CA-CPT Toppers

 

సరైన దిశలో కృషి చేశా... సాధించా!

ప్రత్యేకత చూపించాలనుకున్నపుడు ముందు పలకరించేది కష్టమే. దాన్ని అధిగమిస్తే.. గెలుపు సాధ్యం. దృఢసంకల్పంతో కృషి చేస్తే మార్గం సుగమం అవుతుందని నిరూపించింది శ్రీవల్లి. ఇటీవల వెలువడిన సీపీ-ఐపీసీసీ ఫలితాల్లో అఖిలభారత స్థాయి 12వ ర్యాంకును సాధించిందీమె!
శ్రీవల్లి స్వస్థలం హైదరాబాద్‌. అమ్మ సత్య నాగవేణి. నాన్న భాస్కర్‌రెడ్డి. ఆయన అకౌంటెంట్‌గా పనిచేస్తూ ఇద్దరు కుమార్తెలను ఉన్నత స్థానంలో చూడాలనే అభిలాషతో చదివించారు. తాను చదువుకునే సమయంలో సీఏ చేయాలని కలలు కని అవి సాకారం కాక నిరుత్సాహపడ్డారు. అకౌంటెంట్‌గా స్థిరపడ్డారు. తన కలను మరోరకంగా నెరవేర్చుకోవాలనే ఆశతో పెద్ద కుమార్తె శ్రీవల్లిని సీఏ కోర్సులో చేర్చారు.
ఆమె ఇంటర్‌ ఎంఈసీలో రాష్ట్రస్థాయి ర్యాంకుతో పాటు సీఏ కోర్సులో మొదటి దశ అయిన సీపీటీలో 165 మార్కులు తెచ్చుకుంది. సీపీ-ఐపీసీసీ రెండు గ్రూపులూ ఒకేసారి పూర్తి చేయడమే కాకుండా ఏకంగా అఖిలభారత స్థాయి 12వ ర్యాంకును సాధించింది.
తన విజయ రహస్యాలను ‘చదువు’తో పంచుకుంది శ్రీవల్లి. అవి తన మాటల్లోనే చదువుదాం.
‘పదో తరగతి వరకూ హైదరాబాద్‌ వాసర విద్యాలయ హైస్కూల్లో చదవాను. పదో తరగతిలో 9.7 గ్రేడ్‌ పాయింట్లు వచ్చాయి. మా నాన్నకు సీఏ చేయాలన్నది కల. అది నా ద్వారా నెరవేర్చుకోవాలనుకున్నారు. ఎంఈసీ ద్వారా సీఏ చేయించాలని ‘మాస్టర్‌మైండ్స్‌’ సంస్థలో చేర్చారు. ఇంటర్‌ చదువుతున్నపుడే నాన్న ఆకస్మికంగా చనిపోయారు. ఎలాగైనా నాన్న కలని నిజం చేయాలి; ఎంతటి కష్టాలనైనా భరించాలి- అని ఆరోజే నిశ్చయించుకున్నాను. కానీ ఆర్థిక ఇబ్బందులు... ఆ క్లిష్ట సమయంలో అమ్మ నాకు అండగా నిలిచింది. తను ఒక గుడిలో పనిచేస్తూ నన్ను చదివించింది. మా మామయ్య రామిరెడ్డి కూడా నాకు నైతికంగా ధైర్యాన్ని అందించారు.
నాన్న లేడన్న బాధ కన్నా ఆయన కలను నిజం చేయాలన్న ఆలోచన నాలో కసిని పెంచింది. నా ప్రయత్నానికి తగ్గట్టుగా ఇంటర్లో 981 మార్కులతో రాష్ట్రస్థాయిలో రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంకు తెచ్చుకున్నాను.
ఆ తర్వాత రాసిన సీపీటీలో 200 మార్కులకు 165 మార్కులు వచ్చాయి. సరైన దిశలో కృషి చేసి చదివాను... ఐపీసీసీలో అఖిలభారత స్థాయి ర్యాంకు వచ్చింది! ఇప్పుడు నాన్న ఉంటే చాలా బాగుండేదనిపిస్తోంది. ప్రస్తుతం నేను సీఏ ఆర్టికల్‌షిప్‌లో చేరబోతున్నాను. మంచి సీఏగా జీవితంలో స్థిరపడాలన్నదే నా లక్ష్యం.
మంచి ప్రణాళిక అవసరం
