TS NPDCL > Notification

జయహో జేఏవో!

తెలంగాణ రాష్ట్రంలో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ (జేఏవో) ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ల పరంపర కొనసాగుతూనే ఉంది. కామర్స్ అభ్యర్థులు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (టీఎస్ఎన్‌పీడీసీఎల్)లో 107 జేఏవో పోస్టుల నియామకానికి ఇటీవల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మధ్యకాలంలో వచ్చిన నోటిఫికేషన్‌లలో ఇది మూడోది. ఇది కామర్స్ అభ్యర్థులకు ఒక మంచి అవకాశంగా చెప్పవచ్చు. మంచి హోదా గల ఉద్యోగం, ఆకర్షణీయమైన జీతం, సంస్థ ప్రగతిలో కీలకపాత్ర వహించే అవకాశం ఈ ఉద్యోగ సాధనకు ప్రేరణలు. దీనికి ఆన్‌లైన్‌లో అప్లికేషన్ సమర్పించే ప్రక్రియ జూన్ 16న ప్రారంభమై 30న ముగుస్తుంది. పరీక్షను 2018, జులై 22న GHMC హైదరాబాద్, GWMC వరంగల్ పరిధిలో నిర్వహించనున్నారు. ఈ పరీక్షను కేవలం ఆంగ్ల మాధ్యమంలోనే నిర్వహించనున్నారు. దీన్ని అభ్యర్థులు గమనించాలి.
జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ (జేఏవో) పోస్టులకు బీకామ్ లేదా ఎంకామ్‌లో ప్రథమ శ్రేణిలో పాసైనవారు, సీఏ/ఐసీడబ్ల్యూఏలో ఇంటర్ పాసైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

పరీక్ష విధానం:
జేఏవో పరీక్షను మొత్తం 100 ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలతో ఒక మార్కు చొప్పున మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. ఈ పరీక్షలో ప్రధానంగా రెండు విభాగాలు ఉంటాయి. విభాగం - Aలో ప్రధాన సబ్జెక్టుల నుంచి 80 మార్కులకు, విభాగం - Bలో జనరల్ అవేర్‌నెస్, న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 20 మార్కులకు ప్రశ్నలను ఇస్తారు. ఈ పరీక్ష ఆంగ్ల మాధ్యమంలోనే ఉంటుంది కాబట్టి గతంలో నిర్వహించిన ఎన్‌పీడీసీఎల్ జేఏవో పరీక్ష తెలుగు, ఆంగ్ల మాధ్యమ ప్రశ్నపత్రాలను పరిశీలించాలి.

సిలబస్ విశ్లేషణ
విభాగం - A
విభాగం - Aలో మొత్తం 80 మార్కులకు కామర్స్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలను అడుగుతారు. దీనిలో అకౌంటెన్సీ, అడ్వాన్స్‌డ్ అకౌంటెన్సీకి 35 మార్కులు; కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటింగ్‌కు 25 మార్కులు, ఆడిటింగ్‌కు 20 మార్కులు కేటాయించారు.

