TS EAMCET -2019 - Toppers

బట్టీ వ్యర్థం.. వేగం ముఖ్యం: రవిశ్రీతేజ
ఎంసెట్‌లో మంచి ర్యాంకు తెచ్చుకుంటే అభినందిస్తాం. రెండు రాష్ట్రాల ఎంసెట్‌లలోనూ టాప్‌ ర్యాంకు వస్తే ఇంకా మెచ్చుకుంటాం. మరి రెండింటిలోనూ ప్రథమ ర్యాంకు తెచ్చుకుంటే? ఆ పనే చేసి ఆశ్చర్యపరిచాడు తాడేపల్లిగూడెం విద్యార్థి కురిశేటి రవిశ్రీతేజ. బట్టీ పట్టే విధానం ఎంసెట్‌లాంటి ఏ పోటీ పరీక్షకూ సరిపోదంటున్న ఇతడు తనకీ ఘనత ఎలా సాధ్యమైందో, అందుకు తను చేసిన కృషి ఏమిటో వివరిస్తున్నాడు..!
Read More

ఐఐటీలో బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ చేస్తా -డి.చంద్రశేఖర్‌ ఎస్‌ఎస్‌, 2వ ర్యాంకు
కళాశాలలో రోజూ పది గంటలకు పైగా చదివాను. ప్రణాళికాబద్ధంగా చదవడం వల్లే ఈ ర్యాంకు సాధించాను. చదువులతో పాటు ఆటవిడుపు కోసం ఆటలు ఆడుతుంటాను. ఒలింపియాడ్‌లో అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాను. జేఈఈ మెయిన్స్‌లో 33వ ర్యాంకు వచ్చింది. ఐఐటీలో బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ చేయాలనేది నా లక్ష్యం. దిల్లీ, ముంబయి, చెన్నై..మూడింటిలో ఎక్కడైనా చేరాలని ఉంది.

చదువంటే చిన్నప్పటి నుంచీ ఆసక్తి - జిల్లెల ఆకాశ్‌రెడ్డి, 3వ ర్యాంకు
బాల్యం నుంచి చదువంటే ఎంతో ఇష్టం. ముంబయి ఐఐటీలో బీటెక్‌ చేయాలనేది నా లక్ష్యం. ఆటలంటే ఇష్టమే. బ్యాడ్మింటన్‌, టేబుల్‌ టెన్నిస్‌ ఆడతాను. జేఈఈ మెయిన్స్‌లో 117వ ర్యాంకు వచ్చింది. ఈ ర్యాంకు రావడం పట్ల ఆనందంగా ఉంది. నాన్న అశోక్‌రెడ్డి పంచాయత్‌రాజ్‌ శాఖలో డీఈగా పనిచేస్తుండగా అమ్మ డీఆర్‌డీఓలో సీనియర్‌ శాస్త్రవేత్త.

ఐఏఎస్‌ కావాలనేదే లక్ష్యం -బట్టెపాటి కార్తికేయ, 4వ ర్యాంకు
మాది నెల్లూరు. మాదాపూర్‌లోని ఓ కళాశాలలో ఇంటర్‌ చదివాను. ఎంసెట్‌లో 4వ రాం్యకు రావడం ఆనందంగా ఉంది. ఐఐటీ లక్ష్యంగానే చదివాను. జేఈఈ మెయిన్స్‌లో జాతీయ స్థాయిలో 5వ ర్యాంకు సాధించాను. అడ్వాన్స్డ్‌లో కూడా మెరుగైనా ర్యాంకే వస్తుందని అనుకుంటున్నాను. ముంబయి ఐఐటీలో బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ తీసుకుంటాను. ఐఏఎస్‌ అధికారిగా పేదలకు సేవలందించాలన్నది నా లక్ష్యం. నాన్న సురేష్‌నాయుడు అక్వా ఫార్మ్‌ నిర్వహిస్తారు. అమ్మ గృహిణి.

మంచి ర్యాంకు వస్తుందని ఊహించా -గొర్తి భానుదత్తా, 5వ ర్యాంకు
తెలంగాణ ఎంసెట్‌లో మంచి ర్యాంకు వస్తుందని ముందుగానే ఊహించాను. జేఈఈ మెయిన్స్‌లో 44వ ర్యాంకు సాధించాను. అడ్వాన్స్డ్‌లోనూ మంచి ర్యాంకు వస్తుందనే నమ్మకం ఉంది. ఇటీవల విడుదలైన ఏపీ ఎంసెట్‌ ఫలితాలో 3వ ర్యాంకు సాధించాను. మాది పశ్చిమగోదావరి జిల్లా భీమవరం. మా నాన్న నాగవెంకట విశ్వనాథ్‌ మా అమ్మ సూర్య సుందరలక్ష్మి. ఇద్దరూ ఉపాధ్యాయులే.

 

అగ్రికల్చర్‌ ర్యాంకర్ల మనోగతం

పేదలకు ఉచిత వైద్యం అందిస్తా - ఎంపటి కుశ్వంత్‌, 1వ ర్యాంకు, తెలంగాణ
తెలంగాణ ఎంసెట్‌ ఫలితాల్లో అగ్రికల్చర్‌, ఫార్మసీల్లో రాష్ట్ర మొదటి ర్యాంకు సాధించాడు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన ఎంపటి కుశ్వంత్‌. పేదింటిలో జన్మించిన ఆ విద్యా కుసుమానికి సరస్వతీ కటాక్షం లభించింది. తండ్రి అకాల మరణంతో తల్లి అనిత దర్జీ పనిచేస్తూ అతణ్ని చదివించారు. కుశ్వంత్‌ కష్టపడి చదివి తల్లి కలను సాకారం చేశాడు. అమ్మ ప్రోత్సాహంతో పాటు కళాశాల అధ్యాపకులు ప్రత్యేక శ్రద్ధ చూపించటం వల్లే మొదటి ర్యాంకు సాధించాను. ప్రతిరోజూ కనీసం 10 గంటల పాటు చదివాను. న్యూరోసర్జరీ చదివి పేదలకు ఉచిత వైద్యం అందిస్తాను.

వారంలో ఒకరోజు ఉచితంగా వైద్యం చేస్తా -దాసరి కిరణ్‌కుమార్‌రెడ్డి, 2వ ర్యాంకు, రాజమహేంద్రవరం
వైద్యవిభాగంలో తెలుగు రాష్ట్రాల ఎంసెట్‌లోనూ రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు సాధించడం గర్వంగా ఉంది. ఎయిమ్స్‌లో సీటు సాధించి కార్డియాలజీ చేయాలన్నదే నా లక్ష్యం. వారంలో ఒకరోజు ప్రజలకు ఉచితంగా వైద్యం అందించాలనుకుంటున్నా. వైద్యవిద్యలో కొత్త ఆవిష్కరణలు చేసి పేదలకు వైద్యం అందుబాటులోకి తీసుకురావాలనేది నా కల.

కార్డియాలజిస్ట్‌గా సేవలందిస్తా -వెంకటసాయి అరుణ్‌తేజ, 3వ ర్యాంకు, కాకినాడ
తెలంగాణ ఎంసెట్‌లో మూడో ర్యాంకు సాధించడం ఆనందంగా ఉంది. నేను భవిష్యత్తులో కార్డియాలిజిస్ట్‌గా సేవలందిస్తాను. ఏపీ ఎంసెట్‌ ఫలితాలలో 107వ ర్యాంకు సాధించాను. నీట్‌లో 1292 ర్యాంకు వచ్చింది. మా నాన్న న్యూరోసర్జన్‌. మాఅమ్మ గృహిణి.

ఎయిమ్స్‌లో విద్యాభ్యాసం చేస్తా - ఎస్‌.సాయి స్వాతి, 4వ ర్యాంకు, తిరుపతి
తెలంగాణ ఎంసెట్‌ ఫలితాల్లో 4వ ర్యాంకు సాధించడం సంతోషంగా ఉంది. ఎయిమ్స్‌లో వైద్య విద్యను అభ్యసించి భవిష్యత్తులో న్యూరోసర్జన్‌గా సేవలు అందించాలనేది కోరిక. నాన్న ఎస్‌.సంతోష్‌ కుమార్‌ శ్రీకాళహస్తి ఎల్‌ఐసీ కార్యాలయంలో పనిచేస్తున్నారు. అమ్మ ప్రశాంతి తిరుపతిలోని ప్రైవేట్‌ కళాశాలలో ఇంగ్లిష్‌ లెక్చరర్‌. తిరుపతిలోని బైరాగిపట్డెలో ఉంటాం. చిన్నతనం నుంచి చదువంటే ఇష్టం.

