closeటీఎస్‌పీఎస్సీ > తెలంగాణ రాష్ట్ర ఉద్యమం, ఆవిర్భం ప్రత్యేకాంశంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయ, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక చరిత్ర.

చరిత్ర పూర్వ యుగంలోనూ తెలంగాణ

 • తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పోటీ పరీక్షలన్నింటిలో కీలక పాత్ర వహించే అంశం 'తెలంగాణ చరిత్ర - సంస్కృతి. దీన్ని గురించి సంపూర్ణంగా తెలుసుకోవడానికి ప్రాచీన, మధ్య, ఆధునిక యుగాలకు చెందిన రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, వారసత్వ వ్యవస్థలను అధ్యయనం చేయాల్సి ఉంటుంది. టీఎస్‌పీఎస్సీ దీనికి సంబంధించి నిర్దిష్టమైన సిలబస్‌ను పేర్కొంది. దీనిలో శాతవాహనుల కాలం నుంచి అసఫ్ జాహీ వంశ రాజుల వరకు ఉంది. సిలబస్‌లో సామాజిక, సాంస్కృతిక అంశాలను ప్రత్యేకంగా పేర్కొనప్పటికీ, నాటి రాజకీయ పరిస్థితులను అధ్యయనం చేయాలి. ముఖ్యంగా అప్పటి రాజవంశాలు, రాజులు, వారి పాలనా కాలం గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది.
  ప్రాచీన తెలంగాణ చరిత్రలో శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, బౌద్ధ, జైన మతాలు; ముదిగొండ చాళుక్యులు, వేములవాడ చాళుక్యులు మొదలైన అంశాలను చేర్చారు. ప్రధానంగా నాటి సామాజిక, సాంస్కృతిక అంశాలైన భాష, సాహిత్యం, కళలు, వాస్తు శిల్పం మొదలైన వాటిని క్షుణ్నంగా చదవాలి.
  చరిత్ర రచనలో రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అంశాలు ఒకే నాణేనికి చెందిన బొమ్మ-బొరుసు లాంటివి. ఇవి స్పష్టంగా ఉంటేనే చరిత్రకు విలువ. ప్రపంచంలోని అన్ని జాతుల్లానే తెలంగాణ ప్రజలకు కూడా ఆదిమ యుగం లేదా చరిత్రకు పూర్వయుగం ఉంది.
  భారతదేశ ప్రజల్లో అతి ప్రాచీనుల్లో తెలంగాణ ప్రజలు ఒకరు. తెలంగాణ చరిత్రను తెలుసుకోవడానికి అప్పటి ప్రజలు ఉపయోగించిన పనిముట్లు, అప్పటి కట్టడాలు, శాసనాలు, నాణేలు, వాఞ్మయం ఆధారమయ్యాయి. ఈ చరిత్రను ప్రాచీన శిలాయుగం నుంచి సమగ్రంగా రూపొందించడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.
  తెలంగాణ చరిత్ర శాతవాహనుల చరిత్ర కంటే ప్రాచీనమైంది. క్రీ.పూ.6వ శతాబ్దంలో విలసిల్లిన షోడశ మహాజనపదాల్లో తెలంగాణ కూడా ఉంది. ఈ జనపదాల్లో నాటి తెలంగాణ ప్రాంతంలోని అస్మక లేక అస్సక రాజ్యం ఒకటి. ఇదే నేటి నిజామాబాద్ జిల్లాలోని బోధన్. ఈ ప్రాంతాన్ని పొదన అని కూడా పిలిచేవారు. బోధన్ అస్మక రాజ్యం రాజధాని. దీని పాలకుడు బుద్ధుడికి సమకాలీకుడైన సుజాతుడిగా భావిస్తారు. క్రీ.పూ.6వ శతాబ్దంలో ప్రాచుర్యం పొందిన బౌద్ధ, జైన మతాలు కూడా ఈ ప్రాంతంలోనే విలసిల్లినట్లు ఇటీవల జరిపిన తవ్వకాల్లో చారిత్రక ఆధారాలు లభించాయి. ఆ ప్రాంతాలు... ధూలకట్ట (కరీంనగర్); ఫణిగిరి, గాజుల బండ (నల్గొండ); కొండాపూర్ (మెదక్); నేలకొండ పల్లి (ఖమ్మం).