ఈ సబ్జెక్టులకు నిర్దేశించిన సిలబస్
అకౌంటెన్సీ, అడ్వాన్స్‌డ్ అకౌంటెన్సీ:
దీనిలో బీకామ్ సిలబస్‌లోని మూడు సంవత్సరాలకు సంబంధించిన అకౌంటింగ్ సిలబస్‌ను నిర్దేశించారు. ఈ సబ్జెక్టుల నుంచి దాదాపు 35 మార్కుల వరకు ప్రశ్నలను అడుగుతారు. మొదటి సంవత్సరం ఫైనాన్షియల్ అకౌంటింగ్ నుంచి అకౌంటింగ్ భావనలు, సంప్రదాయాలు; అకౌంటింగ్ ప్రక్రియలోని వివిధ అంశాలు చిట్టా, ఆవర్జా, సహాయక పుస్తకాలు, బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక, వినిమయ బిల్లులు, అంకణా, ముగింపు లెక్కలు, తప్పుల సవరణ, కన్‌సైన్‌మెంట్, ఉమ్మడి వ్యాపారం, తరుగుదల, ఏర్పాట్లు రిజర్వులు, భారతీయ అకౌంటింగ్ ప్రమాణాలు నిర్దేశించారు. అభ్యర్థులు ముఖ్యంగా ప్రాథమిక భావనలు, సూత్రాలు, వివిధ పట్టికలు; డెబిట్, క్రెడిట్ సూత్రాలను లోతుగా చదవాలి. సాధ్యమైనన్ని లెక్కలను సాధన చేయాలి.
అదేవిధంగా అడ్వాన్స్‌డ్ అకౌంటింగ్, కార్పొరేట్ అకౌంటింగ్ సబ్జెక్టుల నుంచి నిర్దేశించిన అంశాలు సెల్ఫ్ బ్యాలెన్సింగ్ లెడ్జర్, రాయల్టీలు, అద్దె కొనుగోలు, వాయిదా కొనుగోలు పద్ధతులు, ఒంటి పద్దు విధానం, వ్యాపారేతర సంస్థల ఖాతాలు, అసంపూర్ణ రికార్డుల నుంచి ఖాతాలు, భాగస్వామ్య ఖాతాలు (ప్రవేశం, విరమణ, మరణం, రద్దు), బ్రాంచి ఖాతాలు, కంపెనీ ఖాతాలు - వాటాలు, డిబెంచర్ల జారీ, వాటాల జప్తు, బోనస్ వాటాల జారీ, కంపెనీ ముగింపు లెక్కలు, అకౌంటింగ్ ప్రమాణాలు, కంపెనీ లిక్విడేషన్, జీవిత బీమా కంపెనీ ఖాతాలు, బ్యాంకు ఖాతాలు, సంయోగం - సంలీనం, పునర్నిర్మాణం, గుడ్‌విల్, వాటాల మూల్యాంకనం, నిష్పత్తి విశ్లేషణ. అభ్యర్థులు వివిధ పద్ధతులు, వాటి సూత్రాలు, వివిధ ఖాతాల నమూనాలను, షెడ్యూళ్ల నెంబర్లను గుర్తుంచుకోవాలి. ఎక్కువగా లెక్కలకు సంబంధించిన ప్రశ్నలను అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తగినన్ని లెక్కలను సాధన చేయాలి. ముఖ్యమైన అంశాలను గుర్తుపెట్టుకోవాలి.
కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటింగ్:
జేఏవో సాధించడంలో ప్రముఖ పాత్ర వహించే సబ్జెక్టుల్లో కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటింగ్ ప్రధానమైంది. దీని నుంచి 25 మార్కులకు ప్రశ్నలను అడుగుతారు. దీనికి నిర్దేశించిన సిలబస్ వ్యయ ప్రాథమిక భావనలు, మెటీరియల్, లేబర్ వ్యయాలు, ఓవర్‌హెడ్స్, కాస్టింగ్ పద్ధతుల్లో యూనిట్ లేదా అవుట్‌పుట్ కాస్టింగ్; జాబ్, కాంట్రాక్ట్ కాస్టింగ్; ఆపరేటింగ్ కాస్టింగ్; ప్రాసెస్ కాస్టింగ్, మార్జినల్ కాస్టింగ్, లాభ - నష్ట రహిత బిందువు (బ్రేక్ - ఈవెన్) విశ్లేషణ, ఆర్థిక నివేదికల విశ్లేషణ - నిష్పత్తి విశ్లేషణ, వర్కింగ్ క్యాపిటల్ నిర్వహణ, నిధుల ప్రవాహ విశ్లేషణ, నగదు ప్రవాహ విశ్లేషణ. ఈ సబ్జెక్టుల్లో అభ్యర్థులు ముఖ్యంగా వివిధ కాస్టింగ్ పద్ధతులు, వాటిని పాటించే సంస్థలు, సూత్రాలను విశ్లేషిస్తూ చదవాలి. వివిధ పద్ధతుల్లో లెక్కలను ప్రాక్టీస్ చేయాలి. ముఖ్యమైన అంశాలను, సూత్రాలను నోట్ చేసుకుని చదవాలి.
ఆడిటింగ్:
జేఏవో సాధనలో ప్రముఖ పాత్ర వహించే మరొక సబ్జెక్టు ఆడిటింగ్. దీని నుంచి 20 మార్కులకు ప్రశ్నలను ఇస్తారు. ఈ సబ్జెక్టుకు నిర్దేశించిన సిలబస్ ఆడిటింగ్ ప్రాథమిక అంశాలు, అంతర్గత తనిఖీ, నియంత్రణ వోచింగ్, వెరిఫికేషన్, కంపెనీల ఆడిట్, విభాజనీయ లాభాలు, భారతీయ ఆడిటింగ్ ప్రమాణాలు మొదలైనవి. అభ్యర్థులు దీనిలో ప్రతి అంశం ప్రాథమిక భావనలు, వివిధ సెక్షన్‌లు, సంవత్సరాలు, కనీస, గరిష్ఠ సంఖ్య, ఇతర నియమాలను విశ్లేషిస్తూ చదవాలి. ముఖ్యమైన వాటిని నోట్ చేసుకున్నట్లయితే తక్కువ సమయంలో రివిజన్ చేయవచ్చు. ఆడిట్ ప్రమాణాలను గుర్తుపెట్టుకోవాలి.
అభ్యర్థులు నిర్దేశించిన సిలబస్‌తోపాటు అకౌంటింగ్, వ్యాపార, ఆర్థిక రంగంలో వస్తున్న సంస్కరణలు, వర్తమాన అంశాలను కూడా చదవాలి. ఇటీవల అకౌంటింగ్, ఆడిటింగ్ ప్రమాణాల్లో వచ్చిన మార్పులు, నూతన సంస్కరణలను లోతుగా అధ్యయనం చేయాలి.

