closeటీఎస్‌పీఎస్సీ > తెలంగాణ రాష్ట్ర ఉద్యమం, ఆవిర్భం ప్రత్యేకాంశంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయ, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక చరిత్ర

విలక్షణాల జనపథం...తెలంగాణం!

ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల పల్లెలో పుట్టి, తెలంగాణ సంస్కృతిని, బతుకు చిత్రాన్ని ఔపాసనపట్టి... ఐక్యకార్యాచరణ సమితి సారథిగా తెలంగాణ ఉద్యమాన్ని సమన్వయం చేసిన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్స్ సిలబస్ సబ్ కమిటీ కన్వీనర్ ఆచార్య కోదండరాం- పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం తెలంగాణ సంస్కృతిపై అందిస్తున్న వ్యాసం... 'ఈనాడు-ప్రతిభ'కు ప్రత్యేకం.

ఇంజినీరింగ్ ఉద్యోగాలకు పోటీపడుతున్నవారిని తెలంగాణ సంస్కృతి గురించి పరీక్షించటమేందని చాలామందిలో ప్రశ్న ఉదయించవచ్చు. సామాజిక న్యాయాన్ని పెంపొందించటం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయటం, అందరికీ అభివృద్ధిలో వాటా దక్కేలా చేయటమనేది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వెనకాలున్న ఒక ముఖ్య లక్ష్యం! కాబట్టి తెలంగాణ డిమాండ్ వెనకాలున్న చారిత్రక కారణాలు స్థూలంగా తెలియకుంటే ఎవరైనాగాని పాలనా యంత్రాంగంలో సరిగ్గా ఇమడలేకపోవచ్చు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ పరిస్థితులు, చరిత్ర, సామాజిక ఆర్థిక స్థితిగతుల పట్ల అవగాహన పెంపొందించే ప్రయత్నం పెద్దగా జరగలేదు. ఇప్పుడు కూడా ఆ ప్రయత్నం చేయకుంటే తెలంగాణలో ఉద్యోగంలోకి వచ్చేవారు ప్రజలకు సరైన రీతిలో సేవ చేయటం కష్టం. గతంలో కూడా సిలబస్‌లో తెలంగాణపై అంశాలుండేవి. కానీ వాటిలో తెలంగాణ సమాజ ప్రత్యేకతలు, విశిష్టతలను ఎత్తిచూపే ప్రయత్నం జరగలేదు. ఇప్పుడు ఆ ప్రయత్నం జరుగుతోంది.

ఎన్నో ప్రత్యేకతల తెలంగాణ
తెలంగాణ సమాజానికి కొన్ని ప్రత్యేకతలున్నాయి. నిజాం కాలంలో తెలంగాణకు రాజకీయ, ఆర్థిక స్వేచ్ఛలు లేవు. నిరంకుశమైన పరిపాలన! అయితే వాస్తవాన్ని గమనిస్తే ఆ నిరంకుశపాలనలోనూ సంస్కరణలు వచ్చాయి. ముఖ్యంగా 1853 తర్వాత అధికారంలోకి వచ్చిన సాలార్‌జంగ్ తెలంగాణ పాలనా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకొచ్చాడు. వాటి