పరిశోధనలు చేయాలని ఉంది -ఆరె అక్షయ్‌, 5వ ర్యాంకు బేగంపేట, హైదరాబాద్‌
దిల్లీలోని ఎయిమ్స్‌లో మెడిసిన్‌ పూర్తి చేసి, వైద్యరంగంలో పరిశోధనలు చేయాలనేదే నా జీవితాశయం. టీఎస్‌ ఎంసెట్‌లో 5వ ర్యాంకు, నీట్‌లో 59వ ర్యాంకు సాధించాను. మా తండ్రి డాక్టర్‌ నరేంద్రకుమార్‌, తల్లి సాయిసుధ. ఎంసెట్‌లో 15లోపు ర్యాంకు వస్తుందనుకున్నా. కానీ 5వ ర్యాంకు రావడం ఆనందంగా ఉంది. ముందస్తు ప్రణాళికతోనే సిద్ధమవ్వడం ఫలితాన్నిచ్చింది.

AP EAMCET -2019 - Toppers

వారు స్థిరమైన లక్ష్యాన్ని పెట్టుకుని చిత్తశుద్ధితో శ్రమించారు. విద్యా ప్రయాణంలో మరో అడుగు ముందుకేశారు. తమ, తల్లిదండ్రుల కలల సాఫల్యానికి శ్రమించారు. ఏపీ ఎంసెట్‌లో అగ్రగణ్యులుగా నిలిచారు. ఇంజినీరింగ్‌ తొలి పది స్థానాల్లో, అగ్రికల్చర్‌, మెడికల్‌ విభాగంలో తొలి నాలుగు స్థానాల విజేతలు తమ అంతరంగాలను పంచుకున్నారు. ఇష్టంగా చదువుతూ తాము వేసుకున్న మెట్లను వివరించారు.
ఐఏఎస్‌గా సేవలందిస్తా
- కురిశేటి రవిశ్రీతేజ, ప్రథమ ర్యాంకర్‌, తాడేపల్లిగూడెం
లక్ష్యాన్ని నిర్దేశించుకుని ప్రణాళికాబద్ధంగా చదివితే ర్యాంకును సులభంగా పొందవచ్చు. అధ్యాపకులు చెప్పిన పాఠ్యాంశాలను శ్రద్ధగా వినటంతోపాటు రోజుకు పది గంటలు చదువుకునేవాణ్ని. కష్టపడి కాకుండా ఇష్టంతో చదవాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా మన గురి ఎప్పుడూ లక్ష్యంపైనే ఉండాలి. మా అమ్మానాన్నలు గీతాకుమారి, ఉమామహేశ్వరగుప్తలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రథమ ర్యాంకు సాధించా. ఐఏఎస్‌గా నిరుపేదలకు సేవ చేయాలన్నదే నా జీవితాశయం.

సరికొత్త సాఫ్ట్‌వేర్‌ ఆవిష్కరిస్తా - పి.వేదప్రణవ్‌, రెండో ర్యాంకర్‌, రంగారెడ్డి జిల్లా.
కళాశాలలో చక్కటి శిక్షణ ఫలితంగా ర్యాంకును సాధించగలిగా. మా నాన్న ఉదయ్‌కుమార్‌ ప్రైవేటు కళాశాల లెక్చరర్‌. అమ్మ శాంతి ప్రియదర్శిని గృహిణి. జేఈఈ మెయిన్స్‌లో 46వ ర్యాంకు వచ్చింది. తెలంగాణ ఎంసెట్‌ ఫలితాల కోసం నిరీక్షిస్తున్నా. ఫలితాలను బట్టి మంచి కళాశాలను ఎంపిక చేసుకొని ఇంజినీరింగ్‌ పూర్తి చేస్తా. తరువాత కమ్యూనికేషన్స్‌ రంగంలో సరికొత్త సాఫ్ట్‌వేర్‌ను ఆవిష్కరించాలనేది నా లక్ష్యం.

చరవాణి.. టీవీకి దూరం - గొర్తి భానుదత్త, మూడో ర్యాంకరు, భీమవరం.
పరీక్షలంటే నిద్ర పట్టేది కాదు. గంట నిద్రపోతే పది గంటలపాటు చదివేవాణ్ని. శిక్షణ సమయంలో అధ్యాపకులిచ్చేవాటితో పాటు నేనూ ప్రత్యేకంగా ప్రశ్నపత్రాలు తయారు చేసుకున్నా. చిన్నప్పటినుంచి చరవాణి, టీవీలకు దూరంగా ఉన్నా. మూడో తరగతిలో అబాకస్‌లో రాష్ట్ర స్థాయిలో తృతీయ స్థానం వచ్చినందుకు అమ్మానాన్న సూర్యసుందరలక్ష్మి, విశ్వనాథ్‌ బహుమతిగా కంప్యూటర్‌ కొనిచ్చారు. జేఈఈ మెయిన్స్‌లో 44వ ర్యాంకు సాధించా. అడ్వాన్డ్స్‌లోనూ మంచి ర్యాంకు వస్తుందనే నమ్మకంతో ఉన్నా. పరిశోధన రంగంలో స్థిరపడతా.

కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ చేస్తా - డి.చంద్రశేఖర ఎస్‌ఎస్‌ హెతాహవ్య, 4వ ర్యాంకరు, రంగారెడ్డి జిల్లా
మాది విజయవాడ. నాన్న మనోహర్‌ప్రసాద్‌ హోమియో వైద్యుడు. అమ్మ మణి గృహిణి. జేఈఈ మెయిన్స్‌లో 33వ ర్యాంకు వచ్చింది. ఇప్పుడు ఏపీ ఎంసెట్‌లో ఉత్తమ ర్యాంకు రావడం ఆనందంగా ఉంది. 146 మార్కులు వచ్చాయి. కంబైన్డ్‌ స్కోర్‌ 93పైన ఉంది. జేఈఈ అడ్వాన్స్డ్‌ ఫలితాల కోసం నిరీక్షిస్తున్నా. ఐఐటీ ముంబయి లేదా దిల్లీలో కంప్యూటర్‌ సైన్స్‌ చేస్తా.

జేఈఈ లోనూ అదే ర్యాంకు -బట్టెపాటి కార్తీకేయ, 5వ ర్యాంకర్‌
మాది నెల్లూరు జిల్లాలోని ఇందుకూరుపేట మండలం నర్సాపురం. నాన్న సురేష్‌నాయుడు ఫిష్‌కల్చర్‌ వ్యవసాయం చేస్తుంటారు. అమ్మ అమరావతి గృహిణి. జేఈఈ మెయిన్స్‌లోనూ ఐదో ర్యాంకు వచ్చింది. బిట్స్‌ పిలానీలో 450కి 442 మార్కులు వచ్చాయి.

ఐఐటీ బాంబేలో చదవాలని.. -రిషిషర్రఫ్‌, బిహార్‌, ఏపీ ఎంసెట్‌, ఆరో ర్యాంకు
ఐఐటీలో కంప్యూటర్‌ సైన్సు బ్రాంచి చదవడమే నా లక్ష్యం. ఐఐటీ బాంబేలో చదవాలని అనుకుంటున్నాను. జేఈఈ మెయిన్‌లో 186వ ర్యాంకు వచ్చింది. అడ్వాన్సుడ్‌లో ర్యాంకు మెరుగుపడుతుందని అనుకుంటున్నాను. ఎంసెట్‌లో కంబైన్డ్‌ స్కోరు 92.1881 వచ్చింది. మాది బిహార్‌లోని మాధేపురా అయినా... ఇక్కడికొచ్చి చదువుకున్నా.

కష్టం ఫలించింది -వెంకటకృష్ణసూర్యలిఖిత్‌, ఏడో ర్యాంకర్‌, తణుకు.
ఇంటర్‌లో చేరినప్పటి నుంచి ఎంసెట్‌కు ప్రత్యేకంగా సిద్ధమయ్యా. ఓవైపు చదువుతూ మరోవైపు ముఖ్యమైన అంశాలపై నోట్సు రాసుకునేవాణ్ని. ఇది ఎంతో ఉపకరించింది. అధ్యాపకులు, సీనియర్ల సలహాలు ఉపయోగపడ్డాయి. నా తల్లిదండ్రులు లక్ష్మీప్రియ, సత్యనారాయణ ప్రోత్సహించారు. మా స్వస్థలం పోడూరు మండలం కవిటం గ్రామం. తణుకులో ఉంటున్నాం. నా కష్టం ఫలించింది. ముంబయి ఐఐటీలో సీటు సంపాదిస్తా.

సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉన్నతోద్యోగం సాధిస్తా -అప్పకొండ అభిజిత్‌రెడ్డి, 8వ ర్యాంకరు.
మాది అనంతపురం జిల్లా హిందూపురం. నాన్న కృష్ణమోహన్‌రెడ్డి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. అమ్మ సుమతి అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌. జేఈఈ మెయిన్స్‌లో 72వ ర్యాంకు వచ్చింది. నేను నేషనల్‌ కెమిస్ట్రీ ఒలింపియాడ్‌కు ఎంపికై ముంబయి క్యాంప్‌లో ఉన్నా. ఐఐటీలో కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసి సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉన్నతోద్యోగం చేయాలని ఉంది.

