసుకోవచ్చు.
* ఆర్టికల్‌షిప్‌ చేసేటప్పుడు అవగతమయ్యే ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌ ఆడిటింగ్‌ పేపర్లకు చాలా అవసరం. కాబట్టి దీనికి కూడా ప్రాధాన్యమివ్వాలి. పుస్తకాల్లోని సమాచారానికి ఆచరణాత్మక జ్ఞానం జోడించి చదవాలి.
* ఫైనాన్షియల్‌ రిపోర్టింగ్‌, ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌, కాస్టింగ్‌ వంటి పేపర్లకు సన్నద్ధమయ్యేటప్పుడు చదవడం కన్నా పెన్‌, పేపర్‌ విధానంలో సాధన చేయడం తప్పనిసరి.
* ఇన్‌కం టాక్స్‌కు సంబంధించిన పేపర్లను చదివేటప్పుడు చట్టంలో వచ్చిన సవరణల గురించి పూర్తి అవగాహన పెంచుకోవాలి. సవరణలు, చట్టాల్లో వస్తున్న సరికొత్త మార్పులను తెలుసుకుంటూ సన్నద్ధత కొనసాగించాలి.

posted on 08.08.2017

Back
Entrance Exams