APPSC Group - I Toppers

 

మూసలో రాస్తే ఫలితం సున్నా..!


* పేరు: అప్పేచెర్ల నిషాంత్‌రెడ్డి, ర్యాంకు: ఒక‌టి

లక్షణమైన ఉద్యోగం. అయినా ఆ కుర్రాడికి విజయదాహం తీరలేదు. లక్షలమంది యువత పోటీ పడే గ్రూపు-1 పరీక్షలకు తానూ సన్నద్ధం అయ్యాడు. ప్రణాళిక ప్రకారం చదివి గ్రూప్‌-1 పరీక్షల్లో రెండు విజయాలు చవిచూశాడు. అప్పేచెర్ల నిషాంత్‌రెడ్డికి ఈ విజయం ఒక్క రోజులో సాధ్యం కాలేదు. పదేళ్లపాటు వివిధ పరీక్షలు రాసిన అనుభవం తోడవడంతో తొలి ప్రయత్నంలో నాలుగో ర్యాంకూ, రెండో ప్రయత్నంలో ఏకంగా రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకూ సాధించాడు. ఆ విజయగాథ అతడి మాటల్లోనే!

నా లక్ష్యం ఒక్కటే...ఎప్పటికైనా ఐఏఎస్‌ సాధించడం. సివిల్‌ సర్వీసెస్‌ సాధించాలని ప్రయత్నం చేసి గ్రూప్స్‌ వైపు అనుకోకుండా వచ్చా. వేరే రాష్ట్రాల్లో ఐఏఎస్‌గా వచ్చినా మన తెలుగు ప్రజలకు పెద్దగా ప్రయోజనం ఉండదు..ఎక్కడో ఐఏఎస్‌గా ఉండటం కంటే మన ఊళ్ళో ఎమ్మార్వోగా ఉండటం మంచిదనే మాట నాలో బలంగా నాటుకుపోయింది. అందుకే ఆరోజు నుంచి గ్రూప్‌-1 ద్వారా మంచి ర్యాంకు సాధిస్తే 7, 8 ఏళ్లకు ఏపీకేడర్‌ ఐఏఎస్‌ సాధించవచ్చు అని భావించా.
గ్రూపు-1 ప్రిలిమ్స్‌ దశ ఉత్తీర్ణతకు ముందు ఆర్‌బీఐ, స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ పరీక్షలు ఇంకా చాలా రాశా. అవన్నీ ఆబ్జెక్టివ్‌ విధానంలోవే కావడంతో ప్రిలిమ్స్‌ సులభంగా గట్టెక్కా. అప్పటికే ఉద్యోగం చేస్తున్నా. సమయం దొరికితే వీలున్నప్పుడల్లా చదివా. ప్రిలిమ్స్‌ 15 రోజుల ముందు మెయిన్స్‌కు 30 రోజుల ముందు సెలవు తీసుకొని సిద్ధమయ్యా. టైం టేబుల్‌ తయారు చేసుకున్నాను. ఏరోజుకు ఎంతెంత చదవాలో లక్ష్యం పెట్టుకున్నా. ఒత్తిడి లేకుండా స్నేహితులను ప్రతిరోజూ కలిసేవాణ్ణి.
కొత్తగా.. విభిన్నంగా!
మెయిన్స్‌లో అందరూ రాసే సమాధానాలు కాకుండా విభిన్నంగా, సరికొత్తగా రాయాలనుకున్నా. ఒక్కో ప్రశ్నకు కనీసం 1 మార్కు ఎక్కువ వస్తే అందరి కంటే కనీసం 30 మార్కుల తేడా వచ్చి నాకే అనుకూలిస్తుందని భావించా. చిన్నప్పుడు చేతిరాతపై మా అమ్మ బాగా అవగాహన కల్పించారు. అందువల్లే వేగంగా రాసినా చేతి రాత బాగా రాయగలిగాను.
లోపాలు సరిదిద్దారు
