Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
అంతర్గత భద్రతలో అవుతారా భాగస్వాములు!

* యూపీఎస్సీ అసిస్టెంట్‌ కమాండెంట్స్‌ ఎగ్జామ్‌-2018
ప్రమాదాలు, ఉద్రిక్త పరిస్థితులు ఎదురైనప్పుడు కొన్ని ప్రభుత్వ బలగాలు ప్రత్యక్షమవుతాయి. వాటిలోని పోలీస్‌ అధికారులు ఎంతో ధైర్యంతో ప్రజల ప్రాణాలను, ఆస్తులను రక్షిస్తారు. దేశ అంతర్గత భద్రతలో మన హీరోలు వారే. అలాంటి అసిస్టెంట్‌ కమాండెంట్‌ ఉద్యోగాల్లోకి ఆహ్వానం పలుకుతోంది యూపీఎస్సీ. ఒక్కసారే ఏసీపీ లేదా డీఎస్పీ హోదాతో సమానమైన ఉద్యోగాలను అందుకోవాలనుకునే డిగ్రీ అభ్యర్థులకు ఇదో మంచి అవకాశం.

డిగ్రీ అర్హతతో నేరుగా ఉన్నత స్థాయిని అందించే వాటిలో అసిస్టెంట్‌ కమాండెంట్‌ ఉద్యోగం ఒకటి. ఈ పోస్టుకి ఎంపికైతే ఏసీపీ / డీఎస్పీలతో సమానమైన హోదా సొంతమైనట్లే. ఉద్యోగం, బాధ్యతలు, వేతనం, హోదా అన్నీ ఉన్నతంగా ఉంటాయి. పాతికేళ్లలోపువారు ప్రయత్నించాల్సిన మంచి ఉద్యోగం ఇది. యూపీఎస్సీ నిర్వహించే ఈ పరీక్ష ద్వారా ఎంపికైనవారు సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (సీఏపీఎఫ్‌)లో అసిస్టెంట్‌ కమాండెంట్‌గా విధులు నిర్వర్తిస్తారు. రాతపరీక్ష, ఫిజికల్‌ టెస్టు, ఇంటర్వ్యూల్లో చూపిన ప్రతిభ ద్వారా నియామకాలు చేపడతారు. తాజా ప్రకటనలో 398 ఖాళీలు ఉన్నాయి.
అంతర్గత భద్రత ప్రధాన లక్ష్యంగా అసిస్టెంట్‌ కమాండెంట్‌ (ఏసీ) పోస్టులను రూపొందించారు. ఇది గ్రూప్‌-ఎ గెజిటెడ్‌ ఆఫీసర్‌ ఉద్యోగం. అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఏసీపీ) / డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీఎస్పీ) స్థాయికి సమాన హోదా ఉన్న ఉద్యోగం ఇది. యూపీఎస్సీ నిర్వహించే ఈ పరీక్ష ద్వారా ఎంపికైనవారు సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (సీఏపీఎఫ్‌)- బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీల్లో ఎందులోనైనా అసిస్టెంట్‌ కమాండెంట్‌గా విధులు నిర్వర్తిస్తారు. భవిష్యత్తులో వీరు సంబంధిత విభాగానికి అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ (ఏడీజీ) స్థాయికి చేరుకోవచ్చు. ఈ ఉద్యోగానికి ఎంపికైనవారికి ఏడాది పాటు శిక్షణ నిర్వహిస్తారు. ఉదాహరణకు సీఐఎస్‌ఎఫ్‌కి ఎంపికైనవారికి నేషనల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ అకాడమీ (ఎన్‌ఐఎస్‌ఎ)- హైదరాబాద్‌లో 53 వారాల పాటు ప్రాథమిక శిక్షణ ఉంటుంది. ఇలా అభ్యర్థి దేనికి ఎంపికైతే ఆ విభాగం వీరికి శిక్షణ అందిస్తుంది. విధుల్లో భాగంగా వీరు దేశ అంతర్గత భద్రతకు సంబంధించిన పలు కార్యకలాపాల్లో పాలుపంచుకుంటారు. ముఖ్యంగా నక్సలైట్లు, ఉగ్రవాదులు, మావోయిస్టుల కదలికలను కనిపెడుతూ ప్రమాదం ఉన్నచోట ప్రత్యక్షమవుతారు. చేపట్టబోయే కార్యక్రమాలకు సంబంధించి వ్యూహరచన చేస్తారు. అవసరమైన చోట ఎన్నికల విధులను సైతం నిర్వర్తిస్తారు.
