closeటీఎస్‌పీఎస్సీ > ఇంట‌ర్వ్యూలు

కంగారొద్దు...గురి ముఖ్యం

* పోటీ పరీక్షల సిలబస్‌ పెరిగినా క్లిష్టత తగ్గింది.. కష్టం కాదు
* ప్రామాణిక గ్రంథాలను ఎంచుకోవడం ముఖ్యం సరైన మార్గదర్శనం అవసరం
* 'ఈనాడు'తో టీఎస్‌పీఎస్సీ సిలబస్‌ కమిటీ సభ్యుడు ఆచార్య గణేష్‌

రాష్ట్ర ఆవిర్భావం తర్వాత విడుదలైన తొలి ఉద్యోగ ప్రకటనతో తెలంగాణ నిరుద్యోగ లోకంలో కోలాహలం పెరిగింది. దాంతోపాటే అనేక సందేహాలు... పరీక్ష విధానంపై, కొత్త సిలబస్‌పై! పాత పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పద్ధతికి, ఈసారి పద్ధతికి ఎలాంటి తేడా ఉండబోతోంది? ఎలా సన్నద్ధమైతే బాగుంటుంది? ఆధార్‌ కార్డు తప్పనిసరా? ఇలా ఔత్సాహిక అభ్యర్థుల మదిలో ఎన్నో ప్రశ్నలు.
ఉద్యోగార్థుల వివిధ ప్రశ్నలు సందేహాలకు సమాధానమిస్తున్నారు- టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌ పరీక్షల సిలబస్‌ కమిటీ సభ్యుడు ఆచార్య చింతా గణేశ్‌! సిలబస్‌ మారిందని, పెరిగిందని కంగారు పడాల్సిన అవసరం అస్సలు లేదని ఆయన సూచిస్తున్నారు. ఇటీవలి దాకా ఉస్మానియా విశ్వవిద్యాలయం పోటీ పరీక్షల కేంద్రం సంచాలకుడిగా వ్యవహరించి వేల మందికి శిక్షణ ఇప్పించిన ఆయన ఈసారి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు పలు సూచనలు చేశారు.
లెక్కల సమస్య తగ్గిందోచ్‌...
గతంలో గ్రూపు-1లో డేటా ఇంటర్‌ప్రెటేషన్‌ అండ్‌ ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ పేరిట 150 మార్కుల పేపర్‌ ఉండేది. అది గణితం, ఇంజినీరింగ్‌ చదివిన వారికి ప్రయోజనంగా ఉండేది. దానివల్ల ఇతర కోర్సులు చదివిన వారికి నష్టం జరిగేది. దాన్ని ఈసారి భారీగా కుదించారు. అంటే గతంలో ఉన్న అసమతుల్యత లేదు.
అదనమైనా క్లిష్టం కాదు
ఈసారి ఇండియన్‌ సొసైటీ అనే అంశాన్ని చేర్చారు. గతంలో అది లేదు. సిలబస్‌ పరంగా కొంత అదనపు భారం అయినా కాబోయే పరిపాలనాధికారులకు తప్పనిసరిగా వీటిపై అవగాహన ఉండాలి. అయితే అదనంగా చేరిన సిలబస్‌ క్లిష్టమైనదేమీ కాదు. సాధారణ విద్యార్థులు సైతం సొంతగా సిద్ధమయ్యేలా ఉంది.
ఒకేసారి రెండు పిట్టలు
ఆబ్జెక్టివ్‌కు ఒకసారి... మెయిన్స్‌కు ఒకసారి సన్నద్ధమవటం- అంటే ప్రిలిమినరీలో గట్టెక్కిన తర్వాత మెయిన్స్‌కు సిద్ధం కావడం మంచిది కాదు. అసలు ప్రిలిమినరీ గట్టెక్కలేమని ఎందుకు అనుకుంటారు? విజయం సాధిస్తామనే రంగంలోకి దిగాలి. పోటీ తీవ్రంగా ఉంటుంది కాబట్టి సిలబస్‌ ప్రకారం ఒకేసారి సన్నద్ధం కావాలి. గ్రూపు-1 లాంటి పోటీ పరీక్షలకు విస్తృత సన్నద్ధత అవసరం. నిర్దిష్ట సిలబస్‌లో ఏ అంశం నుంచి ఎలాంటి ప్రశ్న అడిగినా రాయాలంటే విస్తృత పరిజ్ఞానం ఉండాలి.
