VRA / VRO - Toppers

 

పోటీలో అందరికంటే ముందుండటమే కాదు; పొరబాట్లకు తావివ్వకుండా మార్కులన్నీ సంపూర్ణంగా కైవసం చేసుకోవటమంటే... అది అసాధారణ విజయమే! వీఆర్‌ఓ రాతపరీక్షల్లో వందకు వంద మార్కులు సాధించటం ద్వారా తమ ప్రత్యేకత నిరూపించుకున్నారు నరేంద్రరెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డి. పేద రైతుకుటుంబ నేపథ్యంతో కోచింగ్‌ సహాయమేదీ లేకుండానే ఈ ఘనత సాధించారు!

గ్రూప్స్‌ సన్నద్ధత పనికొచ్చింది
మందడి శ్యామ్‌సుందర్‌రెడ్డి, చిల్పంకుంట్ల (నల్గొండ జిల్లా)ి
1. వీఆర్‌ఓ పరీక్షకు ప్రణాళిక అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు. దీన్నే లక్ష్యం చేసుకుని చదవలేదు. ఉస్మానియా యూనివర్సిటీ గ్రంథాలయంలో ఉదయం 8 నుంచి 12 గంటల వరకూ, మధ్యాహ్నం 2 నుంచి 6 గంటలవరకూ- మళ్ళీ రాత్రి కాసేపు చదువుతూవచ్చాను. వీఆర్‌ఓ పరీక్ష కోసం నిజానికి ఎక్కువ సమయం చదవలేదనే చెప్పాలి.

2. వీఆర్‌ఓ, పంచాయతీ సెక్రటరీ పరీక్షల్లో జనరల్‌స్టడీస్‌ ఉంది. కాబట్టి దాన్ని చదివాను. పంచాయతీ సెక్రటరీలో మిగిలిన పేపర్‌ తర్వాత చదవొచ్చని జీఎస్‌ మీదే దృష్టిపెట్టాను. గ్రూప్‌-2 స్థాయిలో- అందరూ సాధారణంగా చదివే పుస్తకాలే చదివాను. ప్రత్యేకంగా ఏమీ తయారవలేదు.
3. గ్రామీణ స్థితిగతులపై ఎక్కువ ప్రశ్నలు రాకపోవటం ప్రతికూలతగా ఏమీ అనిపించలేదు. దానికి 30 మార్కులు మాత్రమే కాబట్టి ఆ వెయిటేజీకి ఎంత అవసరమో అంతవరకే చదివాను.
4. గ్రూప్స్‌ సన్నద్ధత అనుభవం ఉపయోగపడింది. ప్రైవేటు కంపెనీలో పనిచేసిన అనుభవం మూలంగా ప్రభుత్వోద్యోగం సంపాదించాలని గట్టిగా అనిపించింది. పరీక్షలో సమయ నిర్వహణ కోసం నమూనా పేపర్లు సాధన చేశాను. గతంతో పోలిస్తే పేపర్‌ సులువుగానే వచ్చింది. పరీక్ష రాయగానే నూరు శాతం మార్కులు వస్తాయనుకోలేదు. 'కీ' చూసుకున్నాక మాత్రం అన్ని మార్కులూ సాధించగలనని నిర్ధారణ అయింది!

రేడియో విన్నా! పత్రికలు చదివా!!
ఎం. నరేంద్రరెడ్డి, మదనపల్లె (చిత్తూరు జిల్లా)
1. నాది ఎంపీసీ కాబట్టి గణితంతో సంబంధమున్న నలబై మార్కుల భాగాన్ని వారంలో పూర్తి చేసుకున్నాను. దాంతో తేలికయింది. మోడల్‌ పేపర్‌ ఎలా ఉందో పరిశీలించి తగినట్టుగా సమయం కేటాయించుకున్నాను. ప్రణాళికతో ప్రిపరేషన్లో ముందుకువెళ్ళాను.

2. ఈ పేపర్‌ కోసం రోజుకు మూడు గంటల వరకూ చదివాను. జీవశాస్త్ర అంశాలను 8,9,10 తరగతుల పాఠ్యపుస్తకాల్లో చదివాను. వర్తమాన వ్యవహారాల కోసం పత్రికల్లో ఇచ్చిన అంశాలను క్రమం తప్పకుండా అనుసరించాను. రేడియో వార్తలు వినటం, అవసరమైన పాయింట్లు నోట్‌ చేసుకోవటం చేశాను. గ్రంథాలయంలోని పుస్తకాలు ఉపయోగించుకున్నాను.
3. గ్రామీణ స్థితిగతులపై ప్రశ్నలు పెద్దగా రాకపోయినా వర్తమాన అంశాలు ఎక్కువ వచ్చాయి. వీటిపై నాకున్న అవగాహన పరీక్షల్లో అనుకూలించింది. సులువుగా రాయగలిగాను.
4. ఏకాగ్రత మూలంగా వివిధ పరీక్షాంశాలు గుర్తుపెట్టుకోవడానికి వీలు కలిగింది. ఏది చదివినా దాన్ని అలాగే వదిలెయ్యకుండా వారం తర్వాత పునశ్చరణ చేసుకున్నాను. పట్టుదల, సాధించాలనే అభిలాష కూడా ఉపకరించాయనుకుంటున్నాను
.

