APPSC Group - I Toppers

 

ఇలా నిలిచాం...గెలిచాం!


* పేరు: వెంకటరమణ, ర్యాంకు: ఒక‌టి

పరీక్ష స్థాయి కంటే పైస్థాయిలో ప్రిపేర్‌ కావాలనేది నా సలహా. గ్రూప్స్‌లో నెగ్గాలంటే..సివిల్స్‌కు సిద్ధం కావాలి.
రాష్ట్రప్రభుత్వ అత్యుత్తమ సర్వీసుకు నిర్వహించే పరీక్షలో అగ్రశ్రేణిలో నిలవడమంటే అంత సులువు కాదు. అందుకు ఏయే అంశాలు దోహదపడతాయో గమనిస్తే... భావి అభ్యర్థులకు అవి మార్గదర్శకం. మన ముందుకు ఏపీపీఎస్‌సీ గ్రూప్‌-1 (2011) మొదటి, రెండో ర్యాంకర్లు వచ్చారు. ఒకరిది ప్రకాశం జిల్లా, మరొకరిది శ్రీకాకుళం జిల్లా. స్ఫూర్తిదాయకమైన వారి ప్రిపరేషన్‌ వ్యూహాలు పరిశీలిద్దాం! భారీ పోటీలో దూసుకువెళ్ళటానికి పట్టుదలతో వారు చేసిన అలుపెరగని కృషిని తెలుసుకుందాం! వారి సూచనలతో ప్రయోజనం పొందుదాం!