మా నాన్నే స్ఫూర్తి -ఆర్యన్‌ లడ్డా, 9వ ర్యాంకు, ఏపీ ఎంసెట్‌
మా నాన్న విశాఖ నగర పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌చంద్ర లడ్డా స్ఫూర్తితో నేను కూడా సివిల్స్‌ రాయాలని నిర్ణయించుకున్నా. ఐఏఎస్‌ గానీ, ఐపీఎస్‌ గానీ సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నా. హైదరాబాదులో పదో తరగతి చదివాను. చదువుతో పాటు టెన్నిస్‌లోనూ రాణించి అనేక పతకాలను గెలుచుకున్నా. నా చదువు కోసం మా అమ్మ సునీతా లడ్డా కూడా హైదరాబాదులోనే ఉంటున్నారు. జేఈఈ అడ్వాన్స్‌ రాశా. అందులోనూ మంచి ర్యాంకు వస్తుందని ఆశిస్తున్నా. దాని ఆధారంగా ఐఐటీలో ఇంజినీరింగ్‌ చేస్తా. పోటీ పరీక్షల విషయంలో అమ్మా నాన్నా ఇద్దరూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు.

ఐఐటీయన్‌ కావడమే లక్ష్యం - హేమ వెంకట్‌ అభినవ్‌, 10వ ర్యాంకరు, కొత్తగూడెం (తెలంగాణ)
ఏపీ ఎంసెట్‌లో 141.17 మార్కులు సాధించా. ప్రణాళికాబద్ధంగా చదవడం, పాఠ్యాంశాలను ఆకళింపు చేసుకోవడం, పునశ్చరణ, కీలక అంశాల్లో విశ్లేషణ నా విజయానికి దోహదం చేశాయి. తల్లిదండ్రులు భవానీ, సునీల్‌వర్మ, గురువులు అందించిన ప్రోత్సాహం ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. జేఈఈ మెయిన్స్‌లో 466వ ర్యాంకు సాధించా. ఐఐటీయన్‌ను కావడమే లక్ష్యం.

అగ్రికల్చర్‌, మెడికల్‌ ర్యాంకర్ల మనోగతం

న్యూరోసర్జన్‌గా సేవలందించాలనేది నా లక్ష్యం-ఎస్‌.సాయిస్వాతి, 1వ ర్యాంకు, తిరుపతి
ఏపీ ఎంసెట్‌లో 154 మార్కులు వచ్చాయి. 97.23 కంబైన్డ్‌ స్కోరు సాధించా. ఎంసెట్‌తో పాటు నీట్‌ రాశా. నీట్‌లో ర్యాంకు సాధించి డాక్టర్‌ కావాలన్నదే నా ఆశయం. మా నాన్న సంతోష్‌కుమార్‌ ఎల్‌ఐసీలో అధికారి. అమ్మ ప్రశాంతి ప్రైవేటు డిగ్రీ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. అమ్మానాన్న, అక్క నాగశృతి ప్రోత్సాహంతో ర్యాంకు సాధించా.

నాన్న కల నెరవేరుస్తా -కిరణ్‌కుమార్‌రెడ్డి, 2వ ర్యాంకర్‌, రాజమహేంద్రవరం
మెడికల్‌ విభాగంలో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ర్యాంకు రావడం సంతోషంగా ఉంది. నాన్న సూర్యభాస్కర రావు రైల్వేలో ఉద్యోగి. నన్ను డాక్టర్‌ను చేయాలన్నది ఆయన కల. కార్డియాలజిస్టుగా పేరు తెచ్చుకోవాలి. గ్రామీణ ప్రజలకు వారానికోరోజు ఉచిత వైద్య సేవలందిస్తా. రోజుకు 16 గంటలపైనే కష్టపడ్డా.

 

పేదలకు ఉచిత వైద్యం అందిస్తా -సాయిప్రవీణ్‌ గుప్తా, 3వ ర్యాంకర్‌, కాతేరు, తూ.గో. జిల్లా
నీట్‌లోనూ మంచి ర్యాంకు తెచ్చుకుని ఎయిమ్స్‌లో సీటు సాధించాలన్న పట్టుదలతో ఉన్నా. నాన్న రామారావు, అమ్మ సీతామహాలక్ష్మి, మా అధ్యాపకులు నా విజయానికి సహకరించారు. పది, ఇంటర్మీడియట్‌లలో పదికి పది జీపీఏ సాధించా. 14 ఏళ్ల వయసులో చిన్నపాటి ఆరోగ్య సమస్య కారణంగా వైద్యులతో ఎక్కువసేపు గడపాల్సి వచ్చింది. అప్పుడే వైద్య వృత్తి ఎంత గౌరవప్రదమైందనేది తెలిసింది. గుండె జబ్బులున్న గ్రామీణ పేదలకు ఉచిత వైద్యం అందించాలన్నది నా లక్ష్యం.

పేదలకు సేవచేస్తా -తిప్పరాజు హసిత, 4వ ర్యాంకర్‌, హైదరాబాద్‌
నీట్‌లోనూ ఉత్తమ ర్యాంకు సాధించి వైద్యురాలినవుతా. తెలంగాణ ఎంసెట్, ఎయిమ్స్‌, నీట్ పరీక్షలను కూడా రాశా. వైద్య వృత్తి చేపట్టి పేదలకు సేవ చేయడమే నా జీవిత లక్ష్యం. మా నాన్న వేణుప్రకాశ్‌రావు ఎల్‌ఐసీలో అధికారి. ఏపీ ఎంసెట్‌లో ఉత్తమ ర్యాంకు రావడం ఆనందంగా ఉంది. 148.1764 మార్కులను సాధించా. కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే లక్ష్య సాధన సులువే.

