TS NPDCL > Notification

భారీ పోస్టులు.. గురిపెడదాం!

* ఏఈ, సబ్ ఇంజినీర్ కొలువుల నియామకం
ఎలక్ట్రికల్, సివిల్ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజినీర్, సబ్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీఎస్ ఎన్‌పీడీసీఎల్) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా 66 ఏఈ (ఎలక్ట్రికల్), 2 ఏఈ (సివిల్), 497 సబ్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) పోస్టులు భర్తీ కానున్నాయి. ఎన్‌పీడీసీఎల్ ఇంత భారీగా సబ్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయడం ఇదే మొదటిసారి. తెలంగాణలోని నిరుద్యోగులకు ఇదో సువర్ణావకాశం! జులైలో జరగబోయే నియామక పరీక్షలకు ఎలా సంసిద్ధం కావాలో చూద్దాం!
ఆకర్షణీయమైన జీతభత్యాలు ఇవ్వటంతో పాటు సంస్థ సకల వసతులూ కల్పించే పోస్టులివి. అందుకే కొంతమంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ నియామకాలకు పోటీ పడుతుంటారు.
దీని ప్రాముఖ్యం! రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉండే ప్రయోజనాలు చెప్పాలంటే...
* సొంత రాష్ట్రంలో ఉండొచ్చు.
* దాదాపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల మాదిరిగానే వేతనాలు ఉంటాయి.
* బదిలీలు కూడా తమ జోన్‌లోనే ఉంటాయి.
* భాషా సమస్య ఉండదు.
జీతభత్యాలు: ఏఈ ఉద్యోగానికి రూ.41,150 - రూ.63,600, సబ్ ఇంజినీర్ ఉద్యోగానికి రూ.20,535 - రూ.41,155 ఉంటుంది.
నార్త్ జోన్: వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్
సౌత్ జోన్: హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నల్గొండ
* అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది. http://tsnpdcl.cgg.gov.in వెబ్‌సైట్‌లో నమూనా దరఖాస్తు కూడా అందుబాటులో ఉంది.
దరఖాస్తు ప్రక్రియ: టీఎస్ ఎన్‌పీడీసీఎల్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అసిస్టెంట్ ఇంజినీర్‌కు జూన్ 12 నుంచి 27, సబ్ ఇంజినీర్‌కు చేసేవారు జూన్ 4 నుంచి 18 మధ్యలో దరఖాస్తు చేసుకోవాలి.

విద్యార్హతలు
ఏఈ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో బీఈ/ బీటెక్‌లో డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
సివిల్ ఇంజినీర్: బీఈ/బీటెక్ లేదా సంబంధిత విభాగంలో తత్సమాన అర్హత కలిగి ఉండాలి.
సబ్ ఇంజినీర్: ఎలక్ట్రికల్ సబ్ ఇంజినీర్ కోసం దరఖాస్తు చేసుకునేవారికి గుర్తింపు పొందిన బోర్డు/యూనివర్సిటీ నుంచి డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ సంబంధిత విభాగంలో తత్సమాన అర్హత ఉండాలి.
వయసు: 01.01.2018 నాటికి 18 - 44 ఏళ్ల మధ్యవారై ఉండాలి. బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీలకు అయిదేళ్లు; వికలాంగులకు పదేళ్లు వయసులో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: ఎంపిక రాతపరీక్షపైనే ఆధారపడి ఉంటుంది. 100 ప్రశ్నలు బహుళైచ్ఛిక విధానంలో ఉంటాయి. 100 మార్కులు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. రుణాత్మక మార్కులు లేనందున అన్ని ప్రశ్నలకూ సమాధానాలు రాయొచ్చు.
సెక్షన్ - ఎ: 80 ప్రశ్నలు (కోర్ సబ్జెక్టు)
సెక్షన్ - బి: 20 ప్రశ్నలు (జనరల్ అవేర్‌నెస్, న్యూమరికల్ ఎబిలిటీ)
రాతపరీక్షలో అర్హత సాధించినవారినే కమ్యూనిటీ ప్రకారం ధ్రువపత్రాల పరిశీలనకు 1 : 1 నిష్పత్తిలో పిలుస్తారు.
* అసిస్టెంట్ ఇంజినీర్ ఎలక్ట్రికల్/సివిల్ 15.07.2018 ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గం. వరకు, సబ్ ఇంజినీర్ ఎలక్ట్రికల్ 08.07.2018 ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గం.వరకు ఈ పరీక్షను ఆఫ్‌లైన్‌లో నిర్వహిస్తారు.