అలా అడగరిక...
ప్రతి అంశాన్ని లోతుగా, వివరంగా, విశ్లేషణాత్మక కోణంలో చదవాలి. అందుకు ప్రామాణిక పుస్తకాలను ఎంచుకోవడం ముఖ్యం. ఉదాహరణకు భారత దేశ ఆర్థిక వ్యవస్థకు వస్తే 12 ప్రామాణిక గ్రంథాలున్నాయి. ప్రశ్నపత్రం తయారుచేసే నిపుణులు సైతం వాటిని దృష్టిలో పెట్టుకునే ప్రశ్నలు ఇస్తారనడంలో సందేహం లేదు. కోచింగ్‌ సంస్థలు కొన్ని అందుకు భిన్నంగా ప్రతి అంశాన్ని బిట్లు రూపంలో చెబుతుంటాయి. ఆర్‌బీఐని ఎప్పుడు స్థాపించారు అని అడిగే రోజులు పోయాయి. ఆర్‌బీఐ విధులు, విధానాలు, తాజాగా తెచ్చిన మార్పులు, వాటి ప్రభావం తదితర వాటికి అధిక ప్రాధాన్యం ఉంటుంది. చరిత్రలో ఘటనలు ముఖ్యం కాదు...సాంస్కృతిక ప్రాధాన్యం, యుద్ధాల పర్యవసానాలు కోణంలో దృష్టి కేంద్రీకరించాలి.
శిక్షణ లేకున్నా...
* కోచింగ్‌ లేకుండా కూడా విజయం సాధించవచ్చు. అందుకు నిర్మాణాత్మక సన్నద్ధత కీలకం. సిలబస్‌ను సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి. ప్రామాణిక గ్రంథాలను గుర్తించాలి. ఒక్కో దానికి రెండు పుస్తకాలను ఎంపిక చేసుకొని లోతుగా అర్ధం చేసుకుంటూ చదవాలి. అదే సమయంలో నోట్స్‌ రాసుకోవాలి.
* కోచింగ్‌ తప్పనిసరి కాకున్నా విస్తృత పోటీ, మారిన సిలబస్‌ దృష్ట్యా సరైన మార్గదర్శనం మాత్రం తప్పనిసరి. సొంతంగా సిద్ధమయ్యేవారు మార్కెట్‌ ప్రలోభాలకు గురవుతుంటారు. కనిపించిన ప్రతి పుస్తకం కొంటారు. దానివల్ల స్పష్టత రాకపోగా గందరగోళం ఎక్కువవుతుంది. అందుకు వారు రెండు ప్రామాణిక గ్రంథాలను ఎంపిక చేసుకొని చదవటం చాలా ముఖ్యం. అందుకు ఇప్పటికే విజయం సాధించిన వారు, వారికి తెలిసిన నిపుణులను సంప్రదించడం, పత్రికల్లో నిపుణులు చెప్పే సమాచారం ఆధారంగా గ్రంథాలను ఎంచుకోవచ్చు.
రోజూ చదువుతూనే ఉండండి...
నిత్యం రెండు దినపత్రికలను అవసరమైన అంశాలను చదవాలి. ముఖ్యంగా సామాజిక, ఆర్థిక అంశాలను, అంతర్జాతీయ సంబంధాలను లోతుగా చదువుతూ నోట్స్‌ రాసుకోవాలి. తెలంగాణ సాయుధ పోరాటంపై తెలుగు అకాడమీ పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. మలిదశ పోరాటంపై విద్యార్థులకు పూర్తి అవగాహన ఉంది. వాటిపై కూడా పుస్తకాలు సిద్ధమవుతున్నాయి. విద్యార్థులు తెలుగుతోపాటు ఆంగ్లమాధ్యమం పుస్తకాలను చదవాలి.
పదిని పట్టేయలేమా?
ఆంగ్లం అనేది కేవలం పదో తరగతి స్థాయిలోనే ఉంటుంది. దానివల్ల గ్రామీణ విద్యార్థులకు ఎటువంటి సమస్యలు రావు.
గురి పెట్టండి తెలంగాణపై..