TS EAMCET -2018 - Toppers

ఐఐటీ ముంబయిలో బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ చేస్తా : అయ్యపు వెంకట ఫణివంశీనాథ్‌, 1వ ర్యాంకు
ఐఐటీ ముంబయిలో బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌లో సీటు సాధించడమే తన లక్ష్యమని ఫణివంశీనాథ్‌ తెలిపాడు. అమ్మానాన్నలు ఎన్నడూ చదువు గురించి ఒత్తిడి చేయలేదని చెప్పాడు. కూకట్‌పల్లిలో ఉంటున్న ఫణివంశీనాథ్‌ నాన్న కుమారస్వామిగుప్తా జేఎన్‌టీయూలో ప్రొఫెసర్‌. అమ్మ కల్యాణి గృహిణి. అన్నయ్య ఐఐటీ మద్రాస్‌లో బీటెక్‌ ఫస్టియర్‌ చేస్తున్నాడు. ఫణికి జేఈఈ మెయిన్స్‌లో 85వ ర్యాంకు వచ్చింది.
సివిల్సే లక్ష్యం: గట్టు మైత్రేయ, రెండో ర్యాంకు
సివిల్స్‌కు ఎంపిక కావడమే తన లక్ష్యమని.. సివిల్స్‌ పరీక్షల వరకు ఇదే పట్టుదలతోనే చదువుతానని మైత్రేయ ధీమా వ్యక్తంచేశాడు. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం అచ్చలాపూర్‌ గ్రామానికి చెందిన మైత్రేయ ఇటీవల ఏపీ ఎంసెట్‌లోనూ 2వ ర్యాంకు, అంతకు ముందు ప్రకటించిన జేఈఈ మెయిన్స్‌లో 5వ ర్యాంకు సాధించాడు. గట్టు రాంభావ్‌, అనూరాధ దంపతుల రెండో కుమారుడు మైత్రేయ 6వ తరగతి నుంచి హైదరాబాద్‌లోనే చదువుతున్నాడు.
బీటెక్‌ సీఎస్‌ఈ చేస్తా : గోసుల వినాయక శ్రీవర్ధన్‌, 3వ ర్యాంకు
ఎంసెట్‌లో మంచి ర్యాంకు సాధించడం సంతోషంగా ఉందని.. ముంబయి ఐఐటీలో సీఎస్‌ఈ చేయాలని ఉందని శ్రీవర్ధన్‌ తెలిపాడు. హైదరాబాద్‌ మాదాపూర్‌లోని ఓ కళాశాలలో చదువుకున్న శ్రీవర్ధన్‌కు జేఈఈ మెయిన్స్‌లో 10 ర్యాంకు వచ్చింది. నాన్న లక్ష్మణ్‌రావు ముంబయిలోని బహుళ జాతి సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు.
సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌నవుతా.. హేమంత్‌కుమార్‌, 4వ ర్యాంకు
జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంకు సాధించి ముంబయి ఐఐటీలో కంప్యూటర్‌ సైన్స్‌(సీఎస్‌ఈ)లో చేరాలనుందని హేమంత్‌కుమార్‌ తెలిపాడు. సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌గా స్థిరపడాలన్నది అతడి ఆలోచన. ఆ మేరకు ర్యాంకు రాకుంటే ఫిజిక్స్‌లో పరిశోధన చేసి శాస్త్రవేత్తగా సేవలందించాలని లక్ష్యంగా నిర్ధరించుకున్నాడు. విశాఖ నగరం కంచరపాలెం గోకుల్‌నగర్‌కు చెందిన సి.హేమంత్‌కుమార్‌ జేఈఈ మెయిన్‌లో ఓపెన్‌ కేటగిరిలో జాతీయ స్థాయిలో 2వ ర్యాంక్‌ (ఓబీసీ విభాగంలో 1వ ర్యాంక్‌), ఏపీ ఎంసెట్‌లో 8వ ర్యాంకు సాధించాడు.
సమాజానికి మేలు చేస్తా: ఎస్‌.మదన్‌మోహన్‌రెడ్డి, 5వ ర్యాంకు
జేఈఈ అడ్వాన్సుడులో కూడా మంచి ర్యాంకు సాధించి ముంబయి ఐఐటీలో కంప్యూటర్స్‌ సైన్స్‌ చదివి సమాజానికి తన వంతు సేవలు అందించడమే లక్ష్యమని మదన్‌మోహన్‌రెడ్డి తెలిపాడు. సరైన ప్రణాళికతోపాటు, ఎప్పటికప్పుడు అనుమానాలు నివృత్తి చేసుకోవడం, కాన్సెప్టు అర్థం చేసుకుని చదవడం వల్ల ఈ ర్యాంకు సాధ్యమైందని తెలిపాడు. విజయవాడలోని ఆటోనగర్‌కు చెందిన మదన్‌మోహన్‌రెడ్డి ఏపీ ఎంసెట్‌లో 14వ ర్యాంకు, జేఈఈ మెయిన్స్‌లో 94వ ర్యాంకు సాధించాడు. తల్లిదండ్రులు ఎస్‌.శ్రీనివాసరెడ్డి, రాధికారాణి, తండ్రి ప్రైవేటు కళాశాలలో ఐఐటీ గణిత అధ్యాపకునిగా పని చేస్తున్నారు.
అగ్రికల్చర్‌లో మొదటి ఐదు ర్యాంకర్ల మనోగతం..
వైద్యరంగంలో స్థిరపడటమే లక్ష్యం : నమ్రత, 1వ ర్యాంకు
వైద్యరంగంలో స్థిరపడాలనేదే తన లక్ష్యమని నమ్రత తెలిపింది. కర్నూలు జిల్లాకు చెందిన నమ్రత తల్లిదండ్రులు ఇద్దరూ వైద్యులే కావడం విశేషం. తండ్రి హరిచరణ్‌ కర్నూలు వైద్య కళాశాలలో అసిస్టెంట్‌ ఫ్రొఫెసర్‌ కాగా తల్లి నివేదిత ప్రభుత్వ కంటి ఆస్పత్రిలో వైద్య నిపుణురాలిగా పనిచేస్తున్నారు. నమ్రత ఆంధ్రప్రదేశ్‌ ఎంసెట్‌లో 21వ ర్యాంకు సాధించింది.
కార్డియాలజిస్టు కావాలనుంది: సంజీవకుమార్‌రెడ్డి, 2వ ర్యాంకు
ఎయిమ్స్‌లో వైద్యవిద్యలో చేరి కార్డియాలజిస్టుగా లేదా సివిల్స్‌ సాధించి కలెక్టర్‌గా పేదలకు సేవ చేయాలనుందని సంజీవకుమార్‌రెడ్డి తెలిపాడు. అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకు వెళతానన్నాడు. కర్నూలు జిల్లా భాగ్యనగరం గ్రామానికి చెందిన సంజీవ్‌ తండ్రి వై.పద్మనాభరెడ్డి దక్షిణ మధ్య రైల్వేలో డిప్యూటీ చీఫ్‌ మెటీరియల్‌ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తూ హైదరాబాద్‌ సౌత్‌ లాలాగూడలో నివాసముంటున్నారు.
ప్రణాళికాబద్ధంగా చదివా..-సామల శ్రీఆర్యన్‌, 3వ ర్యాంకు
ప్రణాళికాబద్ధంగా చదివి మంచి ర్యాంకు సాధించానని శ్రీఆర్యన్‌ తెలిపాడు. ఎయిమ్స్‌ ప్రవేశపరీక్షలో అత్యుత్తమ ర్యాంకు సాధించి సీటు పొంది, డాక్టరు కావాలనేది తన లక్ష్యమని స్పష్టంచేశాడు. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలం మంథనికి చెందిన సామల స్వప్న, వినయ్‌కుమార్‌ (మురళి)ల కుమారుడు శ్రీఆర్యన్‌. ఏపీ ఎంసెట్‌లో 145వ ర్యాంకు సాధించాడు. పదోతరగతి దాకా ఆర్మూర్‌లో చదివిన శ్రీఆర్యన్‌ ఇంటర్‌ హైదరాబాద్‌లో చదివాడు.
డాక్టర్‌ కావాలన్నదే లక్ష్యం-చెరుపల్లి సంజన, 4వ ర్యాంకు
అమ్మానాన్న, కళాశాల అధ్యాపకుల ప్రోత్సాహం, సూచనలతోనే ఈ ర్యాంకు సాధించానని సంజన పేర్కొంది. డాక్టరు కావాలన్నదే తన లక్ష్యమని తెలిపింది. సంజనకు ఆంధ్రప్రదేశ్‌ ఎంసెట్‌లో 37వ ర్యాంకు వచ్చింది. సికింద్రాబాద్‌ అల్వాల్‌కి చెందిన సంజన తండ్రి వెంకటధర్మారెడ్డి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కాగా.. తల్లి మంజుల గృహిణి.
తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే..-ముక్తేవి జయసూర్య, ఐదో ర్యాంకు
రెండు రాష్ట్రాల ఎంసెట్‌లలోనూ ఉత్తమ ర్యాంకులు రావడం ఆనందంగా ఉందని జయసూర్య చెప్పాడు. సికింద్రాబాద్‌ పద్మారావునగర్‌కు చెందిన ముక్తేవి జయసూర్య ఏపీ ఎంసెట్‌లో 6వ ర్యాంకు, తెలంగాణాలో ఐదో ర్యాంకు సాధించాడు. తల్లిదండ్రులు ధనవాణి, గిరిజాశంకర్‌ ప్రోత్సాహంతో చిన్నప్పటి నుంచి చదువుల్లో రాణిస్తున్నానని తెలిపాడు.