సిలబస్, ప్రశ్నలసరళి
అసిస్టెంట్ ఇంజినీర్: సిలబస్‌లో భారీగా మార్పులు జరిగాయి. ప్రస్తుతం ఎన్‌పీడీసీఎల్ సిలబస్‌ను పరిశీలిస్తే పూర్తిగా గేట్ సిలబస్‌నే ఇచ్చారు. ఈ మార్పులకు అనుగుణంగా అభ్యర్థులు కొత్తగా చేర్చిన విషయాలపై దృష్టిసారించాల్సి ఉంటుంది. ప్రశ్నపత్రంలో 100 ప్రశ్నలుంటాయి. సమయం 120 నిమిషాలు. అంటే సగటున ఒక ప్రశ్నకు ఒక నిమిషంపైనే ఉంటుంది. కాబట్టి అన్ని ప్రశ్నలకు జవాబును రాబట్టడం సులువే. కాలిక్యులేటర్ అనుమతి లేనందువల్ల కఠినమైన న్యూమరికల్ ప్రశ్నలు ఉండకపోవచ్చు. గత ఎన్‌పీడీసీఎల్ పేపర్లతోపాటు గత గేట్, ఇంజినీరింగ్ సర్వీసెస్ ఆబ్జెక్టివ్స్‌కు సంబంధించిన చిన్న ప్రశ్నలను చదవడం ద్వారా సాధన సులభమవుతుంది.
ఎలక్ట్రికల్ అసిస్టెంట్ ఇంజినీర్: కొత్తగా మూడు సబ్జెక్టులను అదనంగా చేర్చారు. అవి:
1. ఇంజినీరింగ్ మేథమేటిక్స్
2. సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్
3. ఎలక్ట్రోమ్యాగ్నటిక్ ఫీల్డ్స్
* నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ, స్విచ్‌గేర్ ఎక్విప్‌మెంట్, యుటిలైజేషన్ సబ్జెక్టులను తొలగించారు.
* ఎలక్ట్రికల్ సర్క్యూట్స్‌లో ప్యాసివ్ ఫిల్టర్స్, పవర్ అండ్ పవర్ ఫ్యాక్టర్ ఇన్ ఏసీ సర్క్యూట్స్ అంశాలను అదనంగా చేర్చారు.
* ఎలక్ట్రికల్ మెషిన్స్‌లో ఎలక్ట్రో మెకానికల్ ఎనర్జీ కన్వర్షన్ ప్రిన్సిపుల్స్, సపరేట్లీ ఎగ్జాయిటెడ్, స్టాటింగ్ అండ్ స్పీడ్ కంట్రోల్ ఆఫ్ డీసీ మోటార్స్, సిలిండ్రికల్ అండ్ సైలెంట్ పోల్ మెషిన్స్, పర్ఫార్మెన్స్ రెగ్యులేషన్స్ అంశాలను అదనంగా చేర్చి ఇన్సులేటింగ్ మెటీరియల్స్ అంశాన్ని తొలగించారు.
* పవర్ సిస్టమ్స్‌లో ఏసీ, డీసీ ట్రాన్స్‌మిషన్ కాన్సెప్ట్స్, సిరీస్ అండ్ షంట్ కాంపెన్సేషన్స్, ఎలక్ట్రిక్‌ ఫీల్డ్ డిస్ట్రిబ్యూషన్, ఓల్టేజ్, ఫ్రీక్వెన్సీ అండ్ కంట్రోల్ అంశాలను అదనంగా చేర్చారు.
* కంట్రోల్ సిస్టమ్స్‌లో మేథమేటికల్ మోడలింగ్ అండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ సిస్టమ్స్, స్టడీ స్టేట్ అనాలిసిస్ ఆఫ్ లీనియర్ టైం ఇన్‌వేరియంట్‌ సిస్టమ్స్, స్టడీ స్టేట్ మోడల్, స్టేట్ ట్రాన్సిషన్ మాట్రిక్స్‌లను అదనంగా చేర్చారు.
* అనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్‌లో క్లిపింగ్, క్లాంపింగ్, రెక్టిఫ‌య‌ర్‌, ఆపరేషనల్ ఆంప్లిఫ‌య‌ర్‌‌, క్యారెక్టరిస్టిక్స్ అండ్ అప్లికేషన్స్, సింపుల్ యాక్టివ్ ఫిల్టర్స్, వీసీఓ అండ్ టైమర్స్ అదనంగా చేర్చారు.
* పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ డ్రైవ్స్‌లో డ్రైవ్స్ విభాగాన్ని తొలగించారు.