ఆ రెండు మార్కులే పట్టుదల పెంచాయి!
-సీతామహాలక్ష్మి
ఎక్కడ అడుగు వెనక్కి అడుగు పడుతుందో... అక్కడి నుంచే పైకి లేవాలి. ప్రతిభ చూపాలి. ప్రత్యేకత కనబరచాలి. విజయవాడకు చెందిన సీతామహాలక్ష్మి ఇటువంటి పట్టుదలనే కనబరిచింది. పదకొండు లక్షల మంది రాసిన వీఆర్‌వో పరీక్షల్లో 96 మార్కులు సాధించి ప్రశంసలు అందుకుంది. 'చదువుకీ, ప్రతిభకీ పేదరికం అడ్డు రాదు' అంటున్న ఆమెతో వసుంధర మాట్లాడింది.
నాకు ఉద్యోగం వచ్చింది అని తెలియగానే మొదట గుర్తొచ్చింది అమ్మానాన్నలే. 'మన ఇంట్లో ఎవరూ చదువుకోలేదు, ఉద్యోగం చేయలేదు. నువ్వయినా బాగా చదువుకో..' చిన్నప్పటి వాళ్లు నాకు చెప్పింది ఇదే! మాది కృష్ణాజిల్లాలోని సత్యాలపాడు గ్రామం. నాన్న వ్యవసాయం చేసేవారు. అర ఎకరం పొలంలో నాన్న పగలూ రాత్రీ కష్టపడ్డా పండేది తక్కువే. కొన్నిసార్లు అప్పు తెచ్చి వ్యవసాయం చేసినా, పెట్టుబడి చేతికొచ్చేది కాదు. ఆ పరిస్థితుల్లో చాలాసార్లు ఇల్లు గడవడం కూడా ఇబ్బంది అయ్యేది. అప్పు చేయడానికీ, చేశాక తీర్చడానికీ నాన్న ఎంతో ఇబ్బంది పడేవారు. చాలామంది ఈ కష్టాలను పిల్లలకు చెప్పరు. మా అమ్మానాన్నలు చదువుకోలేదు. కానీ ఎంతో జీవితాన్ని చూశారు. అందుకే... ఇదీ మన పరిస్థితి. మీకు ఏ లోటూ రాకుండా చూసుకుంటాం. కానీ చదువుకుంటేనే భవిష్యత్తు అని మాత్రం మరిచిపోవద్దు.. అని పదేపదే చెప్పారు. నాకు ఇద్దరన్నయ్యలు. కానీ ఇద్దరికీ పెద్దగా చదువు అబ్బలేదు. పెద్దన్నయ్య పదో తరగతి, రెండో అన్నయ్య ఇంటర్‌ చదివి ఆపేశారు. పదో క్లాసులో 79 శాతం మార్కులతో నేను స్కూలు ఫస్టు వచ్చానని తెలియగానే అమ్మానాన్నా అందరికీ గొప్పగా చెప్పుకొన్నారు. ఆ సంతోషం చూశాక, మంచి మార్కులకు శభాష్‌లు అందాక మాత్రం ఇకపై ఏదేమైనా బాగా చదువుకోవాలని అనుకున్నా. ఇంటర్‌ చదివేందుకు మధిరలోని కాలేజీలో చేరా. 90 శాతం మార్కులతో ఇంటర్‌ పూర్తి చేసి, బీఎస్సీలో చేరా. స్నేహితులూ, పాకెట్‌మనీ, పిక్నిక్‌లూ, విహార యాత్రలూ, అమ్మానాన్నలు బైక్‌ బహుమతిగా కొనివ్వడం గురించి చెప్పగా విన్నా. కొంత నిరాశగా అనిపించేది. కానీ అది కొన్ని క్షణాలే. ఆ పరిస్థితి లేనప్పుడు మనమే సంపాదించుకోవాలి అనుకునేదాన్ని. మూడేళ్లూ ఇల్లూ, కాలేజీ ప్రపంచంగా గడిపా. బీఎస్సీలో 86 శాతం మార్కులతో కాలేజీ ఫస్టొచ్చా. తరవాత బీఈడీ చేశా.
సాఫ్ట్‌వేర్‌ అవకాశాలు... నాకేమో ఇంకా చదువుకోవాలని. కానీ అప్పటికే మా ఆర్థిక పరిస్థితి బాగా క్షీణించింది. నాన్న 'ఇక చదివించలేనమ్మా' అనేశారు. 2008లో నా వివాహమైంది. ఖమ్మం జిల్లా వైరాలో ఉన్న అత్తారింటికి వచ్చేశా. మాది ఉమ్మడి కుటుంబం. మా వారూ, మరిదీ ప్రింటింగ్‌ ప్రెస్‌ నడుపుతారు. అత్తారింట్లో కూడా ఎవరూ పెద్దగా చదువుకోలేదు. కానీ చదువుకునే వాళ్లంటే అందరికీ ఎంతో ఇష్టం. నా మార్కుల సంగతి తెలుసుకుని అత్తామామలూ, మా వారు వినయ్‌ 'ఇంకా చదువుకో' అంటూ ప్రోత్సహించారు. అంతకంటే ఆనందం ఏముంది!! ఎంసీఏకు దరఖాస్తు చేసి, సీటు సాధించా. ఒకపక్క ఇంటి బాధ్యతలూ, మరోపక్క చదువూ... కొంచెం కష్టమైనా మూడేళ్లు కష్టపడితే సరిపోతుంది అనుకున్నా. ఎంసీఏ ఫైనల్‌ పరీక్షలప్పుడు గర్భవతిని. క్యాంపస్‌ సెలెక్షన్లలో మంచి ఉద్యోగావకాశాలు వచ్చాయి. కానీ చెన్నై, బెంగళూరు వెళ్లి చేరే పరిస్థితి లేదు. ఒక ఏడాది ఆగి చూద్దాం అనుకున్నా. పాప పుట్టింది. 85 శాతం మార్కులతో ఎంసీఏ పాసయ్యా.
చాలా బాధపడ్డా... పాపతో, ఇంటి పనులతో కాలం చకచకా గడిచిపోయింది. అప్పుడు ఆలోచించుకుంటే... ఎక్కడికో వెళ్లి ఉద్యోగం చేసేకంటే స్థిరమైన ప్రభుత్వోద్యోగం, ఇంటి బాధ్యతలు చూసుకుంటూ చేయడమే మంచిది అనిపించింది. చెప్పేదేముంది... 2012 నుంచి డీఎస్సీ, గ్రూప్‌2 పరీక్షలకు చదవడం మొదలుపెట్టా. పొద్దునా, రాత్రీ చదువూ. పగలంతా ఇంటి పని. ఆర్నెల్లు కష్టపడి చదివి, డీఎస్సీ పరీక్షలు రాశా. కానీ ఫలితాల్లో తీవ్ర నిరాశ. రెండు మార్కుల తేడాతో అవకాశం కోల్పోయా. కీ చూసుకుంటే జనరల్‌ స్టడీస్‌లో పదికి రెండు, మూడు మార్కులే వచ్చినట్టు అర్థమైంది. జనరల్‌ స్టడీస్‌పైన శ్రద్ధ పెట్టకపోవడం జరిగిన పొరపాటని తెలిసింది. చిట్టి చిట్టి చేతులతో మట్టి తెచ్చి, ఇల్లు కట్టాక అది గాలి వాటుకి కూలిపోతే చిన్నప్పుడు ఎంత ఏడుస్తాం! చాలా ఏళ్లుగా కష్టపడి చదువుకుంటూ వచ్చిన నేను డీఎస్సీ రాకపోవడంతో అలాగే బాధపడ్డా. జనరల్‌ స్టడీస్‌పై దృష్టి పెట్టి చదవడం మొదలుపెట్టా. గత డిసెంబరులో వీఆర్‌వో పోస్టుల ప్రకటన వెలువడింది. డీఎస్సీ, గ్రూప్స్‌ తరవాత... ముందు దీన్లో విజయం సాధించాలి అనుకున్నా. 'నీది టెక్నికల్‌ బ్యాక్‌గ్రౌండ్‌. దీన్లో జనరల్‌ స్టడీస్‌కే ఎక్కువ మార్కులు' అన్నారంతా. అయినా ప్రయత్నించాల్సిందే అనుకున్నా. రోజూ పేపర్లు చదివా. ముఖ్యాంశాలు రాసుకున్నా. సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలపై అవగాహన పెంచుకుంటూ చదివా. హైదరాబాద్‌ వచ్చి శిక్షణ తీసుకున్నా. పదకొండు లక్షల మంది పోటీ పడుతున్నారని తెలిసినా, ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాశా. ఈసారి కీ చూసుకోలేదు. నాల్రోజుల క్రితం ఫలితాలొచ్చాయి. నాకు 96 మార్కులు. మా జిల్లాలో.. మహిళల్లో నేనే టాప్‌ అని తెలిసి చాలా సంతోషంగా అనిపించింది. ఇకపై గ్రామ రెవెన్యూ అధికారిగా ప్రజల సమస్యలను తీర్చడమే లక్ష్యంగా పని చేస్తా. భవిష్యత్తులో గ్రూప్‌2 రాసి విజయం సాధించాలన్నదే నా లక్ష్యం
.