ఫలితంగా ఒక ఆధునిక పాలనా యంత్రాంగమైతే ఏర్పడింది. ప్రత్యేకమైన విభాగాలు, స్పష్టమైన అధికారాలు, బాధ్యతలను వివరిస్తూ ఆయా శాఖలను అప్పుడు పునర్‌నిర్మాణం చేశారు. పాలనా యంత్రాంగంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా మార్పులు సమాజంలోనూ రావాలి. లేదంటే ఆ పాలనా యంత్రాంగం పనిచేయలేదు. కానీ అప్పటి సమాజంలో మాత్రం ఆర్థిక అసమానతలు, సామాజిక పెత్తనాలు యథాతథంగా ఉండిపోయాయి. దీంతో పాలనకు, సమాజానికి మధ్య వైరుధ్యం ఏర్పడింది. ఫలితంగా తెలంగాణ సమాజంలో రాజకీయ కల్లోలం, దుమారం చెలరేగింది. ఒకవైపేమో ప్రాతినిధ్య ప్రభుత్వం కోసం; మరోవైపు సామాజిక సమానత్వం కోసం పోరాటం సాగింది. అంటే కేవలం రాజకీయరంగంలో ప్రజాస్వామ్యమేకాదు... సామాజిక, ఆర్థికరంగంలోనూ ప్రజాస్వామ్యం కావాలన్న ఉద్దేశంతో తెలంగాణలో ఉద్యమాలు జరిగాయి. వీటి కారణంగా తెలంగాణ సమాజంలో మార్పులు చేర్పులు వచ్చాయి. ఎట్లాంటివంటే- గతంలో ఉన్న నిరంకుశ వ్యవస్థ పోయి అందరికీ రాజ్యాంగం ఇచ్చిన హక్కులు సంక్రమించాయి. గతంలో బలంగా ఉన్న భూస్వామ్య శక్తులు అంతరించిపోయాయి. ప్రత్యేకించి జాగీర్దార్లు, జమీందార్లు, దేశాయిలు, దేశ్‌ముఖ్‌లు వాళ్ల అధికారాలను కోల్పోయారు. అంతకుముందు వరకూ చెలాయించిన పెత్తనం పోయింది. వారు అప్పటి దాకా ఉచితంగా వెట్టి రూపంలో ఏరకమైన సేవల్ని పొందారో అవి అంతరించాయి. అంటే వెట్టి ఆ రూపంలో అంతరించింది. ఇళ్ళలో పెళ్ళిళ్ళైతే కట్నకానుకలు, వస్తువులు, సేవలందించే పద్ధతులు, బండి ముందు చాకలి పరుగెత్తటంలాంటివి చాలామటుకు అంతరించాయి.
భూస్వామి పోయి పెత్తందారులొచ్చారు...
వాటి స్థానంలో చిన్నచిన్న భూస్వాములున్న పల్లెలు ఆవిర్భవించాయి. ఈ సమాజంలోనూ కులపరమైన శ్రమ విభజన మాత్రం పోలేదు. ప్రతి కులమొక వృత్తి చేస్తూ, ఆ గ్రామంలోని వ్యవసాయానికి తోడ్పడుతూ ఉండేవారు. దీంతో గ్రామంలో భూమి ఉన్న ఆధిపత్య శక్తులకు మొత్తం గ్రామంపైనా; సామాజిక శ్రమపైనా; వస్తు ఉత్పత్తి క్రమంపైనా పెత్తనం ఏర్పడింది. అంటే ప్రతి ఒక్కరూ తమ వృత్తిని నిర్వహిస్తూ ఆ వృత్తిద్వారా ఆ గ్రామంలోని పెద్ద (భూస్వామి)కు సేవలందించటం; సౌకర్యాలు కల్పించటమనే ఆనవాయితీ కొనసాగుతూ వచ్చింది. దీనికి లోబడే ఓ సాంస్కృతిక జీవనం పెంపొందింది.