సీఏ కోర్సులో రెండోదశ ఐపీసీసీ చాలా కీలకమని అందరూ అంటుంటారు. ఇది వాస్తవం. ఐపీసీసీలో చేరిన మొదటిరోజు నుంచే నిర్దిష్ట ప్రణాళికతో ముందుకువెళ్ళాలి. తుది పరీక్ష ముగిసేవరకూ అనుసరించే విద్యాప్రణాళికను ముందుగా తయారుచేసుకుని అదే ప్రణాళికకు కట్టుబడాలి. వీలైతే అన్ని సబ్జెక్టులకూ ఒకేచోట కోచింగ్‌ అందించే సంస్థలో చేరితే సమయపు వృథా నివారించవచ్చు. తరగతులు బోధించటమే కాకుండా స్టడీ అవర్స్‌, రివిజన్‌ పరీక్షల వంటివి నిర్వహించే సంస్థను ఎంచుకుంటే లక్ష్యసాధన సులువు అవుతుంది.
సీఏ కోర్సు చదివేటప్పుడు విశ్లేషణాత్మకత, సమయస్ఫూర్తి చాలా అవసరం. వీటిని అలవర్చుకోగలిగితే పరీక్షల్లో నెగ్గటం సులభమవుతుంది. తరగతులు వినేటపుడే తరగతిలో వివరించే ఉదాహరణలూ, చార్టులూ తప్పకుండా రాసుకోవాలి. రన్నింగ్‌ నోట్స్‌ రాసుకుని, పునశ్చరణ సమయంలో ప్రాక్టీస్‌ మాన్యువల్‌, రన్నింగ్‌ నోట్సు చదవాలి.
నాలుగింటిపై...
ఉన్న ఏడు సబ్జెక్టుల్లో నాలుగు సబ్జెక్టులపై ఎక్కువశాతం దృష్టిపెడితే ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు. అకౌంటింగ్‌లో చిన్నచిన్న చాప్టర్టమీద ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలి. బిజినెస్‌ లాస్‌, ఎథిక్స్‌, కమ్యూనికేషన్లో ముందుగా కమ్యూనికేషన్‌, ఎథిక్స్‌ కాన్సెప్టులను పూర్తిచేయాలి. కాస్ట్‌ అకౌంటింగ్‌, ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌లో ప్లాబ్లమ్స్‌ అధ్యయనం అవసరం. టాక్సేషన్‌ (డైరెక్ట్‌, ఇండైరెక్ట్‌ టాక్స్‌లాస్‌)లో అమెండ్‌మెంట్స్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
రోజుకో ఆడిటింగ్‌ స్టాండర్డ్‌ చదవాలి. ప్రతి స్టాండర్డ్‌కీ ఫ్లో చార్టు సిద్ధం చేసుకుంటే పునశ్చరణకు ఉపయోగం. వీలైనన్ని ప్రాక్టికల్‌ ప్రశ్నలు సాధన చేయాలి. ఐటీ, స్ట్రాటజిక్‌ మేనేజ్‌మెంట్‌లో వీలైనంతవరకూ సొంత నోట్సు, ఫ్లో చార్టులు తయారుచేసుకోవాలి. వీటిని పాటిస్తూ కష్టపడి తయారైతే విజయం సొంతమవుతుంది!
సీఏ కోర్సులో రెండోదశ ఐపీసీసీ చాలా కీలకమనేది వాస్తవం. ఐపీసీసీలో చేరిన మొదటిరోజు నుంచే నిర్దిష్ట ప్రణాళికతో ముందుకువెళ్ళాలి. తుది పరీక్ష ముగిసేవరకూ విద్యాప్రణాళికను ముందుగా తయారుచేసుకుని అదే ప్రణాళికకు కట్టుబడాలి.
పేరు: చింతారెడ్డి శ్రీవల్లి
వూరు: హైదరాబాద్‌
పదో తరగతి: 9.7 గ్రేడ్‌ పాయింట్లు
ఇంటర్మీడియట్‌: 981 మార్కులు
సీఏ సీపీటీ: 165 మార్కులు
సీపీ ఐపీసీసీ: ఆలిండియా 12వ ర్యాంకు
posted on 6.2.2017

Back
Entrance Exams