కఠోర సాధనతోనే ఫలితం
-వీఆర్ఏ స్టేట్ 3వ ర్యాంకర్: దాసరి రామకృష్ణ
న్యూస్‌టుడే-నిజామాబాద్ సిటీ, ప్రగతిభవన్: 'వీఆర్వో, వీఆర్ఏ పరీక్షకు కఠోర సాధన చేశాను. అందుకు ఫలితంగానే వీఆర్ఏ పరీక్షలో 96 మార్కులు సాధించి రాష్ట్రస్థాయి మూడో ర్యాంకు (హాల్‌టికెట్ నెం.218100235) సాధించానని' దాసరి రామకృష్ణ పేర్కొన్నారు. ఫిబ్రవరి 22న వీఆర్‌వో, వీఆర్ఏ ఫలితాలు వెలువడిన వెంటనే నిజామాబాద్‌లోని గాయత్రీనగర్‌లో నివాసం ఉండే రామకృష్ణను 'న్యూస్‌టుడే' పలకరించింది. ఈ సందర్భంగా ఆయన పలు వివరాలు వెల్లడించారు.
పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు ఏడాది నుంచి సిద్ధం అవుతున్నాను. అందులో భాగంగానే వీఆర్ఓ, వీఆర్ఏ పరీక్షకు దరఖాస్తు చేశాను. పరీక్షల కోసం ప్రతిరోజు 10 గంటల పాటు చదివాను. ఇంట్లో వారి సహకారం చాలా ఉంది. ఎమ్మెస్సీ, బీఎడ్ చేసిన నేను ప్రస్తుతం నగరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ అధ్యాపకుడిగా పని చేస్తున్నాను. పదో తరగతి ఆర్యసమాజ్ (రాధాకృష్ణ విద్యాలయం)లో చదివాను. ఎస్ఎస్ఆర్ జూనియర్ కళాశాలలో ఇంటర్, గిరిరాజ్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాను. హైదరాబాద్‌లోని సెంట్రల్ వర్సిటీలో ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ) చేశాను. బోధన్‌లో బీఎడ్ పూర్తి చేశాను.
మా నాన్న బలరాం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో నాలుగో తరగతి ఉద్యోగి. అమ్మ పేరు గంగామణి గృహిణి. తమ్ముడు బాలగణేష్, చెల్లి భాగ్యలక్ష్మీ ఉన్నారు
.