AP EAMCET -2018 - Toppers

టాప్‌-10లో ఏడుగురు ఇక్కడే చదివారు
ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ఎంసెట్‌లో తెలంగాణ విద్యార్థులు సత్తాచాటారు. మే 2న‌ వెల్లడించిన ఫలితాల్లో టాప్‌-10లో ఏడు ర్యాంకులు సొంతం చేసుకున్నారు. వీరిలో కొందరు ఏపీకి చెందిన వారు ఉన్నప్పటికీ తెలంగాణలో చదువుతూ ఇక్కడే ఇంటర్‌ పరీక్షలు రాశారు. ఇంజినీరింగ్‌ విభాగంలో గట్టు మైత్రేయ 2వ ర్యాంకు, జి.వినాయక శ్రీవర్ధన్‌ 4వ, ఎస్‌.కె.వాజీద్‌ 5వ, బసవరాజు జిష్ణు 6వ, ఫణి వంశీనాథ్‌ 7వ, ఎం.విష్ణు మనోజ్ఞ 10వ, మెడిసిన్‌ విభాగంలో ఎం.జయసూర్య 6వ ర్యాంకులు సాధించారు.
నా ఎంపిక ముంబయి ఐఐటీనే : ఇంజినీరింగ్‌లో మొదటి ర్యాంకరు సూరజ్‌కృష్ణ, శ్రీకాకుళం
ముంబయి ఐఐటీనే నా తొలి ప్రాథమ్యం. జేఈఈ మెయిన్స్‌ ఫలితాల్లో 350 మార్కులతో దేశంలోనే ప్రథమ ర్యాంకును సొంతం చేసుకున్నా. ప్రస్తుత ఎంసెట్‌లోనూ 150 మార్కులు తెచ్చుకున్నా. అనుమానం తలెత్తితే దాన్ని నివృత్తి చేసుకునేవరకు నిద్రపట్టేది కాదు. ఇదే నా విజయ రహస్యం కావచ్చు. రోజుకు తొమ్మిది గంటల పాటు చదివేవాడిని. చదివింది బాగా గుర్తించుకునేవాడిని. మూడు సబ్జెక్టులకూ సమాన ప్రాధాన్యం ఇచ్చేవాడిని. చివరి పది రోజులు కెమిస్ట్రీకి కాస్త ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చా.
సివిల్‌ సర్వీసెస్‌ సాధించాలని: గట్టు మైత్రేయ(2), అచలాపురం,
నాన్న ఓ ప్రైవేటు విద్యుత్తు ప్లాంట్‌లో ఆపరేటర్‌గా పనిచేస్తున్నారు. అమ్మ గృహిణి. జేఈఈ-మెయిన్స్‌లో దేశస్థాయిలో ఐదో ర్యాంకు సాధించా. ముంబయి ఐఐటీలో చేరాలనుకుంటున్నా. భవిష్యత్తులో సివిల్‌ సర్వీసెస్‌ సాధించి ఉన్నతాధికారిగా సమాజానికి సేవ చేయాలనేదే నా లక్ష్యం.
పరిశోధనా రంగంపై ఆసక్తి : జి.వినాయక శ్రీవర్ధన్‌(4),
మా నాన్న ఇంజినీర్‌. అమ్మ గృహిణి. జేఈఈ-మెయిన్స్‌లో పదో ర్యాంకు సాధించా. మొదట్నుంచీ పరిశోధనా రంగంపైనే నాకు ఆసక్తి. రానున్న కాలంలో శాస్త్రవేత్తగా మారి దేశానికి ఉపయోగపడే పరిశోధనలు చేస్తా.
శాస్త్రవేత్తనవుతా.. ఎస్‌.కె.వాజీద్‌(5), నంద్యాల
మా స్వస్థలం ఏపీలోని నంద్యాల అయినప్పటికీ చదువంతా హైదరాబాద్‌లోనే సాగింది. జేఈఈ-మెయిన్స్‌లో 56వ ర్యాంకు సాధించా. రోజూ నమూనా పరీక్షలు రాయడం, పొరపాట్లను సరిచేసుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధిస్తున్నా. శాస్త్రవేత్తగా సేవలందించాలనేది నా జీవితాశయం.
అమ్మానాన్నల ప్రోత్సాహంతో : బసవరాజు జిష్ణు(6),
మా అమ్మానాన్నలిద్దరూ ఉపాధ్యాయులే. హైదరాబాద్‌లో చదువుకుంటున్న నేను వారి ప్రోత్సాహంతోనే ముందుకెళ్తున్నా. జేఈఈ-మెయిన్స్‌లో 79వ ర్యాంకు సాధించా. గత ఏడాది ఇంటర్నేషనల్‌ ఆస్ట్రానమీ ఒలింపియాడ్‌కూ ఎంపికయ్యా. ఎప్పటికైనా దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్త కావాలనేదే నా లక్ష్యం.
వైద్య, ఇంజినీరింగ్‌ విభాగాల్లో కార్డియాలజిస్టు కావాలన్నదే లక్ష్యం : ఆదర్శ్‌ (మెడికల్‌లో 4వ ర్యాంకు)
మాది కరీంనగర్‌. కార్డియాలజిస్టు కావాలన్నదే నా లక్ష్యం. ఏపీఎంసెట్‌ మెడికల్‌లో 4వ ర్యాంకు సాధించటం ఎంతో ఆనందంగా ఉంది. నీట్‌ పరీక్షలో 50లోపు ర్యాంకు సాధించాలన్న పట్టుదలతో చదువుతున్నా.
శస్త్రచికిత్స నిపుణుడినవుతా: ఎం.జయసూర్య (మెడికల్‌లో 6వ ర్యాంకు)
మాది హైదరాబాద్‌. నాన్న రచయిత. అమ్మ అధ్యాపకురాలు. ఇంటర్‌లో 98.4శాతం మార్కులు సాధించా. నీట్‌ రాసేందుకు సన్నద్ధమవుతున్నా. అందులో మంచి ర్యాంకు సాధించి.. వైద్య విద్యనభ్యసిస్తా. భవిష్యత్తులో శస్త్రచికిత్స నిపుణుడిని కావాలనేది నా సంకల్పం.
మెరిసి మురిసిన ముత్యాలు
ఏపీ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌, వైద్య విభాగాల్లో తొలి పది ర్యాంకర్ల మనోగతం
ఎన్నో ఆశలు, మరెన్నో ఆకాంక్షలతో రేయింబవళ్లూ శ్రమించారు. ఏపీ ఎంసెట్‌లో మెరికలుగా నిలిచారు. వైద్య, ఇంజినీరింగ్‌ విభాగాల్లో తొలి పది స్థానాల్లో తళుకులీనారు. ఈ క్రమంలో మరింత మెరుగైన భవిత దిశగా దూసుకెళ్లేందుకు సంసిద్ధులవుతున్న ఈ ప్రతిభావంతులు ‘ఈనాడు’ ముంగిట తమ మనోగతాన్ని ఆవిష్కరించారు.
తొలి పది ర్యాంకర్ల జాబితా

TELANGANA EAMCET -2017 - Toppers

తెలంగాణ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగాల్లో తొలి మూడు ర్యాంకులు సాధించిన విద్యార్థులు తమ మనోభావాలను వెల్లడించారు. భవిష్యత్తు ప్రణాళికలను వివరించారు.
* సివిల్స్‌కు ఎంపికై పేదలకు సేవ చేస్తా.. - గోరంట్ల జయంత్‌ హర్ష, టీస్ ఎంసెట్-2017 ఇంజినీరింగ్‌ మొదటి ర్యాంకు
కృషి, పట్టుదలతోనే మొదటి ర్యాంకు వచ్చింది. తెలంగాణ ఎంసెట్‌లో మంచి ర్యాంకు వస్తుందని పరీక్ష రాసిన రోజే అధ్యాకులకు, అమ్మానాన్నలకు చెప్పా. ఏపీ ఎంసెట్‌లో నాలుగో ర్యాంకు రాగా తెలంగాణ ఎంసెట్‌లో ప్రథమ ర్యాంకు రావడం ఆనందంగా ఉంది. నిత్యం 13 గంటలు చదివేవాణ్ని. ముంబయిలో సీఎస్‌ఈ చేయాలనుకుంటున్నా. బీటెక్‌ పూర్తి చేసి సివిల్స్‌ రాస్తా. ఎప్పటికైనా సివిల్‌ సర్వీసుకు ఎంపికై పేదలకు సేవ చేయాలనేది నా లక్ష్యం. మాది గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం ముత్తానపల్లి.
* అమ్మానాన్నల కష్టం వల్లే.. - కిల్లారి రాంప్రసాద్‌, టీస్ ఎంసెట్-2017 ఇంజినీరింగ్‌ రెండో ర్యాంకు
మా అమ్మానాన్నలిద్దరూ పెద్దగా చదువుకోలేకపోయినప్పటికీ నన్ను కష్టపడి చదివించారు. వారికి మంచి పేరు తేవాలన్న లక్ష్యంతో పట్టుదలగా చదివా. రోజుకు 13 గంటలు చదవడంతో పాటు అధ్యాపకులు చెప్పిన పాఠాల్ని క్రమం తప్పకుండా సాధన చేసేవాడిని. జేఈఈ మెయిన్స్‌లో జాతీయ స్థాయిలో 83వ ర్యాంకు, ఓబీసీ విభాగంలో ఎనిమిదో ర్యాంకు వచ్చింది. ఆంధ్ర ఎంసెట్‌లో 188వ ర్యాంకు రాగా.. తెలంగాణ ఎంసెట్‌ ఫలితాల్లో రెండో ర్యాంకు రావడం ఎంతో సంతోషంగా ఉంది. ముంబయి ఐఐటీలో కంప్యూటరు సైన్సు చదివి సొంతంగా సంస్థ నెలకొల్పాలన్నదే నా ఆశయం. మాది శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం లంకపేట.
* తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహంతోనే.. - అవ్వారి సాయి ఎస్‌ఎస్‌వీ భరద్వాజ్‌, టీస్ ఎంసెట్-2017 ఇంజినీరింగ్‌ మూడో ర్యాంకు
తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహంతోనే తెలంగాణ ఎంసెట్‌లో మూడో ర్యాంకు సాధించగలిగా. మాది భద్రాది కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని గౌతమీనగరం. జేఈఈ మెయిన్స్‌లో అఖిల భారత స్థాయిలో 25వ ర్యాంకు వచ్చింది. ఏపీ ఎంసెట్‌లో రెండో ర్యాంకు సాధించగా.. తెలంగాణలో మూడో ర్యాంకు వచ్చింది. రెండుచోట్లా ఉత్తమ ర్యాంకులు సాధించడం సంతోషంగా ఉంది.
* ఎయిమ్స్‌లో చదవడమే లక్ష్యం - కడిమిశెట్టి నేస్తంరెడ్డి, టీస్ ఎంసెట్-2017 అగ్రికల్చర్‌, ఫార్మసీ మొదటి ర్యాంకు
తెలంగాణ ఎంసెట్‌ అగ్రికల్చర్‌, ఫార్మసీలో మొదటి ర్యాంకు రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఎయిమ్స్‌లో సీటు సాధించడమే లక్ష్యంగా చదువుతున్నా. మాది తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణంలోని శ్రీనివాసనగర్‌. నాన్న నూకిరెడ్డి కాకినాడ ఎన్‌ఎఫ్‌సీఎల్‌లో ఇంజినీరుగా పనిచేస్తూ ఆరేళ్ల క్రితం మస్కట్‌ వెళ్లారు. చిన్నతనం నుంచి మేనమామ సత్యనారాయణరెడ్డి సంరక్షణలో ఉండి చదువుతున్నా.
* నీట్‌ ర్యాంకును బట్టి మంచి కాలేజీలో చేరతా.. - గొల్లమూడి ప్రదీత్‌సుందర్‌రెడ్డి, టీస్ ఎంసెట్-2017 అగ్రికల్చర్‌, ఫార్మసీ రెండో ర్యాంకు
తెలంగాణ ఎంసెట్‌లో 160కి 153 మార్కులతో రెండో ర్యాంకు సాధించడం చాలా ఆనందంగా ఉంది. ఏపీ ఎంసెట్‌లో 37వ ర్యాంకు వచ్చింది. త్వరలో రానున్న నీట్‌ ర్యాంకును బట్టి మంచి కళాశాలలో చేరి డాక్టర్‌ కావడమే లక్ష్యం. అమ్మానాన్నలిద్దరూ వైద్యులే. నాన్న మధుకిరణ్‌రెడ్డి న్యూరోసర్జన్‌. ఒంగోలులో ఆసుపత్రి నిర్వహిస్తున్నారు.
* కార్డియాలజిస్ట్‌ను అవుతా.. - అభినవ్‌రెడ్డి, టీస్ ఎంసెట్-2017 అగ్రికల్చర్‌, ఫార్మసీ మూడో ర్యాంకు
తెలంగాణ ఎంసెట్‌ అగ్రికల్చర్‌, ఫార్మసీలో మూడో ర్యాంకు రావడం సంతోషంగా ఉంది. ఏపీ ఎంసెట్‌లో 77వ ర్యాంకు వచ్చింది. నీట్‌ పరీక్ష ద్వారా మెడిసిన్‌లో సీటు సాధించి కార్డియాలజిస్ట్‌ లేదా అంకాలజిస్ట్‌ అవుతా. ఎయిమ్స్‌ పరీక్షలో కూడా మంచి ర్యాంకు కోసం చదువుతున్నా. ఉపాధ్యాయులైన మా అమ్మ మంజుల, నాన్న శ్రీనివాసరెడ్డిల ప్రోత్సాహం, అధ్యాపకుల సలహాలు, సూచనలతో ఏ రోజు పాఠ్యాంశాలను ఆరోజే పూర్తి చేస్తుంటా. కష్టపడి చదవడంతోనే ఈ ర్యాంకు సాధ్యమైంది. మాది సిద్దిపేట జిల్లా నంగునూరు.

