CIVILS - Toppers

 

2017 సివిల్స్ విజేత‌ల మ‌నోగ‌తాలు

అవగాహన.. సాధనలే గెలుపు సూత్రాలు!

అనుదీప్‌...
సివిల్స్‌ టాపర్‌! యువతకు సరికొత్త స్ఫూర్తి!!
ఇతడికి వైఫల్యాలు మూడుసార్లు ఎదురయ్యాయి. నిరాశ పడలేదు. పట్టుదల కనబరిచాడు. అనుకున్న లక్ష్యం కోసం ఏళ్ల తరబడి నిరంతరం శ్రమించాడు. ఐఆర్‌ఎస్‌ ఉద్యోగ శిక్షణ సమయంలో ఆయుధ‘గురి’లో చూపిన పట్టు మరింత బలాన్ని ప్రోది చేసింది. ఎక్కడా శిక్షణ తీసుకోకుండానే తీవ్రమైన పోటీలో అగ్రస్థానంలో నిలిచాడు; గెలిచాడు!
‘అధ్యయనం ఎంత ముఖ్యమో పునశ్చరణ అంతకన్నా ముఖ్యం. ఇది ఎంత బాగా చేస్తే అంతమంచి ప్రతిభను పట్టుకోవచ్చు. ఈ విషయం ఎట్టిపరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు.’
‘చెట్టు కనిపిస్తోందా..?’ ‘లేదు’. ‘కొమ్మ?’ ‘లేదు’.
‘పిట్ట కనిపిస్తోందా?’ ‘లేదు’. ‘పిట్ట కన్ను?’ ‘కనిపిస్తోంది!’