గతానికి, ఇప్పటికి చాలా తేడాలు ఉన్నాయి. ముఖ్యంగా గ్రూపు-1, 2లో ప్రత్యేకంగా తెలంగాణ చరిత్ర, సంస్కృతిపై అదనంగా ఒక పేపర్‌ ప్రవేశపెట్టారు. గ్రూపు-1లో 150 మార్కులు, గ్రూపు-2లో 100 మార్కుల పేపర్‌ ఉంటుంది. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని చరిత్ర, భౌగోళికాంశాలు, ఆర్థిక వ్యవస్థ తదితర వాటిని చదివేవారు. ఇప్పుడు భారతదేశ చరిత్రతోపాటు తెలంగాణపై ప్రధానంగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ఉద్యమం తదితర అంశాలకు ప్రాధాన్యం పెరిగింది.
మా పుస్తకాలున్నాయ్‌... కంగారొద్దు
తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న సందేహం- ప్రామాణిక పుస్తకాలు లేవన్నది? ఇప్పటికే గ్రూప్స్‌ సహా అన్ని పరీక్షల విధివిధానాల్ని ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ త్వరలోనే సిలబస్‌ను కూడా పూర్తిస్థాయిలో ప్రకటిస్తామని వెల్లడించిన సంగతి తెలిసిందే. నవంబరు లేదా డిసెంబరులో గ్రూప్‌-2 పరీక్ష ఉండే అవకాశాలున్నాయని కూడా టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ చరిత్ర, ఉద్యమంపై ఇంతదాకా పుస్తకాలు లేవనే సందేహాలను కొట్టిపారేస్తోంది తెలుగు అకాడమీ. తాము ఇంటర్మీడియెట్‌ కోసం ప్రచురించిన చరిత్ర, పౌరశాస్త్రం, అర్ధశాస్త్రం పుస్తకాల్లో పోటీ పరీక్షలకు అవసరమైన సమాచారం చాలామటుకు ఉందని అకాడమీ డైరెక్టర్‌ సత్యనారాయణరెడ్డి తెలిపారు. ''ఇంటర్మీడియెట్‌ కోసం రూపొందించిన చరిత్ర పుస్తకాల్లో శాతవాహనుల నుంచి తెలంగాణ ఆవిర్భావం దాకా అన్ని అంశాలను పొందుపరచాం. అర్ధశాస్త్రం, పౌరశాస్త్రం పుస్తకాల్లో కూడా తెలంగాణ సమాచారం అందుబాటులో ఉంది. వీటితోపాటు తెలంగాణ సాయుధపోరాటం పుస్తకం కూడా ఉపయోగపడుతుంది. ఇవన్నీ చాలా అమ్ముడవుతున్నాయి. హైదరాబాద్‌లోని కార్యాలయం, వరంగల్‌లోని అకాడమీ ప్రాంతీయ కార్యాలయాలతోపాటు అన్ని ప్రధాన పుస్తక కేంద్రాల్లో ఇవి అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు వీటిని ఉపయోగించుకోవచ్చు'' అని సత్యనారాయణరెడ్డి వివరించారు. చరిత్ర పుస్తకాలన్నింటినీ కలిపి సమగ్రంగా ఒకే పుస్తకంగా, జనరల్‌స్టడీస్‌పై మరో సవివరమైన పుస్తకాన్ని త్వరలోనే తీసుకొస్తున్నామన్నారు.
ఆధార్‌ తప్పనిసరా?
టీఎస్‌పీఎస్సీ పరీక్షల దరఖాస్తుకు ముందస్తుగా నమోదు చేసుకునే ఓటీఆర్‌(వన్‌ టైమ్‌ రిజిస్ట్రేషన్‌) సమయంలో ఆధార్‌ సంఖ్యను అడుగుతున్నారు. ఇది తప్పనిసరేమీ కాదని టీపీఎస్సీ ఛైర్మన్‌ ఆచార్య ఘంటా చక్రపాణి ఇప్పటికే స్పష్టంచేశారు. అయితే ఆధార్‌ కూడా ఉంటే, అక్రమాలను అరికట్టడంతోపాటు, తర్వాత నియామకాల సమయంలో ప్రక్రియ సులభమవుతుందనే ఉద్దేశంతో దీన్ని ప్రవేశపెట్టారు. దరఖాస్తుదారుల్లో 80 శాతం మంది తమ ఆధార్‌ వివరాలను సమర్పిస్తున్నారన్నది టీఎస్‌పీఎస్సీ వర్గాల సమాచారం. ఆధార్‌ లేకున్నా పరీక్ష కేంద్రాల వద్ద అభ్యర్థుల వేలిముద్రలను బయోమెట్రిక్‌ పద్ధతిలో నమోదు చేస్తారు.


Posted on 22-08-2015