  మగధ రాజ్యాన్ని పాలించిన మౌర్య వంశ పతనానంతరం దక్కన్ (దక్షిణ పథం) ప్రాంతంలో శాతవాహనులు స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. శాతవాహనుల చరిత్ర తెలంగాణలోనే ప్రారంభమైందని కరీంనగర్ జిల్లాలో విస్తారంగా లభ్యమైన 24,000 'పోటీన్ నాణేల ద్వారా తెలుస్తుంది. ఈ నాణేలపై విస్తృతంగా అధ్యయనం చేసినవారు డాక్టర్ డి.రాజారెడ్డి. ఆ తర్వాత కాలంలో శాతవాహనులు నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమరావతిని, ధరణికోటను రాజధానిగా చేసుకుని పరిపాలించారు. ఆ తర్వాతి కాలంలో నేటి మహారాష్ట్రలోని ఫైఠాన్/ ప్రతిష్ఠానపురాన్ని రాజధానిగా చేసుకుని పాలించినట్లు కొందరు చరిత్రకారుల అభిప్రాయం. శాతవాహనుల కేంద్ర స్థానం మొదట తెలంగాణలోని గోదావరి నదీ తీర ప్రాంతమేనని అక్కడ లభించిన చారిత్రక అవశేషాలు ధ్రువీకరిస్తున్నాయి.
  వాయు పురాణం ప్రకారం శాతవాహనుల రాజులు 17, మత్స్య పురాణం ప్రకారం 30 మంది రాజులు పరిపాలించినట్లు తెలుస్తోంది.
  శాతవాహనులు
  శాతవాహనులు మౌర్యులకు సామంతులుగా తెలుగు ప్రాంతాలను పాలించారు. వీరు తెలంగాణను పాలించిన మొదటి రాజులు.
  శాతవాహనుల జన్మభూమి
  శాతవాహనుల జన్మస్థలం గురించి చరిత్రకారులు భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
  కర్ణాటక దేశం - వి.ఎస్.సుక్తంకర్
  విదర్భ ప్రాంతం - వి.వి.మిరాషీ పండితుడు
  మహారాష్ట్ర - పి.టి.శ్రీనివాస అయ్యంగార్, జొగేల్కర్
  ఆంధ్రదేశం - రాప్సన్, విన్సెంట్ స్మిత్, భండార్కర్, బర్లెన్, గుత్తి వెంకట్రావు.
  తెలంగాణ ప్రాంతం - డాక్టర్ పి.వి.పరబ్రహ్మ శాస్త్రి
  గమనిక: ఇటీవల లభించిన పురావస్తు పరిశోధనల ఆధారంగా శాతవాహనుల ప్రస్థానం మొదట తెలంగాణలో ప్రారంభమై, తర్వాత ఇతర ప్రాంతాలకు విస్తరించినట్లు తెలుస్తోంది.
  * వి.ఎస్.సుక్తంకర్, శ్రీనివాస శాస్త్రి మొదలైన పండితులు శాతవాహనులు ఆంధ్రులు కారని, ఆంధ్రుల భృత్యులని పేర్కొన్నారు.
  శాతవాహనుల చరిత్ర ఆధారాలు:
  * శాతవాహనుల చరిత్రకు లభిస్తున్న ఆధారాల్లో శాసనాలు, పురాణాలు, గ్రంథాలు, నాణేలు, కట్టడాలు ముఖ్యమైనవి.
  శాసనాలు
  శాసనం - వేయించినవారు
  నానేఘాట్ శాసనం - నాగానిక
  నాసిక్ శాసనం - గౌతమీ బాలశ్రీ
  హాథీగుంప, గుంటుపల్లి శాసనాలు - ఖారవేలుడు
  మ్యాకదోని శాసనం - మూడో పులోమావి
  జునాఘడ్ శాసనం - శక రుద్రదమనుడు
  చిన్న గంజాం శాసనం - గౌతమీపుత్ర యజ్ఞశ్రీ
  నాసిక్ శాసనం - కృష్ణుడు
  * వీటితో పాటు శాతవాహాన వంశీయులు, వారి సామంత మాండలీకులు వేయించిన 24 ప్రాకృత శాసనాలు నాసిక్, కార్లే గుహాలయాల్లో లభ్యమయ్యాయి.
