TS Transco > Study Plan

ఏఈ ఉద్యోగాలకు సిద్ధమేనా?

        లక్ట్రికల్‌, సివిల్‌ విభాగాల్లో రెగ్యులర్‌ పద్ధతిలో అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీ జరగబోతోంది. ఆంధ్రప్రదేశ్‌ ట్రాన్స్‌మిషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీ ట్రాన్స్‌కో) ఈ నియామక ప్రకటన విడుదల చేసింది. ఈ ఉద్యోగం సాధించాలంటే ఎలా ముందుకు సాగాలి?
కేంద్రప్రభుత్వ కొలువులకు ఆకర్షితులయ్యే కొంతమంది అభ్యర్థులకు రాష్ట్రప్రభుత్వ ఉద్యోగాల ప్రాముఖ్యం పూర్తిగా తెలియదు. ప్రస్తుత విద్యుత్‌ శాఖలోని ఏఈ పోస్టులు ఈ కోవకు చెందినవే. ఇందులో నియమితులైనవారికి సంస్థ సకల వసతులూ కల్పిస్తుంది. కొంతమంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ పరీక్షకు పోటీ పడుతున్నారంటే, దీని ప్రాముఖ్యం ఎంతో అర్థం చేసుకోవచ్చు.
రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు ఉండే ప్రయోజనాలు:
* సొంత రాష్ట్రంలో ఉండవచ్చు
* జీతభత్యాలు కూడా దాదాపుగా కేంద్రప్రభుత్వ ఉద్యోగాల మాదిరిగానే ఉంటాయి
* బదిలీలు కూడా తమ జోన్‌లోనే ఉంటాయి
* భాషా సమస్య ఉండదు.
దరఖాస్తు ప్రక్రియ
* ఏపీ ట్రాన్స్‌కో అధికారిక వెబ్‌సైట్‌ www.aptransco.gov.in ద్వారా అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్‌ 12, 2017 లోగా దరఖాస్తు చేసుకోవాలి.
* ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేటప్పుడూ, హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసేటప్పుడూ ఏమైనా ఇబ్బందులు తలెత్తితే ఏపీ ట్రాన్స్‌కో వారు అందుబాటులో ఉంచిన సహాయక కేంద్రాన్ని సంప్రదించవచ్చు.
పరీక్ష రుసుము: జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు రూ.500 (రూ.150 రిజిస్ట్రేషన్‌ రుసుము + రూ.350 పరీక్ష ఫీజు) చెల్లించి, ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎస్‌సీ/ ఎస్‌టీ/ బీసీ/వికలాంగులు చెల్లించాల్సింది- రూ.150.
విద్యార్హతలు: ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌ పోస్టు కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎలక్ట్రిక్‌ లేదా ఎలక్ట్రానిక్‌ విభాగంలో బీఈ/ బీటెక్‌/ ఏఎంఐఈల్లో డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. సివిల్‌ ఇంజినీర్‌ పోస్టు కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సివిల్‌ ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్‌/ ఏఎంఐఈ లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి.
వయసు: మార్చి 1, 2017 నాటికి 42 సంవత్సరాలు మించకూడదు. బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీలకు 5 సంవత్సరాలు, వికలాంగులకు 10 ఏళ్ల వయసు సడలింపు ఉంటుంది.
అనలిటికల్‌ ఎబిలిటీ
ఈ విభాగం నుంచి 30 ప్రశ్నలుంటాయి. గత పరీక్షల ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే ప్రతి విభాగం నుంచీ ఒక్కో ప్రశ్న అడిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎత్తులు, దూరాలు, కాలం, పని, సరాసరి, డైస్‌, నంబర్‌ సిరీస్‌, లాభనష్టాలు, నిష్పత్తుల నుంచి ఎక్కువ ప్రశ్నలు రావొచ్చు. దీని నుంచి 30 ప్రశ్నలు రావడం వల్ల ఉద్యోగం సంపాదించడానికి ఇది నిర్ణయాత్మక సబ్జెక్టుగా మారే అవకాశం ఉంది.
