TSPSC Group - II Toppers

 

పట్టుదల.. శ్రద్ధ.. ఓపిక!

గ్రూపు-2 మహిళా టాపర్‌ నిర్మల

పోటీపరీక్షల్లో విజేతగా నిలవాలంటే ఒక ప్రత్యేక వ్యూహం అవసరం. నిపుణుల, సీనియర్ల సూచనలను అనుసరించి సొంత ప్రిపరేషన్‌ పద్ధతిని రూపొందించుకోవాలి. సర్వీస్‌ సాధించాలనే తపన, పట్టుదల ఉండాలి. ఇలాంటి లక్షణాలే విన్నర్‌ని మిగతా వాళ్ల నుంచి వేరు చేస్తాయని చెబుతున్నారు టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌ - 2 మహిళా టాపర్‌ నిర్మల. కష్టమైనవాటినే ముందు చదవాలంటున్నారు.

గ్రూ పు-2 పరీక్షల్లో మహిళల్లో టాపర్‌గా నిలిచిన నిర్మల ఊరు ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గౌరిగూడెం. పోటీపరీక్షల్లో విజయం సాధించాలంటే సబ్జెక్టుపై పట్టు సాధించాలని ఆమె సూచిస్తున్నారు. మార్కెట్లో కనిపించినవన్నీ కొనేసి చదవకూడదు. నాణ్యమైన ఒకటి, రెండు పుస్తకాలు ఎంచుకుంటే సరిపోతుందంటున్నారు.

* గ్రూపు-2 నెగ్గడానికి తోడ్పడిన 3 కారణాలు?
ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ప్రభుత్వ సర్వీస్‌ సాధించాలన్న బలమైన పట్టుదల, శ్రద్ధ, ఓపిక.

* సిలబస్‌ను సమగ్రంగా కవర్‌ చేయడం ఎలా?
ముందుగా సిలబస్‌ మీద పూర్తి అవగాహన పెంచుకోవాలి. తర్వాత ప్రామాణిక పుస్తకాలను ఎంపిక చేసుకోవాలి. ఉదాహరణకు అకాడమీ పుస్తకాలు. ఒకటి లేదా రెండు బుక్స్‌ తీసుకొని ఎక్కువసార్లు చదవాలి. చదివి వదిలేయకుండా.. పునశ్చరణ చేయాలి. తర్వాత సాధన చేయాలి. బిట్లు చూసి సబ్జెక్టు చదవకూడదు. సబ్జెక్టు చదివి బిట్లు చేయాలి. ప్రాక్టీస్‌ అవసరం. ఒక రోజు ఒకటే పేపర్‌ కాకుండా అన్ని పేపర్‌లకూ సమయం కేటాయించుకొని చదవాలి.

* రాతపరీక్షలో ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అంశాలేమిటి?
సబ్జెక్టు చదివి బిట్లు చేయాలి. అప్పుడే మార్చిమార్చి బిట్లు అడిగినా సమాధానం ఇచ్చే వీలుంటుంది. బిట్లు ప్రాక్టీస్‌ చేస్తే అవి మాత్రమే గుర్తుంటాయి. థియరీ మొత్తం చదివితే ఏ ప్రశ్న ఎలా అడిగినా సమాధానం రాయవచ్ఛు కాలం ముఖ్యమైంది. దానిని సద్వినియోగం చేసుకోవాలి.

* ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు సాధన చేస్తే సరిపోతుందా?
నాలుగు సమాధానాలు ఇస్తారు. దానిలో ఒకటి గుర్తించి పెడితే సరిపోతుందని చాలామంది అనుకుంటారు. కానీ సిలబస్‌పైన అవగాహన ఉంటేనే బిట్లకు సరైన జవాబులు గుర్తించడం సాధ్యమవుతుంది. ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు మాత్రమే సాధన చేయడం వల్ల ప్రయోజనం ఉండదు.

* ఇంటర్వ్యూలో నెగ్గాలంటే ఎలా సిద్ధం కావాలి?
జాతీయ, రాష్ట్ర పరిణామాలను గమనించాలి. ప్రసార మాధ్యమాల్లో వచ్చే చర్చలు, విశ్లేషణలు వినాలి. సొంత అభిప్రాయం ఏర్పరచుకోవాలి. సహజంగా ఎలా ఉంటారో అలాగే ఇంటర్వ్యూలో ఉండాలి. వీటన్నింటికంటే మన అభిప్రాయం చెప్పడం ముఖ్యం. ఆందోళనకు దూరంగా ఉండాలి. అనుకున్న విషయాన్ని సూటిగా, స్పష్టంగా చెప్పాలి.

* వర్తమాన అంశాలపై పట్టు ఎంత అవసరం?
సమకాలీన అంశాలపై పూర్తి పట్టు ఉండాలి. దీనికోసం వార్తాపత్రికలు క్రమం తప్పకుండా చదవాలి. మన చుట్టూ ఏం జరుగుతోందో నిత్యం తెలుసుకోవాలి. ఇంటర్వ్యూలో సమకాలీన అంశాలే ఎక్కువ అడిగే అవకాశం ఉంది.

* పరీక్షలో అభ్యర్థులు తరచూ చేసే పొరపాట్లు?
ఏదైనా సబ్జెక్టులో మనం బలహీనంగా ఉన్నాం అనుకున్నప్పుడు దాన్ని ‘తర్వాత చదువుదాం’ అనుకుంటాం. కానీ అలాంటి సబ్జెక్టులే ముందు చదవాలి. ఎక్కువ టైం చేతిలో ఉన్నప్పుడే చదవాలి. దాంతో రివిజన్‌ సులువవుతుంది. ఆబ్జెక్టివ్‌ బిట్‌ పేపర్లు మాత్రమే ప్రాక్టీస్‌ చేయకూడదు. సబ్జెక్టు చదవటం పూర్తిచేసిన తర్వాత బిట్లను ప్రాక్టీస్‌ చేయాలి. మోడల్‌ పరీక్షలు రాసి ‘అంతా తెలుసు’ అనుకోవడం తప్ఫు అనవసరంగా ఆందోళన చెందకూడదు. సన్నద్ధత సమయంలో, పరీక్షల్లో ఆత్మవిశ్వాసంతో ఉండాలి.

- ఎస్‌. ప్రభు ప్రసాద్‌, ఈనాడు, ఖమ్మం

Back
Competitive Exams