భారతంలో అర్జునుడి సునిశిత లక్ష్యశుద్ధి ఇది! అత్యున్నత పోటీపరీక్ష అయిన సివిల్‌ సర్వీసెస్‌లో నెగ్గటానికి కావలసిందిదే! తన లక్ష్యంపై అలాగే గురిపెట్టాడు అనుదీప్‌. ఐఏఎస్‌ను అత్యున్నత ప్రతిభతో సాధించగలిగాడు! సివిల్స్‌-2017లో జాతీయస్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించిన తీరు.. సన్నద్ధతలో చూపిన జోరు... విజయ రహస్యాలను ‘చదువు’తో పంచుకున్నాడు. ఆ విశేషాలు... అతడి మాటల్లోనే!
నాన్న ఉద్యోగరీత్యా విద్యుత్తు శాఖలో ఏఈగా పనిచేస్తున్నారు. చిన్నప్పటినుంచే ఆయన్ను బాగా గమనించేవాడిని. చిన్న ఉద్యోగి స్థాయిలోనే క్రమశిక్షణ, బాధ్యతాయుత విధుల్ని నాన్న నిర్వర్తిస్తుంటే అదే ఐఏఎస్‌ స్థాయి ఉద్యోగంలో ఇదే నిరతిని చూపితే బాగుంటుందన్న ఆలోచనే నన్ను ప్రేరేపించింది. ఆసక్తి పురివిప్పేలా చేసింది. సమాజానికి నానుంచి ఏదో మేలు జరగాలన్నదే నాన్న ఆలోచన. అందుకే ఇంజినీరింగ్‌ తరువాత నా లక్ష్యం ఐఏఎస్‌ అని నిర్ణయించుకున్నా. ఈ దిశగా ప్రణాళిక, పట్టుదలతో అడుగులు వేశా.
సవాళ్లను స్వీకరించే వ్యక్తిత్వం, చుట్టూ ఉన్న సమాజాన్ని గౌరవించే మనస్తత్వం చిన్నప్పటినుంచే అలవడ్డాయి. పుట్టిన పల్లె వాతావరణం, విద్యాబుద్దుల్ని అందించిన పట్టణ ప్రాంత ప్రభావం నన్ను ప్రతిభవైపు మళ్లేలా చేసాయి. ఎప్పుడైతే నాకు ఐఏఎస్‌ కల కావాలనే సంకల్పం పెరిగిందో అప్పటినుంచి నా శ్వాస..ధ్యాస. ఐఏఎస్‌ సాధించడమే! ఇందుకోసం అమ్మానాన్నలకు దూరంగా, అయిష్టంగానే నాలుగున్నరేళ్లు ఉన్నా. నా కల వారికి ఇష్టమనీ, అది గెలిస్తే వారి మనసు గెలిచినట్లేననీ భావించా.
ప్రణాళిక ప్రకారం సాగాలి..
సివిల్స్‌ ఓ సముద్రం. ముందుగా ఏమి చదవాలో, ఎలా చదవాలో అనే లక్ష్యం కచ్చితంగా ముందే నిశ్చయించుకోవాలి. మొదట ఎక్కడినుంచి చదువుతున్నామనేది కీలకం. ఎంతసేపు చదివామనే దానికన్నా ఎంత బాగా అర్థం చేసుకున్నామనేది ముఖ్యం. చదివే తీరుపై కచ్చితమైన నిర్ణయం ఉండాలి. ఒక ప్రణాళిక ప్రకారంగా చదువు పయనం సాగాలి. దిశ ఉండాలి.
వంద రకాల పుస్తకాలుంటాయి. కానీ అందులో ఏది చదవాలనే గందరగోళానికి గురికావద్దు. ఒక టాపిక్‌పై అనేక పుస్తకాలుంటాయి. అన్నీ చదవలేం. అందుకే నిర్దిష్టమైన ప్రణాళిక ఉండాలి. పరీక్షల ముందునాటికే సిలబస్‌ పూర్తయ్యేట్టు చూసుకోవాలి.
ఒకరోజు అంతర్జాతీయ అంశాలు, మరోరోజు వర్తమాన వ్యవహారాలు... ఇలా దేనికైనా వారం వారీగా ప్రణాళిక ఉండాలి. మన సామర్థ్యాలకు తగినట్లుగా సన్నద్ధమవ్వాలి. కొందరికి చరిత్ర కష్టంగా ఉండొచ్చు. వాటికి కొంచెం సమయం ఎక్కువ ఇవ్వాలి. సులువుగా ఉన్నవాటికి తక్కువ సమయాన్ని కేటాయించుకోవాలి. ఆయా అంశాలవారీగా ముందుకు వెళ్తుండాలి.
అధ్యయనం ఎంత ముఖ్యమో పునశ్చరణ అంతకన్నా ముఖ్యం. ఇది ఎంత బాగా చేస్తే అంతమంచి ప్రతిభను పట్టుకోవచ్చు. ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు. చివరి రోజు వరకూ ఏదో ఒక కొత్త మెటీరియల్‌ను చదివేద్దామని మిగతా వాటిని అన్వేషిస్తుంటారు. వాటిని చదివేందుకు ఆసక్తి చూపిస్తారు. అలాకాకుండా అప్పటికే చదివినదానిపై మరింత ఏకాగ్రత పెంచాలి. పట్టు పెంచుకోవాలి.
దురిశెట్టి అనుదీప్‌
* స్వస్థలం: చిట్టాపూర్‌ (జగిత్యాల జిల్లా)
* నివాసం: మెట్‌పల్లి (జగిత్యాల జిల్లా)
* కుటుంబం: అమ్మ జ్యోతి, నాన్న మనోహర్‌, తమ్ముడు అభినయ్‌.
* బలం: మానసికంగా దృఢంగా ఉండటం
* బలహీనత: ప్రజల ముందు మాట్లాడకపోవడం, ఇప్పుడు మాట్లాడుతున్నా.
* ఖాళీ సమయాల్లో: పుస్తకాలు చదువుతా.
* ఇష్టమైనవి: ఆటలు ఎక్కువగా ఆడతా.
ముఖ్యంగా ఫుట్‌బాల్‌
* ఇచ్చే సలహా: జీవితం ఎప్పుడూ సాఫీగా ఉండదు. ఎత్తుపల్లాలుంటాయి.
* మెచ్చే ఆహారం: అమ్మ చేసే టమాటా పెసరపప్పు
* నచ్చే ఆటగాళ్లు: రోజర్‌ ఫెదరర్‌, లైనల్‌ మెస్సీ
* ఇష్టమైన వ్యక్తి: అబ్రహాం లింకన్‌
* లక్ష్యం: మంచి పేరు తెచ్చుకోవాలి. బాధ్యతతో పనిచేయాలి. మరిన్ని శక్తియుక్తుల్ని కూడగట్టుకోవాలి.
* విలువైనది: స్నేహమే. ఒక్కో స్నేహితుడు మనకు ఒక్కో పాఠం.
ఇంటర్వూ ఇలా జరిగింది..
ముందుగానే మాక్‌ ఇంటర్వ్యూలపై శిక్షణ తీసుకోవడం వల్ల ఎక్కడా ఆత్మవిశ్వాసం సడలకుండా ఇంటర్వ్యూలో అన్ని ప్రశ్నలకూ సమాధానాలిచ్చాను. తెలిసిన విషయాన్ని స్పష్టంగా, అవసరాన్ని బట్టి విఫులంగా చెప్పే ప్రయత్నం చేశాను. చెప్పిన సమాధానాల్లోనుంచే కొన్ని ప్రశ్నలు అడిగారు. అందుకే చెప్పే సమాధానాలపై మనకు పట్టు ఉండాలి.