ప్రామాణిక పుస్తకాలు
ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌
* జె.బి. గుప్తా (కోర్‌ సబ్జెక్టు)
* ఆర్‌.కె. రాజ్‌పుత్‌ (కోర్‌ సబ్జెక్టు)
* సి.ఎల్‌. వాద్వా పుస్తకం చివర్లో ఉన్న బిట్లు (పవర్‌ సిస్టమ్స్‌)
సివిల్‌ ఇంజినీరింగ్‌
* ఆర్‌. అఘెర్‌ (కోర్‌ సబ్జెక్టు)
* డా. పి. జయరామిరెడ్డి (కోర్‌ సబ్జెక్టు)
* ఆర్‌.ఎస్‌. ఖుర్మి అండ్‌ జె.కె. గుప్తా (కోర్‌ సబ్జెక్టు)
* ఎస్‌.పి. గుప్తా అండ్‌ ఎస్‌.ఎస్‌. గుప్తా (కోర్‌ సబ్జెక్టు)
న్యూమరికల్‌ అండ్‌ అనలిటికల్‌ ఎబిలిటీ
* ఆర్‌.ఎస్‌. అగర్వాల్‌ (అనలిటికల్‌ ఆప్టిట్యూడ్‌)
సిలబస్‌లో భారీ మార్పులేం లేవు. కాబట్టి వెయిటేజీ ఎక్కువున్న సబ్జెక్టులపై దృష్టి సారించాలి. మిగతా సబ్జెక్టుల్లో ప్రాథమికాంశాలు చదివితే సరిపోతుంది. గత గేట్‌, ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ ఆబ్జెక్టివ్‌కు సంబంధించిన చిన్న చిన్న ప్రశ్నలను కూడా చదివితే ఈ పరీక్ష సాధన సులభమవుతుంది.
ఎంపిక విధానం
అభ్యర్థుల ఎంపిక 100% రాతపరీక్షపైనే ఆధారపడి ఉంటుంది. 100 ప్రశ్నలుంటాయి. ప్రశ్నలు బహుళైచ్ఛిక విధానంలో ఉంటాయి. 100 మార్కులు.
నోట్‌: ప్రతి ప్రశ్నకూ ఒక మార్కు. రుణాత్మక మార్కులుండవు. కాబట్టి, అన్ని ప్రశ్నలకూ సమాధానాలను గుర్తించవచ్చు.
సెక్షన్‌ ఎ: 70 ప్రశ్నలు (కోర్‌ సబ్జెక్టు)
సెక్షన్‌ బి: 30 ప్రశ్నలు (న్యూమరికల్‌, అనలిటికల్‌ ఎబిలిటీ)
రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులనే కమ్యూనిటీ ప్రకారం ధ్రువపత్రాల పరిశీలనకు 1:1 నిష్పత్తిలో పిలుస్తారు.
ప్రశ్నల సరళి
సిలబస్‌లో భారీ మార్పులేం లేవు. కాబట్టి అభ్యర్థులు ఏ సబ్జెక్టుల్లో వెయిటేజీ ఎక్కువ ఉందో వాటిపై దృష్టి సారించాలి. మిగతా సబ్జెక్టుల్లో ప్రాథమికాంశాలను చదివితే సరిపోతుంది. 100 ప్రశ్నలను 120 నిమిషాల్లో పూర్తిచేయాలి. అంటే, ఒక్కో ప్రశ్నకి సగటున నిమిషంపైనే సమయం. అందుకని ప్రతి ప్రశ్నకూ సమాధానాన్ని గుర్తించవచ్చు. కాల్‌క్యులేటర్‌ అనుమతి లేదు. కాబట్టి కఠినమైన న్యూమరికల్‌ ప్రశ్నలు ఉండకపోవచ్చు.
గత గేట్‌, ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ ఆబ్జెక్టివ్‌కు సంబంధించిన చిన్న చిన్న ప్రశ్నలను కూడా చదివితే ఈ పరీక్ష సాధన సులభమవుతుంది.
గమనించాల్సినవి
* పరీక్షను ఏప్రిల్‌ 30, 2017న నిర్వహించనున్నారు. ఈ ఆన్‌లైన్‌ పరీక్ష ఉదయం 10 గం. నుంచి మధ్యాహ్నం 12 గం. వరకు ఉంటుంది.
* రాతపరీక్షను కేవలం విజయవాడ కేంద్రంలోనే నిర్వహిస్తున్నారు.
* అభ్యర్థులు బ్లాక్‌ బాల్‌పాయింట్‌ పెన్నును మాత్రమే వాడాలి.
* పరీక్ష మొదలయ్యే 30 నిమిషాల ముందు పరీక్ష కేంద్రంలోకిఅనుమతిస్తారు. పరీక్ష మొదలైనతర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వరు.
* ఎలక్ట్రానిక్‌ పరికరాల అనుమతి ఉండదు.
గతంతో పోలిస్తే మార్పులు:
గతంలో 100 మార్కులు కోర్‌ సబ్జెక్టుపైనే ఆధారపడి ఉండేవి. కానీ ఇప్పుడు 7:3 నిష్పత్తిలో కోర్‌, అనలిటికల్‌ ఎబిలిటీ ప్రశ్నలు ఉంటాయి. దీన్ని అభ్యర్థులు గమనించి సన్నద్ధమవాలి.

posted on 11.04.2017