TS Sr.INTER 2016 Toppers

తెలంగాణ 'ఇంటర్‌' టాపర్ల మనోగతాలు
సీనియర్‌ ఇంటర్‌ పరీక్ష ఫలితాల్లో విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ చాటారు. ఆయా కోర్సుల్లో అగ్రగణ్యులుగా నిలిచిన విద్యార్థుల అభిప్రాయాలు, లక్ష్యాలివి.
* కూలిపనులకెళ్లి చదువుకున్నా.. ఐఏఎస్‌ కావాలన్నదే లక్ష్యం: హెచ్‌ఈసీలో టాపర్‌ స్నేహ మనోగతం (హెచ్‌ఈసీ 925)
మారుమూల గిరిజన ప్రాంతం.. కూలికెళితేగానీ పూట గడవని కుటుంబ నేపథ్యం.. తండ్రి చనిపోవడంతో అక్కలతో పాటే కూలికెళ్లిన ఆ అమ్మాయి జీవితంతో పోరాడింది. కష్టాన్నే ఇష్టంగా మలుచుకుని ఇంటర్మీడియట్‌లో ఏకంగా రాష్ట్రస్థాయిలో మొదటిస్థానం సాధించి శభాష్‌ అనిపించుకుంది. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలోని మారుమూల గిరిజన ప్రాంతం చండ్రలగూడేనికి చెందిన మొల్కం నారాయణ, రాధమ్మల మూడో కుమార్తె స్నేహ. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో హెచ్‌ఈసీలో 925 మార్కులు సాధించి రాష్ట్రంలో మొదటిస్థానంలో నిలిచింది. స్నేహకు ఆర్నెల్ల వయసున్నప్పుడే తండ్రి చనిపోయాడు. అక్కలు కవిత, మౌనికలతోపాటు తాను కూలి పనులకు వెళ్లేది. కారేపల్లి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో హెచ్‌ఈసీ చదివి రాష్ట్రస్థాయిలో టాపర్‌గా నిలిచింది. కళాశాల అధ్యాపకులు తననెంతగానో ప్రోత్సహించారని చెప్పింది. ప్రస్తుతం ఖమ్మంలో స్పోకెన్‌ ఇంగ్లిష్‌ శిక్షణ తీసుకుంటోంది. ఐఏఎస్‌ కావాలనే లక్ష్యంగా నిర్ణయించుకున్నానని, సాధించి తీరతానని ధీమా వ్యక్తం చేసింది.
* ఐఏఎస్‌ నా లక్ష్యం - చరితారెడ్డి, 992, ఎంపీసీలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం
మాది అనంతపురం జిల్లా కదిరి. నాన్న ప్రసాద్‌రెడ్డి అడ్వకేట్‌గా పనిచేస్తున్నారు. అమ్మ లలిత గృహిణి. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో ఎంపీసీలో రాష్ట్ర స్థాయిలో ప్రథమస్థానంలో నిలవడం ఆనందంగా ఉంది. మాదాపూర్‌లోని నారాయణ కళాశాల నర్మద క్యాంపస్‌లో ఇంటర్మీడియట్‌ చదివాను. తరుచూ పరీక్షలు నిర్వహిస్తూ సబ్జెక్ట్‌పై పట్టుసాధించేలా నారాయణలో మంచి శిక్షణ ఇచ్చారు. మొదటి నుంచి ప్రణాళికబద్ధంగా చదవడం వల్లే ఇది సాధ్యమైంది. ఐఐటీలో సీటు సాధించి అది పూర్తి చేసిన తరువాత సివిల్స్‌ రాసి ఐఏఎస్‌ కావాలనేది నా జీవిత లక్ష్యం.
