‘విజయ్‌’ దరహాసం

* కొణిజర్ల వైద్య విద్యార్థికి జాతీయ స్థాయిలో రెండో ర్యాంకు
* ఎయిమ్స్‌ కార్డియాలజీ విభాగంలో సీటు
* రైతుబిడ్డ అరుదైన ఘనత

కొణిజర్ల, న్యూస్‌టుడే: దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక వైద్య సంస్థ ఎయిమ్స్‌లో వైద్య విద్యను అభ్యసించాలనేది ప్రతి వైద్య విద్యార్థి కల. దానిని నిజం చేసుకోవడానికి చాలామంది ఏళ్లతరబడి కష్టపడుతుంటారు. కేవలం రెండున్నర నెలల కాల వ్యవధి తర్ఫీదుతో ఎయిమ్స్‌ నిర్వహించిన డీఎం / ఎంసీహెచ్‌ కార్డియాలజీ విభాగం ప్రవేశపరీక్షలో జాతీయ స్థాయిలో రెండో ర్యాంకు సాధించడం ద్వారా అరుదైన ఘనత సాధించారు ఖమ్మం జిల్లా కొణిజర్లకు చెందిన సూరంపల్లి విజయ్‌.
మూడు సీట్లు..300 మంది పోటీ
దిల్లీలోని ఎయిమ్స్‌ కార్డియాలజీ విభాగంలో కేవలం మూడు సీట్లు మాత్రమే ఉంటాయి. దీనికోసం జాతీయ స్థాయిలో పోటీ ఉంటుంది. ఈ దఫా మూడు సీట్లకు 300 మంది పోటీపడ్డారు. తొలుత ప్రవేశపరీక్షలో ప్రతిభ కనపరచిన 24 మందిని ఎంపికచేశారు. ‘ఆ తరవాత ముఖాముఖి ద్వారా వడపోత ప్రక్రియ నిర్వహించి ప్రతిభావంతులను ఎంపికచేస్తారని, ఈ ప్రక్రియలో తనకు 68.66 మార్కులు వచ్చాయని’ విజయ్‌ వెల్లడించారు.
ప్రతిభే గీటురాయిగా..
సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన విజయ్‌.. తండ్రి కష్టాలను చూస్తూ పెరిగారు. ప్రతిభతో వాటిని అధిగమించాలన్న నిశ్చయంతో ఎంసెట్‌లో మెరుగైన ర్యాంకు సాధించారు. ఖమ్మంలోని మమత వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ పూర్తిచేయడంతోపాటు.. అనాటమీలో బంగారు పతకాన్ని సాధించారు. వెనువెంటనే ఎండీ / ఎంఎస్‌లో ప్రవేశం కోసం జరిగిన పరీక్షలో జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించి జిప్‌మర్‌లో ఎండీ జనరల్‌ మెడిసిన్‌లో సీటు సాధించారు. ఇటీవలే పూర్తిచేశారు.
ఆత్మవిశ్వాసంతో విజయం సాధించా
ప్రామాణిక పుస్తకాలు చదవడమే రెండో ర్యాంకు రావడానికి దోహదపడింది. రెండున్నర నెలల తక్కువ సమయాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రతి నిమిషాన్నీ సద్వినియోగం చేసుకుంటూ ప్రణాళిక ప్రకారం చదవడం ద్వారా ఈ విజయం సాధించా. గ్రామీణ ప్రాంత ప్రజలకు సేవలు అందించేందుకు కృషిచేస్తా.

posted on 30.04.2018

Back