విభాగం - B జనరల్ అవేర్‌నెస్, న్యూమరికల్ ఎబిలిటీ:
ఇందులో అభ్యర్థుల సాధారణ పరిజ్ఞానాన్ని పరీక్షించే ఉద్దేశంతో వివిధ అంశాలకు సంబంధించిన ప్రశ్నలకు 20 మార్కులను కేటాయించారు. దీనిలో నిర్దేశించిన ముఖ్యమైన అంశాలు విశ్లేషణ, న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ అవేర్‌నెస్, ఆంగ్ల పరిజ్ఞానం, తెలంగాణ ఉద్యమం - సంస్కృతి, కంప్యూటర్ పరిజ్ఞానం మొదలైనవి. ప్రామాణిక పుస్తకాలు, పత్రికలను చదవడం ద్వారా వర్తమాన అంశాలపై పట్టు సాధించాలి.

అభ్యర్థులకు సూచన:
జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ (జేఏవో) ఉద్యోగానికి సన్నద్ధమయ్యే అభ్యర్థులు చక్కటి ప్రణాళికతో సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ, నిరంతర సాధనలో సానుకూల దృక్పథంతో ప్రామాణిక పుస్తకాలను చదివినట్లయితే విజయాన్ని సాధిస్తారు. రోజుకు దాదాపు 10 నుంచి 12 గంటల సమయాన్ని ప్రిపరేషన్‌కు కేటాయించాలి. వీలైనన్ని మాదిరి ప్రశ్నపత్రాలు ప్రాక్టీస్ చేయాలి. ఇది అభ్యర్థుల ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది. అభ్యర్థులు ఇటీవల జరిగిన జేఏవో పరీక్షలో అడిగిన ప్రశ్నల సరళిని విశ్లేషిస్తూ, గతంలో చేసిన పొరపాట్లను తిరిగి పునరావృతం కాకుండా మంచి ప్రణాళికతో శ్రద్ధగా చదవాలి. పరీక్ష ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ప్రామాణిక ఆంగ్ల మాధ్యమ పుస్తకాలను చదివినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. పట్టుదల, నిరంతర శ్రమ, కఠోర సాధన, అనకూల దృక్పథం, సమయ సద్వినియోగం అభ్యర్థుల విజయానికి సోపానాలు.

Reference Books
1. Financial Accounting S.P. Jain & K.L. Narang
2. Advanced Accounting S.N. Maheshwari
3. Corporate Accounting R.L. Guptha & Radha swamy
4. Cost and Management Accounting M.N. Arora (MCQs) & S.P. Jain & K.L. Narang
5. Auditing R.G. Saxena, T.N. Tandon Pradeep Kumar
6. General Awarness & Numerical ebility R.S. Agarwal (Wren and Martin for English)

- ఎం. మల్లారెడ్డి

Posted on 10-07-2018