చిన్న రైతులు... ఆత్మహత్యలు
ఎప్పుడైతే భూసంస్కరణలు అమలయ్యాయో, గ్రామాల్లో రైతుల ఉద్యమాలు జరిగాయో ఈ సంబంధాలు కూడా మారటం మొదలైంది. భూమి బదలాయింపు జరిగింది. చిన్నరైతులు ప్రబలమైన శక్తులుగా ఎదిగారు. అంతకుముందున్న కులపరమైన శ్రమవిభజన, కులపరమైన వెట్టి అనేది కూడా పూర్తిగా అంతరించి పోయి... ఇవాళ గ్రామాల్లో ఒక చిన్నరైతు ప్రధానమైన వ్యవస్థ; వృత్తులు చేస్తూ బతికే మరికొన్ని కులాలు ఏర్పడ్డాయి. కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఈ వర్గాల ఎదుగుదలకు ప్రత్యేకమైన విధానాలు అమలు చేయకపోవటంతో వారు నిజంగా ఆర్థికంగా, స్వయం పోషకంగా ఎదగలేకపోయారు. చిన్నకమతాలపై వచ్చే ఆదాయాలు చాలక, పెట్టిన పెట్టుబడి, చేసిన శ్రమకు తగిన ఫలితం దక్కక పోతుండటంతో చాలాసార్లు తీవ్రమైన నిరాశ నిస్పృహలతో రైతులు అనేకమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇదే పరిస్థితి చేతివృత్తులపై ఆధారపడి బతుకుతున్న వర్గాల్లో కూడా మనకు కనిపిస్తుంటుంది. మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి, సాగునీరు, రుణసదుపాయానికి బ్యాంకింగ్ వ్యవస్థ; మార్కెట్ శక్తుల దోపిడీ నుంచి కాపాడటానికి రక్షణలు; తక్కువ ఖర్చుతో స్థానీయమైన పరిస్థితుల్లో తక్కువ ఖర్చుతో వ్యవసాయం చేసుకునే సాంకేతిక వ్యవస్థ, సదుపాయాలు అందించే వ్యవస్థలు ప్రభుత్వం నుంచి ఏర్పడి ఉండాల్సింది. కానీ అవి రాలేదు. దీంతో ఇప్పుడు మనం చూస్తున్న ప్రత్యేక పరిస్థితులు ఏర్పడ్డాయి. చిన్నరైతు వ్యవసాయం ఏర్పడటం; ఆ చిన్నరైతు తనకాళ్ళపై తాను నిలబడి వ్యవసాయం చేసుకునే పరిస్థితి లేకపోవటంతో వ్యవసాయం సంక్షోభంలో చిక్కుకుంది. పేదరికంలో రైతులు మగ్గిపోతున్నారు. చిన్నచిన్న చేతివృత్తులు చేసుకునేవారి బతుకు అవకాశాలు కూడా బాగా చితికిపోయాయి. వాళ్ళకు ప్రత్యామ్నాయాలు కల్పించక ఆ వర్గాలు కూడా పేదరికంలో మగ్గిపోయి ఉన్నాయి. పట్నాలకు పోయి పనిచేసుకుందామా అంటే నైపుణ్యాలు లేవు. వలసలు జరుగుతున్నాయి...కానీ వెళ్ళిన చో కూడా కూలీనాలీ చేసుకుంటూ బతకాల్సిందే. అక్కడా శ్రమదోపిడీకి గురవుతున్నారు.
వలసలు, తాగుడు వ్యసనం, ఆత్మహత్యలు...
* ఇక్కడి ప్రజలు ఎట్టిపరిస్థితుల్లోనూ ఆధిపత్యాన్ని ఏమాత్రం సహించరు. దాన్ని తీవ్రంగా శక్తిమేరకు ప్రతిఘటిస్తారు. అది ఈ సమాజానికున్న ప్రత్యేక లక్షణం.
* రెండోది ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీలాంటి వర్గాలు ప్రబలంగా, బలంగా ఉన్నాయి. ఆ వర్గాలు రకరకాల వృత్తి నైపుణ్యాలతో ఉన్నాయి. ఆ నైపుణ్యాలను ఆధునిక పరిస్థితులకు తగ్గట్లు చేయూతనందించి ఉంటే స్వయంపోషకంగా ఎదిగేవారు. అది దక్కక పోవటం ఓ సమస్య. ఈ కారణాలతో అసంఘటిత రంగం తెలంగాణలో విపరీతంగా పెరిగింది. తక్కువ కూలీకి, తమ శ్రమను, శక్తిని ధారపోసి మార్కెట్‌కుగానీ, మధ్య దళారీలకుగానీ ఉత్పత్తులను, సేవలను అందిస్తుంటారు. బీడీ కార్మికులు, ఆటోడ్రైవర్లు, నిర్మాణరంగంలో కూలీలు, రిక్షావాళ్ళు!