‘గ్రూప్‌-1 పోస్టులా? అలాంటివి మనవల్ల కాదు’ అని ఒకప్పుడు భావించిన ఆకుల వెంకట రమణ అదే గ్రూప్‌-1 పరీక్ష రాసి ఏకంగా స్ట్టేట్‌ మొదటి ర్యాంకు సాధించాడు. అది కూడా తొలి ప్రయత్నంలోనే! ఈ గెలుపు వెనక ఏళ్ళతరబడి చేసిన కృషీ, సామాజిక అంశాల అధ్యయనమూ, క్షేత్రస్థాయి అనుభవమూ ఉన్నాయి. ఈ గ్రూప్‌-1 టాపర్‌ విజయ గాథను విందామా?
అంతర్జాలం...ఎంతో సాయం
నేను గ్రూప్స్‌ వైపు యాదృచ్ఛికంగానే వచ్చాను. ఎంవీ ఫౌండేషన్‌ అనే ఎన్‌జీఓ ద్వారా సామాజికసేవలో భాగంగా పేద పిల్లలకు బోధన చేసేటప్పుడు మాత్రం సివిల్స్‌, గ్రూప్స్‌ లాంటి పరీక్షల గురించి అస్పష్టంగా తెలిసింది. ఎన్‌జీఓలు ఎన్ని మంచి పనులు చేస్తున్నా వాటికి పరిమితులుంటాయి. కానీ ప్రభుత్వానికి ఉండవు. అది అతిపెద్ద సేవాసంస్థ. అందుకే ప్రభుత్వవ్యవస్థలో భాగం కాదల్చుకున్నాను. లోక్‌సత్తా యూత్‌ వాలంటీర్‌గా సామాజిక సమస్యలపై అధ్యయనం చేశాను. 2013-16లో హైదరాబాద్‌ పెండేకంటి లా కళాశాల నుంచి లా చదివాను. సివిల్స్‌, గ్రూప్స్‌లకు సన్నద్ధం కావటానికి అద్భుతమైన ప్రేరణనిచ్చే ఐఏఎస్‌ అధికారి ఎస్‌ఆర్‌ శంకరన్‌ గురించి తెలుసుకున్నాను. ఒక అధికారి ప్రజల జీవితాలను ఎంత బాగా మార్చగలడనేదానికి ఆయన మార్గం చూపారు. పైగా పబ్లిక్‌ సర్వీసులకు జరిపే సన్నద్ధత స్వల్పకాలంలోనే గొప్ప పరిజ్ఞానాన్ని అందిస్తుంది. అందుకే పరీక్షల ప్రిపరేషన్‌ ఆరంభించాను.
సివిల్స్‌కు కొంత కోచింగ్‌ తీసుకున్నాను గానీ, గ్రూప్స్‌కి ఎలాంటి శిక్షణా తీసుకోలేదు. పరీక్షలో నెగ్గటానికి కోచింగ్‌ తప్పనిసరేమీ కాదు. కాకపోతే అవగాహన ఆరంభానికి అది పనికొస్తుంది. ప్రస్తుత డిజిటల్‌ విప్లవ శకంలో ఆరువేల రూపాయిల స్మార్ట్‌ఫోన్‌ ఇంటర్నెట్‌ ఉంటే ఎవరైనా అవసరమైన పరిజ్ఞానం సంపాదించవచ్చు. నా ప్రిపరేషన్‌కు అంతర్జాలం (ఇంటర్నెట్‌) ఎంతగానో ఉపయోగపడింది. ఆర్‌ఎస్‌ టీవీ, బీబీసీ డిబేట్లూ, టెడ్‌ టాక్స్‌, నిపుణుల చర్చలూ పరీక్షల కోణంలో ఎంతో విలువైనవి.
నా సన్నద్ధత సందర్భంగా ఎంతోమందితో మాట్లాడాను. హేతుబద్ధ, విమర్శనాత్మక ఆలోచనా విధానాన్ని రవీంద్ర వేపాటి నాకు పరిచయం చేశారు. డా.జి.వి.రామాంజనేయులు సమాజానికి సంబంధించిన వివిధ అంశాలపై ముఖ్యంగా వ్యవసాయరంగంపై నా దృక్పథాన్ని మెరుగుపరిచారు. అమర్‌నాథ్‌ వాసిరెడ్డి పర్సనల్‌ ఇంటర్వ్యూ గైడెన్స్‌ అందించారు. తుదిఫలితాల్లో 489.5 మార్కులతో మొదటి ర్యాంకు వచ్చింది. ఒక నిర్దిష్ట ర్యాంకుకు గురిపెట్టకుండా అభ్యర్థులు తమ సామర్థ్యాన్ని మెరుగుపరచుకుంటూ ఉండటమే సరైనదని నా ఉద్దేశం. అత్యుత్తమ ప్రదర్శన ఎటూ ఉన్నతమైన ర్యాంకును తెచ్చిపెడుతుంది కదా!
విడివిడి సన్నద్ధత వద్దు!
నా ఉద్దేశంలో గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌, మెయిన్స్‌, ఇంటర్వ్యూలకు విడివిడి ప్రిపరేషన్‌ ఉండకూడదు. సమాజం, రాష్ట్రం, దేశం ఎదుర్కొనే సమస్యలకు తన పరిజ్ఞానాన్ని తార్కిక చింతనతో, లోకజ్ఞానంతో అన్వయించటం తెలిసుండాలి. ఈ మూడు అంచెలకూ ఉన్న తేడా... ప్రశ్నలను అడిగే విధానం మాత్రమే. సంబంధిత నైపుణ్యాలను సాధనతో పెంచుకోవాలి.
