CA-CPT Toppers

 

కష్టం కాదు కృషి చేయాలంతే!

సీఏ కోర్సు పట్ల పెంచుకున్న భయాలతో కొంతమంది దీనిలో చేరడానికి సంకోచిస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో సాధారణ కుటుంబానికి చెందిన ఒక పల్లెటూరి కుర్రాడు సీఏ- సీపీటీ ఫలితాల్లో అఖిలభారత స్థాయిలో ఉత్తమశ్రేణిలో నిలవడం నిజంగా ఘనత అని చెప్పవచ్చు. సంకల్పం బలంగా ఉంటే సాధించలేనిది ఉండదని నిరూపించాడీ టాపర్‌.. నల్లాని సాయికృష్ణ. తన సన్నద్ధత తీరు అతడి మాటల్లోనే...

మాది కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలంలోని బండిపాలెం. మా నాన్న రుక్మాంగధరావు వ్యవసాయం చేస్తుంటారు. అమ్మ సీతామహాలక్ష్మి గృహిణి. మాది సాధారణ రైతు కుటుంబం. నేను మంచి ఉద్యోగం చేస్తూ జీవితంలో ఉన్నత స్థానంలో నిలవాలన్నది మా నాన్న కల. అందుకే వీలైనంత త్వరగా జీవితంలో స్థిరపడి అమ్మానాన్నలకు చేయూతను ఇవ్వాలని చిన్నప్పుడే నిర్ణయించుకున్నా. పదో తరగతిలో ఉన్నపుడు నందిగామలోని మా పాఠశాల... కాకతీయ అపోలో ఇన్‌స్టిట్యూట్లో ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమం ద్వారా సీఏ గురించీ, దీన్ని చేసినవారికి ఉండే ఉపాధి అవకాశాల గురించీ తెలిసింది. అవి నాకు నచ్చాయి; స్ఫూర్తినిచ్చాయి. ఆ క్షణమే సీఏ చదవాలని నిర్ణయించుకున్నాను.

తరువాతి ప్రేరణ- మాకు తెలిసిన వాళ్ల అమ్మాయి.. మా అక్క ధనలక్ష్మి. తను పల్లెటూరు నుంచి వచ్చి సీఏ కోర్సు పూర్తిచేసింది. ఆమెలాగే వీలైనంత త్వరగా సీఏ పూర్తిచేసి జీవితంలో స్థిరపడాలనీ, మంచి సీఏగా రాణించాలనీ స్థిరంగా అనుకున్నాను.
పదో తరగతిలో 9.7 గ్రేడు పాయింట్లు సాధించాను. మా నాన్న నన్ను ఎంఈసీ, సీఏ చదవడానికి మాస్టర్‌మైండ్స్‌ శిక్షణ సంస్థలో చేర్పించారు. ఇంటర్‌ ఎంఈసీ, సీఏ-సీపీటీ కోర్సులను ఏకకాలంలో చదివాను. సాయి బ్రహ్మతేజ అనే మా సీనియర్‌ విద్యార్థి సీఏ-సీపీటీలో 194 మార్కులతో అఖిలభారత స్థాయిలో మొదటి ర్యాంకు సాధించాడు. ఈ మార్కులను అధిగమించాలని లక్ష్యం పెట్టుకున్నాను. ఆ దిశగా సన్నద్ధత ప్రారంభించాను. ఇంటర్‌ ఎంఈసీలో 967 మార్కులు తెచ్చుకున్నా. వెంటనే జరిగిన సీఏ-సీపీటీ పరీక్షలో 200 కు 197 మార్కులు సాధించగలిగాను.ఆ రకంగా అఖిలభారత స్థాయిలో టాపర్‌గా నిలిచినందుకు అమ్మానాన్నలు ఎంతగానో సంతోషించారు.