* విపరీతమైన ఆత్మహత్యలు! విదర్భ తర్వాత అతి ఎక్కువ ఆత్మహత్యలు, వసలున్న ప్రాంతం తెలంగాణ ఒకటి. రకరకాల ప్రాంతాలకు, రకరకాల పనులపై వసలపోయేవారి సంఖ్య ఇక్కడ ఎక్కువ. పౌష్టికాహార లోపం, అనారోగ్యంతో సతమతమవుతున్నవారు కూడా మనకు తెలంగాణలో చాలామంది కనిపిస్తారు.
శిష్టవర్గ సంస్కృతి కాదిది....
మనది దక్కన్ పీఠభూమి వాతావరణం. ఎగుడుదిగుడుగా ఉండే ఈ భూభౌతిక పరిస్థితుల్లో ఎక్కడికక్కడ నీటిని నిలువ చేసుకొని దానికింద వ్యవసాయం చేస్తుంటారు. వర్షాధారంగా మరికొంత పంట వేస్తుంటారు. దీని నుంచి పుట్టిన ప్రత్యేకమైన పండగలు మనకు తెలంగాణలో కనిపిస్తాయి. తెలంగాణలో రెండో ప్రత్యేకతేంటంటే సాంస్కృతిక విషయాకొస్తే, శిష్టవర్గ సంస్కృతి నుంచి పుట్టిన మతాచారాల కంటే ప్రజలు నిత్యజీవితంలో భాగంగా తాము ప్రకృతిని ఆరాధిస్తూ చేసే మతాచారాలు చాలా ఉంటాయి. బతుకమ్మ అందుకు ఉదాహరణ! ఇది శిష్టవర్గ సంస్కృతి నుంచి వచ్చింది కాదు. ఇదో ప్రకృతి ఆరాధన. ఆ సమయంలో, కాలంలో దొరికే పూలతో, వచ్చిన వంటకాలతో బతుకునిచ్చే చెరువును పూజించటం! అలాంటివే బోనాలు, ఎల్లమ్మ పూజలు. వీటిలో సమష్టితత్వం బలంగా ఉంటుంది. పండగ అంతా కలసి చేసుకుంటారు. చేసేప్పుడు వైయుక్తికమైన కోరికలకంటే అంతా కలసి ఊరు బాగుండాలని మొక్కుతుంటారు. ఇది తెలంగాణకు ప్రత్యేకమైన సంస్కృతి. చాలాకాలంపాటు ఉత్తర ప్రాంతం నుంచి వచ్చి పాలించిన మొగల్ చక్రవర్తులు కూడా శిష్టవర్గానికి సంబంధించిన భాషను రుద్దే ప్రయత్నం ఇక్కడ చేయలేదు. దీంతో స్థానిక అవసరాలకు తగ్గట్లుగా ఎక్కడికక్కడ భాష, అనుబంధంగా సంస్కృతులు రూపొందాయి. మతాచారాలు వాటి చుట్టూ అల్లుకొని కథలు, పాటలు తయారయ్యాయి. తమకు కావల్సిన జ్ఞానాన్ని, తమ సామాజిక చరిత్రను తెలియజెప్పే కళారూపాలు... తెలంగాణకు ప్రధానాంశాలుకావటంతో తెలంగాణ భాషకు ప్రత్యేకత వచ్చింది. కాళోజీ అన్నట్లు ఇది పలుకుబడుల భాషగా పెరిగింది. అందుకే తెలంగాణకు కష్టమొచ్చిన, సుఖమొచ్చిన ఓ పాటనే. ఆ పాటలోనే తన చరిత్రను నిక్షిప్తం చేసుకుంది. తన జీవితాన్ని అందులో వివరించింది. ప్రపంచానికి, ప్రకృతికి సంబంధించి తనకు ఏర్పడిన అవగాహనను తర్వాతి తరాలకు అందిస్తున్నది. తెలంగాణది శిష్టసంసృతి కాదు. జానపద సంస్కృతి. జానపదమే తెలంగాణ ఆయువుపట్టు. ప్రజలు ఏం చేయాలనుకున్నా ఆ సంస్కృతిపైనే ఆధారపడి, ఆ సాంస్కృతిక చిహ్నాల ద్వారా, సాధనాల ద్వారానే జీవితాన్ని పెంపొందించడానికి ప్రయత్నిస్తున్నారు.
