పాలిటెక్నిక్‌ లెక్చరర్‌

 

నిజామాబాద్ జిల్లా (భిక్కనూరు): ఓటమి విజయానికి తొలిమెట్టంటారు.. తొలి పరాజయానికి కుంగకుండా మరింత కసితో చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకున్నారామే. ముందుగా జూనియర్‌ లెక్చరర్‌ ఉద్యోగం 0.5 మార్కు తేడాతో చేజారింది. తర్వాత పాలిటెక్నిక్‌ లెక్చరర్‌ పరీక్ష రాసి రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు కైవసం చేసుకుని ఉద్యోగం సాధించారు. అంతకుముందే తెవివిలో ఫిజిక్స్‌ అసిస్టెంట్‌ ప్రోఫెసర్‌ ఉద్యోగానికి దరఖాస్తు చేశారు. ఇంటర్వ్యూలో ప్రతిభ చూపడంతో తెవివి దక్షిణ ప్రాంగణంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగానికి ఎంపికయ్యారు డాక్టర్‌ లక్కరాజు హరిత. ఆమె ఈ స్థాయికి చేరుకున్న ప్రస్థానం.. పడ్డ కష్టాన్ని ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.

* చదువు - కుటుంబ నేపథ్యం
'మాది మెదక్‌ జిల్లా పటాన్‌చెరు. అమ్మనాన్నలు శ్రీనివాస్‌రావు - పద్మ. మేం ఇద్దరం ఆడపిల్లలమే. నేనే పెద్ద కూతురిని. నాన్నకు ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం, అమ్మ గృహిణి. చిన్నప్పటి నుంచి చదువుల్లో నేను ముందుండేదాన్ని. దాంతో అమ్మానాన్నలు నన్ను ప్రోత్సహించేవారు. 1 నుంచి 5వ తరగతి భారత్‌ పబ్లిక్‌ స్కూల్‌లో, 6 నుంచి 10వ తరగతి వరకు శ్రీవాణి హైస్కూల్‌లో చదివాను.