రాత పరీక్ష
పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్‌-1లో జనరల్‌ ఎబిలిటీ అండ్‌ ఇంటెలిజెన్స్‌ అంశాల నుంచి, పేపర్‌-2లో జనరల్‌ స్టడీస్‌, ఎస్సే, కాంప్రహెన్షన్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు. మొదటి పేపర్‌ 250 మార్కులకు, రెండో పేపర్‌ 200 మార్కులకు ఉంటాయి. పేపర్‌-1 ప్రశ్నలు ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉంటాయి. పేపర్‌-2 డిస్క్రిప్టివ్‌ విధానంలో ఉంటుంది. రెండు పేపర్లలోనూ కనీస అర్హత మార్కులు సాధించడం తప్పనిసరి. పేపర్‌-1లో అర్హత సాధిస్తేనే పేపర్‌-2 మూల్యాంకనం చేస్తారు.
ఫిజికల్‌ టెస్టు
రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి ఫిజికల్‌ స్టాండర్డ్‌ / ఫిజికల్‌ ఎఫిషియన్సీ పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా వంద మీటర్ల దూరాన్ని పురుషులు 16 సెకన్లలో, మహిళలైతే 18 సెకన్లలో పూర్తిచేయాలి. అనంతరం 800 మీటర్ల దూరాన్ని పురుషులు 3 నిమిషాల 45 సెకన్లలో, మహిళలు 4 నిమిషాల 45 సెకన్లలో చేరుకోవాలి. లాంగ్‌ జంప్‌లో భాగంగా మూడు ప్రయత్నాల్లో పురుషులైతే 3.5 మీటర్లు, మహిళలు 3 మీటర్లు జంప్‌ చేయగలగాలి. షాట్‌ పుట్‌లో 7.26 కి.గ్రా. గుండును పురుషులు 4.5 మీటర్ల దూరానికి విసరాలి. మహిళలకు షాట్‌ పుట్‌ లేదు.
ఇంటర్వ్యూ
ఫిజికల్‌ టెస్టుల్లో అర్హత సాధించినవారికి మెడికల్‌ పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులోనూ విజయవంతమైతే ముఖాముఖికి పిలుస్తారు. ఇంటర్వ్యూకి 150 మార్కులు కేటాయించారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగా తుది నియామకాలు చేపడతారు.
విభాగాల వారీ ఖాళీలు
బీఎస్‌ఎఫ్‌-60, సీఆర్‌పీఎఫ్‌-179, సీఐఎస్‌ఎఫ్‌-84, ఐటీబీపీ-46, ఎస్‌ఎస్‌బీ-29
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత
వయసు: ఆగస్టు 1, 2018 నాటికి కనిష్ఠం 20 గరిష్ఠం 25 ఏళ్లు. ఆగస్టు 2, 1993 కంటే ముందు; ఆగస్టు 1, 1998 తర్వాత జన్మించినవారు అనర్హులు.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: మే 21 సాయంత్రం 6 వరకు
దరఖాస్తు ఫీజు: రూ. 200 (మహిళలు, ఎస్సీ, ఎస్టీలు ఫీజు చెల్లించనవసరం లేదు)
పరీక్ష తేదీ: ఆగస్టు 12
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, విశాఖపట్నం, తిరుపతి.
వెబ్‌ సైట్‌: www.upsc.gov.inBack..

Posted on 03-05-2018