GATE 2020 - Toppers

 

తెలిస్తేనే చాలదు... సాధన మానొద్దు! (ఎ. పవన్‌కుమార్‌రెడ్డి)


తొలి ప్రయత్నంలో 1200 ర్యాంకు. రెండోసారి 700 ర్యాంకు. మూడోసారి సబ్జెక్టులతో సంబంధం పోకుండా జాగ్రత్తపడి.. ఒత్తిడి దూరం చేసుకుని పరీక్ష రాశాడు. ఏకంగా అఖిలభారత స్థాయిలో అత్యుత్తమ ర్యాంకును కైవసం చేసుకున్నాడు! గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (గేట్‌)లో చిత్తూరు కుర్రాడు ఎ. పవన్‌కుమార్‌రెడ్డి సక్సెస్‌ గ్రాఫ్‌ ఇది! గేట్‌ సన్నద్ధత తీరుపై అతడితో ముఖాముఖీ...

గేట్‌ రాయటానికి ప్రేరణ ఎవరు?
చదువుకోవటమంటే మొదట్నుంచీ నాకు అమితమైన ఆసక్తి. తిరుపతి శ్రీ విద్యానికేతన్‌ ఇంజినీరింగ్‌ కాలేజ్‌లో ఇంజినీరింగ్‌ (ఈసీఈ) చేశాను. ఎంటెక్‌లో చేరాలంటే గేట్‌ రాయటం అవసరం కాబట్టి పీజీ చదవాలనే కోరికే నన్ను ఈ పరీక్ష రాసేలా ప్రేరేపించింది.

ఈ పరీక్ష చాలా కష్టమనే అభిప్రాయం విద్యార్థుల్లో ఉంది. వాస్తవం ఏమిటి?
ఈ పరీక్ష కేవలం మౌలిక ఇంజినీరింగ్‌ సబ్జెక్టులపైనే ఉంటుంది. ఈ ఫండమెంటల్స్‌పై ఎంత స్పష్టత, పట్టు పెంచుకుంటే గేట్‌ అంత సులువుగా ఉంటుంది. అంతకంటే మరేమీ లేదు!

మీ సన్నద్ధత ఏ విధంగా సాగింది?
విజయం సాధించాలంటే ఎవరికైనా స్పష్టమైన దీర్ఘకాలిక లక్ష్యమూ, దాన్ని నిలిపివుంచే స్వల్పకాలిక లక్ష్యమూ ఉండాలని నమ్ముతాను. ఇంజినీరింగ్‌ ఫైనల్‌ ఇయర్‌ (2018)లో మొదటిసారి గేట్‌కు హాజరయ్యాను. 1200 ర్యాంకు వచ్చింది. మళ్లీ ఇంకో ప్రయత్నం గట్టిగా చెయ్యాలనిపించి హైదరాబాద్‌ ఏస్‌ ఇంజినీరింగ్‌ అకాడమీలో చేరాను. గేట్‌తో పాటు సమాంతరంగా ఈఎస్‌ఈ శిక్షణ కూడా తీసుకున్నా. నా సబ్జెక్టు పరిజ్ఞానం మెరుగుపడటమే కాకుండా సరైన దిశలో ప్రిపరేషన్‌ సాగేలా మార్గదర్శనం లభించింది. గేట్‌- 2019కు ఈసీఈ పుస్తకాలే కాకుండా ఈఈఈ, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ లాంటి ఇతర బ్రాంచి పుస్తకాలు కూడా సాల్వ్‌ చేసేవాణ్ణి. ఆ సంవత్సరం 700 ర్యాంకు తెచ్చుకోగలిగాను. అయితే మంచి ఐఐటీల్లో చేరటానికి ఆ ర్యాంకు సరిపోదు. ఏడాది వ్యవధిని వృథా చేసుకోలేక డీఆర్‌డీఓలో ఉద్యోగం తెచ్చుకుని, జాయినైపోయా. ఆ సంస్థలో నా పని మొత్తం ఈసీఈ కోర్‌ ఎలక్ట్రానిక్‌ సబ్జెక్టులతోనే సంబంధించినది కావటం వల్ల సబ్జెక్టులతో ‘టచ్‌’ కోల్పోలేదు. అంతకంటే మూడోసారి గేట్‌కు ప్రత్యేకంగా సిద్ధమైందేమీ లేదు. ప్రశాంతమైన మనసుతో ఒత్తిడేమీ లేకుండా గేట్‌-2020 రాశా. పరీక్ష రాసినవెంటనే ఆలిండియా ఫస్ట్‌ ర్యాంకుకు తక్కువేమీ రాదని స్పష్టంగా తెలిసిపోయింది. ర్యాంకును ముందుగానే ఊహించటం వల్లనేమో... ఫలితం చూడగానే మరీ అంత సంతోషాతిశయం ఏర్పడలేదు! ‘ఏటా ఎవరికో ఒకరికి రావలసింది, ఈ సంవత్సరం నాకు వచ్చింది, అంతే’ అనిపించింది.

