CAT - Toppers

నవలలు చదివి.. సుడోకు చేసి!

* క్యాట్‌లో మంచి ర్యాంకుకు టాపర్‌ వినీత్‌ చంద్రారెడ్డి సూచనలు

కేవలం సిలబస్‌కే పరిమితం కాకుండా ఇంగ్లిష్‌ నవలలు చదవడం, సుడోకు లాంటి పజిల్స్‌ పరిష్కరించడం చేస్తే క్యాట్‌లో మెరుగైన ర్యాంకు సాధించటం సులువు అవుతుందని అంటున్నాడు వినీత్‌ చంద్రారెడ్డి కొలుగూరి. మేనేజ్‌మెంట్‌ విద్యలో ప్రవేశాల కోసం జాతీయస్థాయిలో నిర్వహించిన ‘క్యాట్’లో ఇతడు 99.94 పర్సంటైల్‌తో సత్తా చాటాడు. క్యాట్కు సిద్ధమవ్వడంలో అభ్యర్థులు ఎదుర్కొనే సవాళ్లు, పాటించదగ్గ మెలకువలను ‘ఈనాడు-చదువు’తో పంచుకున్నాడు!

ప్రశ్న: క్యాట్లో మెరుగైన పర్సంటైల్‌ సాధించడం ఎలా సాధ్యమైంది?
జవాబు: క్యాట్లో ఈ ర్యాంకు ఎంతో శ్రమిస్తే కానీ సాధ్యపడలేదు. ఎన్‌ఐటీ భోపాల్‌లో బీటెక్‌ (ఈసీఈ) గత ఏడాది చదివేప్పుడు క్యాట్ రాశా. అప్పుడు 99.37 పర్సంటైల్‌ వచ్చింది. ఆ ర్యాంకుతో ఐఐఎం ఇండోర్‌లో సీటు వచ్చేదే. కానీ దేశంలో అగ్రగామి ఐఐఎం అహ్మదాబాద్‌లో చదవాలనే లక్ష్యంతో మళ్లీ క్యాట్కు సిద్ధమయ్యా. ఇంజినీరింగ్‌ పూర్తి కావడంతోనే క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లలో ఉద్యోగ అవకాశం వచ్చింది. పాత అనుభవాల దృష్ట్యా ఆ తప్పులు చేయకుండా ఉద్యోగం చేస్తూ రెండోసారి క్యాట్కు సిద్ధమై సాధించా.

ప్రశ్న: అటు ఉద్యోగం, ఇటు సన్నద్ధత కష్టం కాలేదా?
జవాబు: దిల్లీలో ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తూనే క్యాట్‌కు సిద్ధమయ్యా. ఉద్యోగం మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 9 వరకు. ఇక ప్రయాణంతో కలిపితే రోజూ 12 గంటలకన్నా ఎక్కువ సమయమే. దీంతో ప్రతిరోజూ ఉదయం వేళ కాసేపు సిద్ధమవుతూనే వారాంతాల్లో కనీసం మూడు మాక్‌ టెస్ట్‌లు రాసేవాడిని. మాక్‌ టెస్ట్‌లు మూడు గంటలు రాస్తే, అందులో నేను చేసిన పొరపాట్లపై నాలుగైదు గంటలు విశ్లేషించుకునేవాడిని. క్యాట్కు సిద్ధమయ్యేవారికి ఓపిక చాలా అవసరం. దీంతోపాటు మన ప్రతిభపై మనకు నమ్మకం ఉండాలి. అలా ఉద్యోగం చేస్తూనే కష్టపడి అనుకున్నది సాధించా!

ప్రశ్న: ఏ సబ్జెక్టు కష్టంగా అనిపించింది?
జవాబు: క్యాట్లోని క్వాంటిటేటివ్‌ ఎబిలిటీపై నాకు మొదటి నుంచీ పట్టుంది. కఠినమైనదంటే వెర్బల్‌ అండ్‌ రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ (వీఏఆర్‌సీ). గత సంవత్సరం దీనిలో 85 శాతం మార్కులు వస్తే ఈ సారి 99 శాతం సాధించా. మిగతా పరీక్షల్లో మాదిరి పదాల అర్థాలకు, గ్రామర్‌కు ప్రాధాన్యం ఇవ్వకుండా వీఏఆర్‌సీలో విషయావగాహన చూస్తారు. ఇందుకు ఆంగ్ల నవలలు చదివితే ఉపయోగం. వేగంగా చదివి అర్థం చేసుకోవడం తెలిసివుండాలి. అప్పుడే అధిక మార్కులు సాధించగలం. నాలుగు ఆప్షన్లలో ఏ సమాధానాలు సరైనవి కావో గుర్తిస్తే సరైనదేంటో తెలుస్తుంది. మొదటిసారి పరీక్ష రాసిన అనుభవం దృష్ట్యా ఈసారి ఆంగ్లంపై పట్టు పెంచుకున్నా. మరో సబ్జెక్టు డేటా ఇంటర్‌ప్రెటేషన్‌ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌ (డీఐఎల్‌ఆర్‌). ఇది మొత్తం పజిల్స్‌తో కూడుకున్నది. ఇందుకోసం సుడోకు సాధన చేశా. మెదడుకు మేత లాంటి ఆటలు ఆడాలి. చదరంగం ఆడేవాడిని. 2048 అనే మొబైల్‌ యాప్‌ కూడా ఉపకరించింది. పజిల్స్‌ తరచూ సాధన చేయడం వల్ల మెదడు పదునెక్కుతుంది.