ఒక ప్రశ్నకు సమాధానంగా ‘మా నాన్న నాకు స్ఫూర్తి’ అని చెప్పాను. ఎందుకు..? ఎలా...? అనేది ఆసక్తికరంగా చెప్పగలిగా. నాన్న నుంచే క్రమశిక్షణ, బాధ్యతాయుత తీరును అలవర్చుకున్నానని చెప్పాను.
* గూగుల్‌ సంస్థలో ఉద్యోగాన్ని వదిలి ఐఆర్‌ఎస్‌ కొలువుకు ఎందుకు వచ్చారు..?
గూగుల్‌ సంస్థలో ఒక స్థాయిలోనే మెరుగైన సేవను చూపించాను. అదే ఐఏఎస్‌ అధికారిగా ఉత్తమమైన సమాజాన్ని నిర్మించే అవకాశం ఉంటుంది. అందుకే ఐఆర్‌ఎస్‌కు వచ్చా.
* కృత్రిమ మేధ భవిష్యత్తులో మానవ మేధను దాటి వెళ్తుందా..?
సమీప భవిష్యత్తులో మాత్రం మానవ మేధపై కృత్రిమ మేధ ప్రభావం అంతగా ఉండదు. (ఇందుకు కారణాల్నీ, ఇతర విషయాల్నీ చెప్పాను).
* ఐఆర్‌ఎస్‌లో షూటర్‌గా పతకాన్ని గెలిచారు కదా..? మంచి షూటర్‌కు ఉండాల్సిన లక్షణాలేంటి..?
ఆయుధంపై పట్టుండాలి. భద్రత గురించి తెలియాలి. దాన్ని పట్టుకోవడంతోపాటు ట్రిగర్‌ నొక్కడం, శ్వాసను పీల్చుకోవడం, లక్ష్యంపై గురిపెట్టాల్సిన తీరు ఇవన్నీ ముఖ్యం..
కొన్ని ఇతర ప్రశ్నలు...
* స్వచ్ఛభారత్‌లో ఎలాంటి మార్పులు తీసుకురావచ్చని మీ భావన..?
* మనదేశంలో మొదట ప్రజలు ఎలా స్థిరనివాసం ఏర్పరచుకున్నారు..?
* నల్ల, తెల్లజాతి జనుల మధ్య ప్రతిభ, మేధస్సు పరంగా వ్యత్యాసాలపై మీరేమంటారు..?
ఐదోసారి అనూహ్య విజయం!
ఐదో ప్రయత్నంలో నేను ఈ అనూహ్య విజయాన్ని సాధించాను. ఇందుకోసం ఎప్పటికప్పుడు కొత్త విషయాల్ని తెలుసుకున్నా. నోట్స్‌ సన్నద్ధత విషయంపై నాకు సమయం దొరికేది కాదు. అందుకే నేను చదివిన ఆంత్రపాలజీల పుస్తకంలోనే అవసరమైన అంశాల్ని అండర్‌లైన్‌ చేసుకుని చదివాను. మెటీరియల్‌ దొరకని కొన్ని టాపిక్స్‌కు మాత్రం నోట్స్‌ తయారు చేసుకున్నా.
అవసరమైతేనే నోట్స్‌కు సన్నద్ధమవ్వాలి. ప్రతి చిన్న అంశాన్నీ నోట్స్‌ కోసం కేటాయిస్తే సమయం వృథా తప్ప ప్రయోజం ఉండదని నా భావన. ఏది ఉపయోగమనేది మనమే ముందుగా గ్రహించాలి.
పాత పేపర్‌ విధానం సమయంలో మొదట జనరల్‌ స్టడీస్‌, ఆ తరువాత పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఆప్షన్‌గా ఇచ్చాను. 2013లోనే ఐఆర్‌ఎస్‌ కొలువును సాధించడంతో ఈసారి ఎక్కడా శిక్షణ తీసుకోకుండానే చదివాను. మాక్‌ ఇంటర్వ్యూ కోసం మాత్రం శిక్షణ తీసుకున్నా. నిత్యం ఒక ఆంగ్ల పత్రికతోపాటు ఆన్‌లైన్‌లో ఈనాడు దినపత్రిక చదివాను. సమకాలీన అంశాలపై అవగాహన పెంచుకున్నా. దీంతోపాటు నెలవారీగా వెలువడే చాలా పుస్తకాల్ని చదివాను.
త‌ప్పుల్ని స‌రిదిద్దుకున్నా..
నాలుగుసార్లు సివిల్స్‌ పరీక్షల్లో నేను చేసిన తప్పుల్ని తెలుసుకున్నా. మళ్లీ వాటిని ఏ కోశాన కూడా నా దరికి చేరనివ్వకుండా జాగ్రత్తపడ్డాను. తిప్పలు పెట్టిన తప్పులపై పైచేయి సాధించాను. నాచేతి రాత వేగంగా ఉండేది కాదు. చాలా నిదానంగా రాయడంవల్ల నిర్ణీత సమయంలో తెలిసిన ప్రశ్నల్ని కూడా వదిలేయాల్సివచ్చింది. అందుకే గత పరీక్షల్లో అనుకున్నవిధంగా మార్కులు రాలేదు. వేగం లేకపోవడం వల్ల పేపర్‌ సకాలంలో పూర్తయ్యేది కాదు.
అందుకే ఎలాగైనా ఈసారి సమయాన్ని సద్వినియోగపర్చుకునేలా రాత వేగాన్ని పెంచుకున్నా. ఇందుకోసం విస్తృతంగా సాధన చేశాను. రాత విషయంలో మరింత చురుగ్గా రాసేలా నైపుణ్యాన్ని పెంచుకున్నా. దీంతో అన్ని పేపర్లను పక్కాగా నిర్ణీత వ్యవధిలో పూర్తిచేయగలిగాను. దీంతోపాటు పునశ్చరణ విషయంలో మరింత జాగ్రత్తల్ని తీసుకున్నా. వ్యాసరచన కోసం గంటలతరబడి సాధన చేశాను.
అధైర్యపడవద్దు!
ఆటలో ఉన్నట్లుగానే గెలుపు ఓటములు మన జీవితాన్నీ ప్రభావితం చేస్తాయి. అందుకే వీలు దొరికితే ఆటలు ఆడతాను. మానసిక వికాసంతోపాటు శారీరక దృఢత్వం మన సొంతమవుతుంది. ఎప్పుడూ చదవడమే సరి కాదు. ఆటల్లోనే ఆ చదివిన చదువును నిలబెట్టుకునే స్థైర్యం దొరుకుతుంది.
గెలుపే మన బలమవ్వాలి. జాతీయ స్థాయిలో ప్రథమస్థానాన్ని సాధించానని నాకేదో అమితమైన ప్రతిభ ఉందని అందరూ అనుకుంటున్నారు. కానీ దీన్ని సాధించడం కోసం మూడు సార్లు ఓడిపోయాను. ఓటమినుంచే గుణపాఠం నేర్చుకున్నా. ఎంతగానో మథనపడ్డాను. అందుకే నన్ను గేలి చేసిన ఓటమిపై గెలిచేందుకు తపన పడ్డా. గెలిచి ఓటమిపై ప్రతీకారం తీర్చుకున్నాను. నా నుంచి యువత ఇదే నేర్చుకోవచ్చు. ఓటమి చెందామని ఎప్పుడూ అధైౖర్యపడొద్దు. కచ్చితంగా గెలుపు ఉంటుందని గుర్తించండి.