గేట్‌ అభ్యర్థులు తరచూ ఎలాంటి పొరపాట్లు చేస్తుంటారు?
పోటీ పరీక్షల్లో కొత్త సమస్య ఎదురైనపుడు తన మెదడు ఎలా స్పందిస్తుందో, ఎలా ఎదుర్కొంటుందో అభ్యర్థులు తెలుసుకోవాలి. వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలు సాల్వ్‌ చేస్తేనే ఇది సాధ్యమవుతుంది. గేట్‌ అభ్యర్థుల్లో చాలామంది కేవలం కాన్సెప్టులను నేర్చుకుంటారు. ప్రశ్నలను ఎక్కువ సాల్వ్‌ చెయ్యరు. ఈ లోపం తప్పనిసరిగా సవరించుకోవాలి.

పునశ్చరణ (రివిజన్‌) పాత్ర ఎంత?
రివిజన్‌ చాలా కీలకం. దాన్ని స్మార్ట్‌ పద్ధతిలో చేయాలి. రివిజన్‌ అనగానే మన నోట్సును చాలాసార్లు చదివేసెయ్యటమే కాదు. కొత్త ప్రశ్నలను సాల్వ్‌ చేసుకుంటూ కాన్సెప్టులను రివైజ్‌ చేసుకుంటూవుండాలి. మాక్‌టెస్టులు రివిజన్‌కు ఓ మార్గం. అవి మన లోపాల విశ్లేషణకు దారిచూపిస్తాయి.

సమయ నిర్వహణను ఎలా అలవర్చుకోవాలి?
ఇచ్చిన సమయంలో అన్ని ప్రశ్నలనూ సాల్వ్‌ చేయటమెలా అన్నది కాదు; ఉన్న ప్రశ్నల్లో కచ్చితంగా తెలిసినవాటికి ఎక్కువ సమయం, సరిగా తెలియనివాటికి తక్కువ సమయం కేటాయించటం తెలుసుకోవడమే టైమ్‌ మేనేజ్‌మెంట్‌. చేయలేమనుకున్న ప్రశ్నలను విచక్షణతో వదిలేసెయ్యాలి.

గేట్‌ అభ్యర్థులకు మీ సూచనలు..?
అంచనాలూ, ఒత్తిడులూ, ఆందోళనలూ అన్నీ పరీక్ష ముందువరకే ఉంచి పరీక్ష కేంద్రంలోకి ప్రశాంతమైన మనసుతో వెళ్లండి. పరీక్ష రాయటాన్ని ఆస్వాదించండి. నేనలాగే చేసి ఈ విజయం సాధించా! లక్ష్యం విషయంలో స్థిరంగా ఉండాలి, దాన్ని సాధించేవరకూ. అంతేగానీ.. మధ్యలో పక్కదార్లు పట్టటం, వెనుదిరగటం చేయకూడదు!

* నోట్సును పదేపదే చదవటం రివిజన్‌ కాదు. ఏ ప్రశ్నలు సాల్వ్‌ చేయాలో తెలియటమే టైమ్‌ మేనేజ్‌మెంట్‌

Back
Entrance Exams