జనరల్‌స్టడీస్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ
ఇందులో అనలిటికల్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లిష్, తెలంగాణ ఉద్యమం- సంస్కృతి, కంప్యూటర్ నాలెడ్జ్ విభాగాలున్నాయి. గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే ప్రతి విభాగం నుంచి నాలుగు ప్రశ్నలు అడిగారు. గణితశాస్త్రంలో సంఖ్యాశాస్త్రాన్ని సూచించే నిష్పత్తులు, శాతాలు, భాగస్వామ్యాలు, కాలం - పని, కాలం - దూరం నుంచి ప్రశ్నలను అడుగుతున్నారు. జాతీయ వర్తమానాంశాల్లో జాతీయ పథకాలు, భారతదేశ విదేశీ సంబంధాలు, క్రీడలు, సదస్సులు, అవార్డుల మీద దృష్టిపెట్టాలి.
అంతర్జాతీయ అంశాల నుంచి తక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి అభ్యర్థి ప్రధానమైన అంశాలను చదివితే చాలు. ఇంగ్లిష్ వ్యాకరణం, పర్యాయపదాలు, వ్యతిరేక పదాలు, జతపరచడం వంటి ప్రాథమికాంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి. తెలంగాణ తొలి, మలిదశ పోరాటాలు; తెలంగాణ సాధించాక జరిగిన పరిణామాలను అవగతం చేసుకోవాలి. కంప్యూటర్‌కు సంబంధించిన విడిభాగాలు, కంప్యూటర్ నెట్‌వర్కింగ్, అంతర్జాలాలకు సంబంధించిన ప్రాథమికాంశాలపై ప్రశ్నలు వచ్చే అవకాశముంది.
సిలబస్ (సబ్ ఇంజినీర్)
ఇందులో మూడు సబ్జెక్టులకు ప్రాధాన్యమిచ్చారు. అవి:
1. ఎలక్ట్రికల్ మెషీన్స్‌
2. పవర్ సిస్టమ్స్
3. మెజర్‌మెంట్స్
* పవర్ సిస్టమ్స్‌లో స్విచ్‌గేర్ అండ్ ప్రొటక్షన్, ట్రాన్స్‌మిషన్, యుటిలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ అనే మూడు విభాగాలుగా మార్పులు చేశారు.
సెక్షన్ - ఎ
ఎలక్ట్రికల్ మెషీన్స్‌: ట్రాన్స్‌ఫార్మర్స్, డీసీ జనరేటర్స్ అండ్ మోటార్స్, త్రీ ఫేజ్ ఇండక్షన్ మోటార్, సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్స్ అండ్ కమ్యూటేటర్ మోటార్స్.
స్విచ్‌గేర్ అండ్ ప్రొటక్షన్: ఫాల్ట్ అండ్ స్విచింగ్ అపార‌ట‌స్‌, ప్రొటెక్టివ్ రీలేయింగ్
ట్రాన్స్‌మిషన్: లైన్ కండక్టర్స్, లైన్ సపోర్ట్స్ అండ్ స్వాగ్ కాలి‌క్యులేషన్స్, ట్రాన్స్‌మిషన్ లైన్ పారా మీటర్స్, పర్‌ఫామెన్స్ ఆఫ్ లైన్స్, ఇన్సులేటర్స్ అండ్ సబ్‌స్టేషన్స్, కేబుల్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్, మెజరింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్ అండ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్.
యుటిలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ: ఎలక్ట్రిక్ డ్రైవ్స్, ఇల్యూమినేషన్, ఎలక్ట్రిక్ హీటింగ్ అండ్ వెల్డింగ్
సెక్షన్ - బి
జనరల్ అవేర్‌నెస్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ: అనలిటికల్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లిష్, తెలంగాణ కల్చర్ అండ్ మూవ్‌మెంట్, కంప్యూటర్ నాలెడ్జ్.
సన్నద్ధత ఎలా?
* అసిస్టెంట్ ఇంజినీర్, సబ్ ఇంజినీర్ ఉద్యోగం పొందాలంటే రోజూ కనీసం 9-10 గంటలు సాధన చేయాలి. సన్నద్ధతలో పరిమాణం కంటే నాణ్యత ముఖ్యం.
* మొదటిసారి ఈ పరీక్షకు సిద్ధమయ్యేవారు ప్రతి చాప్టర్‌కూ సంబంధించి ముఖ్య విషయాలను చిన్న చిన్న పట్టికల ద్వారా సంక్షిప్తంగా తయారు చేసుకోవాలి. పరీక్షకు ముందురోజుల్లో పునశ్చరణకు ఇది చాలా ఉపయోగం.
* ఈమధ్య జరిగిన టీఎస్ ట్రాన్స్‌కో, టీఎస్ ఎస్‌పీడీసీఎల్, ఇతర డిస్కం పరీక్షపత్రాలను గమనిస్తే ప్రశ్నల నిడివి చిన్నగా, కాన్సెప్ట్ పరంగానూ ఉన్నాయి. కాలి‌క్యులేటర్ అనుమతి లేనందున గేట్ తరహా కష్టమైన న్యూమరికల్ ప్రశ్నలు రాకపోవచ్చు. కాబట్టి కాన్సెప్ట్‌ను సరిగా అర్థం చేసుకుని ప్రాథమిక స్థాయి ప్రశ్నలను బాగా సాధన చేయాలి.
* ప్రామాణిక పాఠ్యపుస్తకాలను ఎంచుకోవడం ప్రధానం. అందుబాటులో ఉన్న సమయంలో ఏ అంశాలను చదివితే ఎక్కువ మార్కులు వస్తాయో నిర్ణయించుకోవాలి. పూర్వ ప్రశ్నపత్రాలతోపాటు (ఎన్‌పీడీసీఎల్, జెన్‌కో, ట్రాన్స్‌కో, ఎస్‌పీడీసీఎల్) జేబీ గుప్తాలోని ఆబ్జెక్టివ్ ప్రశ్నలను సాధన చేయడం మంచిది. ఆన్‌లైన్ ప్రశ్నపత్రాలను కూడా సాధన చేయాలి.
* రెండు గంటల పరీక్ష సమయంలో ఎన్ని ప్రశ్నలు, వేటిని రాస్తే ఎక్కువ మార్కులు సాధించవచ్చో నిర్ణయించుకోవాలి. ఈ కీలక సమయంలో సమయ వృథాను నిరోధించాలి. సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలి. రోజూ క్రమం తప్పకుండా కనీసం అరగంట యోగా/ధ్యానం వంటివి చేస్తే ఒత్తిడికి దూరంగా ఉండగలుగుతారు. వివాదాలు, ఆందోళనలకు దూరంగా ఉండి, శ్రద్ధగా, ప్రశాంతంగా పరీక్షను రాస్తే ఆశించిన ఫలితం మీదే.

- వై.వి. గోపాలకృష్ణ మూర్తి

Posted on 10-07-2018