- తుమ్మల శ్రీనివాస్‌, ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌

ఏ ప్రశ్ననూ వదల్లేదు
రాసిన తొలి ప్రయత్నంలోనే సివిల్‌ సర్వీస్‌కు ఎంపికవటం ఒక ఎత్తయితే.. అది కూడా అఖిలభారత స్థాయిలో ఆరో స్థానంలో నిలవటం ప్రత్యేకం. ఖమ్మం జిల్లాకు చెందిన శ్రీహర్ష ఆ ఘనత సాధించాడు. వర్తమాన అంశాలను సబ్జెక్టులతో అనుసంధానం చేసి, పట్టు పెంచుకున్న ఇతడి విజయరహస్యాలు తెలుసుకుందామా?
సివిల్‌ సర్వీస్‌ అంటే ఎన్నో పోటీపరీక్షల్లో మరొకటి మాత్రమేనా? కాదు. ఇది దేశంతో, ప్రజలతో సంబంధమున్న విభిన్నమైన పరీక్ష. అందుకే సమాజానికి మేలు చేయాలనే సేవాభావం, తపన జ్వలించేవారే సివిల్స్‌లో అత్యుత్తమ కృషి చేయగలుగుతారు; ఉన్నత స్థానంలో నిలవగలుగుతారు.
చిన్ననాట ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం, పల్లెటూరు వాతావరణం, తర్వాత సమాజంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు.. వీటన్నింటినీ చూసిన శ్రీహర్షకు తన వంతుగా సమాజానికి ఏదైనా చేయాలనే తలపు ఉండేది. అదెలా అన్నదానిపై ఆలోచించేవాడు. ఈక్రమంలో చదువును ఏనాడూ నిర్లక్ష్యం చేయలేదు. జంషెడ్‌పూర్‌లోని ఎన్‌ఐటీలో బీటెక్‌ (ప్రొడక్షన్‌ ఇంజినీర్‌) పూర్తి చేశాడు. 2012 క్యాంపస్‌ ఎంపికలో రాణించి బెంగళూరులో ఓ ప్రైవేటు కంపెనీలో ప్రొడక్షన్‌ ఇంజినీర్‌గా ఉద్యోగం సంపాదించాడు. నెల తిరిగేసరికి వచ్చే లక్షల వేతనం, విదేశాల్లో ఉద్యోగ అవకాశం.. ఇలాంటి ఆకర్షణలేమీ సంతృప్తి కలిగించలేకపోయాయి. కంపెనీ పనిమీదే జపాన్‌ పర్యటనకు వెళ్లాడు. అపుడే అతడికి సివిల్స్‌పై ఆసక్తి కలిగింది. జపాన్‌లో సంస్థల నిర్వహణ, పరిపాలన దక్షత తదితర విషయాలు అతణ్ణి ఆకట్టుకున్నాయి. ఐఏఎస్‌ అధికారి అయి దేశానికి తన సేవలు ఎందుకు అందించకూడదని తనకు తాను ప్రశ్నించుకున్నాడు. ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్‌కు సిద్ధమయ్యాడు.ఆంత్రోపాలజీని ఆప్షనల్‌గా ఎంచుకున్నాడు. సివిల్స్‌ పరీక్ష రాసిన మొదటిసారే ఏకంగా ఆరో ర్యాంకు సాధించాడు.
* హార్డ్‌వర్క్‌+ స్మార్ట్‌ వర్క్‌: శ్రీహర్ష
ప్రణాళిక పక్కాగా ఉండేలా చూసుకున్నాను. ఏడు రోజుల ప్రణాళిక వేసుకుని, దానిలో రోజువారీ లక్ష్యాలు పెట్టుకునేవాణ్ణి. విస్తృత సిలబస్‌పై నియంత్రణ ఉండేలా ఇది ఉపకరించింది. ఏ టాపిక్‌ను అయినా వర్తమాన అంశాలతో అనుసంధానించి మెరుగ్గా అవగాహన చేసుకున్నాను. సమాధానాలను శక్తిమంతంగా రాయటానికి స్నేహితుల సలహాలు తీసుకున్నా.
ప్రిలిమినరీ:
* సివిల్స్‌ ప్రక్రియలో ఇది కఠినమైన దశ..అందుకే పరీక్షకు 5 నెలలముందే .సన్నద్ధత ఆరంభించాను.
* వర్తమాన అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టాను. వార్తాపత్రికలను ప్రతిరోజూ చదివాను. మాసపత్రికల ద్వారా కరంట్‌ అఫైర్స్‌ను అనుసరిస్తూ.. వాటిని క్రమం తప్పకుండా పునశ్చరణ చేసుకునేవాణ్ణి.
* పాలిటీ, మోడర్న్‌ హిస్టరీ, మ్యాప్స్‌ మొదలైన కీలక అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టాను.
* నేను చదివినవి చాలా తక్కువ పుస్తకాలే. కానీ వాటిని చాలాసార్లు అధ్యయనం చేశా. దాంతో వాటిని బాగా గుర్తుంచుకోగలిగాను. .
* ప్రాక్టీస్‌ టెస్టులను చాలా రాశాను. దాదాపు 60 ప్రిలిమినరీ టెస్టులకు హాజరయ్యాను.
* ప్రాక్టీస్‌ టెస్టులను ఎక్కువ రాయటం వల్ల సమయాన్ని ఎలా నిర్వహించుకు రావొచ్చో అర్థమైంది. నా తప్పులనూ, నెగిటివ్‌ మార్కులనూ తగ్గించుకోవటానికి ఈ పరీక్షలు సాయపడ్డాయి.
మెయిన్స్‌:
* ప్రిలిమ్స్‌ పూర్తయిన వెంటనే..పెద్దగా విరామమేదీ తీసుకుండానే మెయిన్‌ పరీక్ష ప్రిపరేషన్‌ మొదలుపెట్టాను.
* ఆప్షనల్‌ సబ్జెక్టులను బట్టే ర్యాంకు ఆధారపడివుంటుందని గ్రహించాను. అందుకే ఈ సబ్జెక్టుల అధ్యయనానికి 60-70 శాతం సమయం కేటాయించాను.
* ఆప్షనల్‌ అయిన ఆంత్రోపాలజీని బాగా సాధన చేశాను. ప్రతి వారం దీనిపై పరీక్ష రాసి, అధ్యాపకులతో దిద్దించుకునేవాణ్ణి. ఏ అంశాలపై దృష్టి కేంద్రీకరించాలో, జవాబులను ఎలా రాయాలో దీనివల్ల అవగాహన అయింది.
* డయాగ్రమ్‌లనూ, ఫ్లో చార్టులనూ జవాబుల్లో ఉపయోగించాను. నా ఆలోచనలను చక్కగా వ్యక్తం చేయటానికి ఇవి ఉపయోగపడ్డాయి.
* జనరల్‌ స్టడీస్‌ పేపర్లలో జవాబులు పకడ్బందీగా ఉండటానికి కొన్ని ప్రామాణిక సమాధానాల మోడల్స్‌ను అనుసరించాను.
* ప్రాక్టీసు పరీక్షల ద్వారా సమయ నిర్వహణా, జవాబుల్లో పదాల పరిమితిని పాటించటం అలవడింది.
* వీలైనన్ని ఉదాహరణలను వాడుతూ మెరుగ్గా జవాబులు రాయటానికి కృషిచేశాను.
* ఎస్సే అంశానికి సంబంధించిన స్థూల చిత్రం ఇవ్వటానికి ప్రయత్నించాను. ఆరకంగా సంబంధిత కోణాలన్నిటినీ స్పృశించాను.
* పరీక్షలో అన్ని ప్రశ్నలూ రాయటంపై శ్రద్ధ తీసుకున్నాను. ఏ ప్రశ్ననూ రాయకుండా వదల్లేదు.
మౌఖిక పరీక్ష: ‘జపాన్‌, ఇండియా పరిపాలనలో తేడాలు ఏమిటీ?, చిన్న రాష్ట్రాలు చేస్తే మంచిదేనా? కాదా? బ్రెజిల్‌, ఇండియాలకు మధ్య తేడాలు ఏమిటీ?’ మొదలైన ప్రశ్నలు సివిల్స్‌ ఇంటర్వ్యూలో అడిగారు. అన్నిటినీ తడుముకోకుండా విశ్లేషించాను. .
సివిల్స్‌ రాయబోయేవారికి ఆశావహ దృక్పథం చాలా అవసరం. లక్ష్యంవైపు గురి ఉండాలి.స్వీయ ప్రేరణ పొందుతుండాలి. జవాబులను పదపదే రాస్తుండటం చాలా ప్రధానం. అలాగే సన్నద్ధతలో నిలకడ ఉండాలి. అపుడే హార్డ్‌వర్క్‌, స్మార్ట్‌ వర్కుల సమ్మేళనం ప్రయోజనకరంగా ఉంటుంది. సివిల్స్‌ రాసిన అభ్యర్థుల సూచనలూ, సలహాలూ ఉపయోగపడతాయి.

