JEE (Mains) 2019 - Toppers

 

పట్టు పెంచుకో.. ర్యాంకు తెచ్చుకో!

- కార్తికేయ (జాతీయ స్థాయిలో ఐదో ర్యాంకు )
ప్రస్తుతం నేను రెండు లక్ష్యాలు పెట్టుకున్నా. ఒకటి ఐఐటీ బాంబేలో కంప్యూటర్‌ సైన్స్‌లో చేరటం. రెండోది ఇంటర్నేషనల్‌ కెమిస్ట్రీ ఒలింపియాడ్‌లో బంగారు పతకం పొందటం. మొదటి లక్ష్యం చేరువలోనే ఉంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పూర్తయ్యాక ఒలింపియాడ్‌ ఉంటుంది. దీనికి ఎంపికవ్వడం అంత సులువైనదేమీ కాదు. ఇక కెమిస్ట్రీ ఒలింపియాడ్‌ను ఎంచుకుని పోటీపడటానికి కారణం- బహశా ఇది నా అభిమాన సబ్జెక్టు అవటం కారణం.

జనవరిలో జేఈఈ రాసినపుడు నాకు 345 మార్కులు వచ్చాయి. మళ్ళీ ఏప్రిల్లో రాస్తే 340 మాత్రమే వచ్చాయి. వీటిలో అత్యుత్తమ స్కోరును బట్టి, 100 పర్సంటైల్‌ ఆధారంగా నా ర్యాంకును ప్రకటించారు. మొదటిసారి ఫలితాలు వచ్చినపుడే టాప్‌ టెన్‌ ర్యాంకులో ఉంటానని ఊహించాను. అది నిజమైంది.

నా విద్యాభ్యాసం సంగతికొస్తే... నెల్లూరు, విజయవాడల్లోని నారాయణ స్కూలులో 6 నుంచి 10 తరగతులూ, హైదరాబాద్‌ నారాయణలో ఇంటర్మీడియట్‌నూ చదివాను. పాఠశాల దశలోనే కాన్సెప్టులను చదవటం వల్ల కాలేజీకి వచ్చేసరికి సులువు అనిపించాయి. ఇంటర్‌ రెండేళ్ళలో మాత్రమే సబ్జెక్టులను చదివితే విద్యార్థికి వాటిపై పట్టు, ఆత్మవిశ్వాసం రావటం కష్టం. అందుకే విద్యార్థులు స్కూలులో ఉన్నపుడే సబ్జెక్టులపై బాగా సిద్ధమవటం మంచిది. ఇంటర్మీడియట్‌లో అయితే విరామాలతో కలిసి రోజుకు 12-13 గంటలు చదివాను.

పొరపాట్ల జాబితా
కళాశాలలో జేఈఈ మెయిన్స్‌, అడ్వాన్స్‌డ్‌, ఇంటర్నేషనల్‌ కాంపిటిషన్‌..ఇలా ఫలానా వాటికోసం అని కాకుండా సబ్జెక్టులను వాటికవే నేర్పారు. కాన్సెప్టులపై పట్టు వచ్చేలా బోధించారు. దీనివల్ల ఏ పరీక్ష అయినా బాగా రాయగలగటం సాధ్యమయింది. సబ్జెక్టుపై స్పష్టతా, అవగాహనా ఉంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. భయమనేదే ఉండదు!
జేఈఈ కోసం ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాలు బాగా చదవాలి. మ్యాథ్స్‌ కంటే ఫిజిక్స్‌, కెమిస్ట్రీలపై అవగాహనకు ఈ పుస్తకాలు తప్పనిసరి. ఎన్‌సీఈఆర్‌టీ కెమిస్ట్రీ చాలా ముఖ్యం.
తరగతి గది పాఠాలకు హాజరై నమూనా పరీక్షలు, వీక్లీ టెస్టులు రాశాను. సబ్జెక్టుల్లో అన్ని పాఠ్యాంశాలూ ముఖ్యమే. ఎప్పటి పాఠాలను అప్పుడు సాధన చేసేవాణ్ని.
పునశ్చరణ, సాధన విజయానికి చాలా అవసరం.
నమూనా పరీక్షలు రాసినప్పుడు మన అవగాహనలో, ఆచరణలో తప్పులు అర్థమవుతాయి. పొరపాట్ల జాబితా రాసుకుని, వాటి సవరించుకుంటూవుంటే పర్‌ఫెక్షన్‌ వస్తుంది. ఇలా పరీక్షలు రాస్తే సమయం సరిపోదనే ఒత్తిడి ఏమీ ఉండదు.

ఒత్తిడి నష్టదాయకం
దాదాపు విద్యార్థులందరూ జేఈఈ కోసం బాగానే ప్రిపేరవుతుంటారు. కానీ అసలు పరీక్ష రాయటం పూర్తిగా వేరు. బాగా చదివి కూడా ఒత్తిడి మూలంగా సరిగా రాయలేకపోవచ్చు. ఆ మానసిక స్థితిలో తెలిసిన ప్రశ్నలను కూడా సరిగా చదవక నష్టపోతుంటారు. ఒత్తిడి లేనట్టయితే వీరు చాలా బాగా రాయగలుగుతారు. ప్రాక్టీస్‌ టెస్టులు ఎక్కువ రాసి, పరీక్షను అలవాటు చేసుకుంటే తడబాటు లేకుండా ధీమాగా పరీక్ష రాయవచ్చు.
సబ్జెక్టుపై స్పష్టత, అవగాహన ఉంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. జేఈఈ కోసం ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాలు బాగా చదవాలి. పునశ్చరణ, సాధన విజయానికి చాలా అవసరం.

ప్రేరణ తగ్గితే...
ఐఐటీ లక్ష్యంగా సాగే సన్నద్ధత ప్రయాణంలో అప్పుడప్పుడూ ప్రేరణ తగ్గటం సహజం. మార్కులు సరిగా రాకపోయినా డిప్రెషన్‌ వస్తుంది. అలాంటపుడు అధ్యాపకులు సపోర్టుగా ఉండి నిరుత్సాహం తగ్గించేవారు. మార్కులు తక్కువ వస్తున్నాయని బాధపడకూడదనీ, నేర్చుకుంటే మెరుగైన మార్కులు తప్పకుండా వస్తాయనీ ప్రోత్సహించేవారు. నమూనా పరీక్షల్లో చేసిన తప్పులను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ సవరించుకుంటూ వచ్చా. పరీక్ష ముందు కాన్సెప్టులూ, ముఖ్యాంశాలూ మరిచిపోకుండా 10- 15 రోజులపాటు షార్ట్‌నోట్సును రిఫర్‌ చేసుకోవటం ఉపయోగం. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు మెయిన్స్‌ కంటే మించి కాన్సెప్టులపై స్పష్టత అవసరం.

Back
Entrance Exams