ఇటీవల వచ్చిన గ్రూపు-1 పరీక్షల్లో 4వ ర్యాంకు వచ్చింది. వ్యాసరచన సక్రమంగా రాయలేక పోయినందువల్లే మొదటిసారి 4వ ర్యాంకు వచ్చింది. రెండోసారి అన్ని పేపర్లూ బాగా రాశా. కొంత విభిన్నంగా రాయడానికి ప్రయత్నించా. జాతీయ, అంతర్జాతీయ అంశాలతో పాటు డోక్లాం, జీఎస్టీ, కరెంట్‌ అఫైర్స్‌ మీద ముందే నోట్స్‌ ప్రిపేర్‌ చేసుకొని పెట్టుకొన్నా. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఇచ్చే ప్రసంగాల్లోని ముఖ్యమైన అంశాలను వ్యాసరచన సమాధానాల్లో కొన్నిటికి జోడించా. ప్రభుత్వం చేసే ఆర్థిక సర్వే అంశాలను అవగాహన చేసుకున్నా. అందులోని అంశాలను లోతుగా చదివా. కొన్ని అంశాలు నేరుగా వచ్చాయి. గణితంలో ఎక్కువగా 131 మార్కులు వచ్చాయి.
కొడాలి భవానీశంకర్‌, వేదకుమారిల దగ్గర ప్రత్యేకంగా తర్ఫీదు పొందా. రెండు మూడు వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూలు ఇచ్చా. వారు లోపాలు సరిదిద్దారు.
పుస్తకాలు... నోట్స్‌
పుస్తకాలు బాగా చదివా. ఎక్కువగా చదివిన అంశాలను నోట్స్‌ రూపంలో సిద్ధం చేసుకున్నా. ఈనాడు ఎడిటోరియల్స్‌ బాగా ఉపయోగపడ్డాయి.
ఆర్థికశాస్త్రానికి సంబంధించి పాషా నోట్స్‌, సైన్సుకు సంబంధించి హరికృష్ణ పుస్తకాలు చదివా. కరెంట్‌ అఫైర్స్‌పై పట్టు పెంచుకోవటం ముఖ్యం. తరచూ బృంద చర్చలతోపాటు నిపుణులతో మాట్లాడటం చేశా.
కొత్తగా సన్నద్ధం కావాలి
ట్రెండ్‌ మారుతోంది. మూస ధోరణిలో సన్నద్ధం అయితే ఫలితం ఉండదు. సరికొత్తగా కరెంట్‌ అఫైర్స్‌ను చదవాలి. ఇంజినీరింగ్‌ చేసినా ఇతర సబ్జెక్టులను బ్యాలెన్సు చేసుకున్నా. చిన్నప్పటి నుంచి సోషల్‌, సైన్స్‌ ప్రాథమికాంశాలు బాగా వచ్చు. అందుకే నాకు గ్రూపు-1 కష్టం అన్పించలేదు. అనుకూల ఫలితం రావటానికి నాకు 8- 10 ఏళ్ళు పట్టింది. ఉద్యోగం చేస్తూ చదవడం వల్లే కొంత ఆలస్యం అయిందనుకున్నా. నాక్కూడా మొన్నటి వరకు అన్నీ అపజయాలే. అయినా ఆత్మవిశ్వాసం చెదరనీయలేదు.
పోటీపరీక్షల గురించి ఏమీ తెలియనివారికి కోచింగ్‌ అవసరమే. కచ్చితంగా వారికది దారి చూపుతుంది. ఎందులోనైనా కష్టపడందే విజయం రాదు. అంతిమంగా నేను చెప్పేది ఏమిటంటే తగిన కృషిచేస్తే ఆలస్యం కావొచ్చు గానీ ఫలితం రావడం మాత్రం పక్కా!
ఇంటర్వ్యూ ఎలా జరిగింది
ఇన్సూరెన్సులో పని చేస్తుండటంతో చంద్రన్న బీమా, ఇన్సూరెన్సు ఎఫ్‌డీఐల అనుమతి ఇవ్వకపోవటం గురించి అడిగారు. ‘రాష్ట్ర బడ్జెట్‌ రెండు లక్షల కోట్లు దాటుతోంది..స్పెషల్‌ స్టేటస్‌ అవసరమా?, కేంద్ర సహాయం అవసరమా?’ అనడిగారు. రాష్ట్రానికి వాగ్దానం చేశారు కాబట్టి సహాయం అవసరమే అన్నా. ఒకవేళ సహాయం చేయకున్నా రాష్ట్రం అభివృద్ధి చెందగలదని చెప్పా.

Back
Competitive Exams