TELANGANA EAMCET - III 2016 - Toppers

సాధించగలననే ఆత్మ విశ్వాసం, అమ్మానాన్నల అండదండలు ఉంటే చాలు... పరీక్షలు ఏవైనా విజయం అమ్మాయిలదే అంటున్నారు తెలంగాణ ఎంసెట్‌ ర్యాంకర్లు. అబ్బాయిల్ని తోసిరాజని.. వరసగా మొదటి మూడు ర్యాంకుల్నీ సొంతం చేసుకున్న రేగళ్ల మానస, శ్రీహారిక, తేజస్విని మనోగతం ఇది..
* వేల ర్యాంకు నుంచి.. - రేగళ్ల మానస
పరీక్షల్లో ప్రథమంగా పాటించాల్సిన నియమం సమయపాలన! ఇది చదివేటప్పుడే కాదు పరీక్ష రాసేటప్పుడూ ఎంతో ముఖ్యం అని నాకు తొలిసారి తెలంగాణ ఎంసెట్‌ రాసినప్పుడు తెలిసొచ్చింది. అప్పుడు సమయం సరిపోక... కంగారుగా ఓఎమ్‌ఆర్‌ షీటు నింపేశాను. నాలుగు వేల ర్యాంకు వచ్చింది! అలా విఫలమైన నేను ఈసారి ఎలాగైనా విజయం సాధింధచాలనే కసితో చదివాను. ఆ కష్టానికి ఫలితమే మొదటి ర్యాంకు. మా సొంతూరు విస్సన్నపేటయినా నాన్న వృత్తిరీత్యా గుడివాడలో ఉంటున్నాం. అమ్మ గృహిణి. మా చెల్లి ప్రస్తుతం ఇంటర్‌ మొదటి ఏడాది చదువుతోంది. వైద్యురాల్ని కావాలన్నదే చిన్నప్పట్నుంచీ నా లక్ష్యం. అందరూ కష్టం అన్నా నేను బైపీసీ తీసుకుని.. 986 మార్కులు సాధించా. భవిష్య అకాడమీలో శిక్షణ తీసుకున్నా. మొదటిసారి విఫలం అయినా.. రెట్టించిన ఉత్సాహంతో మళ్లీ తెలంగాణ ఎంసెట్‌కు సిద్ధమయ్యా. మొదటిసారి తెలంగాణ ఎంసెట్‌ రద్దయినా ఉదయం ఆరు నుంచి రాత్రి పది వరకూ చదవడం మానుకోలేదు. బయటకు వెళ్లడం, సరదాలూ, షికార్ల జోలికి వెళ్లలేదు. దగ్గరి బంధువుల ఇంట్లో పెళ్లిళ్లూ, శుభకార్యాలకీ దూరంగానే ఉన్నాను. మా అమ్మావాళ్ల.. అమ్మమ్మ(జేజమ్మ) పరీక్షకు ముందు రోజే చనిపోయారు. నేను వాళ్లింటికి వెళ్లడానికి కూడా కుదరలేదు. నేను ఆ బాధతోనే పరీక్ష రాశా. భవిష్యత్తులో కార్డియాలజిస్టు అవ్వాలనేది నా కోరిక. తప్పకుండా వైద్యురాలిగా మీ ముందుకొస్తాను..! అమ్మానాన్నకి ఇంతకన్నా మంచి పేరు తీసుకువస్తాను.
* అమ్మతోడుగా.. - శ్రీహారిక
అమ్మకి ఇప్పటికే ఎన్ని ఫోన్లు వచ్చాయో! అభినందనల చిట్టిసందేశాలతో తన ఫోన్‌ ఇన్‌బాక్సు కూడా నిండిపోయింది. మాది సికింద్రాబాద్‌. మధ్యతరగతి కుటుంబం. నాన్న ఓ ఫార్మాసంస్థలో ఉద్యోగి. అమ్మానాన్నలకు మేం ఇద్దరం ఆడపిల్లలం. మా చెల్లి పదో తరగతి చదువుతోంది. ఐదో తరగతి వరకూ నేను హైదరాబాద్‌లోనే చదువుకున్నా. తరవాత పదో తరగతి వరకూ ముంబయిలో చదువుకున్నా. చైతన్య నారాయణ కాలేజీలో ఇంటర్‌ చదివి 98.6 శాతం మార్కులు తెచ్చుకున్నా. అక్కడే ఎంసెట్‌ శిక్షణ తీసుకున్నా. మా ప్యాకల్టీ ఇచ్చిన షెడ్యూల్‌ ప్రకారం చదువుకున్నా. ఆడపిల్లలం కదాని అమ్మానాన్నలెప్పుడూ మా చదువుల విషయంలో వెనకడుగు వేయలేదు. మగపిల్లలతో సమానంగా చదివించడానికి తాపత్రయపడ్డారు. మంచి భవిష్యత్తుకి బాటవేశారు. మా అమ్మ నేను ఒత్తిడి ఫీలవ్వకుండా ఎప్పుడూ నాకు తోడుగా ఉండేది. వైద్యురాలిగా అమ్మానాన్నలకి ఇంకా మంచి పేరు తీసుకురావాలనేది నా లక్ష్యం.
* తొమ్మిదో తరగతి నుంచే.. - తప్పెట తేజశ్విని
మానసిక వికలాంగుల్ని.. చూసినప్పుడు వాళ్లకి ఏదో ఒక రకంగా సాయం చేయాలని ఉండేది. అందుకే వైద్యురాల్ని కావాలనుకుని బైపీసీ తీసుకుని.. ఎంస్‌ట్‌ రాశా. కష్టపడి చదివి మూడో ర్యాంకు సాధించగలిగాను. మాది కడప. నాన్న వృత్తిరీత్యా అనంతపురంలో స్థిరపడ్దాం. తొమ్మిదో తరగతి నుంచే వైద్యవిద్యకి సంబంధించి చదవడం మొదలుపెట్టా. విజయవాడ చైతన్య కాలేజీలో ఇంటర్‌పూర్తి చేశాను. ఇంటర్‌లో 987 మార్కులు వచ్చాయి. తొలిసారి ఆంధ్రా ఎంసెట్‌ కోసం శిక్షణ తీసుకున్నా. 29వ ర్యాంకు వచ్చింది. అది నాకు సంతృప్తినివ్వలేదు. తెలంగాణ ఎంసెట్‌కి ఇంట్లో ఉంటూనే సిద్ధమయ్యా. మొదటిసారి రాసినప్పుడు పదహారో ర్యాంకు వచ్చింది. అది రద్దై రెండోసారి నిర్వహించినప్పుడు ఏడో ర్యాంకు వచ్చింది. ఇదిగో ఇప్పుడు మూడో ర్యాంకు! నిర్ణీత సమయమంటూ లేకుండా.. ఇవాళ ఇంత భాగం పూర్తి చేయాలని మాత్రమే లక్ష్యం పెట్టుకుని చదివా. అందుకోసం ఎంత సమయమైనా వెచ్చించేదాన్ని. పాటలు విని ఒత్తిడిని అధిగమించేదాన్ని. భయం దరిచేరనీయకుండా పరీక్షలు రాశాను. నాకు పోటీ అంటే చాలా ఇష్టం. దాంతోనే ప్రతిదాంట్లోనూ విజయం అందుకునేందుకు ప్రయత్నించేదాన్ని. ఆ ఆత్మవిశ్వాసమే నన్ను విజేతగా నిలబెట్టింది. న్యూరాలజిస్టు అయి మానసిక వికలాంగులకు సేవ చేయాలని ఆశపడుతున్నా!