సీఏ కోర్సు అందరూ అనుకునేంత కష్టమైనది కాదని నా అభిప్రాయం. సీఏ-సీపీటీ చదువుతున్నప్పుడు ఏరోజూ కూడా కష్టం అనిపించలేదు. అలాగే నా సీనియర్లు ఐపీసీసీ, సీఏ ఫైనల్‌ పూర్తిచేసినవారు కూడా ప్రణాళిక ప్రకారం క్రమశిక్షణతో చదివితే సీఏ ఐపీసీసీ, సీఏ ఫైనల్‌ కూడా కష్టమేం కావని చెప్పారు. చెప్పడమే కాదు.. తమ ఫలితాల ద్వారా నిరూపించారు. కావలసిందల్లా.. దృఢ సంకల్పం, కష్టపడే తత్వం. అంతే!

పునశ్చరణ అవసరం: ఇన్నాళ్లూ చదివిన పుస్తకాలు, సీపీటీకి సంబంధించిన మెటీరియళ్లనే మళ్లీ మళ్లీ చదవడం మేలు. కొత్తవాటి జోలికి పోకూడదు. ఎందుకంటే కొత్తవాటిని చదివితే తికమకకు గురయ్యే అవకాశాలు ఎక్కువ. ఐసీఏఐ వారి మెటీరియలే ప్రామాణికం. సీపీటీలోని అకౌంట్స్‌, ఎం.లా సబ్జెక్టులు చాలా ముఖ్యమైనవి. సీపీటీ మొదటి ప్రయత్నంలోనే నెగ్గాలంటే ఈ రెండు సబ్జెక్టులపై పట్టుండాలి. సన్నద్ధతలో వీటికి సింహభాగం కేటాయించడం మేలు. రోజూ 10-12 గంటలపాటు సన్నద్ధతకు కేటాయించండి. దీంతో ఆత్మస్థైర్యం కూడా ఏర్పడుతుంది.

ఏ సబ్జెక్టు? ఎలా?
* అకౌంట్స్‌లోని ఏ అంశాన్నీ బట్టీ పట్టకూడదు. ప్రతి అంశం పట్ల తార్కిక ఆలోచనా దృక్పథాన్ని అలవరచుకోవాలి.
* ‘ఎం-లా’లో సబ్జెక్టు పరంగా వివాదాస్పద అంశాలు ఎక్కువ కాబట్టి, చదువుతున్న పుస్తకం తప్ప వేరే మెటీరియల్‌ కానీ, పుస్తకాన్ని కానీ పరీక్షల ముందు చదవవద్దు. సీపీటీ పరిధిలో సెక్షన్‌ సంఖ్యలు, కేస్‌ స్టడీస్‌, రచయితల పేర్లు, నిర్వచనాలను గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. గుర్తు పెట్టుకోగలిగితే సరే కానీ తప్పనిసరి కాదు.
* ఎకనామిక్స్‌లోని మాక్రో ఎకనామిక్స్‌లో ఫాక్ట్స్‌, ఫిగర్స్‌ (సంవత్సరాలు, శాతాలకు సంబంధించిన డేటా) చాలా ముఖ్యం.
* క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌లో ముఖ్యంగా మ్యాథ్స్‌, స్టాటిస్టిక్స్‌లో..ఫార్ములాలు ముఖ్యమని గుర్తుంచుకోవాలి. పునశ్చరణ చేసుకునే అంశాలు/ సంబంధిత ఫార్ములాలను వేరొక పేపర్‌లో రాసుకుంటూ ప్రతిరోజూ ఒకసారి తర్ఫీదు పొందుతూ వెళ్లాలి. అప్పుడే తుది పరీక్షలో బాగా రాయగలుగుతారు. పోటీపరీక్షల్లో నిడివిగా ఉన్న లెక్కలను మొదట చేయడానికి ప్రయత్నించకూడదు. తెలిసినప్పటికీ ఆ ప్రశ్నలు మూడు సబ్జెక్టులు పూర్తి చేసుకున్న తర్వాతే ఆలోచించాలి.

Posted on 22.08.2017

Back
Entrance Exams