- సిద్దిరాం ప్రభుప్రసాద్‌, ఈనాడు- ఖమ్మం

శిక్షణ తీసుకోకుండా... సివిల్స్‌ టాపర్‌గా
రెండేళ్ల పిల్లాడిని పుట్టింట్లో వదిలేసి... సరదాలన్నీ మానేసి... దాదాపు ఆర్నెల్లు పుస్తకాలే తన ప్రపంచంగా మార్చుకుంది. ఆ త్యాగం, కష్టం ఆమెకు అసాధారణ గుర్తింపునే తెచ్చిపెట్టాయి. తాజాగా వచ్చిన సివిల్స్‌ ఫలితాల్లో... మహిళా అభ్యర్థుల్లో మొదటి ర్యాంకు... దేశంమొత్తంమీద రెండో ర్యాంకు ఆమె సొంతమైంది. ఆమే హరియాణాకు చెందిన అనూకుమారి. తన గురించి వసుంధరకు చెప్పుకొచ్చిందిలా...
మాది హరియాణా. నాన్న ప్రభుత్వాసుపత్రిలో హెచ్‌ఆర్‌ మేనేజరుగా పనిచేసేవారు. అమ్మ ఇంట్లోనే ఉంటుంది. మేం నలుగురం. అక్క, నేను, ఇద్దరు తమ్ముళ్లు. మాది సాదాసీదా కుటుంబమే అయినా... నాన్నకు మొదటినుంచీ నేను పెద్ద చదువులు చదవాలని ఉండేది. నాన్న అందించిన ప్రోత్సాహంతోనే అలా దిల్లీ హిందూ కళాశాలలో ఫిజిక్స్‌లో డిగ్రీ పూర్తిచేసి, ఆ తరువాత ఐఎమ్‌టీ నాగ్‌పూర్‌లో ఎంబీఏ చదివా. మహిళలకు నా వంతుగా ఏదయినా చేయాలని చిన్నప్పటినుంచీ అనుకునేదాన్ని. సివిల్స్‌ ఆలోచన ముందునుంచీ ఉన్నా నా చదువు పూర్తయ్యే సమయానికి నాన్న రిటైర్డ్‌ కావడంతో వాళ్లకు సాయంగా ఉండేందుకు ఉద్యోగంలో చేరా. రెండేళ్లు పనిచేశా. ఆ తరువాత వరుణ్‌ దహియాతో పెళ్లయ్యింది. మా అత్తగారిది సోనిపట్‌ అనే చిన్న ఊరు. ఆ తరువాత కూడా నేను ఉద్యోగం చేసినా... సివిల్స్‌ రాయాలన్న లక్ష్యంతో మానేశా. అయితే దానికోసం చాలా సవాళ్లనే ఎదుర్కొన్నా అనుకోండి.
పుట్టినరోజుకీ వెళ్లలేదు...
మేముండే చోట దినపత్రికా రాదు. బాబు వియాన్‌ దహియా పుట్టాడు. కానీ మనసులో ఏదో వెలితిగా ఉండేది. చదువుకోవాలనిపించింది. ముఖ్యంగా సివిల్స్‌ రాయాలని అనిపించింది. ఇదే విషయాన్ని ఇంట్లోవాళ్లకు చెబితే ప్రోత్సహించారు. అప్పుడు బాబుకు రెండేళ్లు. అమ్మ వాడిని చూసుకుంటానని చెప్పడంతో పుట్టింట్లోనే వదిలేశా. అయితే అంతచిన్నపిల్లాడిని వదిలేసి ఎలా ఉండాలో తెలియలేదు. అప్పుడు అమ్మ ‘అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే కొన్నింటిని తాత్కాలికంగా త్యాగం చేయాల్సిందే’ అని చెప్పింది. అలా వాడిని మా అమ్మ తీసుకువెళ్లిపోయింది. కొన్నిరోజులు మనసంతా వాడిపైనే ఉన్నా, బాధనిపించినా చదువుకోవడం మొదలుపెట్టా. ఆర్నెల్లకోసారీ పిల్లాడిని చూడలేకపోయేదాన్ని. కారణం ఊరు దూరం కావడమే. నేను వెళ్లి వచ్చేసరికి చాలా సమయం పడుతుంది. ఆ సమయంలో చదువుకోవచ్చు కదా అనుకునేదాన్ని. అందుకే అప్పుడప్పుడూ ఫోన్లో మాట్లాడేదాన్ని. ప్రిలిమ్స్‌ రాశాక ఒకసారి, మెయిన్స్‌ పూర్తిచేశాక మరోసారి వెళ్లి చూశా. ఓ ఏడాది వాడి పుట్టినరోజుకు కూడా వెళ్లలేకపోయా. అన్నీ మా అమ్మే చూసుకుంది. చెప్పాలంటే ఈ రెండేళ్లు వాడికి అమ్మగా మారిపోయింది.
గుణపాఠంగా మార్చుకున్నా...
అలా మొదటిసారి 2016లో సివిల్స్‌ రాశా. అయితే ఒక్క మార్కులో పోయింది. చాలా బాధనిపించింది. ఎక్కడ పొరపాటు చేశానో తెలుసుకున్నా. ఆ పొరపాట్లను దిద్దుకున్నా. మొదటిసారి మూడు నెలల కన్నా ఎక్కువ చదవలేదు. అందుకే ఆ తరువాత రోజులో 12 గంటలపాటు చదవడం మొదలుపెట్టా. అప్పుడప్పుడూ వివేకానందుడి పుస్తకాలు ఎక్కువగా చదివేదాన్ని. చదువు మధ్యలో అవే నాకు ఆటవిడుపు. నాకు మా ఊళ్లో కనీసం దినపత్రిక సౌకర్యమూ లేదు. కానీ నేను రాసే పరీక్షకు లోక పరిజ్ఞానం ఎక్కువ కావాలి. శిక్షణా తరగతులకు కూడా వెళ్లలేదు. అందుకే నేనే స్వయంగా ఏం చదవాలో తెలుసుకున్నా. అవసరమైనవాటిని ఇంటర్నెట్‌ ద్వారా నేర్చుకునేదాన్ని. అలాగే ఇంట్లో మా వారూ, అత్తగారు చాలా ప్రోత్సహించారు. రెండోసారి మాత్రం మనసులో చదువు తప్ప మరే లక్ష్యం పెట్టుకోలేదు. మొదటిసారే రాస్తున్నాన్నట్లుగానే భావించా. ఈసారి నాపై నాకు నమ్మకం కలిగింది. ఫలితాలు వచ్చాక చాలా సంతోషం అనిపించింది. పాసవ్వడమే కాదు, మహిళల్లో మొదటి ర్యాంకు మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా రెండో ర్యాంకు రావడం చాలా ఆనందం కలిగించింది. ఇది సాధించడానికి నేను పడిన కష్టంలో అమ్మా, మా వారూ, మా అబ్బాయి, ఇతర కుటుంబసభ్యుల ప్రోత్సాహమే ఎక్కువ.
మహిళలకు రక్షణగా...
నేనూ మహిళనే కాబట్టి... ప్రస్తుతం సమాజంలో సాటివారిపై జరుగుతున్న అమానుషమైన సంఘటనలకు ఏదయినా పరిష్కారం ఆలోచించే ప్రయత్నం చేస్తా. మహిళ సాధికారతపై దృష్టిపెట్టాలనుకుంటున్నా. జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని చేరాలనే ఆశయం ఉండగానే కాదు, అందుకు తగినట్లుగా ప్రణాళిక వేసుకుని కష్టపడితేనే విజయం సాధించడం సులువు. ఒకసారి ఓడిపోయినా వదిలేయకూడదు. పొరపాట్లు దిద్దుకుని ఆత్మవిశ్వాసంతో మళ్లీ మళ్లీ ప్రయత్నించాలి. ‘మహిళలందరూ నిన్ను స్ఫూర్తిగా తీసుకుంటారు’ అని హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ కట్టర్‌ మెచ్చుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు నా బాధ్యత పెరిగిందని అనుకుంటున్నా.

