close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

గ్రూప్‌-1 వాయిదా!

* కొత్త జోనల్‌ వ్యవస్థ వచ్చాకే ప్రకటన
* రాష్ట్ర ప్రభుత్వం తాజా నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా విడుదల కానున్న ఉద్యోగ ప్రకటనల జాబితా నుంచి గ్రూప్‌-1 పోస్టులను తొలగించారు. కొత్త జోనల్‌ విధానం వచ్చిన తరువాతే వీటిని భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌కు సూచించినట్లు తెలిసింది. దీంతో ఆ ఉద్యోగ ప్రకటనను ప్రస్తుతానికి తప్పిస్తోంది. తెలంగాణ ఏర్పాటైన తరువాత ఇప్పటి వరకు గ్రూప్‌-1 ప్రకటన వెలువడలేదు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్‌ 2న తొలి ప్రకటన ఇవ్వాలని టీఎస్‌పీఎస్సీ భావించింది. ఈ మేరకు 125 పోస్టులతో ప్రాథమిక షెడ్యూలును సిద్ధం చేసింది. అప్పటికి పాత జోనల్‌ విధానం కిందనే ఈ ప్రకటన వెలువరించాలని ప్రభుత్వం భావించింది. ఆ మేరకు పోస్టుల గుర్తింపు, రోస్టర్‌ను ప్రభుత్వ విభాగాధిపతులు సిద్ధం చేసి పంపించారు. అయితే ప్రస్తుతం రాష్ట్రానికి కొత్త జోనల్‌ విధానాన్ని సిద్ధం చేసిన విషయం తెలిసిందే. గ్రూప్‌-1లో పోస్టులు మల్టీ జోనల్‌ పరిధిలో ఉంటాయి. పాత పద్ధతి ప్రకారం నోటిఫికేషన్‌ వచ్చి నియామకాలు చేపడితే సాంకేతికంగా ఇబ్బందులు వస్తాయని ప్రభుత్వం గుర్తించింది. దీంతో జూన్‌ 2న జారీ చేయాలని భావించిన ప్రకటనల నుంచి గ్రూప్‌-1ను తప్పించింది. కొత్త జోనల్‌ విధానంపై త్వరలోనే రాష్ట్రపతి ఆమోదం లభిస్తుందని ప్రభుత్వం ఆశిస్తోంది. అప్పటి వరకు గ్రూప్‌-1 నియామకాలకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదని భావిస్తున్నట్లు సమాచారం.
3,000 పోస్టులతో కొత్త ప్రకటనలు....
కొత్త ప్రకటనల జాబితాలో గ్రూప్‌-4, వీఆర్‌వో పోస్టులు ఉంటాయి. వీటితో పాటు ఆర్టీసీ నియామకాలకు ప్రకటన వెలువరించే అవకాశాలున్నాయి. ఆర్టీసీ నియామకాలపై వివరాలు ఇవ్వడంలో ఆ సంస్థ ఆలస్యం చేయడంతో కొన్ని నెలలుగా పెండింగ్‌లో పడింది. తాజాగా ఆ పోస్టులను కలిపి దాదాపు 3,000 ఉద్యోగాలతో ప్రకటనలు వెలువరించే అవకాశాలున్నాయి.






Posted on 31-05-2018