  పురాణాలు
  * మత్స్య, వాయు పురాణాలు
  గ్రంథాలు
  * బౌద్ధ జాతక కథలు
  * జైన మత గ్రంథాలు
  గాథా సప్తశతి - హాలుడు
  బృహత్కథ - గుణాడ్యుడు
  వాత్సాయనీయం (వాత్సాయన కామ సూత్రాలు) - వాత్సాయనుడు
  లీలావతి కావ్యం - కుతూహలుడు
  కథాసరిత్సాగరం - సోమదేవసూరి
  కాతంత్ర వ్యాకరణం - శర్వవర్మ
  ఆచార్య నాగార్జునుడి గ్రంథాలు:
  1) ప్రజ్ఞాపారమిత శాస్త్రం
  2) సుహృల్లేఖ
  3) శూన్య సప్తశతి
  4) రసరత్నాకరం (రసాయన వాదం)
  5) ద్వాదశనికాయ శాస్త్రం
  6) ఆరోగ్య మంజరి (వైద్య శాస్త్ర గ్రంథం)
  7) మాధ్యమిక కారిక
  8) ప్రమాణ విభేతన శాస్త్రం
  9) మాధ్యమిక శాస్త్రానికి 'ఆకుతోభయ' పేర వ్యాఖ్యానం రచించాడు.
  ఆర్యదేవుడు:
  ఇతడు నాగార్జునాచార్యుడి శిష్యుడు.
  ఈయన రచించిన గ్రథాలు: శతుశ్శతకం, అక్షర శతకం, శత శాస్త్రం
  బుద్ధస్వామి - కథాశ్లోకానుగ్రహం
  ధనపాలుడు - తిలక మంజరి
  ఉద్యోతనుడు - కువలయ మాల
  నాణేలు:
  * రాజ్యస్థాపకుడైన శ్రీముఖుడి నాణేలు కోటిలింగాల్లో విస్తృతంగా బయటపడ్డాయి.
  * శాతవాహన వంశస్థాపకుడైన శాతవాహనుడి నాణేం మెదక్ జిల్లా కొండాపూర్‌లో దొరికింది.
  * వెండి, రాగి, సీసం, పోటిన్, లోహ నాణేలుండేవి. వీరి నాణేలు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో లభించాయి.
  కట్టడాలు
  * అమరావతి, జగ్గయ్యపేట, భట్టిప్రోలు, ఘంటశాల శాలిహుండం, రామతీర్థం, ధారపాలెం, గుంటుపల్లి, గుడివాడ మొదలైన ప్రాంతాల్లోని ఆరామ, విహార, చైత్యాలయాలు.
  * అజంతాలోని 8 నుంచి 10, 12, 13 సంఖ్యలున్న గుహలు, ఎల్లోరాలోని 12, 15 ఆడుగుల ఎత్తు ఉన్న బౌద్ధ విగ్రహాలు, వివిధ నాట్య భంగిమలు.
  విదేశీ గ్రంథాలు:
  నేచురల్ హిస్టరీ - ప్లినీ
  ఎగైడ్ టు జియోగ్రఫీ - టాలమీ
  ఇండికా - మెగస్తనీస్
  పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రయన్ సీ - అజ్ఞాత నావికుడు
  * పై గ్రంథాలు శాతవాహన చరిత్రకు ఉపయోగపడుతున్నాయి.
  శాతవాహనుల రాజధానులు
  శాతవాహనుల రాజధానులు ధాన్యకటకం, అమరావతి (గుంటూరు), ఫైఠాను (మహారాష్ట్ర). అయితే ఇటీవల లభించిన నాణేల ఆధారంగా వారి మొదటి రాజధాని తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాలని భావిస్తున్నారు.
 • Posted on 12-09-2015

  డా.ఎం. జితేందర్ రెడ్డి