ప్రశ్న: పరీక్ష రాయడంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు?
జవాబు: ఆన్‌లైన్‌ పరీక్ష ఎదుర్కోవడం సవాలే. ఎంత తెలివిగలవారైనా చిన్నచిన్న పొరపాట్ల వల్ల పరీక్షలో వెనకబడతారు. సమయం చాలా కీలకం. మిగతా పరీక్షల్లా ఒకేసారి ప్రశ్నలన్నీ తెరపై కనిపించవు. ఒక దాని తర్వాత ఒకటి వస్తుంది. కాబట్టి అయోమయానికి గురికాకుండా సమయం దృష్టిలో పెట్టుకొని సులువైన సమాధానాలు మొదట రాసి తర్వాత కఠినమైనవాటిని ఎదుర్కొన్నా. ఉదాహరణకు మొదటి రౌండులో మ్యాథ్స్‌లో 34 ప్రశ్నలుంటాయి. వీటిలో ఒక పది సులువైన జవాబులు ఉంటాయి. వాటిని సాల్వ్‌ చేశాక మిగతావి చూడాలి.

ప్రశ్న: క్యాట్కు సిద్ధమయ్యేవారికి మీ సూచనలేంటి?
జవాబు: మార్కులు సాధించడం ఒక్క రోజులో సాధ్యం కాదు. నిత్యం ఓపికగా సాధన చేస్తుంటే మార్కులు క్రమంగా పెరుగుతాయి. మాక్‌ టెస్ట్‌లు రాయడం చాలా ముఖ్యం. ఒత్తిడి అధిగమించడానికీ మాక్‌ టెస్ట్‌ ఉపకరిస్తుంది. మనం మాక్‌ టెస్ట్‌ల్లో చేసే ప్రతీ చిన్న పొరపాటు నోట్ చేసుకొని పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఎంత తెలివైన విద్యార్థి అయినా పరీక్షలో అయోమయానికి గురైతే విజయం సాధించలేరని గుర్తించి తగిన విధంగా సిద్ధం కావాలి.

ప్రశ్న: కుటుంబ నేపథ్యం?
జవాబు: నాన్న తిరుపతి రెడ్డి ఉపాధ్యాయులు. అమ్మ కవిత గృహిణి. చెల్లి బీటెక్‌ చదువుతోంది. పదో తరగతి వరకు హన్మకొండలోని వరంగల్‌ పబ్లిక్‌ స్కూల్లో, ఇంటర్మీడియట్‌ హైదరాబాద్‌ నారాయణలో చదివాను.

ప్రశ్న: ఏ ఐఐఎంలో చేరబోతున్నారు? మీ భవిష్యత్‌ లక్ష్యాలేమిటి?
జవాబు: ఐఐఎం అహ్మదాబాద్‌ మొదటి ప్రాధాన్యం. తర్వాత కోల్‌కతా. ఇక్కడ ప్రణబ్‌ ముఖర్జీ లాంటి ప్రముఖులు ఆర్థిక శాస్త్రం బోధిస్తారు. ఈ సబ్జెక్టును లోతుగా చదివి పెద్ద వ్యాపారవేత్త కావాలన్నది నా లక్ష్యం. ప్రస్తుతం తీసే సినిమాల్లో అవసరానికి మించి ఖర్చు చేస్తున్నారు. నేను సొంతంగా ప్రొడక్షన్‌ ఏర్పాటుచేసి మంచి లాభాలు గడించేవిధంగా మూవీ ప్రొడక్షన్‌ను తీర్చిదిద్ది సొంత వ్యాపారం చేస్తా.

- జి. పాండురంగశర్మ, ఈనాడు, వరంగల్‌

 

Posting on 08.01.2020

Back
Entrance Exams