మనదేగదా అని మైమరచిపోకండి
ఈ సిలబస్ తెలంగాణ పిల్లలకు ఒకరకంగా సులభమైంది. తనకు తెలిసిన చరిత్ర. తనకు తెలిసిన జీవితం. తెలంగాణ విద్యార్థి జీవితం చుట్టూ ఉన్న ప్రపంచమే కేంద్రబిందువులు. అందుకే వారిలో విశ్వాసం కనిపిస్తోంది. అయితే ఇదొక్కటే సరిపోదు. మనకు తెలిసింది ఓ క్రమపద్ధతిలో చెప్పే నేర్పు, సమాచార సేకరణ జాగ్రత్తగా చేసుకోవటం; సరైన రీతిలో విశ్లేషించే సామర్థ్యం సంపాదించుకోవటం ప్రధానం. ఆ రకంగా సన్నద్ధం కావాలి. సెస్ విడుదల చేసిన మానవాభివృద్ధి సూచికలు, సామాజిక రుగ్మతలపై వచ్చిన పుస్తకాలు ఉపయోగపడతాయి.
కీలకాంశాలు....
తెలంగాణ సమాజాన్ని స్థూలంగా మూడు దశల్లో చూడాలి.
* 1948 దాకా ఉన్న దశ: బాగా బలమైన భూస్వామ్య వ్యవస్థ. వెట్టిచాకిరీ. ఆర్థిక, సామాజిక స్వేచ్ఛలేని అన్నిరకాల దోపిడీ.
* 1948- 1970ల దాకా రెండోదశ: వ్యవస్థలో గణనీయమైన మార్పులు వచ్చినప్పటికినీ సంప్రదాయకమైన శ్రమవిభజన ఆధారంగానే చిన్నభూస్వామ్య వ్యవస్థ కొనసాగింది.
* 1975 తర్వాత...: చిన్నరైతు వ్యవస్థ ఆవిర్భవించింది. స్వతంత్రంగా బతికే అవకాశాన్ని పోరాడి సంపాదించుకోగలిగినప్పటికీ తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవటానికి కావాల్సిన సదుపాయాలు లేకపోవటం మూడో దశలోని ప్రత్యేక లక్షణం. వీటిలో గ్రామాల్లో పేదరికం, రుణగ్రస్థులైన రైతులు మనకు కనబడుతున్నారు. ఈ పరిస్థితుల నుంచి బయటపడటానికి వలసలు పోతున్నారు. నైపుణ్యం లేక చాలీచాలని జీతాలతో పనిచేస్తుండటంతో అక్కడ కూడా నిరంతరం దోపిడీకి గురవుతున్నారు. కాబట్టి పట్ణణాల్లోకి వచ్చాక అసంఘటిత రంగ కార్మికులుగా... హైదరాబాద్ అయినా, సూరత్, ముంబై, గల్ఫ్ ఇలా ఎక్కడికి పోయినా ఆర్థిక, శ్రమ దోపిడీకి గురయ్యే వర్గంగా మిగిలిపోతున్నారు.

Posted on 12-09-2015