ప్రిలిమ్స్‌: కటాఫ్‌ 1:50 నుంచి 1:15/12కు మారిన నేపథ్యంలో ప్రిలిమ్స్‌ చాలా కష్టంగా ఉండబోతోంది. అందుకే నాణ్యమైన ప్రశ్నలను విస్తృతంగా సాధన చేయాలి. యాంత్రికంగా కాకుండా మనసును లగ్నం చేసి చదవాలి. పరీక్షకు కాన్సెప్టులపై స్పష్టత ఎంతో అవసరం. మనకు ఏది రాదనేదానిపై అవగాహన ఉండాలి. సంబంధం లేని జవాబులను తెలివిగా తొలగించటం నేర్చుకోవాలి. కంగారుగా చదవటం పనికిరాదు. ఏ ప్రశ్నపైనా మరీ ఎక్కువ సమయం వెచ్చించకుండా ‘ఆర్ట్‌ ఆఫ్‌ లీవింగ్‌ ద క్వశ్చన్‌’ తెలుసుకోవాలి. స్థూల దృష్టి లోపించిన సూక్ష్మ ఆలోచనా విధానం వల్ల ప్రయోజనం ఉండదు.
మెయిన్స్‌: దీనికి నిమిషానికి కనీసం 15 పదాల చొప్పున రైటింగ్‌ ప్రాక్టీస్‌ చాలా అవసరం. ఇది కొద్దిరోజుల్లోనో, నెలల్లోనో సాధ్యం కాదు. ముఖ్యంగా తెలుగు మీడియం నేపథ్యం నుంచి వచ్చిన నాలాంటివారికి ఎక్కువ సాధన తప్పదు. గ్రూప్స్‌ పరీక్షకు రాసే వేగం చాలా ముఖ్యం. ఎందుకంటే చాలామంది అభ్యర్థులకు తమకు తెలిసినది రాయటానిక్కూడా సమయం సరిపోదు. ఎంతోమంది పరీక్ష దగ్గరకొచ్చేవరకూ సమాచారం సేకరించటంలోనే మునిగిపోయి మాక్‌ టెస్టులు రాయకుండా పొరపాటు చేస్తుంటారు. చదవటమూ, రాయటమూ రోజూ చేయాలి. నేనైతే 60 శాతం వెయిటేజిని రైటింగ్‌కూ, 40 శాతం స్టడీకీ ఇస్తాను. ‘బెస్ట్‌’ ఆన్సర్‌ కోసం కాకుండా జవాబు సంతృప్తిగా రాయటానికి ప్రయత్నించాలి.
ఇంటర్వ్యూ: దీనికి నిజాయతీ తప్పనిసరి. ఇంటర్వ్యూలో మరీ వేగంగానో, అతి నెమ్మదిగానో జవాబులు చెప్పకూడదు. సమతూకంలో చెప్పాలి. నా ఇంటర్వ్యూలో ప్రశ్నలు లోతుగానే అడిగారు. ‘ప్రభుత్వోద్యోగులందరూ అవినీతి పరులని నేను అనుకుంటాను. ఏమంటావు?’ అని చైర్మన్‌ అడిగారు. మంచీ చెడూ అన్ని రంగాల్లో ఉంటాయని చెపుతూ ఉత్తమ అధికారుల పేర్లు కోట్‌ చేశాను. చెడు ఉదాహరణలు కూడా ఉంటాయని చెప్పాను. అవినీతి తక్కువ ఉండాలంటే.. చట్టాలను కఠినంగా అమలు చేయాలనీ, వాటి లొసుగులను ఉపయోగించుకోకుండా చూడాలనీ చెప్పాను.
‘మీడియం’పై ఆందోళనా?
ఇంటర్మీడియట్‌ వరకూ తెలుగుమీడియంలోనే చదివినప్పటికీ ఈ గ్రూప్‌-1 పరీక్షను ఇంగ్లిష్‌మీడియంలోనే రాశాను. విషయం, దాన్ని వ్యక్తీకరించటం గురించి ఆలోచించాలి కానీ, మీడియం గురించి ఆందోళనపడకూడదు. చదివే సమయాన్ని సమర్థంగా వినియోగించుకోవటం ముఖ్యం. నేను కొన్ని రోజులు కేవలం 4-5 గంటలూ, మరికొన్ని రోజుల్లో అయితే 12-13 గంటలు చదివాను. సబ్జెక్టును ప్రేమించి, నేర్చుకునే ప్రక్రియను ఆస్వాదించాలి. కాన్సెప్టులపై పునాది కోసం ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు చదివాను. మెటీరియల్స్‌పై ఆధారపడకుండా స్టాండర్డ్‌ పాఠ్యపుస్తకాలు చదివాను. యూట్యూబ్‌లో చాలా వీడియోలు ఉపయోగపడ్డాయి. ప్రభుత్వ నివేదికలెన్నో సమగ్రంగా చదివాను. ఆర్‌ఎస్‌ టీవీ, ఆలిండియా రేడియో, మృణాల్‌, జీకే టుడే, అన్‌ అకాడమీ వెబ్‌సైట్లు, ఇతర మొబైల్‌ యాప్స్‌ ఉపయోగించుకున్నాను.
ఇవి పాటిస్తే తిరుగుండదు
* అభ్యర్థులు ప్రిపరేషన్లో నిలకడపై శ్రద్ధ పెట్టాలి.
* ఇతరులు చెప్పినదాన్ని గుడ్డిగా పాటించకూడదు. దేనినైనా ప్రశ్నించి, విశ్లేషించి ఒక అభిప్రాయానికి రావాలి.
* సమాధానాలు సూటిగా, స్పష్టంగా, క్లుప్తంగా ఉండాలి.
* అడిగిన ప్రశ్న దృక్కోణంలోనే జవాబును సానుకూల దృక్పథంతో రాయాలి.
* రాజ్యాంగం, ప్రజాస్వామ్యాలపై గొప్ప విశ్వాసం ఉండాలి. మొండి పట్టుదలతో కాకుండా ప్రజానుకూల ధోరణి ప్రదర్శించాలి.
* రాజకీయపరంగా తటస్థత మరో అవసరమైన లక్షణం.
* పరీక్ష కోసం సమాచారం సేకరించటానికి పరిమితం కాకుండా జ్ఞాన సముపార్జనకు నిజమైన తపన ఉండాలి.
* సమస్యలను వివరించటమే కాకుండా పరిష్కారాలూ చెప్పగలగాలి.

Back
Competitive Exams