* తల్లిదండ్రుల కల నెరవేరుస్తా - ప్రీతి శర్మ, ఎంపీసీ(992), రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం
మాది నిజామాబాద్‌. నేను గొప్ప సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ను కావాలనేది మా అమ్మానాన్న బీనాశర్మ, సంతోష్‌శర్మల కోరిక. దాన్ని నెరవేరుస్తా. నిజామాబాద్‌ కాకతీయ కళాశాలలో చదివాను. గతేడాది ప్రథమ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంకు సాధించాను. ఈసారి మరింత పట్టుదలగా చదివి రాష్ట్రస్థాయిలో మొదటి స్థానంలో నిలవడం సంతోషంగా ఉంది. పట్టుదల, ప్రణాళికతో చదవడమే ఈ విజయానికి కారణం. ఇదే స్ఫూర్తితో ఇంజినీరింగ్‌లోనూ ముందుకెళతాను.
* చిన్నపిల్లల వైద్యురాలినవుతా - నిదామెహ్రీన్‌, బైపీసీ (994), రాష్ట్ర స్థాయి ప్రథమ ర్యాంకరు
నిజామాబాద్‌లోని అహ్మద్‌పురా కాలనీకి చెందిన తలాతార, అలీషరీఫ్‌ నా తల్లిదండ్రులు. ఇంటర్‌ నిజామాబాద్‌ కాకతీయ కళాశాలలో చదివాను. బైపీసీలో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం సాధించడం సంతోషాన్నిచ్చింది. నాకు స్నేహితులెవరూ లేరు. పుస్తకాలే నా నేస్తాలు. రోజుకు 14 గంటలు చదవడం వల్లే ఈ విజయం సొంతమైంది. దీని వెనుక తల్లిదండ్రులు, కళాశాల అధ్యాపకుల ప్రోత్సాహం ఎంతో ఉంది. చిన్నపిల్లల వైద్యురాలిని కావాలన్నదే నా జీవితాశయం.
* పేదలకు మెరుగైన వైద్యం అందిస్తా - కావ్యశ్రీ (993) బైపీసీలో రాష్ట్ర స్థాయిలో రెండో స్థానం
కరీంనగర్‌ జిల్లా పెగడపల్లి మండలంలోని ఎల్లాపూర్‌ మాది. నాన్న రంగు శ్రీనివాస్‌ మాజీ సర్పంచి. అమ్మ సంధ్య అంగన్‌వాడీ కార్యకర్త. నేను, నా చెల్లెలు సాత్వికల చదువు కోసం మా కుటుంబం కరీంనగర్‌కు వచ్చింది. పదో తరగతిలో 10/10 జీపీఏ సాధించడంతో ఇంటర్‌లో కరీంనగర్‌లోని ఆల్ఫోర్స్‌ కళాశాలలో ఉచితంగా సీటిచ్చారు. ఇంటర్‌ మొదటి సంవత్సరంలో 437 మార్కులు సాధించి స్టేట్‌ టాపర్‌గా నిలిచా. రెండో సంవత్సరం ఫలితాల్లో 993 మార్కులతో బైపీసీలో రాష్ట్రంలో రెండో స్థానం సాధించాను. ఎంసెట్‌లో మంచి ర్యాంకు సాధించి కార్డియాలజిస్టుగా పేరు తెచ్చుకోవాలనుంది. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నది నా ఆశయం.
* సివిల్స్‌లో రాణించాలని.. - జి.సుష్మ (967), సీఈసీలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం
హుజురాబాద్‌ మండలంలోని రాంపూర్‌ మాది. వ్యవసాయ కుటుంబం. ఆడపిల్లలను బాగా చదివించాలనేది అమ్మానాన్నల కల. అక్క నేను బాగా చదవాలని పోటీపడేవాళ్లం. అక్క బీ ఫార్మసీ చేస్తోంది. ఇంటర్‌ కరీంనగర్‌ అల్ఫోర్స్‌ కళాశాలలో చదివాను. మంచి మార్కులు వస్తాయనుకున్నా. రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం దక్కించుకోవడంతో మా ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తోంది. సివిల్స్‌ రాసి ఉన్నత ఉద్యోగంలో స్థిరపడాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నా. ప్రణాళిక, చదవాలనే ఆసక్తి ఉంటే తప్పకుండా విజయం వరిస్తుంది.