TELANGANA EAMCET 2015 - Toppers

'ఎయిమ్స్‌' పైనే టాపర్ల దృష్టి
* తెలంగాణ ఎంసెట్ (మెడిసిన్) తొలి పది ర్యాంకర్ల మనోగతమిదీ... .
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎంసెట్‌లలో ఉత్తమ ర్యాంకులు సాధించినా... అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లో ప్రవేశం పొందేందుకు సన్నద్ధమవుతున్నామని తెలంగాణ ఎంసెట్ మెడిసిన్ విభాగ తొలి పది ర్యాంకర్లు వెల్లడించారు. ర్యాంకుల సాధనకు దోహదపడిన అంశాలను వారు 'ఈనాడు'కు వివరించారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం... శ్రీచైతన్య నారాయణ సంస్థల ప్రత్యేక శిక్షణ తాము భావి వైద్యులుగా తయారుకావడానికి దోహదపడ్డాయని పేర్కొన్నారు. వారి మాటల్లోనే...
* రోజుకు 14 గంటలు సాధన చేశా - ఉప్పలపాటి ప్రియాంక, మొదటి ర్యాంకరు
మెడిసిన్‌లో మొదటి ర్యాంకు సాధించడం చాలా ఆనందంగా ఉంది. మాది ప్రకాశం జిల్లా పర్చూరు మండలం, నాగులపాలెం గ్రామం. నాన్న జగదీష్ వ్యాపారి. అమ్మ ఉమాలక్ష్మి గృహిణి. ఇంటర్‌లో 983 మార్కులు వచ్చాయి. రోజుకు 14 గంటల పాటు చదివా. ఎయిమ్స్, జిప్‌మర్ పరీక్షలకు సన్నద్ధమవుతున్నా. ఆంధ్రా మెడికల్ కళాశాలలో చేరాలనుకుంటున్నా. కార్డియాలజీ విభాగంపై ఆసక్తి ఉంది. చిత్రలేఖనం, నవలలు చదవడం నా అభిరుచులు... Read More
* మంచి వైద్యునిగా పేరు తెచ్చుకుంటా - కాడ శ్రీవిదుల్, రెండో ర్యాంకరు
మంచి వైద్యునిగా పేరు తెచ్చుకోవాలని ఉంది. స్పెషలైజేషన్‌పై ఇంకా ఆలోచించలేదు. నాన్న సత్యనారాయణ, అమ్మ రమాదేవి ఇద్దరూ వైద్యులే. ఇంటర్‌లో 981 మార్కులు వచ్చాయి. రోజుకు 8 గంటలు చదివా. జాతీయ స్థాయి పరీక్షలకు సిద్ధపడుతున్నా. అమ్మానాన్నలాగే నేనూ వైద్యుడిని కావాలనుకున్నా.
* కార్డియాలజిస్ట్ కావాలని... - వంగాల అనూహ్య, మూడో ర్యాంకరు
'ఎయిమ్స్' అందించే ఎంబీబీఎస్‌లో చేరతా. కార్డియాలజీ విభాగంలో స్పెషలైజేషన్ చేయాలని ఉంది. నాన్న పాపిరెడ్డి వ్యవసాయదారుడు. అమ్మ నాగలత ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయిని. ఇంటర్‌లో 977 మార్కులు వచ్చాయి. రోజూ 14 గంటల పాటు చదివా. తీరిక సమయాల్లో సైన్స్‌కు సంబంధించిన అంశాలు, గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు చదువుతుంటా... Read More
* జాతీయ స్థాయి సంస్థల్లో ఎంబీబీఎస్ చేస్తా - పారశెల్లి సాయితేజ, నాలుగో ర్యాంకరు
ఏపీ ఎంసెట్‌లో 84వ ర్యాంకు, తెలంగాణ ఎంసెట్‌లో నాలుగో ర్యాంకు రావడం సంతోషంగా ఉంది. మాది శ్రీకాకుళం జిల్లా పాతపట్నం. నాన్న నారాయణరావు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు. అమ్మ నీరజ గృహిణి. ఎయిమ్స్, జిప్‌మర్ తదితర జాతీయ వైద్యవిద్యా సంస్థల్లో మెడిసిన్ చేయాలని కోరిక. వాటి ప్రవేశ పరీక్షల్లో మంచి ర్యాంకు సాధనకు కృషి చేస్తున్నా.
* న్యూరాలజిస్ట్‌ను అవుతా - చెన్నూరి సాయితేజరెడ్డి, ఐదో ర్యాంకరు
ఎయిమ్స్‌లో ప్రవేశం పొందడానికి కృషి చేస్తున్నా. న్యూరాలజిస్ట్‌ను కావాలని ఉంది. నాన్న నాగిరెడ్డి, అమ్మ కళావతి ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు. ఇంటర్‌లో 984 మార్కులు సాధించా. రోజుకు 14 గంటలపాటు చదివా. వైద్యునిగా పేదలకు సేవ చేస్తా. తీరిక సమయాల్లో సాంకేతిక విజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదువుతుంటా. అన్నయ్య సాయిచరణ్‌రెడ్డి విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతున్నాడు.
* పేదలకు ఉచిత వైద్యం అందిస్తా - పైడి తేజేశ్వరరావు, ఆరో ర్యాంకరు
పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తా. మాది శ్రీకాకుళం జిల్లా రణస్థలం. నాన్న అప్పారావు రైతు. అమ్మ అరుణ గృహిణి. ఇంటర్‌లో 976 మార్కులు వచ్చాయి. రోజుకు 14 గంటల పాటు చదివా. తీరిక సమయాల్లో క్రికెట్ ఆడతా. స్వామి వివేకానంద రచనలు చదువుతుంటా.
* గుండె వైద్య నిపుణురాలినవుతా.. - పొన్నాడ నాగసత్య వరలక్ష్మి , ఏడో ర్యాంకరు
ఏపీ ఎంసెట్ ఫలితాల్లో 46వ ర్యాంకు వచ్చింది. మాది తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం. రాజమండ్రి శ్రీ చైతన్య కళాశాలలో చదివా. భవిష్యత్తులో గుండె వైద్య నిపుణురాలు కావాలన్నది నాలక్ష్యం.
* అమ్మా నాన్నల ప్రోత్సాహంతో...- బాలబోలు కీర్తన, ఎనిమిదో ర్యాంకరు
ఏపీ ఎంసెట్‌లోనూ నాకు 19వ ర్యాంకు వచ్చింది. ఎయిమ్స్, జిప్‌మర్ ప్రవేశ పరీక్షల్లో ర్యాంకుల సాధనకు కృషి చేస్తున్నా. జాతీయ స్థాయి వైద్య విద్యాసంస్థల్లో మెడిసిన్ చదవాలన్నది నా లక్ష్యం. నాన్న రమేష్, అమ్మ అనురాధ ఇద్దరూ విశాఖ కేజీహెచ్‌లో వైద్యులుగా పనిచేస్తున్నారు. నా విజయం వెనుక వారి ప్రోత్సాహం ఎంతో ఉంది.
* ఎయిమ్స్ కాకుంటే.. ఉస్మానియాలో చేరతా - అన్ష్ గుప్త, తొమ్మిదో ర్యాంకరు
మంచి న్యూరాలజిస్ట్‌గా పేరు తెచ్చుకుంటా. నాన్న మనీష్ గుప్త, అమ్మ అనామిక గుప్త ఇద్దరూ వైద్యులే. ఇంటర్‌లో 981 మార్కులు వచ్చాయి. రోజూ 8 నుంచి 10 గంటల పాటు చదివా. తీరిక వేళల్లో బాస్కెట్‌బాల్ ఆడతా. ఫ్రెండ్స్‌తో చాటింగ్, నవలలు చదవడం ఆసక్తి. ఎయిమ్స్. జిప్‌మర్ పరీక్షల్లో వచ్చే ర్యాంకులను చూసుకుని.. ఉస్మానియా వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌లో చేరతా.
* ఇది నా చిన్ననాటి కల - సిరంచెట్టి సాయిప్రీతమ్, పదో ర్యాంకరు
వైద్యుడిని కావాలనేది నా చిన్ననాటి కల. మంచి కళాశాలలో సీటు రావాలన్న సంకల్పంతో, ర్యాంకే లక్ష్యంగా చదివా. నాన్న భాస్కర్ వరంగల్‌లో వైద్యుడు. అమ్మ మాధవి గృహిణి. ఇంటర్‌లో 973 మార్కులు వచ్చాయి. రోజుకు ఎనిమిది గంటల పాటు అభ్యాసం చేశా. ఉస్మానియా వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చేయాలని ఉంది. ప్రస్తుతం ఎయిమ్స్, జిప్‌మర్ పరీక్షలకు సన్నద్ధమవుతున్నా. న్యూరాలజీ విభాగంలో స్పెషలైజేషన్ చేస్తా.