ఇంటర్‌ ఎంఎన్‌ఆర్‌ కళాశాల హైదరాబాద్‌లో చదివాను. కోఠి ఉమెన్స్‌ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాను. 2006-08లో ఎమ్మెస్సీ(ఫిజిక్స్‌)ని ఉస్మానియా క్యాంపస్‌లో చదివాను. అక్కడ ఎస్‌ఎస్‌పీ(సోలిడ్‌ స్టేట్‌ ఫిజిక్స్‌) టాపర్‌గా నిలిచాను.
* కాకతీయ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ
'ఉస్మానియాలో పీజీ పూర్తయిన తర్వాత 2008 నుంచి 2012 వరకు పీహెచ్‌డీ పూర్తిచేశాను. ఇక్కడ చదువుతున్నప్పుడే ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనే పట్టుదల పెరిగింది. నిత్యం గ్రంథాలయం వెళ్లి చూస్తే స్నేహితులందరు శ్రద్ధగా చదువుతూ కనిపించేవారు. వారితో పాటు నేను కూడా గ్రంథాలయానికి ఎక్కవ సమయం కేటాయించేదాన్ని. నిత్యం 10 నుంచి 12 గంటల పాటు చదవడం అలవరుచుకున్నాను.'
* జేఎల్‌ చేజారింది
'2012లో జేఎల్‌ నోటిఫికేషన్‌ వచ్చింది. దరఖాస్తు చేశాను. మహిళా కేటగిరిలో ఒకటే కొలువు ఉంది. అయినా నిరుత్సాపడకుండా చదివి పరీక్ష రాశాను. అందులో కేవలం 0.5 మార్కు తేడాతో నేను ఉద్యోగం కోల్పోయాను. అప్పుడే నాలో ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. నేను ఉద్యోగం సాధించగలను అనే నమ్మకం ఏర్పడింది. దీంతో మరింత కసిగా చదవడం ప్రారంభించాను. నా స్నేహితులు, అమ్మానాన్నలు ప్రోత్సహించారు.'
* పాలిటెక్నిక్‌ లెక్చరర్‌ పరీక్షలో స్టేట్‌టాప్‌
'జేఎల్‌ పరీక్షల తర్వాత 2012లో పాలిటెక్నిక్‌ లెక్చరర్‌ పరీక్షలకు నోటిఫికేషన్‌ వెలుబడింది. దానికి దరఖాస్తు చేశాను. 2013లో పరీక్షలు రాశాను. ఉద్యోగం వస్తుందనుకున్నాను కాని స్టేట్‌ టాపర్‌గా ఎంపికయ్యాను. కొద్దిసేపటి దాకా నన్ను నేనే నమ్మలేకపోయాను. స్నేహితులు, బంధువులు అభినందనల్లో ముంచెత్తారు. ఇంటర్వ్యూలోనూ 50 మార్కులకు గాను 43 మార్కులు సాధించాను. సిద్దిపేట పాలిటెక్నిక్‌ కళాశాలలో ఉద్యోగం వచ్చింది. అక్కడ మూడు నెలల పాటు విధులు నిర్వహించి సెలవు పెట్టాను.'
* భర్త ప్రోత్సహం ఎంతో ఉంది
'పాలిటెక్నిక్‌ లెక్చరర్‌ ఉద్యోగానికి సన్నద్ధమవుతున్నప్పుడు నా భర్త నాగరాజు ప్రోత్సాహం ఎంతోగానే ఉంది. ఆయన ప్రైవేటు కళాశాలో ఫిజిక్స్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తుంటారు. ఇద్దరి సబ్జెక్ట్‌ ఒకే కావడం వల్ల ఆయన నాకోసం నిత్యం ఒక ప్రశ్నపత్రాన్ని తయారు చేసి సిద్ధంగా ఉంచేవారు. సాయంత్రం ఆ పశ్నపత్రానికి జవాబులు రాసేదాన్ని. నేను రాసిన జవాబులను మూల్యాంకనం చేసి మార్కులు వేసేవారు. ఏ సబ్జెక్టులో మార్కులు తక్వుకగా వస్తున్నాయో చేప్పేవారు. ఆయన సలహాలతో మూడు నెలలు పరీక్షలకు సిద్ధమయ్యాను.'
* హోం ట్యూషన్లు చెప్పేదాన్ని
'మాది సాధారణ మధ్యతరగతి కుటుంబం కావడంతో 10వ తరగతి చదువుతన్నప్పటి నుంచి హోం ట్యూషన్లు చెప్పేదాన్ని. ఇంటర్‌లో టెన్త్‌ వాళ్లకు, డిగ్రీలో ఇంటర్‌ విద్యార్థులకు, పీజీలో డిగ్రీ విద్యార్థులకు హోం ట్యూషన్లు చెబుతూ చదువుకున్నాను. కుటుంబానికి కొంతైనా ఆర్థికభారం తగ్గిద్దామనుకేదాన్ని. అందువల్లే ట్యూషన్లు చెప్పి వచ్చిన డబ్బులతోనే ఖర్చు పెట్టుకున్నాను.'
* తెవివిలో అసిస్టెంట్‌ ప్రోఫెసర్‌కు దరఖాస్తు..
'ఉద్యోగం ఉండగా మరోక ఉద్యోగం ఎందుకంటారా.. లెక్చరర్‌ కంటే అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ హోదా పెద్దది కదా.. అందుకే ఇక్కడ విధుల్లో చేరాను. 2012లో జేఎల్‌ అవకాశం చేజారినప్పుడు ఇక్కడ తెవివిలో ఫిజిక్స్‌ పోస్టుకు నోటిఫికేషన్‌ వెలుబడింది. దరఖాస్తు చేశాను. ఇంటర్వ్యూకు హాజరయ్యాను. వివిధ కారణాల వల్ల అర్హుల జబితాను ఆలస్యంగా ప్రకటించారు. 2014 జనవరి 23న ఇక్కడి తెవివి దక్షిణ ప్రాంగణంలో ఫిజిక్స్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా విధుల్లో చేరాను. ప్రస్తుతానికి పాలిటెక్నిక్‌ లెక్చరర్‌ ఉద్యోగానికి సెలవు పెట్టాను.'
* నిరుత్సాహం వద్దు
'ఉద్యోగాల ప్రకటన వెలుబడుతున్నప్పుడు ఒకటి, రెండు పోస్టులు మాత్రమే ఉన్నందున ఆ ఉద్యోగం మనకు రాదనే భావన చాలా మంది యువతీయువకుల్లో ఉంటుంది. ముందుగా ఆ అపోహ తొలగిపోవాలి. నోటిఫికేషన్‌లో పేర్కొన్న ఉద్యోగం మన ఖాతాలోకే వస్తుందనే విశ్వాసంతో చదవాలి. ఇప్పుడు నేను ఆర్థికంగా స్థిరపడినందున మా చెల్లి చదువు బాధ్యతలను చూసుకోగలుగుతున్నాను.'

 

Back
Competitive Exams