గురి తప్పని..గురు పుత్రిక!
* తెలంగాణ యువతికి సివిల్స్‌లో 144వ ర్యాంకు
పెంట్లవెల్లి, న్యూస్‌టుడే: తెలంగాణ రాష్ట్రం నాగర్‌కర్నూలు జిల్లా పెంట్లవెల్లి మండల కేంద్రానికి చెందిన మాధురి సివిల్స్‌లో 144వ ర్యాంకు సాధించారు. మారుమూల గ్రామం పేరు జాతీయ స్థాయిలో ఇనుమడింపజేశారు. మాధురి తల్లిదండ్రులు గడ్డం మురళీధర్‌, శారద దంపతులు ఉద్యోగ నిమిత్తం హైదరాబాదులో స్థిరపడ్డారు. మురళీధర్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లోని దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో అధ్యాపకుడిగా విధులు నిర్వహిస్తున్నారు.
రూ.20 లక్షల జీతం కాదనుకుని: మాధురి విద్యాభ్యాసం అంతా హైదరాబాద్‌లోనే సాగింది. జేఈఈ మెయిన్స్‌లో 790 ర్యాంకు సాధించి గచ్చిబౌలిలోని ఐఐటీ ప్రాంగణంలో కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో బీటెక్‌ 2015లో పూర్తి చేశారు. ప్రాంగణ ఎంపికల్లో రూ.20 లక్షల ప్యాకేజీతో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా ఉద్యోగం సాధించారు. సివిల్స్‌ లక్ష్యంగా నిర్దేశించుకున్న యువతి ఆ ఉద్యోగాన్ని వదులుకున్నారు. దిల్లీలో శిక్షణ తీసుకున్నారు. 2016వ సంవత్సరంలో మొదటి ప్రయత్నంలో యూపీఎస్‌సీ మెయిన్స్‌లో అర్హత సాధించలేక పోయినా నిరుత్సాహపడకుండా.. రెండో ప్రయత్నం చేసి 2017 సివిల్స్‌ జాతీయ స్థాయిలో 144వ ర్యాంకు సాధించారు. 'లక్ష్యాన్ని ఏర్పరచుకుని అంకిత భావంతో కృషి చేస్తే తప్పకుండా దాన్ని చేరుకోవ‌చ్చ‌'ని తెలిపారు.