* ఐపీఎస్‌ అవుతా.. - కె.వినీతారెడ్డి (967), సీఈసీలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం
మానకొండూర్‌ మండలం రంగంపేట మాది. నాన్న వ్యవసాయం చేస్తారు. చదువులో చురుకుగా ఉండడంతో అమ్మ, నాన్న, అక్క ప్రోత్సహించారు. ఇంటర్‌ ట్రినిటీ కళాశాలలో చదివాను. సీఈసీలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలవడం ఆనందంగా ఉంది. ఐపీఎస్‌ కావాలనే ఆలోచనతో బాగా చదవడం అలవాటు చేసుకున్నా. తప్పకుండా లక్ష్యం సాధిస్తాననే ధీమా ఈ ఫలితాలతో వచ్చింది.
* అమ్మ కష్టానికి ఫలితమిది - సాయికుమార్‌ (985) ఎంఈసీలో రాష్ట్ర స్థాయి ప్రథమ స్థానం
మాది మహబూబ్‌నగర్‌జిల్లా షాద్‌నగర్‌. నాన్న సత్యనారాయణ ఏడేళ్ల కింద చనిపోయారు. మా అమ్మ సువర్ణ రోజు కూలీగా పని చేస్తూ నన్ను చదివించింది. ఆమె కష్టాన్ని వృథా పోనివ్వకూడదనే పట్టుదలతో చదివా. షాద్‌నగర్‌ విజ్ఞాన్‌ కళాశాలలో ఇంటర్‌ చదివాను. పదో తరగతిలో మంచి మార్కులు సాధించడంతో కళాశాల యాజమాన్యం ఉచితంగా సీటిచ్చింది. మా ప్రిన్సిపల్‌ విశ్వనాథ్‌, అధ్యాపకులు బాగా ప్రోత్సహించారు. సీఏ లక్ష్యంగా ప్రస్తుతం హైదరాబాద్‌లో శిక్షణ తీసుకుంటున్నా. సివిల్స్‌ సాధించాలనే పట్టుదలతో ముందుకెళుతున్నా.
* అమ్మానాన్నకు ప్రేమతో.. - పాగాల రాజశేఖర్‌రెడ్డి, 992, ఎంపీసీలో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం
ఆర్థిక ఇబ్బందులతో అమ్మా, నాన్న పెద్దగా చదువుకోలేకపోయారు. నన్ను, మా చెల్లిని మాత్రం బాగా చదివించడానికి ఎంత కష్టమైనా వెనకాడలేదు. వారి కష్టాన్ని వమ్ము చేయకూడదనే పట్టుదలతో చదివి ఎంపీసీలో రాష్ట్రస్థాయిలో మొదటి స్థానంలో నిలిచాను. మా స్వగ్రామం మెదక్‌ జిల్లా తొగుట. కొన్నాళ్ల క్రితం సిద్దిపేట మండలం ఎన్సాన్‌పల్లికి వచ్చేశాం. నాన్న రంగారెడ్డి ఆర్టీసీ బస్‌ డ్రైవర్‌. హైదరాబాద్‌ ప్రగతినగర్‌ రావూస్‌ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ చదివాను. నాకు నేను పోటీ అనే దృక్పథంతో చదవడమే నా విజయరహస్యం. భవిష్యతులో శాస్త్రవేత్త కావడం నా లక్ష్యం.
* అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌ చదువుతా - రవితేజ (992), ఎంపీసీలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం
మా స్వస్థలం వరంగల్‌. నాన్న వెంకటేశ్వరరావు సూరత్‌లో స్పిన్నింగ్‌ మిల్లులో పని చేస్తున్నారు. అమ్మానాన్న ఇద్దరూ అక్కడే ఉంటారు. నేను దిల్‌సుఖ్‌నగర్‌లోని నారాయణ కళాశాలలో వసతిగృహంలో ఉంటూ ఇంటర్మీడియట్‌ చదివాను. తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలన్న ఉద్దేశంతో కష్టపడి చదివాను. అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌ చదువుతానని పేర్కొన్నాడు.

Back

Academic Exams