Previous Toppers


* శిష్టు చిట్టిబాబు (వీఆర్ఓ ఫస్ట్ ర్యాంక్)
వీరఘట్టం: శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరీక్ష కేంద్రం అని చెప్పారు. అకస్మాత్తుగా దాన్ని ఇచ్చాపురానికి మార్చారు. మా గ్రామం నుంచి ఏడుగంటల ప్రయాణం. అందుకే ముందురోజు బయల్దేరి అష్టకష్టాలు పడి ఇచ్ఛాపురం చేరుకున్నా. Read More...
లక్ష్యం దిశగా ముందడుగు
* రాజేష్ కుమార్ ( వీఆర్ఓ రెండోర్యాంకు)
సింగుపురం(రామలక్ష్మణకూడలి): గ్రూప్స్ లక్ష్యంగా ప్రయత్నించిన రాజేష్‌కుమార్ వీఆర్ఓ పరీక్షలో జిల్లా స్థాయిలో ద్వితీయ ర్యాంకును కైవసం చేసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలనుకునే వాళ్లున్న ఈ రోజుల్లో ఎయిర్ ఫోర్సులో ఉద్యోగం వచ్చినా వదిలేసి... గ్రూప్స్‌ను లక్ష్యంగా చేసుకొని సాధన చేపట్టారు. Read More...

 

Back
Competitive Exams