'కోటి' కాద‌న్నాడు కోరి సాధించాడు!
* సివిల్స్‌ 24వ ర్యాంకర్‌ ఇమ్మడి పృథ్వీతేజ ప్రస్థానం
* శాంసంగ్‌లో ఉద్యోగం కాదని సివిల్స్‌ వైపు

ఈనాడు, హైదరాబాద్‌: 'ఐఐటీ-2011లో ఇండియా టాపర్‌గా నిలిచా. ముంబయి ఐఐటీలో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేశాక దక్షిణ కొరియాలోని సాంసంగ్‌ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. వార్షిక వేతనం రూ.కోటి. అక్కడికి వెళ్లాక ఏదో వెలితి. ఏడాది పాటు పనిచేశాక తిరుగుటపాకట్టా. మ‌రో ఏడాది శ్ర‌మించి తొలి ప్ర‌య‌త్నంలోనే సివిల్స్ సాధించాన‌'ని సివిల్స్‌లో 24వ ర్యాంకు సాధించిన ఇమ్మిడి పృథ్వీతేజ అన్నారు. ప్రస్తుతం దిల్లీలో ఉన్న పృథ్వీతేజ..తన విజయ విజ‌య ప్ర‌స్థానాన్ని 'ఈనాడు'తో పంచుకున్నారు
కుటుంబ నేపథ్యం
మాది పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల. తండ్రి పేరు శ్రీనివాసరావు. స్వగ్రామంలో బంగారు దుకాణం. తల్లి గృహిణి. 'నువ్వు పెద్దయ్యాక నాలా కాకుండా గొప్పస్థాయికి ఎదగాలి. పదిమందికి సేవ చేసే స్థితికి చేరుకోవాలి. క‌ష్టాలు ప‌డినా స‌రే నీ గ‌మ్యాన్ని మార్చుకోవ‌ద్దు' అంటూ చిన్నప్పట్నుంచి నాన్న చెబుతూ వస్తున్న మాట నాలో బలంగా నాటుకుపోయింది.
గ్రామాల స్థితిగతులు మార్చాలని
దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలు ఇంకా ఉన్నాయి. రాయలసీమలో నీటికరవు, కోస్తాంధ్రలో తుపానులు, ప్రాథమిక వైద్య సౌకర్యాల లేమి. ఇలాంటి సమస్యలెన్నో. దృష్టి కేంద్రీకరిస్తే వీటన్నింటికీ పరిష్కారం లభిస్తుంది. కలెక్టర్‌ లేదా ఎస్పీ అయితే గ్రామాల్లో తిరిగే అవకాశాలుంటాయి. అందుకే సివిల్స్‌పై గురిపెట్టా.
దక్షిణ కొరియా నుంచి దిల్లీకి
దక్షిణ కొరియాలో ఉద్యోగం రావడం అదృష్టమని స్నేహితులు, సన్నిహితులు అన్నారు. అమ్మా, నాన్న కూడా ప్రోత్సహించడంతో 2015లో అక్కడికి వెళ్లా. వృత్తిపరంగా సంతృప్తి లభించినా నాన్న మాటలు నాపై బాగా ప్రభావం చూపాయి. వేతనం పరంగా గొప్పస్థాయి అనుకున్నా..ఉద్యోగంలో సంతృప్తి లభించలేదు. అందుకే సివిల్స్‌ సాధించాలని 2016లో దక్షిణ కొరియా నుంచి నేరుగా దిల్లీకి వచ్చా.
సీనియర్ల సలహాతో
సివిల్స్‌కు ఎలా తర్ఫీదు కావాలో స్పష్టత ఉండటంతో సీనియర్లు, స్నేహితులున్న గదిలో సభ్యుడిగా చేరా. ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణత కోసం రెండు నెలల క్రాష్‌కోర్సులో చేరా. మెలకువలు నేర్చుకుని అందులో ఉత్తీర్ణుడినయ్యా.
కష్టమన్నా.. ఇష్టంతో
ఈ క్రతువులో కీలక ఘట్టం మెయిన్స్‌. గణిత శాస్త్రం ఐచ్ఛికంతో అందులో గట్టెక్కడం కష్టం అన్నారు. చిన్నప్పట్నుంచి లెక్కలంటే ఇష్టం. అందుకే దాన్నే ఎంచుకున్నా.
సాధించగలనన్న ఆత్మవిశ్వాసం...
ప్రిలిమ్స్‌ గట్టెక్కాక సివిల్స్‌ సాధించగలనన్న ఆత్మవిశ్వాసం రెట్టింపయింది. నా సన్నద్ధతలో లోపాలు గుర్తించుకుంటూ.. వాటిని సవరించుకుంటూ మెయిన్స్‌పై దృష్టి కేంద్రీకరించా. మా గదిలో సీనియర్లు బాగా సహకరించారు. ప్రశ్నలు, సమాధానాలు, తార్కికంగా ఎలా ఆలోచించాలన్న అంశాలపై వారు సలహాలు, సూచనలిచ్చేవారు. రోజుకు పద్నాలుగు గంటలపాటు చదివేవాడిని. గ్రంథాలయానికి ఉదయం వెళితే తిరిగి రావడం రాత్రికే.
24వ ర్యాంకు ఊహించలేదు
మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించాక మౌఖిక పరీక్షకు సిద్ధమయ్యా. మౌఖిక పరీక్షలో వ్యక్తిగత విషయాలు, ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం, అంతర్జాతీయ వ్యవహరాలు, రూ.కోటి వేతనం ఎందుకు వదులుకుని వచ్చావ్‌?వంటి ప్రశ్నలు అడిగారు. మౌఖిక పరీక్ష పూర్తయ్యాక ర్యాంకుకచ్చితంగా వస్తుందని అనుకున్నా. 24వ ర్యాంక్‌ వస్తుందని ఊహించలేదు.
ఇరవైనాలుగ్గంటలూ చదివితే సివిల్స్‌ రాదు..
ఇరవైనాలుగ్గంటలూ చదివితేనే సివిల్స్‌లో ర్యాంకు సాధించలేం. పాఠ్య ప్రణాళికతోపాటు..మనచుట్టూ జరుగుతున్న అంశాలను గమనించాలి. రోజుకు 16 గంటలు, 20 గంటలు చదివినా ఉపయోగం ఉండదు. మనం చదువుకున్నది ఎంత వరకు గుర్తుంది? ఆ పాఠ్యాంశంలో ఏముంది? అన్న ప్రశ్నలను మనమే వేసుకోవాలి. అలా తర్ఫీదయితేనే ఫలితం ఉంటుంది.
బలహీనతలు.. బలాలు గుర్తిస్తేనే
సివిల్స్‌ అంటే దేశవ్యాప్త పోటీ. అందులో విజేతగా నిలబడాలంటే ముందు మన బలహీనతలు...బలాలను గుర్తించాలి. బలాలను పెంచుకుంటే...బలహీనతలను అధిగమించాలి. స్వీయ క్రమశిక్షణ..సకారాత్మక ధోరణి, విజ్ఞానాన్ని పెంపొందించే వాతావరణం చుట్టూ ఉండేలా చూసుకోవాలి.
నమ్మకమే విజయ రహస్యం
నా విజయ రహస్యం నమ్మకం. మిన్నువిరిగి మీదపడుతున్నా సడలని ఆత్మస్థైర్యం. ప్రతికూల పరిస్థితులనూ అనుకూలంగా మార్చుకోవడం. ఇవే నన్ను విజయం వైపు నడిపించాయి.