 

 

ఐఐటీలో చేరతాం... లక్ష్యం సాధిస్తాం
* తెలంగాణ ఎంసెట్ ఇంజినీరింగ్ ర్యాంకర్ల మనోగతం
న్యూస్‌టుడే యంత్రాంగం: తెలంగాణ ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగంలో అబ్బాయిలు అదరగొట్టారు. తొలి పది ర్యాంకుల్లో తొమ్మిదింటిని వారే కైవసం చేసుకున్నారు. వీరిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులూ ఉన్నారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, అధ్యాపకుల సూచనలు, ప్రణాళికాయుత సాధన వల్ల మంచి ప్రతిభ కనబరచగలిగామని పేర్కొన్నారు. వారేమన్నారంటే...
* ఐఐటీ ముంబయిలో చదివి శాస్త్రవేత్తనవుతా - మోపర్తి సాయి సందీప్, మొదటి ర్యాంకర్, కుత్బుల్లాపూర్
మొదటి ర్యాంకు సాధించినందుకు ఆనందంగా ఉంది. ఏపీ ఎంసెట్‌లోనూ ఆరో ర్యాంకు వచ్చింది. ప్రస్తుతం ముంబయిలోని ఇంటర్నేషనల్ కెమిస్ట్రీ ఒలంపియాడ్‌లో శిక్షణ పొందుతున్నా. ఐఐటీ ముంబయిలో కంప్యూటర్ సైన్స్ చదివి, శాస్త్రవేత్త కావాలన్నది నా లక్ష్యం. ఐఐటీ ప్రవేశ పరీక్షలో రెండో ర్యాంకు సాధిస్తా. మా కుటుంబం గుంటూరు జిల్లా లెమెళ్లపాటు నుంచి నగరానికి వచ్చి కుత్బుల్లాపూర్ సర్కిల్ ఆదర్శ్‌నగర్‌లో స్థిరపడింది. తమ కుమారుడికి ఊహించిన ర్యాంకే వచ్చిందని సందీప్ తల్లిదండ్రులు రవి, కృష్ణకుమారి చెప్పారు.
* కంప్యూటర్ రంగంలో మార్పులు తీసుకొస్తా - రౌతు నిహార్ చంద్ర, రెండో ర్యాంకరు, నిజాంపేట
ఐఐటీలో చదివి, అమెరికాలోని మైక్రోసాఫ్ట్ సంస్థలో సీఈవో స్థాయికి ఎదగాలన్నదే నా లక్ష్యం. సమాజానికి ఉపయోగపడే సరికొత్త కంప్యూటర్ పరిజ్ఞానాన్ని రూపొందించేందుకు కృషి చేస్తా. నా విజయం వెనుక అమ్మ విజయలక్ష్మి, నాన్న నాగేశ్వరరావుల ప్రోత్సాహం ఎంతో ఉంది. నాన్న కంప్యూటర్స్ రంగంపై పుస్తకాలు రాస్తుంటారు. మాదాపూర్‌లోని శ్రీచైతన్య నారాయణ కళాశాలలో ఇంటర్ చదివా.
* సివిల్స్ సాధనే లక్ష్యం - బోగి కీర్తన, మూడో ర్యాంకరు, బొబ్బిలి, విజయనగరం జిల్లా
ఎంసెట్‌తో పాటు ఐఐటీ ప్రవేశ పరీక్ష కూడా రాశాను. దాంట్లోనూ ర్యాంకు సాధిస్తాను. పట్టుదల, ప్రణాళికాబద్ధంగా చదివితే ర్యాంకు సాధించడం అసాధ్యమేమీ కాదు. ఇంటర్‌తోపాటే ఎంసెట్‌కూ సిద్ధపడ్డాను. నాన్న సత్యనారాయణ గుప్తా వ్యాపారి. అమ్మ గృహిణి. ఐఐటీ తర్వాత సివిల్స్ సాధించాన్నదే నా లక్ష్యం... Read More
* రెండేళ్ల కష్టానికి ప్రతిఫలమిది - జీ సాయితేజ, నాలుగో ర్యాంకరు, హైదరాబాద్
ఐఐటీ ముంబయిలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ చదవాలనుకుంటున్నా. ఇంటర్‌లో 978, జేఈఈ మెయిన్స్‌లో 320 మార్కులు వచ్చాయి. జేఈఈ తుది ఫలితాల్లోనూ మంచి ర్యాంకు వస్తుందనే నమ్మకం ఉంది. రెండేళ్ల కష్టానికి ప్రతిఫలమిది.
* ఐఐటీలో చేరతా - వెన్నపూస హేమంత్‌రెడ్డి, ఐదో ర్యాంకరు, పులివెందుల, కడప
154మార్కులతో ఐదోర్యాంకు సాధించా. జేఈఈ మెయిన్స్‌లో 299, ఇంటర్‌లో 978 మార్కులు వచ్చాయి. మాది కడప జిల్లా పులివెందుల. 'ఈనాడు నిర్వహించిన మాక్ ఎంసెట్‌లో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచా. ఐఐటీలోనే చేరతా.
* మంచి ఇంజినీరుగా పేరు తెచ్చుకుంటా - తన్నీరు శ్రీహర్ష, ఆరో ర్యాంకరు, కోదాడ, నల్గొండ
ఇది ముందే ఊహించిన ర్యాంకు. ఎంసెట్‌కు ప్రణాళికబద్ధంగా సన్నద్ధమయ్యా. అధ్యాపకుల సాయంతో ఎప్పటికప్పుడు సందేహాలను నివృత్తి చేసుకున్నా. మంచి ఇంజినీరుగా స్థిరపడి, దేశానికి సేవ చేస్తా. ఇంటర్‌లో 986, జేఈఈ మెయిన్స్‌లో 250 మార్కులు వచ్చాయి. ఐఐటీలో ఎలక్ట్రికల్ లేదా సివిల్ విభాగంలో చేరతా.
* ధ్యాసంతా చదువుపైనే - మజ్జి సందీప్‌కుమార్, ఏడో ర్యాంకరు, విజయనగరం
చిన్నతనం నుంచి చదువంటే నాకిష్టం. పట్టుదలగా చదివి రెండు రాష్ట్రాల ఎంసెట్లలోనూ పది లోపు ర్యాంకులు సాధించా. జేఈఈ మెయిన్స్‌లో 335 మార్కులు వచ్చాయి. ఐఐటీ ముంబయిలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో చేరతా.
* కొత్త ఆవిష్కరణలకు కృషి - గార్లపాటి శ్రీకర్, ఎనిమిదో ర్యాంకరు, నాచారం
ఇది ఊహించిన ర్యాంకే. ప్రణాళికాబద్ధంగా రోజుకు 9 నుంచి 12 గంటలపాటు చదివాను. ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ చదివి, సమాజాభివృద్ధికి దోహదపడే కొత్త ఆవిష్కరణలకు కృషి చేస్తా. ఏపీ ఎంసెట్‌లోనూ ఏడో ర్యాంకు వచ్చింది. నాన్న శ్రీనివాస్‌రావు వ్యాపారి. అమ్మ కృష్ణశ్రీ గృహిణి. ఇంటర్‌లో 975 మార్కులు, జేఈఈ మెయిన్స్‌లో 335 మార్కులు వచ్చాయి.
* ఐఏఎస్ కావడమే లక్ష్యం - దొంతుల అక్షిత్‌రెడ్డి, తొమ్మిదో ర్యాంకరు, వరంగల్
ఎంచుకున్న రంగంలో అందరికంటే ముందుండాలన్నదే నా ఆశయం. అందుకు తగినట్టుగానే ఎప్పటికప్పుడు సిద్ధపడుతున్నా. నేను రాసిన చాలా ప్రవేశ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులొచ్చాయి. భవిష్యత్తులో ఐఐటీ ముంబయిలో బీటెక్ పూర్తిచేసి, ఐఏఎస్ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నా.
* ఒత్తిడి లేకుండానే ర్యాంకులు సాధించా - అనిరుథ్‌రెడ్డి, పదో ర్యాంకరు, హైదరాబాద్
ర్యాంకుల కోసం తల్లిదండ్రులు ఎప్పుడూ ఒత్తిడి తీసుకురాలేదు. స్వేచ్ఛగా చదువుకునే ఈ ర్యాంకు సాధించా. ఏపీ ఎంసెట్‌లో మొదటి ర్యాంకు వచ్చింది. నాన్న శ్రీనివాస్‌రెడ్డి తెలంగాణ జెన్‌కోలో కార్యనిర్వాహక ఇంజినీరు.

Back
Entrance Exams