మేధావులే సివిల్స్‌ సాధిస్తారన్నది అపోహే
* సగటు విద్యార్థులూ విజేతలు కావొచ్చు
* 23 ఏళ్లకే సివిల్స్‌ 245వ ర్యాంకు

ఈనాడు, హైదరాబాద్‌: 'సివిల్‌ సర్వీస్‌ విజేతలందరూ ఐఐటీ, బిట్స్‌ పిలానీ, ఎయిమ్స్‌లో చదివిన వారే ఉంటారన్నది అపోహ మాత్రమే. గ్రామీణ ప్రాంతాల‌కు చెందిన స‌గ‌టు సివిల్స్ విద్యార్థులూ సివిల్స్‌లో విజ‌యం సాధించ‌వ‌చ్చు' అని సివిల్స్ 245వ ర్యాంక‌ర్‌ గురజాల చందీష్‌ అన్నారు. కాకపోతే ఒకసారి విజయం దక్కకున్నా నిరాశ చెందకుండా...నిరంతర కృషి చేయాల్సి ఉంటుందన్నారు. మొదటి ప్రయత్నంలోనే సివిల్స్‌లో ర్యాంకు సాధించి ఇండియన్‌ ఇన్‌ఫర్మేషన్‌ సర్వీసుకు ఎంపికై ప్రస్తుతం దిల్లీలో శిక్షణ పొందుతున్న 23 ఏళ్ల చందీష్‌ రెండో ప్రయత్నంలో 245వ ర్యాంకు సాధించారు. శ‌నివారం 'ఈనాడు'తో మాట్లాడారు. సివిల్స్‌లో విజేత‌గా నిలిచే వారందరూ ప్రతిభావంతులేం కాదు. సాధారణ విద్యాసంస్థల్లో చదివిన సగటు విద్యార్థులూ ఎందరో ఉంటున్నారు. ఐతే ఒకసారి రాసి విజయం దక్కలేదని వదిలేయకూడదు. పట్టువదలకుండా చివరి వరకు ప్రయత్నించాలి. నాకు మొదటి నుంచి జీవశాస్త్రం అంటే ఆసక్తి. అంతేకాదు గిరిజనుల సమస్యలు తెలుసుకోవాలన్న ఉత్సుకత ఉండేది. ఆంత్రోపాలజీలో జీవశాస్త్రానికి సంబంధించిన అంశాలు అధికంగా ఉంటాయి. అందుకే ఆంత్రోపాలజీనీ ఐచ్ఛికాంశంగా ఎంచుకున్నా. ప్రతి ఒక్కరూ చదివే పుస్తకాలు దాదాపు ఒకటే. కాకపోతే సొంతగా నోట్సు రాసుకోవాలి. అది కూడా క్రమపద్ధతిలో సాగాలి. వేగంగా జవాబులు రాసేలా సాధన చేయాలి. ఇలా శిక్షణ సాగితే ఎవరైనా సివిల్స్‌ విజేతలు కావొచ్చుఅన్నారు.
కుటుంబ నేపథ్యం: చందీష్‌ తండ్రిది చిత్తూరు జిల్లా ఐరాల మండలం అడపగుండ్ల గ్రామం. తండ్రి పూర్ణచంద్రరావు ఏపీ నీటి వనరుల విభాగంలో డిప్యూటీ ఇంజినీరు. ప్రస్తుతం ఆయన కర్నూల్‌లో పనిచేస్తున్నారు. తల్లి జయసుధ గృహిణి. ప్రస్తుతం హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో నివాసముంటున్నారు. తమ్ముడు దిల్లీలోని శివనాడార్‌ విశ్వవిద్యాలయంలో బీటెక్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు.
బిట్స్‌ పిలానీ నుంచి సివిల్స్‌ వైపు
* 10వ తరగతి వరకు తిరుపతి, హైదరాబాద్‌ భారతీయ విద్యా భవన్‌లో(94 శాతం)
* ఇంటర్‌మీడియట్‌ ఎంపీసీ హైదరాబాద్‌లో ఫిడ్జి కళాశాలలో(95శాతం)
* బిట్స్‌ పిలానీ క్యాంపస్‌లో 2015లో బీటెక్‌ (మెకానికల్‌) పూర్తి
* తొలిసారి 2016లో సివిల్స్‌కు హాజరుposted on 30.04.2018

Back
Competitive Exams